BRS Manifesto 2023: ” పింఛన్ ₹4000 చేస్తరట. అయితే మేము ₹5000 చేస్తాం. అడవులుగా రైతు రుణాలు మాఫీ చేస్తరట. అధికారం కోసం అడ్డగోలుగా హామీలు ఇస్తరా? కాంగ్రెస్ వాళ్ళకి ఏమయినా నెత్తా, కత్తా? వాళ్ళను ఎవడు నమ్ముతడు?” కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సభ నిర్వహించినప్పుడు హామీలు ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ ఇచ్చిన కౌంటర్. కానీ అదే కేసీఆర్ మొన్నటి ఎన్నికల మేనిఫెస్టోల్లో చేతికి ఎముకే లేదు అన్నట్టుగా ఉదారత చూపించారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చారు. కెసిఆర్ ప్రకటించిన ఈ హామీలు నెరవేరాలంటే కోకాపేట లాంటి ప్రాంతాలు కూడా సరిపోవు అని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. గతంలో ఇచ్చిన హామీలనే అమలు చేయలేక ఇబ్బంది పడుతోంది. ప్రభుత్వ రాబడులు సరిపోక.. అప్పులు చేసి పథకాలను అమలు చేయాల్సి వస్తోంది. విలువైన ప్రభుత్వ భూములను విక్రయించాల్సి వస్తోంది. అయినా.. ఈసారి ఎన్నికల్లోనూ భారీ హామీలు గుప్పించింది. ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోలో ఓటర్లను ఆకర్షించేందుకే ప్రాధాన్యమిచ్చింది. పేదలకు రూ.5 లక్షల వరకు బీమా, ఆసరా పెన్షన్లు రూ.5,016కు పెంపు, రూ.400కే గ్యాస్ సిలిండర్, రైతుబంధు సాయం రూ.16 వేలకు పెంపు, అర్హులైన మహిళలకు రూ.3 వేల చొప్పున భృతి వంటి హామీలు
ఇచ్చింది. ఇందులో రూ.5 లక్షలబీమా, రూ.400కే గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ.3 వేల చొప్పున భృతి వంటి పథకాలు కొత్తవి కాగా, మిగతావి పాతవే. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఈ పథకాలన్నింటినీ అమలు చేయాలంటే ప్రభుత్వ ఖజానాపై అదనంగా రూ.52,461 కోట్ల భారం పడుతుంది. ఈ హామీల
భారం కలిపి రూ.3.5 లక్షల కోట్లకు పైగా బడ్జెట్‌ను పెట్టాల్సి వస్తుంది. కానీ, రాష్ట్ర రాబడులు మాత్రం రూ.2 లక్షల కోట్లకు మించడం లేదు.
రూ.400కే గ్యాస్ సిలిండర్
అధికార బీఆర్ఎస్ పార్టీ తమ కొత్త హామీల్లో భాగంగా రూ.400కే గ్యాస్ సిలిండర్‌ను అందజేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ వినియోగదారులు 1.27 కోట్ల మంది ఉన్నారు. వీరికి నెలకు 52 లక్షల సిలిండర్లు వినియోగమవుతున్నాయి. ఒక్కో సిలిండర్ ధర రూ.955. కాగా, ప్రభుత్వం రూ.400కే సిలిండర్ ఇస్తామంటున్నందున.. ఒక్కో సిలిండర్‌కు రూ.555 చొప్పున సబ్సిడీని ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 52 లక్షల సిలిండర్లకు నెలకు రూ.288.60 కోట్లను భరించాలి. ఏడాదికి దీని భారం ఏడాదికి రూ.3,463.20 కోట్లు అవుతుంది.
రైతుబంధు 16 వేలకు పెంపు..
రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులు ఉండగా.. కోటిన్నర ఎకరాలకు రైతుబంధు పథకం అమలవుతోంది. ప్రస్తుతం ఏడాదికి ఎకరాకు ఇస్తున్న రూ.10 వేలను రూ.16 వేలకు పెంచనున్నారు. రూ.10 వేల చొప్పున పంపిణీ చేస్తే.. ఏడాదికి రూ.15 కోట్లు వ్యయమవుతున్నాయి. అదే రూ.16 వేల చొప్పున అందజేస్తే రూ.24 వేల కోట్లు కావాలి. అంటే రూ.9 వేల కోట్ల అదనపు భారం పడనుంది.
ఆసరా పించన్ రూ.5016
ఆసరా పించన్ రూ.5016కు పెంచుతామని ప్రభుత్వం మరో హామీ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పించన్ దారులు 38.65 లక్షల మంది ఉన్నారు. వీరికి ప్రస్తుతం పంపిణీ చేస్తున్న నెలకు రూ.2016తో సంవత్సరానికి రూ.9,350 కోట్ల నిధులు అవసరమవుతున్నాయి. అయితే దీనిని విడతల వారీగా ఐదేళ్లలో రూ.5016 చేస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ లెక్కన వ్యయం రూ.23,264.20 కోట్లకు చేరుతుంది. అంటే అదనపు భారం రూ.13.914.20 కోట్లు అవుతుంది. ఇక 5.35 లక్షల మంది దివ్యాంగులకు ప్రస్తుతం రూ.4016 పించన్ ఇస్తున్నారు. ఇందుకు ఏటా రూ.2,568 కోట్లు ఖర్చవుతున్నాయి. అయితే వీరి పించన్ రూ.6,016కు పెంచుతామన్నందున ఈ మొత్తం రూ.3,852 కోట్లు కానుంది. అదనపు భారం రూ.1,284 కోట్లు అవుతుంది. మొత్తం ఆసరా పెన్షన్ల అదనపు భారం రూ.15,198 కోట్లు అవుతుంది.
ఆరోగ్యశ్రీ రూ.15 లక్షలు
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు 90 లక్షల కుటుంబాలుండగా.. ఏటా 4 లక్షల కుటుంబాలు ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతున్నాయి. వీరికి ఆరోగ్యశ్రీ కింద ఏటా సగటున రూ.1,250 నుంచి రూ.1,350 కోట్లు వ్యయమవుతున్నాయి. రూ.5 లక్షల పరిమితితో చికిత్సలు అందిస్తే.. ఇంత మొత్తం ఖర్చవుతుంది. వ్యయ పరిమితిని రూ.15 లక్షలకు పెంచితే… అదనంగా రూ.650-700 కోట్ల భారం పడనుంది.
పేద మహిళలకు 3వేల భృతి
అర్హులైన పేద మహిళలకు రూ.3 వేల చొప్పున నెలవారీ భృతిని అందిస్తామని బీఆర్ఎస్ తమ మేనిఫెస్టోలో చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల వరకు బీపీఎల్ కుటుంబాలున్నాయి. కుటుంబానికి ఒక మహిళను పరిగణనలోకి తీసుకున్నా 90 లక్షల మంది మహిళలకు నెలకు రూ.2,700 కోట్లు, ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరమవుతాయి. అయితే వీరిలో ప్రస్తుతం ఆసరా పింఛను పొందుతున్నవారూ ఉన్నందున.. వారిని ఆ జాబితా నుంచి తొలగించి, ఈ భృతి చెల్లిస్తే ఈ మొత్తంలో కొంత తేడా రావచ్చు. వీరు 30 శాతం మంది ఉంటారనుకున్నా.. ఏడాదికి రూ.22 వేల కోట్లు అయ్యే అవకాశం ఉంది.
పేదలకు రూ.5 లక్షల బీమా
పేదలకు రూ.5 లక్షల చొప్పున బీమాను వర్తింపజేస్తామని బీఆర్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రైతు బీమా కింద ఒక్కో రైతుకు రూ.3,600 చొప్పున ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తోంది. కాగా, రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాలు 90 లక్షలు ఉన్నాయి. ఈ కుటుంబాల్లో ఇంటికి ఒకరిని లబ్ధిదారుగా పరిగణనలోకి తీసుకుంటే.. ప్రీమియం రూపంలో ఏటా రూ.3,240 కోట్ల భారం పడుతుంది. అయితే వీరిలో రైతు బీమా పరిధిలోకి వచ్చేవారు 30 శాతం వరకు ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ మొత్తం ప్రీమియం ఏడాదికి రూ.2,100 కోట్లు అయ్యే అవకాశం ఉంది.
ఇక హామీల అమలుకు రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోని క్రమంలో మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది ప్రశ్నగా మారింది. సాగునీటి ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల లభ్యత కష్టతరంగా మారుతుంది. అప్పుడు అభివృద్ధి కుంటుపడుతుంది. అది అంతిమంగా రాష్ట్ర వృద్ది రేటు మీద ప్రభావం చూపిస్తుంది. వృద్ధిరేటు తగ్గితే అది పెట్టుబడుల ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే కేవలం అధికారంలోకి వచ్చేందుకు మాత్రమే భారత రాష్ట్ర సమితి ఇన్ని ఉచితాలు ప్రకటించిందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్ఎస్ హామీలతో పెరిగే అదనపు భారం
ఆసరా పించన్ ₹15,198 కోట్లు, రూ.400కే సిలిండర్ వల్ల ₹3,463 కోట్లు, ఆరోగ్యశ్రీ వల్ల ₹700 కోట్లు, మహిళా భృతి వల్ల ₹22,000 కోట్లు, రైతుబంధు పెంపు తో ₹ 9,000 కోట్లు, పేదలకు బీమా వల్ల ₹2,100 కోట్లు..
మొత్తం భారం 52,461కోట్లు.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Special article about kcrs promises
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com