Janasena: మత్స్యకారులు జనసేనకు టర్న్ అయ్యారా? దశాబ్దాల పాటు తమను ఓటు బ్యాంకుగా మార్చుకున్న రాజకీయ పక్షాలపై విరక్తితో ఉన్నారా? తమ భవిష్యత్, మనుగడ పవన్ తోనే సాధ్యమనుకుంటున్నారా? ఆయనతోనే తమకు రాజ్యాధికారం దక్కుతుందని భావిస్తున్నారా? ఉద్యోగ, ఉపాధి మార్గాలు పెరుగుతున్నాయనుకుంటున్నారా? చట్టసభల్లో తమ ప్రాతినిధ్యం పెరగాలంటే పవన్ వెంట నడవడమే శ్రేయస్కరమనుకుంటున్నారా? అంటే మత్స్యకార వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రానికి ఏమైనా కలిసి వచ్చిందంటే అది తీర ప్రాంతమే. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా పీఠమెక్కిన చంద్రబాబు సర్కారు సైతం తీర ప్రాంత పరిరక్షణకు తీసుకున్న చర్యలేమీ లేవు. మత్స్యకారుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపట్టనూ లేదు. అటు తరువాత వచ్చిన వైసీపీ సర్కారు సైతం సంక్షేమ పథకాల తాయిలాలుగా చూపి మత్స్యకార వర్గాల నుంచి ఎన్నికల్లో లబ్ధి పొందిందే తప్ప వారికి శాశ్వత ప్రయోజనం కలిగించే ఏ ఒక్క ప్రాజెక్టును నిర్మించలేదు. పైగా తీర ప్రాంతంలో భూములను బడా సంస్థలకు కేటాయింపులు చేస్తోంది. అదే సమయంలో ఫిషింగ్ హార్బర్లు, జెట్టీల నిర్మాణానికి మాత్రం భూములను సేకరించలేకపోతోంది. పైగా మత్స్యకారుల ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా 270 జీవోను తెరపైకి తెచ్చింది. సముద్రంతో పాటు నదులు, కాలువలు, చెరువుల్లో చేపల వేటకు వేలం పాట నిర్వహించేందుకు నిర్ణయించింది. 60 లక్షల మంది ఉన్న మత్స్యకారుల సంఖ్యను తక్కువగా చూపి… మత్స్యకార సహకార సంఘాల్లో సభ్యత్వం ఉంటేనే ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తోంది. ఏటా వేసవిలో వేట నిషేధ సమయంలో అందించే వేసవి భ్రుతిలో సైతం భారీగా కోత విధిస్తోంది.
మత్స్యకారుల అభ్యున్నతి సభతో ఊపు
మత్స్యకారులు మర్రోమంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ద్రుష్టిసారించిన పాపాన పోలేదు. ఇటువంటి సమయంలో జనసేనాని పవన్ మత్స్యకారుల సమస్యలపై గొంతెత్తారు. మత్స్యకార అభ్యున్నతి సభ ఏర్పాటుచేసి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకార సంఘ నాయకులు కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను విన్నవించారు. దశాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న అపరిష్క్రుత సమస్యలను వినిపించారు. దీనిపై పవన్ కళ్యాణ్ గళమెత్తారు. దీంతో ప్రభుత్వం 270 జీవో విషయంలో వెనక్కి తగ్గింది. ఫిషింగ్ హార్బర్లు, జెట్టీల నిర్మాణంపై స్పీడ్ పెంచింది. టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి భూ సేకరణ చేపడుతోంది. మత్స్యకారుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోంది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ కార్చాచరణ ప్రారంభించిన తరువాతే ప్రభుత్వంలో కదలిక రావడాన్ని మత్స్యకారులు గుర్తించారు. జనసేనతోనే మత్స్యకారుల ఉనికి సాధ్యమని నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. దాని ఫలితంగానే తీర గ్రామాల్లో మత్స్యకారులు జనసేనలో చేరుతున్నారు.
Also Read: Telangana Congress: గీత దాటితే వేటే… రేవంత్ కాంగ్రెస్ ను గాడిలో పెడుతున్నాడా?
ఓటు బ్యాంక్ రాజకీయాలకు చెక్
సువిశాల తీర ప్రాంతం ఏపీ సొంతం నెల్లూరు జిల్లా తడ నుంచి శ్రీకాకుళం జిల్లా డొంకూరు వరకూ దాదాపు 1000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. వేలాది తీర గ్రామాలున్నాయి. దాదాపు 60 లక్షల మంది మత్స్యకార జనాభా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా మత్స్యకారుల బతుకులు మాత్రం మారడం లేదు. మత్స్యకారులను ఓటు బ్యాంకు చూస్తున్నారే తప్ప వారి జీవన ప్రయోజనం మెరుగుపరిచే చర్యలు ఈ రాష్ట్రంలో శూన్యం. ఫిషింగ్ హార్బర్లు లేవు. జెట్టీల నిర్మాణమూ లేదు. మత్స్య సంపదను విక్రయించేందుకు సరైన మార్కెట్, రవాణా సదుపాయాలూ లేవు. స్థానికంగా వేట గిట్టుబాటుకాక మత్స్యకారులు సుదూర ప్రాంతాలకు వలసపోతున్నారు. గుజరాత్, కాండ్ల వంటి ప్రాంతాల్లో ప్రైవేటు కాంట్రాక్టర్ల వద్ద పనికి కుదురుతున్నారు. వేటకు వెళ్లి సరిహద్దు దాటి విదేశీ జల విభాగంలోకి అడుగుపెడుతున్నారు. అక్కడి కోస్టుగార్డులకు చిక్కుతున్నారు. సంవత్సరాల తరబడి అక్కడి జైలులో మగ్గుతున్నారు. దశాబ్దాలుగా వారి వ్యథ అంతా ఇంతా కాదు. నేతల హామీలు వినివిని వేసారిన గంగపుత్రులకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక ఆశాదీపంలా కనిపిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావం తరువాత మత్స్యకారులు ఆ పార్టీ వెంట నడిచారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు. విభజిత ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు వైపు, గత ఎన్నికల్లో సంక్షేమ హామీలతో జగన్ కు అండగా నిలిచారు. మత్స్యకారులు అండగా నిలిచిన పార్టీలే రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నాయి. ఈసారి పవన్ కళ్యాణ్ వైపు మరలుతుండడంతో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
Also Read: Russia occupies Mariupol: మారియుపోల్‌ను ఆక్రమించిన రష్యా.. అమెరికాకు పుతిన్ సీరియస్ వార్నింగ్
Web Title: Pawan kalyan is hope for fishermen looking towards janasena
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com