Rainfall Through Yagna: పూర్వకాల భారత సమాజంలో యజ్ఞాలు, యాగాలు కేవలం ఆధ్యాత్మిక ఆచారాలుగా మాత్రమే కాకుండా, వర్షాలు, పంటలు, ప్రకృతి సమతుల్యతతో ముడిపడిన వ్యవస్థగా భావించబడ్డాయి. వేదాల్లో “యజ్ఞాత్ భవతి పర్జన్యః” అనే సూక్తి తరచుగా ప్రస్తావించబడుతుంది. అయితే ఆధునిక కాలంలో యజ్ఞాలు చేస్తే వర్షాలు పడతాయన్న భావనను కొందరు మూఢనమ్మకంగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో యజ్ఞాలు–వర్షాల మధ్య నిజంగా ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్న మళ్లీ చర్చకు వస్తోంది.
పూర్వకాల నమ్మకం ఏమిటి?
వేదకాలంలో యజ్ఞాన్ని ప్రకృతితో సంభాషించే ప్రక్రియగా చూశారు. అగ్ని దేవుడు దేవతలకు దూతగా.. ఇంద్రుడు వర్షాధిపతిగా..
వరుణుడు జలాధిపతిగా..వర్ణించబడ్డారు. యజ్ఞాల ద్వారా దేవతలు సంతృప్తి చెందితే వర్షాలు కురిసి, పంటలు పండుతాయని అప్పటి సమాజం విశ్వసించింది. అందుకే వర్షాభావం వచ్చినప్పుడు రాజులు, ప్రజలు యజ్ఞాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు.
ఆధునిక శాస్త్రం ఏమంటోంది?
శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం..వర్షాలు కురవడానికి వాతావరణ పీడనం,తేమ,గాలుల దిశ,మేఘాల నిర్మాణం వంటి కారకాలు కీలకం. యజ్ఞాలు చేయడం వల్ల నేరుగా వర్షాలు పడతాయని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవు. అందువల్ల యజ్ఞం–వర్షం మధ్య నేర సంబంధాన్ని శాస్త్రం అంగీకరించదు.
యజ్ఞపు పొగపై శాస్త్రీయ చర్చ
యజ్ఞాల్లో ఉపయోగించే గోఘృతం, ఔషధ మొక్కలు, సమిధలు దహనమయ్యేటప్పుడు ప్రత్యేకమైన పొగ ఏర్పడుతుంది.
కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ఈ పొగలో ఉండే సూక్ష్మ కణాలు (ఎయిరోసాల్స్), వాతావరణంలో మేఘాల ఏర్పాటుకు సహకరించే కండెన్సేషన్ న్యూక్లియైగా పనిచేయవచ్చు. అయితే ఇది స్థానిక స్థాయిలో మాత్రమే ప్రభావం చూపే అవకాశం ఉంది, విస్తృత వర్షాలకు కారణమవుతుందని శాస్త్రీయంగా నిర్ధారించబడలేదు.
మూఢనమ్మకమా ?లేక పర్యావరణ అవగాహననా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, యజ్ఞాన్ని వర్షాన్ని తెచ్చే మంత్రంగా చూడటం కంటే, ప్రకృతిని గౌరవించే జీవన విధానం, అడవులు, ఆవులు, ఔషధ మొక్కల సంరక్షణ,పర్యావరణ సమతుల్యత,వంటి అంశాల సమాహారంగా చూడాలి. అటువంటి జీవన విధానం వల్లే పూర్వకాలంలో వర్షాలు సమృద్ధిగా ఉండేవని వారు విశ్లేషిస్తున్నారు.
యజ్ఞాలు చేస్తే తప్పనిసరిగా వర్షాలు పడతాయన్నది శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. కానీ యజ్ఞాలను పూర్తిగా మూఢనమ్మకంగా కొట్టిపారేయడం కూడా సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు. అవి పూర్వీకులు ప్రకృతితో సమన్వయంగా జీవించేందుకు రూపొందించిన ఆధ్యాత్మిక పర్యావరణ విధానంగా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.