Homeఆంధ్రప్రదేశ్‌YS Viveka Case : లెటర్ దాచమని చెప్పింది వివేకా అల్లుడే.. బాంబుపేల్చిన వైఎస్ వివేకా...

YS Viveka Case : లెటర్ దాచమని చెప్పింది వివేకా అల్లుడే.. బాంబుపేల్చిన వైఎస్ వివేకా పీఏ

YS Viveka Case  : వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్. కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలపై వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని తనపై వారు ఒత్తిడి పెంచినట్టు ఆరోపించారు. ఇప్పటికే కేసు కీలక మలుపులు తిరుగుతోంది. సుప్రీం కోర్టు సీబీఐ కొత్త సీట్ ఏర్పాటుచేయడంతో కేసుతో సంబంధమున్న వారిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివేకా పీఏ కృష్ణారెడ్డిని సీబీఐ రెండు రోజుల పాటు విచారించింది. ఈ తరుణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేకా అల్లుడు, కుమార్తెపై చేసిన సంచల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ రోజు ఏం జరిగిందంటే..
వివేకాకు తాను చాలా రోజులుగా పీఏగా పనిచేస్తున్నట్టు కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రతిరోజూ ఐదున్నర గంటలకు వివేకా ఇంటికి వెళ్లడం అలవాటన్నారు. ఆ సమయానికి వివేకా ఇంట్లో లైట్లు వేస్తారని.. అప్పుడే తాను లోపలకు వెళ్తానని చెప్పారు. అయితే వివేకా హత్య జరిగిన  ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఇల్లంతా చీకటిగా ఉందన్నారు. అందుకే బయటే ఎదురుచూసినట్టు తెలిపారు. కొద్దిసేపటి తరువాత వివేకా భార్య సౌభాగ్యమ్మకు ఫోన్ చేయగా.. వివేకా లేట్ నైట్ వచ్చుంటారని.. కాసేపు ఎదురుచూడాలని ఆమె చెప్పడంతో వేచిచూసినట్టు తెలిపారు. అదే సమయంలో ఎప్పుడైనా ఎక్కువ సేపు నిద్రపోతుంటే లేపకపోతే వివేకా కేకలు వేస్తారని భయంతో పనిమనిషి లక్ష్మి, వాచ్ మెన్ రంగయ్యల సాయంతో లోపలికి వెళ్లి చూడగా వివేకా రక్తపు మడుగులో కనిపించారని చెప్పారు. తొలుత ప్రకాష్ కు.. ఆ తరువాత అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, బావమరిది శివప్రకాష్ రెడ్డికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పినట్టు పీఏ కృష్ణారెడ్డి చెబుతున్నారు.

లెటర్ ఉంచమని చెప్పారు..
ఆ సమయంలో వివేకా వీల్ ఛైర్ దగ్గర పేపర్‌లో ఏదో రాసి ఉండటం గమనించానని కృష్ణారెడ్డి  చెప్పారు. ఆ లేఖ గజిబిజిగా ఉందని, అందులో డ్రైవర్ ప్రసాద్‌ను డ్యూటీకి త్వరగా రమ్మనందుకు తనను కొట్టి చంపారని లేఖ ఉందని, లేఖ గురించి వెంటనే వివేకా అల్లుడు రాజశేఖర్‌ రెడ్డికి ఫోన్ చేసి చెప్పానన్నారు. అతను ఆ లేఖను జాగ్రత్తగా దాచి పెట్టాలని చెప్పారని, ఫోన్, లెటర్‌లను తాను వచ్చే వరకు జాగ్రత్త చేయాలని రాజశేఖర్ రెడ్డి తనకు చెప్పారని కృష్ణారెడ్డి వివరించారు. పోలీసులకు అప్పగిస్తానని చెబితే…వద్దని వారించారని తెలిపారు.అయితే లేఖ రక్తపు మరకలతో ఉందని, ఆయనతో బలవంతంగా రాయించినట్లు అనిపించిందని, రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఒంటిమంగట సమయంలో దానిని అతనికి అప్పగించినట్లు చెప్పారు.

నెల రోజుల పాటు కస్టడీ..
వివేకా హత్యకు గురైన రోజు సాయంత్రం తమను పోలీసులు పిలిచారని, ఆ తర్వాత వేర్వేరు చోట్లకు తిప్పి రాత్రికి కడప డిటిసికి తీసుకెళ్లి 13రోజుల పాటు ఉంచారని, తమతో పాటు ఎర్రగంగిరెడ్డి, ఇనయతుల్లా, జగదీష్‌, ప్రకాష్, సునీల్ యాదవ్, రాజశేఖర్‌ రెడ్డి, దస్తగిరి తదితరులు ఉన్నారని కృష్ణా రెడ్డి చెప్పారు. 13రోజులు పోలీసుల అదుపులో ఉన్న తర్వాత ముద్దాయిలుగా రిమాండ్ ఇచ్చారని, మూడ్నెల్లు జైల్లో ఉన్నామని చెప్పారు. జైల్లో ఉన్నపుడు సునీత, రాజశేఖర్‌ రెడ్డి వచ్చి చూసే వారని, ఎలా ఉన్నారని వాకబు చేసేవారన్నారు. ఆ తర్వాత సిబిఐకు కేసు దర్యాప్తు అప్పగించారని, సిబిఐకు అప్పగించిన తర్వాత తమను ఢిల్లీ రమ్మంటున్నారని సిబిఐ వాళ్లు పిలిచారని, ఆ విషయం రాజశేఖర్ రెడ్డికి చెబితే ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసి బస ఏర్పాటు చేస్తాను వెళ్లి రమ్మన్నాడన్నారు. నాలుగు రోజుల్లో పంపేస్తారని చెప్పి పంపారని, ఢిల్లీ వెళ్లిన తర్వాత నెల రోజులు ఉంచుకున్నారని కృష్ణారెడ్డి తెలిపారు.

బలవంతం పెట్టారు..
సీబీఐ దర్యాప్తులో తనకు అష్టకష్టాలు ఎదురయ్యాయని కృష్ణారెడ్డి వాపోయారు. సిబిఐ దర్యాప్తులో భాగంగా ఏఎస్పీ రాంసింగ్ వచ్చి తాను చెప్పినట్లు చెప్పాలని తనను కొట్టే వాడని, అవినాష్ రెడ్డి, శంకర్‌ రెడ్డి మేనేజ్ చేశారని ఒప్పుకోవాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు. మధ్యలో సునీత, రాజశేఖర్ రెడ్డి దంపతులు కూడా తను బెదిరించారని కృష్ణా రెడ్డి ఆరోపించారు.తన బెయిల్ రద్దు చేస్తామని బెదిరించే వారని, తాను వారి బెదిరింపులకు ఏనాడు లొంగలేదని చెప్పారు. సీబీఐ అధికారి  రాంసింగ్‌కు సహకరించకపోతే ఇబ్బందుల్లో పడతావని, సహకరిస్తే తనను సేవ్ చేస్తామని  ఆఫర్ ఇచ్చారని కృష్ణారెడ్డి చెప్పారు. చివరకు తన కుమారుడి వివాహాన్ని కూడా అడ్డుకున్నారని.. లేనిపోని ఆరోపణలతో పిల్లనిచ్చేవారిని బెదిరించారని చెప్పారు.  అవినాష్ రెడ్డి తనను మేనేజ్ చేసినట్లు సిబిఐకు చెప్పాలని రాజశేఖర్ రెడ్డి తనపై ఒత్తిడి చేశారని, తాను ఎదురు తిరగడంతో సునీత కూడా తనపై ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. ఆ సమయంలోనే కృష్ణారెడ్డి సహకరించకుంటే నువ్వు జైలులోకి వెళ్తావని భర్తను సునీత హెచ్చరించిందన్నారు. అలా ఎందుకు అన్నారో నాకు అర్ధం కాలేదన్నారు. సీబీఐ కొత్త సీట్ అధికారుల వద్ద ఇదే విషయం వెల్లడించినట్టు కృష్ణారెడ్డి చెప్పారు. మొత్తానికైతే వివేకా హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు కొత్త మలుపులు తిరిగే చాన్స్ కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version