Home Blog Page 8600

ఇదే మంచి సమయం..:మోడీ

2020 ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి (పిఎంబిజెకె-2020)సెలబ్రేషన్స్ లో భాగంగా మోడీ పిఎంబిజెకె యజమానులతో, ప్రధాన మంత్రి జన ఔషధి పరియోజన లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్బంగా మోడీ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

దేశ వ్యాప్తంగా కరోనావైరస్ పై వస్తున్న వదంతులను నమ్మవద్దని, వైద్యుల సూచనలను పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు సూచించారు. కరచాలనాలను మానేసి మరోసారి నమస్తే పెట్టాలని ఆయన చెప్పారు.

ప్రపంచంలోని అనేకదేశాల ప్రజలు పరస్పరం అభినందించుకునేందుకు నమస్తేను అలవాటు చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. ఏదైనా కారణం వల్ల మనం దాన్ని మానేసి ఉంటే, కరచాలనం చేయడానికి బదులు దాన్ని తిరిగి అలవాటు చేసుకోవడానికి ఇదే సమయమని మోడీ అన్నారు.

జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రతి నెలా కోటి కుటుంబాలకు పైగా చౌక ధరలకు మందులు అందుతున్నాయని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 6 వేల జన ఔషధి కేంద్రాల వల్ల ప్రజలు రూ. 2 వేల కోట్ల నుంచి 2 .5 కోట్ల రూపాయలు అదా చేసుకోగలుగుతున్నారని మోడీ తెలిపారు.

క్యారెక్టర్ కోసం కోటి డిమాండ్ చేసిన ఆంటీ

ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు రాణించిన వారంతా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. సీనియర్ హీరోయిన్లు కావడంతో వీరికి దర్శక, నిర్మాతలు పారితోషికం భారీగానే ఇస్తున్నారు. వీరికి క్రేజ్ బాగా ఉండటంతో తమ సినిమాల్లో నటించాలని సంప్రదిస్తే హీరోయిన్లను మించిన పారితోషికం అడుగుతున్నాడటంతో నిర్మాతలు అవాక్కవుతున్నారు. తాజాగా సీనియర్ నటి టబును ఓ క్యారెక్టర్ కోసం నిర్మాత సంప్రదించగా ఏకంగా కోటి రూపాయాలు డిమాండ్ చేసిందట. దీంతో నిర్మాత అంత ఇచ్చుకోలేనంటూ వెనుదిరిగినట్లు సమాచారం.

టాలీవుడ్లో కూలీ నెం.1 మూవీతో టబు ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఘనవిజయం సాధించడంతో తెలుగులో ఈ అమ్మడికి భారీ క్రేజ్ వచ్చింది. ఒకప్పుడు అగ్రహీరోయిన స్టార్డమ్ అనుభవించిన టబు ప్రస్తుతం ఏజ్ బారవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తుంది. క్యారెక్టర్ ఏదైనా సరే అవలీలగా టబు నటించి మెప్పించడంలో దిట్ట. ఇటీవల అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురములో’ టబు క్యారెక్టర్ ఆర్టిస్టు నటించి మెప్పించింది. దీంతో టాలీవుడ్లో టబు పేరు మళ్లీ మారుమ్రోగుతోంది.

‘అలవైకుంఠపురములో’ భారీ విజయం తర్వాత టబును తమ సినిమాల్లో తీసుకునేందుకు పలువురు నిర్మాతలను ఆమెను సంప్రదించారు. ఈమేరకు ఆమెకు కథలు కూడా వినిపించినట్లు సమాచారం. అయితే తనతో సినిమా చేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని కండిషన్‌ పెడుతుందట. ఇప్పటికే హీరో హీరోయిన్లకి కోట్ల కొద్ది రెమ్యూనేషన్ ఇస్తున్నామని ఇక క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా కోట్లు ఇవ్వాలంటే ఆస్తులను అమ్ముకోవాల్సిందేనంటూ వాపోతున్నారు. టబుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు ఆమెకు బాగా ముట్టజెప్పినప్పటికీ కోట్లలో డిమాండ్ చేస్తుండటంతో పునరాలోచనలో పడుతున్నారు. దీంతో ఆమెకు టాలీవుడ్లో మంచి అవకాశాలు చేజారుతున్నాయి.

అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

తెలంగాణ అసెంబ్లీ నుంచి ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఒకరోజు పాటు సస్పెండ్‌ అయ్యారు. సస్పెండ్‌ అయిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, జగ్గారెడ్డి, పోడెం వీరయ్య, భట్టి విక్రమార్క, సీతక్క ఉన్నారు.

శనివారం గవర్నర్‌ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతుండగా కాంగ్రెస్‌ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. సభలో ఇష్టమొచ్చినట్లు అరవడం సరికాదని, సభకు ఆటంకం కలిగించే చర్యలను సహించమని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

అసెంబ్లీకి ఒక పద్ధతి ఉంటుందని, దాని ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. సభలో ఇష్టమొచ్చినట్లు అరిచి, అరాచకం సృష్టిస్తే కుదరదని తేల్చిచెప్పారు.

ఏదో ఒక విధంగా బయటకు వెళ్లాలనే కాంగ్రెస్‌ సభ్యుల గొడవ చేస్తున్నారని, సభకు ఆటంకం కలిగించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి సీఎం సూచించారు. దీంతో ఆరుగురు సభ్యులను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్‌ చేశారు.

ట్రస్ట్‌ చైర్మన్‌ మార్పును ప్రశ్నించిన అశోక్ గజపతిరాజు

తమ కుటుంభానికి చెందిన మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారాలలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకొని రాత్రికి రాత్రి తనను చైర్మన్ పదవి నుండి మార్చడం పట్ల టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల వ్యవహారాల్లో రాజకీయాలు చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ట్రస్ట్‌ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం సరికాదని స్పష్టం చేశారు.

పైగా వేరే మతంకు చెందిన తన అన్నగారి కుమార్తెను నియమించడాన్ని ప్రస్తావిస్తూ వేరే మతం వారిని నియమిస్తే సమస్యలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయినా ప్రభుత్వ జీవోను ఇప్పటివరకు బయటపెట్టకుండా వేరే మతానికి చెందిన మహిళకు ఏ విధంగా బాధ్యతలు అప్పజెబుతారని ఆయన ప్రశ్నించారు.

మాన్సాస్‌ ట్రస్ట్‌ పరిధిలో 105 ఆలయాలు ఉన్నాయని చెబుతూ ట్రస్ట్‌, దేవాదాయ భూములపై ప్రభుత్వం కన్నేసిందని ఆరోపించారు. దాతల భూములు ఆలయాలకే చెందాలని అశోక్‌ గజపతిరాజు డిమాండ్ చేశారు.

మాన్సాస్‌ చైర్మన్‌ పదవి మార్పు వింతగా ఉందని చెబుతూ భక్తుల నమ్మకాలపై దెబ్బకొట్టారని ధ్వజమెత్తారు. వంశపారంపర్య పదవుల్లో, ట్రస్టుల్లో అన్యమతస్తుల జోక్యం సరికాదని హెచ్చరించారు. మాన్సాస్‌ ట్రస్ట్‌లో దేవాదాయ శాఖ అధికారులతోనే… నిర్వీర్యం చేయడానికి కొన్నాళ్లుగా ఎత్తుగడలు వేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు మారినా… ఇలాంటి సమస్యలు రాలేదని వాపోయారు.

రాజకీయాలతో సంబంధంలేని సంస్థకు రాజకీయాలు ఆపాదించడం దేశానికి అరిష్టమని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారించారు. ట్రస్టీగా తానేదైనా పొరపాట్లు చేసి ఉంటె తనకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పదవి నుంచి ఎలా తొలగిస్తారని నిలదీశారు.

జివో కాపీ అందిన తర్వాత కోర్టును ఆశ్రయించాలా?… ఏ విధమైన పోరాటం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ వైఖరి వల్ల పరిశ్రమలు, పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నారని అశోక్‌ గజపతిరాజు మండిపడ్డారు

Eureka Movie Pressmeet Photos

Samantha Launches Healthy way Restaurant

చీలిన చిత్రపరిశ్రమ.. ఎప్పుడు ఏమవుతుందో..

సిఎఎ, ఎన్‌ఆర్‌సి, జెఎన్‌యు-జామియా హింస తదితర అంశాలపై ముంబై చిత్ర పరిశ్రమ చాలా వేడెక్కింది. ఈ నేపధ్యంలోనే సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా మరో నటుడు అనుపమ్ ఖేర్‌ను ‘జోకర్’ అని అభివర్ణించారు. దీనికి ప్రతిస్పందనగా అనుపమ్ ఖేర్ తన సహనటుడు షా ని నిరాశపరిచిన నటుడిగా పేర్కొన్నారు. నసీరుద్దీన్ షా- అనుపమ్ ఖేర్‌ల మధ్య వివాదం ప్రభుత్వం ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు కారణంగా చోటుచేసుకుంది. సిఎఎ, ఎన్‌ఆర్‌సిలను నసీరుద్దీన్ షా వ్యతిరేకిస్తుండగా, అనుపమ్ ఖేర్ వాటికి మద్దతు ఇస్తున్నారు

బాలీవుడ్ చరిత్రలో మొదటిసారిగా పరిశ్రమలోని కొంతమంది, మరికొందరిపై ఈ విషయమై పదునైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దింతో చిత్ర పరిశ్రమ ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఇదే కోవలో నసీరుద్దీన్ షా మాత్రమే కాకుండా, అనురాగ్ కశ్యప్, విశాల్ భరద్వాజ్, అనుభవ్ సిన్హా, దీపికా పదుకొనే, ఫర్హాన్ అక్తర్, సుశాంత్ సింగ్, స్వరా భాస్కర్, అనురాగ్ బసు తదితరులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మరోవైపు అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్, పరేష్ రావల్, వివేక్ ఒబెరాయ్, ప్రసూన్ జోషి, మాధుర్ భండార్కర్, వివేక్ మొదలైన వారంతా ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు. హీరోలు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లు ప్రభుత్వానికి సన్నిహితం గా మెలుగుతుంటారని అందరు అనుకుంటారు. అయితే ఇప్పుడు వారితో సంబంధం ఉన్న వ్యక్తులు రాజకీయ క్రియాశీలత నుంచి తప్పుకుంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో 60 మంది సినీ ప్రముఖులు లౌకిక పార్టీలకు ఓటు వేయమని ప్రజలను కోరుతూ సంతకాల ప్రచారం చేశారు. దీనిపై చాలా మంది కళాకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బాలీవుడ్‌లో చీలిక మరింత పెరిగింది. నటుడు అనుపమ్ ఖేర్, గాయకుడు అభిజీత్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. అధికార పార్టీకి చెందిన ప్రతి కదలికకు మద్దతు పలికారు. 2019 ఎన్నికల్లో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా ఓట్లను అభ్యర్ధించారు. నిజానికి కళ, సాహిత్యం అనేవి అధికార ధోరణికి వ్యతిరేకమని అంటుంటారు. అయితే హాలీవుడ్‌లోను ఇటువంటి భిన్న ధోరణి కనిపిస్తుంది. అక్కడ రాబర్ట్ డి నిరో, మెరిల్ స్ట్రీప్ వంటి సూపర్ స్టార్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను బహిరంగంగా విమర్శించారు. అయితే ఇప్పుడు బాలీవుడ్‌లో తలెత్తిన చీలిక అసాధారణమైనది. ఇప్పుడిది ఎక్కడికి దారి తీస్తుందో వేచిచూడాలి.

రాజకీయ పార్టీకి వేగంగా రజనీకాంత్ కసరత్తు!

గత రెండేళ్లుగా తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతూ వస్తున్న ప్రముఖ నటుడు రజనికాంత్ పార్టీ ఏర్పాటుకు వేగం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మరో రెండు నెలల్లో పార్టీని లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీ ప్రధాన ఎన్నికల కమిషన్‌లో రజనీకాంత్ తరఫున కొత్త పార్టీకోసం దాఖలు చేయవలసిన దరఖాస్తు ఫారం తీసుకోవడంతో ఈ ప్రయత్నాలు వేగం అందుకున్నట్లు నిర్ధారణ అయింది.

2021లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు చెబుతూ వస్తున్న రజనీకాంత్ గురువారం మండ్రం కార్యదర్శులతో సమావేశమై జిల్లాల వారి పరిస్థితులను సమీక్షించారు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తే రాగాల పరిష్టితుల గురించి క్షేత్రస్థాయిలో అంచనా వేసి నివేదికలు ఇవ్వమని వారిని కోరారు.

నియోజకవర్గంలో ఇతర పార్టీల బలాలు? గెలిచే అభ్యర్థులు? కమల్‌ పార్టీతో జత కడితే లాభమా, నష్టమా? ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయా?..తదితర వివరాలతో నివేదిక సమర్పించాలని రజనీకాంత్‌ ఆదేశించినట్లు చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నిలకు సమాయత్తంకండి, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఢీకొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చినట్లు సమాచారం. ఇతర పార్టీలతో కూటమి జోలికి పోకుండా ఒంటరిపోరే మంచిదని కార్యదర్శులు రజనీకి సూచించినట్లు తెలుస్తున్నది.

ఒకరు కొత్త పార్టీ ప్రారంభించడానికి మునుపు దాన్ని రాజకీయ పార్టీగా రిజిస్టర్‌ చేయాలనుకుంటే ఎన్నికల కమిషన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈ దరఖాస్తు తీసుకున్నట్టు సమాచారం. పార్టీ పేరు ప్రకటించగానే, ఈ ఫారాన్ని పూర్తి చేసి అందజేయవలసి ఉంది. అందుకోసం పార్టీ విధి విధానాలను కూడా ప్రకటించవలసి ఉంది.

రాజకీయ అరంగేట్రం చేసి క్రియాశీలక పాత్ర పోషిస్తానని 2017 డిసెంబర్‌లో అభిమానుల నడుమ రజనీకాంత్‌ బహిరంగంగా ప్రకటించారు. అయితే రెండేళ్లుగా పార్టీని స్థాపించకున్నా రాజకీయ విమర్శలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.

స్థానిక ఎన్నికలలో గందరగోళం!

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయితీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల కు ఈ రోజు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలు, రెండు దశల్లో గ్రామ పంచాయితీ ఎన్నికలు జరుగనున్నాయి. మర్చి 9 నుంచి మర్చి 29 వరకు రెండు దశల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మొత్తం ఎన్నిక షెడ్యూల్ గ్రామీణ ప్రజలను కొంతమేర అయోమయానికి గురిచేస్తుంది.

అన్ని ఎన్నికలు రెండు మూడు రోజుల గ్యాప్ లోనే జరగడంతో కొంతవరకు గందరగోళ పరిస్థితి నెలకొన్నది. అదే విధంగా మార్చి 27న ఒకవైపు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మరోవైపు గ్రామ సర్పంచ్ ఎన్నికలు ఒకేరోజు జరుతున్నాయి. మధ్యలో మర్చి 26న నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అనివార్యమైతే అదేరోజు ఎన్నికలు జరగొచ్చు. ఇట్టి గందరగోళ పరిస్థితుల మధ్య స్వేచ్ఛగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా ఈ ఆంధ్ర ఎన్నికలను అధికారులు ఎలా నిర్వహిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.

ఎన్నికల షెడ్యూల్ వివరాలు:

జెడ్పీటీసీ, ఎంపీటీసీ (పరిషత్) షెడ్యూల్ వివరాలు:

  • నామినేషన్ల స్వీకరణ
    మార్చి 9 నుంచీ 11 వరకు
  • ఎన్నికల పోలింగ్
    మార్చి 21న
  • ఎన్నికల ఓట్ల లెక్కింపు (కౌంటింగ్)
    మార్చి 24న

గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వివరాలు:

  • నామినేషన్ల స్వీకరణ
    మార్చి 17 నుంచీ 19 వరకు
  • ఎన్నికల పోలింగ్
    మార్చి 27న మొదటిదశ
    మార్చి 29న రెండోదశ

మార్చి 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్

మార్చి 27న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్

పలాస 1978 రివ్యూ: వృధా ప్రయాస

న‌టీన‌టులు: ర‌క్షిత్‌, న‌క్ష‌త్ర‌, తిరువీర్‌, ర‌ఘుకుంచె, జ‌నార్ధ‌న్‌, శ్రుతి, ల‌క్ష్మ‌ణ్ త‌దిత‌రులు
నిర్మాత‌: ధ్యాన్ అట్లూరి వ‌ర‌ప్ర‌సాద్‌
ద‌ర్శ‌క‌త్వం: క‌రుణ కుమార్‌
సంగీతం: ర‌ఘుకుంచె

సినిమా అనేది అద్భుత దృశ్య మాధ్యమం. విభిన్న కధల్ని ,వాస్తవ సంఘటల్ని చాలా అందంగా ,హృద్యంగా ప్రేక్షకులకి అందించ వచ్చు. ఆ క్రమంలో తెలుగు తెర ఫై మంచి ప్రయత్నం పలాస 1978 . ఒక ఊరి చరిత్రని నేపధ్యంగా తీసుకొని అల్లబడిన ఈ చిత్ర కథ తెలుగు తెరకు కొత్త అనుభవమే అందులో ఎటువంటి సందేహం అక్కరలేదు. కానీ కధలో కొత్తదనం లోపించడం మాత్రం ఒక వెలితిగా మిగిలి పోయింది.

కథ :

జానపద కళనే నమ్ముకొని బ్రతికే బడుగు జీవితాల వ్యధ పలాస 1978 చిత్రం. ఆదరణకు నోచుకోని మనుషుల తిరుగుబాటు ఈ చిత్రం. పెత్తందారీ వ్యవస్థ రగిల్చిన అగ్నికి అసహన వాయువు తోడైతే ఏమౌతుందో ఈ చిత్రం చెబుతుంది. నేటికీ తరగని జాతి అంతరాల చర్చకు ఈ సినిమా ఒక మార్గదర్శి. జానపద కళనే వృత్తిగా చేసుకొని బ్రతికే రంగారావు, మోహన్ రావు అనబడే ఇద్దరు అన్నదమ్ములు తమ ఊరి షావుకారు చేసే దురాగతాలపై ఎలా స్పందించారు అనేది చిత్ర కథ. ఆ క్రమంలో జరిగే సంఘర్షణ , పోరాటాల వల్ల తమ చేతులకు నెత్తురు అంటింది అని ఆ మరక అంత త్వరగా పోదని కథానాయకుడు చెప్పడంతో సినిమా ముగుస్తుంది.

దర్శకత్వం:

తెలుగులో పలు లఘు చిత్రాలు తీసి ప్ప్రశంసలు అందుకొన్న కరుణ కుమార్ తన తొలి ప్రయత్నంగా ఒక ఊరి నేపధ్యం తీసుకోవడం చాలా బాగుంది. తమిళం లో భారతి రాజా, బాలా , చరణ్ , వెట్రిమారన్ వంటి దర్శకులు ఇలాంటి విల్లెజ్ బేస్డ్ చిత్రాలకు పెట్టింది పేరు. వారి బాట లోనే ఒక ఊరి నేపధ్యం ఈ చిత్రానికి కదా వస్తువు అయ్యింది. ఆ కథని దర్శకుడు బాగా హేండిల్ చేసాడు. కరుణ కుమార్ దర్శకుడిగా సక్సెస్ అయినప్పటికీ తాను చెప్పిన కధలో కొత్త ధనాన్ని చూపించ లేక పోయాడు. సినిమాలో వచ్చే దృశ్యాలన్నీ ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగు తుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే సినిమాలో థ్రిల్ కొరవడింది. రంగస్థలం వంటి చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం ఆ సినిమాలోని థ్రిల్లింగ్ అంశాలే… అలాంటి వాటిని తన చిత్రంలో చూపించడం లో దర్శకుడిగా కరుణ కుమార్ విఫల మయ్యాడు.

నటీనటులు :

గతంలో లండన్ బాబులు చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయిన రక్షిత్ తన రెండో చిత్రంగా పలాస 1978 ని ఎన్నుకోవడం అభినందించదగ్గ విషయం. తనలోని నటుడికి పరీక్ష పెట్టె ఇలాంటి చిత్రాలే అతని భవిష్యత్ కి బాగా ఉపయోగ పడతాయి. ఇక హీరో అన్న రంగారావు గా నటించిన తిరువీర్ కూడా మంచి నటనని కనబర్చాడు. ఇక విలన్లుగా నటించిన రఘు కుంచె, లింగమూర్తి తమ దుర్మార్గాన్ని బాగా చూపించారు.హీరోయిన్ గా నటించిన నక్షత్ర ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది. ఆమె తన తొలి చిత్రం రాజదూత్ లో కనిపించిన దానికి భిన్నంగా పలాస చిత్రంలో కనిపించి నటిగా మెరుగయింది.

సాంకేతిక నిపుణులు :

కథ, మాటలు, స్క్రీన్ ప్లే , దర్శకత్వం వంటి కీలక శాఖలు తన భుజాల ఫై మోసిన కరుణ కుమార్ ఒక్క కథ విషయం లోనే తడ బడ్డాడు. పాత కదాంశానికి కొత్త ట్విస్టులు ఇవ్వడం లో ఫెయిల్ అయ్యాడు. ఇక మాటల రచయితగా మంచి ప్రతిభ చూపించాడు. కత్తిని అమ్మినవాడిది కాదు తప్పు దాన్ని ఉపయోగించే వాడిదే తప్పు, శోభనం లేని పెళ్లి ఎందుకు దండగ వంటి అర్ధవంతమైన మాటలు సినిమాకి సపోర్ట్ గా నిలిచాయి. అలాగే చిత్రానికి కరుణ కుమార్ అందించిన స్క్రీన్ ప్లే బాగుంది. మంచి నేటివిటీ తో అందర్నీ ఆకట్టు కొనేలా వుంది. సినిమాకి వెన్నెముకగా నిలిచిన అంశాల్లో .కెమెరా మాన్ అరుళ్ విన్సెంట్ పాత్ర మరువలేనిది. మంచి పిరియాడికల్ మూవీ కి ఉండాల్సిన సొగసులు బాగా అద్దాడు. ఎడిటింగ్ కూడా ఒకే అనదగ్గ స్థాయిలో ఉంది. ఇక సంగీత దర్శకుడిగా రఘు కుంచె కూడా మంచి ఫలితమే రాబట్టాడు. కానీ పాటల్ని హిట్ చేయడం లో ఇంకా కొంచెం శ్రద్ద చూపిస్తే బాగుండేది.

విశ్లేషణ :

కొత్త ప్రయత్నానికి పాత కథ తోడవ్వడం తో పలాస 1978 చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించడం లో విఫలం అయ్యింది. సినిమా విడుదలకు ముందు ఉన్న హైప్ సినిమా వచ్చాక తగ్గడానికి ప్రధాన కారణం ఇదే . భూస్వాముల ఫై అణగారిన వర్గాల తిరుగుబాటు అనేది ఎప్పటి నుంచో ఉన్న కధాంశం. దాని కొత్తగా చెప్పడంలో దర్శకుడు మాత్రం సఫలం కాలేక పోయాడు. ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డెడ్ అన్న చందంలా పలాస 1978 చిత్రం ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేక పోతోంది.

ఇంజినీర్లు ఇలాంటి పని చేస్తున్నారేంటి?

చెన్నైకి చెందిన 21 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఎస్ ఆదిత్య కార్ పార్కింగ్ అటెండర్‌గా పనిచేస్తున్నారు. ప్రతి నెలా 18 వేల రూపాయల జీతం పొందుతున్న ఆదిత్య, చెన్నై కార్పొరేషన్ కు చెందిన స్మార్ట్ కార్ పార్కింగ్ కోసం రూపొందించిన యాప్ ప్రమోషన్ కోసం పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగానికి 10 వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు సరిపోతారు. అయితే ఈ ఉద్యోగం కోసం సుమారు 50 మంది ఇంజనీర్లు, ఎంబీఏ డిగ్రీ హోల్డర్లు దరఖాస్తు చేశారు. వీరు అవుట్‌సోర్స్ అందించిన సంస్థ ద్వారా ఈ పని చేస్తున్నారు. తాము తక్కువ అర్హత ఉన్న వ్యక్తికి దక్కే ఉద్యోగావకాశాలను హరించడం లేదని ఆదిత్య చెప్పారు. ఆదిత్య మాట్లాడుతూ, ‘పదవ తరగతి పాస్ అయిన అబ్బాయి లేదా అమ్మాయి ఈ పనిలోకి దిగితే, వారు ఈ టెక్నిక్ అర్థం చేసుకోవడానికి 4 నుండి 5 గంటలు పడుతుంది. అదే మాకు అయితే రెండు, మూడు నిమిషాలు మాత్రమే పడుతుంది.

ఆదిత్య మాదిరిగానే ఎంబీఏ డిగ్రీ హోల్డర్, 21 సంవత్సరాల రాజేష్ కూడా టీమ్ లీడర్‌గా చేరాడు. రాజేష్ తాను గతంలో అందుకున్న జీతానికన్నా తక్కువ జీతానికి ఈ ఉద్యోగంలో చేరాడు. అతనికి పెళ్లి అవడంతో పాటు ఆరేళ్ల పిల్లవాడు కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ఎంబీఏ లేదా బీఈ చేసిన తర్వాత ఎవరికీ ఉద్యోగాలు రావడం లేదు. మా లాంటివారు రూ. 10,000 కన్నా తక్కువ జీతం వచ్చినా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నిరుద్యోగ సమస్యతో పోరాడుతున్న 1500 మందికి పైగా ఉన్నత విద్యావంతులైన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే సంస్థ 50 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చింది. కాగా ఎస్ఎస్ టెక్, టర్క్ మీడియా సర్వీసెస్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ బి రిజ్వాని కటు మాట్లాడుతూ 1000 మంది అభ్యర్థులలో 50 మందిని ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇచ్చారని చెప్పారు. గత సంవత్సరం తమిళనాడు అసెంబ్లీలో 14 స్వీపర్ పోస్టులకు 4,600 మంది ఇంజనీర్లు, ఎంబీఏ చేసినవారు, రీసెర్చ్ స్కాలర్స్ దరఖాస్తు చేశారని చెప్పారు.

చెన్నకేశవుల భార్యకు అండగా నిలుస్తున్న ఆర్జీవీ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చెన్నకేశవుల భార్య రేణుకు అండగా నిలుస్తాడు. తెలంగాణలో వెటర్నరీ వైద్యురాలు(దిశ)పై జరిగిన అమానుష ఘటన సంచనలం సృష్టించిన సంగతి తెల్సిందే. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తాయి. దిశ కేసులో ప్రధాన నిందితుల్లో చెన్నకేశవులు ఒకరు. తాజాగా చెన్నకేశవుల భార్య రేణుక గత రాత్రి పండంటి పాపకు జన్మనిచ్చింది. దీనిపై రాంగోపాల్ వర్శ తన ట్వీటర్లో స్పందించాడు.

తోడులేకుండా జీవిస్తున్న వారికి ప్రతీఒక్కరు అండగా ఉండాలని రాంగోపాల్ వర్మ కోరాడు. రేపిస్టుల నీడ వారిపై పడకుండా వారి భవిష్యత్ బాగుండాలంటే దయచేసి వారికి సాయమందించాలని రాంగోపాల్ వర్శ ట్వీటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. యాక్షన్ ఎయిడ్ ఫర్ సొసైటల్ అడ్వాన్స్ మెంట్(ఎఎస్ఎ) అకౌంట్ నెంబర్, బ్యాంక్ IFSC కోడ్ తన ట్వీటర్లో ట్వీట్ చేశాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

‘దిశ’ సంఘటనపై రాంగోపాల్ వర్శ మూవీని తెరకెక్కిస్తున్నాడు. మృగాళ్లు భయపడేలా సినిమా తీస్తానని ఇప్పటికే ఆయన ఇప్పటికే ప్రకటించాడు. ఇందులో భాగంగానే ఇటీవల చెన్నకేశవుల భార్యను తన ఛాంబర్ కు పిలిపించుకొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెకు కొంతమేర ఆర్థికసాయం కూడా అందించారు. అలాగే దిశ కేసును ఛాలెంజ్ గా తీసుకొని నిందితులను పట్టుకున్న పోలీస్ అధికారులతో మాట్లాడి కథను సిద్ధం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీని త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రాంగోపాల్ వర్శ సన్నహాలు చేస్తున్నారు.

Nabha Natesh Mesmerizing Pictures

కన్నీరు పెట్టుకున్న మోడీ!


భారత్ ప్రధాని నరేంద్రమోడీ భావోద్వేగానికి గురైయ్యారు. జన ఔషధి లబ్ధిదారులతో ఈ రోజు ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంలో ఒక మహిళా లబ్ధిదారు (దీపా షా) మాటలకు ప్రధాని ఉద్వేగానికి లోనయ్యారు. ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం (పిఎంబిజెకె)” ద్వారా తనకెంతో మేలు జరుగుతుందని, అందుకు మీకు(మోడీ) రుణపడి ఉంటామని కన్నీళ్లు పెట్టుకుంటూ.. ఆమె అన్న మాటలకు మోడీ కూడా కన్నీరు పెట్టుకున్నారు.

https://youtu.be/_f8w2Ya2x3Y

పేదవారికీ నాణ్యమైన మందులు, అతి తక్కువధరకే ఇవ్వాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాన్ని (పిఎంబిజెకె) ఫార్మా అడ్వైజరీ ఫోరం(బిపిపిఐ) దేశంలోని వివిధ జిల్లాల్లో ప్రారంభించింది. ఈ పిఎంబిజె కేంద్రాలలో ప్రజలకు అవసరమైన మందులను 60-80% వరకు తగ్గించి ఇస్తారు.

గోప్యంగా జరుగుతున్న ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ వ్యవహారం

పరిపాలనా వికేంద్రీకరణ పేరిట విశాఖపట్నంలో నెలకొల్పదల్చిన పాలనా రాజధాని (ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌) వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా సాగిస్తున్నది. న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు, శానన మండలిలో బిల్లుల పెండింగ్‌, మరికొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ప్రభుత్వ కార్యాలయాల పరిశీలన, గుర్తింపు, ఎంపిక అత్యంత రహస్యంగా జరుపుతున్నారు.

జిల్లా కలెక్టరేట్, గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జివిఎంసి), విశాఖ మెట్రో ప్రాంత డెవలప్‌మెంట్‌ అథారిటీ (విఎంఆర్‌డిఎ)లలో ఒక స్థాయి అధికారుల వరకు రాజధాని భవనాల విషయమై నోరు విప్పడం లేదు. ఎక్కడ ఏ డిపార్టుమెంట్‌ వస్తుందనే విషయంపై పూర్తిగా మౌనం పాటిస్తున్నారు.

పరిపాలనా రాజధానిలో ప్రధానమైన గవర్నర్‌, ముఖ్యమంత్రి కార్యాలయాలు, వారి నివాసాలు, సచివాలయ సముదాయం, విభాగాధిపతుల (హెచ్‌ఒడి) ఆఫీసులు, ఇక్కడికి తరలి వచ్చే అధికారులు, సిబ్బందికి వసతి, మంత్రుల నివాసాలు వీటి పరిశీలనపై సచివాలయంలోని సాధారణ పరిపాలన విభాగం (జిఎడి) నుంచి నేరుగా జిల్లా స్థాయిలో ఒకరిద్దరు ఉన్నతాధికారులతో మాత్రమే మంతనాలు సాగిస్తున్నారు.

స్థానిక అధికారపార్టీ నాయకులు, ఎక్కడైనా ప్రభుత్వ, ప్రైవేటు భవనం ఖాళీగా ఉందని సమాచారం ఇచ్చిన మరుక్షణం ఆ ఒకరిద్దరు ఉన్నతాధికారులు, మీడియా కంట పడకుండా సందర్శించి పైకి మౌఖిక సమాచారం పంపుతున్నారు. అంతేకాకుండా, ప్రభుత్వ విభాగాలు దేనికది హెచ్‌ఒడి కార్యాలయాల కోసం వేట సాగిస్తున్నాయి. అనధికారికంగా అడ్వాన్స్‌ బుకింగ్‌లు చేసుకుంటున్నాయి.

రాష్ట్ర పాలనకు గుండెకాయ వంటి సచివాలయం ఎక్కడొస్తుందో స్పష్టత లేకపోయినా ఇప్పటి వరకు మధురవాడ ఐటి సెజ్‌ పరిధిలోని హిల్‌ నెం.3 అనువైన ప్రాంతమని పలువురు వైసిపి నేతలు, అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన మిలీనియం టవర్స్‌, పక్కనే శరవేగంగా నిర్మితమవుతున్న బి-2 కాంప్లెక్స్‌, ఆ పక్కనే ఉన్న స్టార్టప్‌ విలేజి కలుపుకుంటే సుమారు 8.25 లక్షల చదరపు అడుగుల స్పేస్‌ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.
అమరావతిలో సచివాలయం ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంతకంటే ఎక్కువ భవనాలు ఒక్క హిల్‌ 3పై అందుబాటులోకి వస్తాయని పేర్కొంటున్నారు. కాగా మిలీనియం టవర్స్‌లో ఐటి కంపెనీలను ఖాళీ చేయిస్తే మొత్తంగా ఐటి ప్రమోషన్‌కే దెబ్బ తగులుతుందన్న విమర్శలొస్తున్నాయి. హిల్‌ నెం.3 పైనే మొత్తం సచివాలయ సముదాయం కాకుండా పక్కనున్న హిల్‌ నెం.1, హిల్‌ నెం.2లో ఖాళీగా ఉన్న భవనాల్లో సచివాలయాన్ని విడగొట్టి పెట్టే అవకాశాలూ లేకపోలేదని తెలుస్తున్నది.

విశాఖ పట్నానికి 15 కిలోమీటర్ల దూరంలో ఆనందపురం మండలం బోయపాలెం గ్రామం వద్ద పైడా కాలేజీని సచివాలయం నిమిత్తం పరిశీలించారని చెబుతున్నారు. అధికారపార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి ఓకే చెబితే సచివాలయం కాకపోయినా, కొన్ని హెచ్‌వొడిలు పైడా కాలేజీలో రావొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పైడా, పక్కనే ఉన్న కౌశిక్‌ కాలేజీల్లో ఒకదాన్ని ఒక మంత్రి కొనుగోలు చేశారని సమాచారం.

ప్రధానికి త్రిసూత్ర పధకం సూచించిన మన్మోహన్!

సామాజిక వైషమ్యాలు, ఆర్థిక మందగమనం, కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) నుంచి భారత్‌కు ముప్పేట ముప్పు పొంచి ఉందని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాటలకు పరిమితం కాకుండా సరైన విధాన నిర్ణయాలతో భారత్‌ను ఈ ముప్పు నుంచి కాపాడాలని కోరారు. ఈ మేరకు ఆయన ఒక ఆంగ్ల దినపత్రికకు వ్యాసం రాశారు.

‘ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాటలతో కాక చేతలతో దేశానికి నమ్మకం కలిగించాలి. మన ఎదుర్కొంటున్న ప్రమాదాల గురించి ఆయనకు తెలుసు. ఈ ముప్పు నుంచి వీలైనంత సురక్షితంగా బయటపడేందుకు చేయూత నివ్వగలనని ఆయన జాతికి హామీ ఇవ్వాలి’ అని మాజీ ప్రధాని తన వ్యాసంలో పేర్కొన్నారు. దేశంలో ఇప్పుడు హానికలిగించే భయంకరమైన పరిస్థితి నెలకొని ఉందని హెచ్చరించారు.

సమస్యల పరిష్కారానికి ప్రధాని నరేంద్రమోదీకి త్రిసూత్ర పథకం సూచించారు. మొదట దేశీయంగా అందుబాటులో ఉన్న వనరులు, శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుని కొవిడ్‌-19 నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

సామాజిక సామరస్య వాతావరణానికి ముప్పుగా పరిణమించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను రద్దు చేయడం గానీ, నిబంధనలను సవరించడంగానీ చేయాలని, తద్వారా జాతి ఐక్యతకు మార్గం సుగమం చేయాలని ఆయన సూచించారు.
వ్యవస్థ పునరుద్ధరణకు ద్రవ్య ఉద్దీపన పథకాలను తేవాలని మన్మోహన్ హితవు చెప్పారు.

ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో తలెత్తిన మత ఘర్షణలను నివారించి ప్రజల ప్రాణాలను, శాంతిభద్రతలను పరిరక్షించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని మాజీ ప్రధాని విమర్శించారు. మత ఉద్రిక్తతలు పెరిగాయని, రాజకీయ వర్గంతో సహా సమాజంలో అరాచక శక్తులు మత కల్లోలాన్ని రగిలించాయని మన్మోహన్‌సింగ్ ఆవేదన చెందారు.

శాంతిభద్రతల వ్యవస్థలు పౌరులకు రక్షణ కల్పించాల్సిన ధర్మాన్ని విడనాడాయి. న్యాయవ్యవస్థలు, మీడియా కూడా మనకు తోడ్పడలేకపోయాయని వ్యాఖ్యానించారు.

సరళీకృత ప్రజాస్వామిక విధానాలతో ఆర్థికాభివృద్ధిలో కొన్నేళ్ల క్రితం ప్రపంచానికే నమూనాగా నిలబడిన భారతదేశం చాలా వేగంగా ఆ స్థాయి నుంచి పతనమవుతోందని మాజీ ప్రధాని హెచ్చరించారు. ఆర్థిక రంగం ఒడిదుడుకులకు లోనవుతున్న సమయంలో సామాజిక అశాంతి మాంద్యాన్ని మరింత వేగిరం చేస్తుందని వారించారు.

ట్వీటర్లో సరికొత్త రికార్డు సృష్టించిన మహేష్

సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం సూపర్ స్టార్ మహేష్ బాబుకి కొత్తేమీ కాదు. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించి మహేష్ బాబు అభిమానుల్లో సరికొత్త జోష్ నింపారు. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ సినిమాలతో మహేష్ బాబు మంచి విజయాలను దక్కించుకున్నాడు. సంక్రాంతి కానుకగా రిలీజైన ‘సరిలేరునికెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ సత్తాను చూపింది. తాజాగా మహేష్ బాబు ఓ సరికొత్త రికార్డు సొంతం చేసుకోవడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబుకు యువతలో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా మహేష్ బాబుకి మహిళల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. షూటింగ్ లతో బీజీగా ఉండే మహేష్ బాబు సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్ గా ఉంటారు. ట్వీటర్, ఇన్ స్ట్రాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా అభిమానులతో టచ్ లోనే ఉంటాడు. ఇందులో సినిమా విషయాలతోపాటు పర్సనల్ విషయాలను పోస్టు చేస్తుండటంతో ఆయనకు రోజురోజు ట్వీటర్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

సోషల్‌ మీడియాలో మహేష్ బాబును ఫాలో అయ్యేవారి సంఖ్య భారీగానే ఉంది. మహేష్‌ ట్విట్టర్‌ ఫాలోవర్ల సంఖ్య తాజాగా తొమ్మిది మిలియన్లను క్రాస్ చేసింది. సౌత్‌ ఇండియాలో 9మిలియన్ల ట్విట్టర్‌ ఫాలోవర్లను కలిగిన ఏకైక నటుడిగా మహేష్ బాబు చరిత్ర సృష్టించాడు. బాక్సాఫీస్ వద్దనే కాకుండా సోషల్ మీడియాలోనూ మహేష్ బాబు దూకుడు చూపించడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని వారంతా ఆశాభావం వ్యక్తం చేశారు. మహేష్ బాబు దూకుడు చూస్తుంటే త్వరలోనే 10మిలియన్ ఫాలోవర్స్ ను దాటేయడం ఖాయంగా కన్పిస్తుంది.