ఉత్కంఠకు తెరపడింది.. మూడు నెలలుగా హోరాహోరీగా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పోరులో మంచు విష్ణు ప్యానల్ ఘన విజయం సాధించింది. అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. ప్రకాశ్ రాజ్ పై సుమారు 400 ఓట్ల తోడాతో విజయం సాధించారు. అయితే.. ఎగ్జిగ్యూటివ్ మెంబర్స్ విషయంలో మాత్రం ప్రకాశ్ రాజ్ ప్యానల్ మెరుగైన ఫలితాలు సాధించింది. 18 స్థానాలకుగానూ 11 స్థానాల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు గెలిచారు. 7 స్థానాల్లో విష్ణు మంచు ప్యానెల్ సభ్యులు విజయం సాధించారు.

జనరల్ సెక్రటరీగా విష్ణు ప్యానల్ నుంచి పోటీ చేసిన రఘుబాబు, ట్రెజరర్‌గా శివ బాలాజీ విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీగా గౌతంరాజు విజయం సాధించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్ మాత్రమే గెలిచారు. మొత్తంగా విష్ణు ప్యానెల్ మా ఎన్నికల్లో సక్సెస్ సాధించింది.
– స్థానికతే పనిచేసిందా?
మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. కానీ.. మొదటి నుంచీ.. ప్రకాష్ రాజ్ వైపు ఎడ్జ్ కనిపించిందనే ప్రచారం సాగింది. కానీ.. చివరి నిమిషంలో విష్ణు మ్యాజిక్ చేశాడు. ప్రకాష్ రాజ్‌ను నటుడిగా ఆదరించినా కూడా.. అధ్యక్షుడిగా మాత్రం చూడలేమని ఓపెన్‌గానే చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఇదే నిజమైంది. ఏకంగా 400 ఓట్లకు పైగా మెజారిటీ విష్ణుకు వచ్చిందంటే చిన్న విషయం కాదు. దాదాపు 75 శాతం ఓట్లు విష్ణుకు వచ్చాయి. దీంతో గెలుపు ఓటములపై చర్చ సాగుతోంది. ఈ ఎన్నికల్లో స్థానికతే పనిచేసిందా? అని చర్చించుకుంటున్నారు.