T20 World Cup Team India Squad: ఆసియా కప్ ఓటమితో టీమిండియా సెలెక్టర్లు కళ్లు తెరిచారు. బౌలింగ్ విభాగాన్ని పటిష్ట పరిచారు. టీ20 స్పెషలిస్ట్ బౌలర్లు అయిన జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ లకు ఆస్ట్రేలియాలో వచ్చే నెలలో జరగబోయే టీ20 ప్రపంచకప్ లో భారత జట్టులో చోటు కల్పించారు. టీ20 వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో బౌలింగ్ దళంలోనే భారీ మార్పులు జరిగాయి. బ్యాటింగ్ విభాగం మొన్నటి ఆసియాకప్ లో ఆడినవారే ఉన్నారు.

టీమిండియా బౌలింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేశారు. ఆసియాకప్ లో తడబడిన ఆవేశ్ ఖాన్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్ లను పక్కనపెట్టేసారు. ఇక గాయంతో దూరమైన రవీంద్ర జడేజా స్థానంలో సేమ్ స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు చోటిచ్చారు. బుమ్రా, హర్షల్ పటేల్ రాకతో టీమిండియా బౌలింగ్ విభాగం అత్యంత పటిష్టమైందనే చెప్పాలి. ఈ నలుగురు కలిస్తే ప్రత్యర్థులకు చుక్కలే. భువి, బుమ్రా, హర్షల్, అర్షదీప్ ఏస్ బౌలర్లుగా ఉండనున్నారు.
ఇక బ్యాటింగ్ లో బీసీసీఐ సెలెక్టర్లు వేలు పెట్టలేదు. ఓపెనర్లుగా రోహిత్, రాహుల్ కంటిన్యూ చేశారు. విరాట్ కోహ్లీ వన్ డౌన్ లో.. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, పంత్ ,. దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడాలకు చోటిచ్చారు. పంత్, దినేశ్ కార్తీక్ లలో ఎవరో ఒకరికి మాత్రమే అవకాశం ఉండనుంది.
మొత్తంగా టీమిండియా ఆసియాకప్ లో బౌలింగ్ వైఫల్యం వల్లే ఓడింది. దాన్ని మెరుగ్గా చేసి ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లో ఆడించేందుకు రెడీ అయ్యారు. మరి ఈ బౌలర్లు వరల్డ్ కప్ లో భారత జట్టుకు కప్ ను అందిస్తారా? లేదా? అన్నది వేచిచూడాలి.
-టీమిండియా ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (కీపర్), దినేష్ కార్తీక్( కీపర్), హార్దిక్ పాండ్యా, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, బుమ్రా, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అర్ష్ దీప్ సింగ్.