YS Viveka’s case : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ వేగం పెంచింది. ఈ నెల 10 నాటికి విచారణ పూర్తిచేయాలని పట్టుదలగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే కేసులో కీలకమైన వారికి విచారణ పేరిట నోటీసులిస్తోంది. దాదాపు కేసు విచారణ తుది దశకు చేరుకుందనుకుంటున్న తరుణంలో ఇప్పుడు కీలక వ్యక్తులకు విచారణకు పిలుస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ రెండుసార్లు విచారణ చేపట్టింది. ఆయన ద్వారా సేకరించిన కీలక సమాచారాన్ని అనుసరించి దర్యాప్తులో వేగం పెంచింది. అటు కడపలోని సీఎం జగన్ ఓఎస్డీ కార్యాలయాన్ని పరిశీలించడంతో పాటు పులివెందులలో కీలక ప్రదేశాలను సీబీఐ అధికారులు పరిశీలించారు. ఏపీ సచివాలయంలోని కీలక వ్యక్తికి విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చారు.

వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరికి ముఖ్యమైన కీలక నేత ఆశీస్సులున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి విచారణ సమయంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వివేకా హత్య జరిగిన తరువాత పదేపదే రెండు నంబర్లకు అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి కాల్స్ వెళ్లడాన్ని సీబీఐ అధికారులు గుర్తించారు. అదే విషయాన్ని విచారణలో అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. తొలుత తటపటాయించిన అవినాష్ రెడ్డి సమాధానం ఇవ్వని తప్పనిసరి పరిస్థితి ఎదురైంది. ఆ ఫోన్ నంబర్లు జగన్ ఓఎస్ డీ కృష్ణమోహన్ తో పాటు మరొకటి కుటుంబ సహాయకుడు నవీన్ దిగా చెప్పడంతో ఆ ఇద్దర్ని సీబీఐ నోటీసులిచ్చి విచారణ చేపట్టింది.
ఈ నేపథ్యంలో త్వరలో సీఎం జగన్ తో పాటు ఆయన సతీమణి భారతిని సీబీఐ ప్రశ్నించనుందన్న ప్రచారం జరుగుతోంది. అటు ఎల్లో మీడియా సైతం కథనాలు వండి వారుస్తోంది. జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనకు ఓఎస్డీగా కృష్ణమోహన్ ఉన్నారు. జగన్ కు ఎటువంటి కాల్స్ వచ్చినా ఆయనే రిసీవ్ చేస్తారు. అటు కుటుంబ సహాయకుడిగా ఉన్న నవీన్ ఫోన్ కాల్స్ రిసీవ్ చేసి అందిస్తుంటారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో అవినాష్ రెడ్డి ఎక్కువగా ఈ రెండు ఫోన్లకు కాల్ చేసి అటు జగన్, ఇటు భారతితో మాట్లాడినట్టు సీబీఐ గుర్తించింది. అందుకే ఇప్పుడు వారిద్దర్నీ విచారించనున్నట్టు టాక్ నడుస్తోంది. అవినాష్ రెడ్డితో అసలు ఏం మాట్లాడారు? ఆయన ఎందుకు పదేపదే మీకు ఫోన్ చేశారు? వంటి వాటిపై విచారణ చేపట్టే అవకాశముంది. ఒకటి రెండు, రోజుల్లో విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసే చాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది