
2020 ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి (పిఎంబిజెకె-2020)సెలబ్రేషన్స్ లో భాగంగా మోడీ పిఎంబిజెకె యజమానులతో, ప్రధాన మంత్రి జన ఔషధి పరియోజన లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్బంగా మోడీ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
దేశ వ్యాప్తంగా కరోనావైరస్ పై వస్తున్న వదంతులను నమ్మవద్దని, వైద్యుల సూచనలను పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు సూచించారు. కరచాలనాలను మానేసి మరోసారి నమస్తే పెట్టాలని ఆయన చెప్పారు.
ప్రపంచంలోని అనేకదేశాల ప్రజలు పరస్పరం అభినందించుకునేందుకు నమస్తేను అలవాటు చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. ఏదైనా కారణం వల్ల మనం దాన్ని మానేసి ఉంటే, కరచాలనం చేయడానికి బదులు దాన్ని తిరిగి అలవాటు చేసుకోవడానికి ఇదే సమయమని మోడీ అన్నారు.
జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రతి నెలా కోటి కుటుంబాలకు పైగా చౌక ధరలకు మందులు అందుతున్నాయని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 6 వేల జన ఔషధి కేంద్రాల వల్ల ప్రజలు రూ. 2 వేల కోట్ల నుంచి 2 .5 కోట్ల రూపాయలు అదా చేసుకోగలుగుతున్నారని మోడీ తెలిపారు.