Salman khan: కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు కానీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టుకు మాత్రం మునావర్ ఫారూఖీ కారణం. ఇదంతా అందరికి తెలిసిందే. హైదరాబాద్ లో ఫారూఖీతో షో నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. ఓ వైపు బీజేపీనేతలు అడ్డుకుంటున్నా వినకుండా టీఆర్ఎస్ నేతలు తమ పని కానిచ్చేశారు. దీంతో బీజేపీ నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ ముస్లింలపై ఆరోపణలు చేశారనే ఉద్దేశంతో ఆయనను అరెస్టు చేశారు. దీనిపై విమర్శలు వచ్చినా సర్కారు పట్టించుకోలేదు.

ఇప్పుడు తాజాగా మరో వివాదం రాజుకుంటోంది. బిగ్ బాస్ హిందీ వెర్షన్ లో కంటెస్టెంట్ గా మునావర్ ఫారూఖీని హోస్ట్ సల్మాన్ ఖాన్ ఆహ్వానించడం చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే బీజేపీ టార్గెట్ గా ఉన్న మునావర్ ను బిగ్ బాస్ లోకి తీసుకున్న సల్మాన్ ఖాన్ పై బీజేపీ ఏ రేంజ్ లో లేస్తుందో తెలియడం లేదు. బిగ్ బాస్ ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకుంది. 16వ సీజన్ కు మునావర్ ను పిలిచారు. దీంతో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సల్మాన్ ఖాన్ ను టార్గెట్ గా చేసుకుని నేతలు తమ నోళ్లకు పనిచెప్పే అవకాశాలున్నాయి.
బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మునావర్ వ్యవహారంపై బీజేపీ నేతలు గుర్రుగానే ఉన్నట్లు చెబుతున్నారు. సల్మాన్ ఖాన్ చేస్తున్న దానిపై బీజేపీలో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టుకు నిరసన వ్యక్తం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మరోమారు తమ మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వారిపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారో తెలియడం లేదు. సల్మాన్ ఖాన్ మాత్రం దీంతో చిక్కుల్లో ఇరుక్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్న వారికి బిగ్ బాస్ ఎలా అందలం ఎక్కిస్తుందో తెలియడం లేదని పలువురు బీజేపీ నేతలు ఇప్పటికే వ్యాఖ్యానించడం గమనార్హం.
తెలుగు బిగ్ బాస్ షోపై సీపీఐ నేత నారాయణ పలు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయం వివాదాలకు తావిస్తోంది. బీజేపీ నేతలు సల్మాన్ ఖాన్ ను ఓ ఆట ఆడుకుంటారని చెబుతున్నారు. ఆయన నటించిన సినిమాలు ఆడకుండా చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి బిగ్ బాస్ విషయంలో సల్మాన్ ఏకపక్ష నిర్ణయంపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. వివాదాస్పదమైన వ్యక్తులను ఎందుకు చేరదీస్తున్నారని బీజేపీ మండిపడుతోంది.

ఈ షోకు సంబంధించిన ప్రొమో కూడా విడుదల చేశారు. దీంతో 16వ సీజన్ అంత సజావుగా సాగుతుందని అనుకోవడం లేదు. దీనికి బీజేపీ నేతలు కచ్చితంగా అడ్డు చెబుతారు. షో నిర్వహణపై పీటముడి పడే అవకాశముంది. మొత్తానికి సల్మాన్ ఖాన్ నిర్ణయంపై అందరిలో అయోమయం నెలకొంది. కావాలనే మునావర్ ను పిలిపించినట్లు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా బిగ్ బాస్ మరోమారు సంచలనాలకు వేదిక కాబోతోందని మాత్రం తెలిసిపోతోంది.