IND vs ENG 2nd Test: 84 పరుగులకే ఐదు వికెట్లు పోయాయి. ఇంకేముంది ఇంగ్లాండ్ 120 పరుగుల లోపు అలౌట్ అవుతుందని… టీమిండియా ఫాలో ఆన్ ఆడిస్తుందని అందరూ అనుకున్నారు. ఆ సమయంలో టీమిండియా బౌలర్ల ప్రదర్శన కూడా అలానే ఉంది. కానీ ఎప్పుడైతే బ్రూక్, స్మిత్ వచ్చారో పరిస్థితి మారిపోయింది. అప్పటిదాకా ఉత్సాహంతో కనిపించిన భారత బౌలర్లలో వణుకు మొదలైంది. వాస్తవానికి ఐదు వికెట్లు కోల్పోయిన తర్వాత ఏ ఆటగాళ్లు అయినా సరే డిఫెన్స్ మోడ్లో క్రికెట్ ఆడుతుంటారు. పైగా ఆడుతోంది టెస్ట్ క్రికెట్ కాబట్టి.. మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ బ్రూక్, స్మిత్ అలా ఆడలేదు. టీమ్ ఇండియా బౌలర్లకు ఏమాత్రం భయపడలేదు.. ప్రసిద్ కృష్ణ బౌలింగ్ ను ఊచ కోత కోశారు. సిరాజ్ బౌలింగ్లో సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఆకాష్ దీప్ బౌలింగ్లో వేగంగా పరుగులు తీశారు. రవీంద్ర జడేజా బౌలింగ్ లో దూకుడుగా బ్యాటింగ్ చేశారు. వాషింగ్టన్ సుందర్ ను ఆటాడుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ ను బెంబేలెత్తించారు. మొత్తంగా 500కు మించి పరుగులు చేసిన టీమ్ ఇండియాకు చుక్కలు చూపించారు.
Also Read: ఒక్క ఓవర్ లో 23 పరుగులా? ప్రసిద్ద్ కృష్ణను ఎంపిక చేసిన వారికి దండం పెట్టాలి!
ఫాలో ఆన్ ఆడుతుందనే స్థాయి నుంచి.. భారత జట్టు చేసిన పరుగులను బ్రేక్ చేస్తుంది అనేదాకా ఇంగ్లాండ్ జట్టును తీసుకెళ్లారు. ముఖ్యంగా స్మిత్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. ఏ మాత్రం భయపడకుండా దుమ్మురేపాడు.. 207 బంతులు ఎదుర్కొన్న అతడు 21 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 184 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బ్రూక్ 234 బంతులు ఎదుర్కొని.. 17 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 158 పరుగులు చేశాడు.. ఆకాష్ దీప్ వేసిన బంతిని అంచనా వేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లేకపోతే మ్యాచ్ స్వరూపం మరో విధంగా ఉండేది. అయితే బ్రూక్, స్మిత్ బజ్ బాల్ క్రికెట్ ఆడారు. వాస్తవానికి ఇంగ్లాండ్ జట్టు నుంచి బ్రూక్, స్మిత్ మినహా మెరుగైన భాగస్వామ్యం ఏర్పడలేదు. వీరిద్దరు గనుక ఆడకపోయి ఉంటే ఇంగ్లాండ్ పరిస్థితి దారుణంగా ఉండేది. వీరిద్దరూ ధ్వజస్తంభాలలాగా నిలబడ్డారు. కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నప్పటికీ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.. ఓవర్లకు ఓవర్లు డిఫెన్స్ ఆడకుండా దూకుడుగా బ్యాటింగ్ చేశారు. అందువల్లే ఇంగ్లాండ్ జట్టు 407 పరుగులకు ఆల్ అవుట్ అయింది..ప్లాట్ పిచ్ పై మూడవరోజు ఇంగ్లాండ్ బ్యాటర్లు పండగ చేసుకున్నారు.. 368 బంతులు ఎదుర్కొని 303 పరుగులు చేశారంటే వారి బ్యాటింగ్ స్టైల్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పోప్, డకెట్, రూట్, స్టోక్స్, క్రాల్వే వంటి దిగ్గజ ప్లేయర్లు విఫలమైనప్పటికీ..బ్రూక్, స్మిత్ ఇంగ్లాండ్ జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా స్మిత్ మైదానం నలుమూలల షాట్లు ఆడాడు. భారత బౌలర్లను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మరోవైపు బ్రూక్ కూడా అదే విధంగా బ్యాటింగ్ చేశాడు. అందువల్లే ఇంగ్లాండ్ ఫాలో ఆన్ ప్రమాదం నుంచి బయటపడింది.. టీమిండియాకు గట్టి సమాధానం ఇచ్చింది. బ్రూక్, స్మిత్ నెలకొల్పిన 303 పరుగుల భాగస్వామ్యం ఇంగ్లాండ్ జట్టుకు కొండంత బలాన్ని అందించింది. వీరిద్దరు చేసిన ఈ పరుగులే మూడవరోజు మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా నిలిచాయి. అంతేకాదు రెండో టెస్టును రసకందాయంలో నిలిపాయ్. టీమిండియా లీడ్ లో కొనసాగుతున్నప్పటికీ.. నాలుగో రోజు బ్యాటింగ్ చేసిన దాని బట్టే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.