
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలినందున నిన్న రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఈ క్రమంలోనే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండేళ్లు.. అంతకంటే ఎక్కువ రోజులు జైలు శిక్ష పడిన రాహుల్ గాంధీ లోక్ సభ నుండి అనర్హుడయ్యాడు. లోక్‌సభ సెక్రటేరియట్ కూడా ఆయన నియోజకవర్గం ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది. ఎన్నికల సంఘం ఇప్పుడు ఈ స్థానానికి ప్రత్యేక ఎన్నికలను ప్రకటించవచ్చు.
బిలియనీర్ , పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ఆరోపణలను ఆరోపించినందుకే రాహుల్ గాంధీని అనర్హుడిగా చేశారని.. పార్లమెంట్ లో అదానీతో మోడీ సంబంధాన్ని ప్రశ్నించినందుకే ఇలాంటి చర్యలు తీసుకున్నారని.. ఇది రాహుల్ గాంధీని మౌనంగా ఉంచేందుకు జరిగిన ‘కుట్ర’ అని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ అంశంపై కమిటీ (జేపీసీ) విచారణ చేపట్టింది.
“కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం దోషిగా తేలిన తేదీ నుండి అంటే 23 మార్చి, 2023 నుండి లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాడు. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8 ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేసినట్టు” లోక్‌సభ సెక్రటేరియట్ ఈరోజు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఎంపిగా అనర్హత వేటుకు సంబంధించిన ఆర్డర్ జారీ చేసినందున రాహుల్ గాంధీ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి ఒక నెల సమయం ఇస్తూ గెజిట్ జారీ చేశారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8(3) ప్రకారం, పార్లమెంటు సభ్యుడు ఏదైనా నేరానికి పాల్పడి కనీసం రెండేళ్ల జైలు శిక్ష విధించిన వెంటనే, అనర్హత వేటు పడతుంది.. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయబడింది.
దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ‘రాహుల్ మీ కోసం, ఈ దేశం కోసం వీధుల నుండి పార్లమెంటు వరకు పోరాడుతున్నాడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి సాధ్యమైన ప్రతిదాన్ని ప్రయత్నిస్తున్నాడు. ఎన్ని కుట్రలు జరిగినప్పటికీ రాహుల్ గాంధీ ఈ పోరాటాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగిస్తారని.. ఈ విషయంలో న్యాయమైన చర్య తీసుకుంటాడని.. పోరాటం కొనసాగుతోంది’’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.