KCR National Party: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా రెండేళ్లుగా పోరాటం మొదలు పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి.. కొన్ని రోజులు బీజేపీ, కాంగ్రెస్ యేతర ఫ్రంటు అంటూ జాతీయ పర్యటనలు చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఫ్రంటులో చేరడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. గులాబీ బాస్ గొంతుకు ఎవరూ శృతి కలుపడం లేదు. పచ్చిగా కేసీఆర్ భాషలోనే చెప్పాలంటే ఫక్తు రాజకీయ పార్టీ టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉండడమే మంచిదని భావిస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ప్రయత్నాలు పూర్తిగా అడుగంటాయి. ఇక విధిలేని పరిస్థితిలో జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయానికి వచ్చారు. దీనిపై కొన్ని రోజులు కసరత్తు చేస్తున్నట్లు మీడియాకు లీకులు ఇచ్చారు. బహిరంగ సభల్లో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆయన వేస్తున్న అడుగులపై అనేక చిక్కు ముడులు ఎదురవుతున్నాయి.

ప్రాంతీయ పార్టీలతో సమావేశం..
బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ జాతీయ పార్టీ పెడతానంటూనే ఇంకోవైపు ప్రాంతీయ పార్టీలతో సమావేశం అవుతున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై జేడీఎస్ నేత కుమారస్వామితో ప్రగతిభవన్‌లో మంతనాలు సాగించారు. కుమార స్వామి కూడా జాతీయరాజకీయాల్లోకి రావాని కేసీఆర్‌ను ఆహ్వానించారు. కానీ బీఆర్‌ఎస్ ఆవిర్భవించిన తర్వాత కుమారస్వామి ఇదే మాటకు కట్టుండి ఉంటాడన్న గ్యారెంటీ లేదు. నితీశ్‌కుమార్, అఖిలేష్ యాదవ్, తృణమూల్, ఆప్ పార్టీ కూడా ప్రస్తుతం కేసీఆర్‌ను బీజేపీకి శత్రువుగా మాత్రమే ఆహ్వానిస్తున్నాయి. జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కలిసి పనిచేసే అవకాశం ఉండదు.
పొత్తు పెట్టుకుంటే తెలంగాణలోనూ సీట్లు ఇవ్వాలి..
జాతీయ పార్టీ ప్రకటన తర్వాత కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటారన్న వార్తలు వస్తున్నాయి. కానీ అదే జరిగితే అక్కడి ప్రాంతీయ పార్టీలు తెలంగాణలోనూ సీట్లు అడిగే అవకాశం ఉంది. కేసీఆర్ పార్టీకి ఇతర రాష్ట్రాల్లో సీట్లు ఇస్తే.. తెలంగాణలో కూడా కేసీఆర్ టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు కేసీఆర్‌కు తెలంగాణలో కూడా కేసీఆర్‌కు నష్టం జరిగే అవకాశం ఉంది.
తెలుగు ప్రజలు ఉన్న చోటే పోటీ..
జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత వచ్చే ఎన్నికల్లో తెలుగువారు ఉన్న ప్రాతాల్లోనే పోటీ చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే తెలుగువారు బీఆర్‌ఎస్‌కు ఓటేస్తారని కచ్చితంగా చెప్పలేం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రా పార్టీలుగా ముద్రపడిన టీడీపీ, వైసీపీ పోటీ చేసినా ఓట్లు వేయలేదు. సీమాత్ర ప్రజలు కూడా టీఆర్‌ఎస్‌కే ఓట్లు వేశారు. బీఆర్‌ఎస్ పార్టీ కూడా ఇతర రాష్ట్రల్లో తెలుగు ప్రజలు ఉన్న చోట పోటీ చేసినా అక్కడి పార్టీలకే ఓట్లు వేస్తారు తప్ప బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయరు.
శత్రువుకు శత్రువైనా మిత్రుడు కావడం లేదు..
శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడు అన్నది నానుడు. కానీ దేశ రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడు కాలేకపోతున్నారు. దేశంలోని ఆప్, తృణమూల్ కాంగ్రెస్, జేడీఎస్, సమాజ్‌వాదీ, సీపీఐ, జేడీయూ, టీఆర్‌ఎస్ తదితర పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అందని ఎజెండా బీజేపీని ఓడించడమే కానీ ఏ పార్టీలు కలిసి పోటీకి సిద్ధం కావడం లేదు. కారణం.. ఎవరి ఎజెండా వారికి ఉండడమే. బెంగాల్‌లో సీపీఐ, తృణమోల్ శత్రువులు, ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్ వైరి పక్షాలు. అయితే ఈ పార్టీలకు ఉమ్మడి శత్రువు బీజేపీ. అయినా కలిసి మాత్రం పనిచేయరు.

ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌వైపే మొగ్గు..
కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ పెట్టిన తర్వాత కూడా ప్రాతీయ పార్టీలు కేసీఆర్ పార్టీలో పొత్తు పెట్టుకునే అవకాశం చాలా తక్కువ. బలం లేని పార్టీలో కలిసి ముందుకు సాగడం కన్నా. ఎంతో కొంత బలం ఉన్న కాంగ్రెస్‌తో కలిసి బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలు మొగ్గుచూపతాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో కలిసి వచ్చే పార్టీలు ఉండవు. వేదిక ఏర్పాటు చేసినా కాంగ్రెస్ లేకుండా ఉండదు. మరి ఇన్ని చిక్కు ప్రశ్నల నడుమ ఏర్పాటు చేయబోయే బీఆర్‌ఎస్ దేశ రాజకీయాల్లో ఎలా బతికి బట్టకడుతుందో కేసీఆర్ మాత్రమే సమాధానం చెప్పాలి.