HomeజాతీయంDiwali Sivakasi : దీపావళి: ఈ పటాసుల వెలుగుల వెనుక వారి చీకటి!

Diwali Sivakasi : దీపావళి: ఈ పటాసుల వెలుగుల వెనుక వారి చీకటి!

Diwali Sivakasi దీపావళి.. ఈ పండుగ పేరు చెబితే ఎవరికైనా ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది. మతాబుల నుంచి చిచ్చుబుడ్ల దాకా కాల్చి చీకటి వేళ మరిన్ని వెలుగులు పంచొచ్చు. అలా కాల్చడం ప్రతి ఒక్కరికి ఓ ఆనందం. కానీ ఈ వెలుగుల వెనుక ఎంతోమంది కార్మికుల చీకటి గాధలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీల్లో ఉన్న చీకట్లలో మగ్గక పోతే మనకు ఈ వెలుగులు లేవు. ఈ పటాసులు లేవు. ఇక పటాసుల గురించి చెప్పాలంటే మన దేశంలో అందరికీ గుర్తుకు వచ్చేది తమిళనాడు రాష్ట్రంలోని శివకాశి. దక్షిణ కాశీగా పేరు శివకాశి బాణాసంచా తయారీ కి పుట్టింది పేరు. ఈ శివకాశిలో లెక్కకు మిక్కిలి బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. మనం ఏడాదికి ఒకసారి వేడుకగా జరుపుకునే దీపావళి కోసం వారు ఏడాది మొత్తం కష్టపడతారు. కొన్నిసార్లు ప్రమాదాలకు గురై మృత్యువాత కూడా పడతారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి 550 కిలోమీటర్ల దూరంలో ఉంది శివకాశి పట్టణం. విరుద్ నగర్ జిల్లాలో ఉన్న ఈ పట్టణం వందేళ్ల కిందట అటవీ ప్రాంతం.

ఈ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది

ఈ ప్రాంతానికి శివకాశి అనే పేరు రావడం వెనుక ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. క్రీస్తు శకం 1428లో ఈ ప్రాంతాన్ని హరికేసరి పరశురామ పాండియన్ అనే రాజు పాలిస్తుండేవాడు. ఇతడు పరమ శివ భక్తుడు. శివుడిని తమ ప్రాంతంలో కొలువు తీర్చాలనే ఆలోచనతో ఉత్తరకాశి పట్టణంలో ప్రత్యేక పూజలు చేసి శివలింగాన్ని దక్షిణ కాశీ తీసుకొచ్చి ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ఇందులో భాగంగా సతీసమేతంగా కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొని తెన్ కాశీకి బయలుదేరాడు. మరో కొద్ది రోజుల్లో తెన్ కాశీకి వెళ్లాల్సి ఉండగా.. ప్రస్తుతం శివకాశిగా చెబుతున్న ప్రాంతంలో చీకటి పడింది. మారేడు వృక్షాలతో ఆ ప్రాంతం అరణ్యం లాగా ఉండటంతో శివుడికి ఇష్టమైన ప్రాంతంగా భావించి రాత్రికి అక్కడే బస చేశారు. తెల్లవారుజామున శివలింగానికి పూజ చేశారు. త్వరగా వెళ్లి తెన్ కాశీలో ప్రతిష్టించాలని బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. వారు వెళ్లాల్సిన గుర్రాలు కాలు కదిపేందుకు మొరాయించాయి. ఏం జరిగిందోనని రాజు ఆరా తీస్తే ఆయన సతీమణి నెలసరి లో ఉన్నట్టు అర్థమైంది. దీంతో మూడు రోజులపాటు అక్కడ నుంచి కదలని పరిస్థితి. ఆ రోజుతో శివలింగాన్ని ప్రతిష్టించాల్సిన బ్రహ్మ ముహూర్తం గడువు ముగియనుంది. దీంతో ఇక వారు ఆ విగ్రహాన్ని బస చేసిన ప్రాంతంలోనే ప్రతిష్టించారు. కాశీ నుంచి వచ్చిన విగ్రహం కావడం, ఇప్పుడు తమ దైవం కావడంతో ఆ ప్రాంతానికి పాండ్యరాజు శివకాశి అని నామకరణం చేసి పెద్ద ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఇక దైవానికి సంబంధించి మొదటి అక్షరం చివరి అక్షరం కలిసి ఉండే పేరుతో ప్రపంచంలోనే రెండు దైవంశ ప్రాంతాలు ఉన్నాయి ఒకటి “తి”తో ప్రారంభమై “తి”తో ముగిసే శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుపతి అయితే, “శి” తో మొదలై “శి”తో ముగిసే శివకాశి. శివకాశి పేరు వెనుక రాచరికపు చరిత్ర ఉన్నట్టే బాణాసంచా తయారీకి కూడా వందేళ్ళకు పైగా చరిత్ర ఉంది.

1908లో తయారీ

శివకాశిలో షణ్ముగ అయ్యర్ నాడార్ 1908 లో 30 మందితో చిన్నపాటి బాణాసంచా తయారీ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేశాడు. అది రెండు సంవత్సరాలలో 12 యూనిట్లుగా అభివృద్ధి చెందింది. దానిని చూసి కొంతమంది వ్యాపారం మొదలుపెట్టారు. ఇలా వేలాదిగా కర్మకారాలు, కుటీర పరిశ్రమలు ఏర్పడి లక్షల మందికి ఉపాధి కల్పించడంతో ప్రపంచంలోనే బాణాసంచా తయారీలో ప్రముఖమైన ప్రాంతంగా శివకాశి నిలిచింది. 20వ శతాబ్దంలో 30 మందితో ప్రారంభమైన టపాసులు తయారీ కేంద్రాలు కాలక్రమేణా 1,100 భారీ కర్మగారాలు, ఎనిమిది వేల కుటీర పరిశ్రమలుగా విస్తరించాయి. 6 లక్షల మందికి పైగా ఉపాధినిస్తున్నాయి. బాణసంచా తయారీ అక్కడి ప్రజల జీవనం జీవనాధారం అయింది. ఇక్కడే బాణసంచా కర్మకారాలు ఎందుకు ఏర్పడ్డాయి? ఎందుకు ఇక్కడే వాటిని తయారు చేయాల్సి వస్తుంది? ఎందుకు వేరే వృత్తిని ఎంచుకోరు? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక సమాధానం శివకాశిలోని భౌగోళిక కారణాలు. శివకాశి పూర్తిగా మెట్ట ప్రాంతం. సుమారు 30 కిలోమీటర్ల దూరం వరకు నీటి నిలువలు లేవు. సారవంతమైన భూమి తక్కువ. భూమిలో రసాయనాలు కలుస్తుండడంతో వ్యవసాయానికి పనికిరాదు. నదులు, సాగునీరు లేకపోవడంతో చేతివృత్తులు, ఉపాధి పనులు తప్ప ఇక్కడ వేరే మార్గం లేదు. అందుకే ఇక్కడ ప్రజలు బతుకుదెరువు కోసం ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేవారు. అలాంటి చోట టపాసులు తయారీ కేంద్రాన్ని ప్రారంభించడంతో ప్రజలు వాటి మీద ఆధారపడుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చారు. ఫలితంగా ఈ ప్రాంతాలకు ఇతర ప్రజలు వలస వస్తున్నారు. ఇక ఇక్కడ బాణసంచా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతూ ఉంటుంది. తయారయ్యే బాణ సంచాను యాజమాన్యాలు శివకాశి పట్టణంలోని తమ ఏజెన్సీల ద్వారా విక్రయాలు జరుపుతారు. విక్రయాలకు ముందే తయారీ సమయంలో బాణాసంచా కవర్ పై ధరలను నిర్ణయిస్తారు. ఆ ధర పై 50 నుంచి 60 శాతం తగ్గింపుతో భారీగా విక్రయాలు జరుపుతారు.

గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 20% ధరలు పెరిగాయి. అంటే ఒక్కో తయారుదారు సుమారు 25 నుంచి 30 కోట్ల వరకు వ్యాపారం చేస్తున్నారని అంచనా. ఇక్కడ తయారయ్యే బాణ సంచాలో 30 నుంచి 40 శాతం దేశంలోని వివిధ నగరాలు, ప్రాంతాలకు, విదేశాలకు ఎగుమతి అవుతుంది.. జపాన్, చైనా తర్వాత ఇంత భారీ స్థాయిలో ఎగుమతులు శివకాశి నుంచే జరుగుతున్నాయి. అయితే బాణాసంచా తయారీ కేంద్రాల్లో ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. లాభాల మీద మాత్రమే ఆసక్తి చూపే యాజమాన్యాలు రక్షణ చర్యల విషయంలో అంతగా దృష్టి సారించరు. ఫలితంగా కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని కొన్ని సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం కార్మికుల కోసం 1000 కోట్లతో ఒక బోర్డును ఏర్పాటు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా అది మూలకు పడింది.

వాస్తవానికి శివకాశి పరిసర ప్రాంతాల్లో ఒక్కో కార్మికుడికి రోజుకు 500 నుంచి కూలి రాదు. కాని శివకాశి లో బాణాసంచా తయారీ కేంద్రాల పని చేసే కార్మికులకు రోజుకు 1500 నుంచి 2500 వరకు కూలీ లభిస్తుంది. అందువల్లే కార్మికులు ఇక్కడ పనిచేసేందుకు ఇష్టపడుతుంటారు. దీర్ఘకాలం పరిశ్రమల్లో పని చేయడం వల్ల అనారోగ్యం బారిన పడుతుంటారు. ఇక్కడ పనిచేసే కార్మికుల్లో 30 నుంచి 35% వరకు క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఒక శివకాశిలోనే సుమారు పదివేల కోట్ల వరకు బాణాసంచా వ్యాపారం జరిగినట్టు తెలుస్తోంది.. ఇందులో సుమారు 60 శాతం దేశంలో వివిధ ప్రాంతాలకు ఎగుమతి కాగా.. మిగతా 40% ఇతర దేశాలకు సరఫరా అయ్యాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version