Homeఅంతర్జాతీయంRishi Sunak: భారతీయుడి చేతుల్లోకి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం.. రిషి సనక్ ఎవరు? ఎలా...

Rishi Sunak: భారతీయుడి చేతుల్లోకి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం.. రిషి సనక్ ఎవరు? ఎలా సాధించారు?

Rishi Sunak: కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వినా నాప చేనే పండుతుంది. ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో భారతదేశానికి వచ్చి వందల ఏళ్లపాటు ఈ దేశాన్ని దోచుకుని, దాన్నంతా దాచుకొని తమ దేశానికి తరలించుకుని వెళ్లిన బ్రిటిషర్లకు.. రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరు గడించిన వారి దేశానికి ఇప్పుడు మళ్లీ భారతీయులే కావాల్సి వచ్చింది. బోరిస్ జాన్సన్, లీజ్ ట్రస్ రాజీనామాల తర్వాత.. బ్రిటన్ దేశాన్ని గాడిలో పెట్టేందుకు ఓ భారతీయుడి అవసరం ఏర్పడింది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత భారత మూలాలు ఉన్న రిషి సనక్ ఇంగ్లాండ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పంజాబీ నేపథ్యం, హిందూ మూలాలు ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి కావడం బహుశా బ్రిటన్ చరిత్రలో ఇదే ప్రథమం. రిషి సనక్ ప్రధానమంత్రి అయ్యేందుకు అనేక పరిణామాలను ఎదురుకోవాల్సి వచ్చింది. సరే ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఆయన ముందు ఉన్న సవాళ్ళు ఏమిటి? వాటి పరిష్కారానికి ఆయన ముందున్న మార్గాలు ఏమిటి?

-కరోనా సమయంలో

రిషి సనక్ కోవిడ్ సమయంలో ఉద్యోగులు, ప్రజల కోసం ఎన్నో మెరుగైన పథకాలు తీసుకొచ్చారు. ప్రజలకు అండగా నిలిచారు. దీంతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత రిషి సనక్ కాబోయే ప్రధానమంత్రి ప్రచారం జరిగింది. కానీ అనూహ్య పరిణామాల మధ్య లీజ్ ట్రస్ ఆ పదవిని చేపట్టారు. కానీ ఆమె తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల బ్రిటన్ పరువు గంగలో కలిసింది. పైగా ఆమె మంత్రివర్గంలో ఉన్న ఆర్థిక మంత్రి సంపన్నులకు పన్ను మినహాయింపు ఇస్తామని చెప్పడం పెద్ద దుమారానికి దారి తీసింది. అసలే ఆర్థిక మాంద్యంలో ఉన్న బ్రిటన్ కు పంటి కింద రాయి అయింది. దీంతో పార్లమెంట్ సభ్యులు లీజ్ ట్రస్ రాజీనామా చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అనుకున్నట్టుగానే ఆమె ముందుగా తన ఆర్థిక శాఖ మంత్రిని తప్పించారు. తర్వాత ఆమె తప్పుకున్నారు. ఈ దశలో బోరిస్ జాన్సన్ మళ్ళీ ప్రధానమంత్రి అవుతారని ఊహాగానాలు వినిపించాయి. కానీ బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు ఈసారి రిషి సనక్ వైపు మొగ్గు చూపారు.

-పంజాబ్ నేపథ్యం

రిషి సనక్ పూర్వికులు పంజాబ్ కు చెందినవారు. ఆయన తల్లిదండ్రులు ఇద్దరు బ్రిటన్ దేశంలో ఆరోగ్య రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన తల్లి ఫార్మసిస్ట్. తండ్రి నేషనల్ హెల్త్ సర్వీస్ జనరల్ ప్రాక్టీషనర్ గా పేరు తెచ్చుకున్నారు. రిషి సనక్ బ్రిటన్ లోనే జన్మించారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, స్టాన్ ఫోర్డ్ లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కాలిఫోర్నియాలో చదువుకున్నప్పుడు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. వీరికి కృష్ణ, అనౌష్క అనే పిల్లలు ఉన్నారు. 2015 లో రిషి బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. యార్క్ షైర్ లోని రిచ్మండ్ నుంచి ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందారు. కన్జర్వేటివ్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతూ తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బ్రెక్సిట్ కోసం పిలుపులకు మద్దతు ప్రకటించారు. బోరిస్ జాన్సన్ తన “లీవ్ ఈయూ” కి మద్దతు ప్రకటించారు. ఫిబ్రవరి 2020లో అత్యంత ముఖ్యమైన యూకే క్యాబినెట్ పదవి చాన్సర్ ఆఫ్ ఎక్స్ చైర్ కు నియమితులై కొత్త చరిత్ర సృష్టించారు. కోవిడ్ సమయంలో వ్యాపారాలు, ఉద్యోగులకు సహాయం చేసేందుకు అనేక ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించారు. ఆర్థిక ప్యాకేజీ లో భాగంగా ఉద్యోగాల నిలుపుదల కార్యక్రమం కూడా ఉంది. బ్రిటన్ లో సామూహిక నిరుద్యోగాన్ని నిరోధించింది. అయితే పార్టీ గేటు కుంభకోణం తర్వాత అతని ప్రజాదరణ దెబ్బతిన్నది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడం, లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ కార్యాలయంలో పార్టీలను నిర్వహించడం, లండన్ పోలీసులు జరిమానా విధించిన అధికారులలో ఆయన ఒకరుగా ఉండటం గమనార్హం. దీంతో ఆయన పాపులారిటీపై ప్రభావం పడింది. జాన్సన్ రాజీనామా తర్వాత ప్రధాని రేసులో అనూహ్యంగా తెరమీదకు వచ్చారు. ఇదే సమయంలో తన భార్య నివాసానికి పన్ను లేని హోదా కోసం ప్రయత్నించి విమర్శల పాలయ్యాడు. పన్ను స్థితి మరొక దేశంలో జన్మించిన వ్యక్తి లేదా వారి తల్లిదండ్రులు మరొక దేశానికి చెందిన వారైతే బ్రిటన్ లో వారి ఆదాయంపై మాత్రమే పందు చెల్లించడానికి అనుమతి ఇస్తుంది. ఈ వ్యవస్థ విదేశీ వలస దారులు బ్రిటన్ లో నివసించే అన్ని ప్రయోజనాలను ఆస్వాదించేందుకు అనుమతి ఇస్తుంది. అదే సమయంలో బ్రిటన్ లో పనులలో చాలామంది తక్కువ చెల్లిస్తారు.

-ఎన్నో సమస్యలు

మొన్నటిదాకా ప్రధాన మంత్రుల మార్పుతో ఇబ్బంది పడిన బ్రిటన్.. ఇప్పుడు రిషి సనక్ రూపంలో మరో ప్రధానమంత్రిని ఎన్నుకున్నది. ఆయన ముందు ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మొన్నటిదాకా సిరి సంపదలతో తులతూగిన బ్రిటన్ ఇప్పుడు సరికొత్త ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫలితంగా లక్షలాది మంది ఒక పూట భోజనం చేస్తున్నారు . దీనికి తోడు ఏప్రిల్ నుంచి ఇంధన ధరలపై కట్టడి విధిస్తామని లీజ్ ట్రస్ గతంలో నిర్ణయం నేపథ్యంలో ఇంగ్లాండ్ లోని సగం ఇళ్లల్లో స్టౌ వెలిగే పరిస్థితి ఉండదు. దీనికి తోడు బడ్జెట్లో కోతలు, ఆర్థిక నిర్ణయాలను తిరగ తోడటం వంటి అపరిపక్వత చర్యల వల్ల సెప్టెంబర్ లోనే బ్రిటన్ మాంద్యం ఒక్కసారిగా 10% ఎగబాకింది. దీనివల్ల ఆహార ఉత్పత్తుల ధరలు అమాంతం పెరిగాయి. బ్రిటన్ ప్రజలు ఎక్కువగా మాంసాహారం స్వీకరిస్తారు. గొడ్డు మాంసం, చికెన్, మైదా, బ్రెడ్, ఇంధన ధరలు చుక్కలను అంటుతున్నాయి. దీంతో జీవన వియాలను తట్టుకునేందుకు ప్రజలు తిండిపై స్వచ్ఛందంగా కోతలు పెట్టుకున్నారు. దొరికింది మాత్రమే తింటూ నాణ్యత విషయంలో పూర్తిగా రాజీ పడిపోయారు.. ఉక్రెయిన్ రష్యా యుద్దం నేపథ్యంలో యూరప్ లో నింగిని తాకిన ఇంధన ధరలను మళ్లీ అందుబాటులోకి తెచ్చేందుకు కట్టడి విధిస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే చలికాలానికి ఇంధనం దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిణామం వల్ల బ్రిటన్ శవాల దిబ్బగా మారిపోవడం ఖాయం. ఇన్ని సమస్యల నేపథ్యంలో రిషి సనక్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దాని పై అక్కడి ప్రజలు ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version