Homeఆంధ్రప్రదేశ్‌నిత్యావసరాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోలు రూమ్

నిత్యావసరాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోలు రూమ్

లాక్‌డౌన్ నేపధ్యంలో ప్రజలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోలు రూమ్ నుండి నిత్యం పర్యవేక్షిస్తున్నామని ప్రత్యేక అధికారి, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమీషనర్ పి.ఎస్. ప్రద్యుమ్న తెలిపారు. విజయవాడలో సోమ‌వారం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోలు రూం వద్ద వివరాలు వెల్లడిస్తూ… కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ అమలవుతున్న పరిస్థితులలో ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత రాకుండా చూడటానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనల ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రతినిత్యం సమీక్షిస్తున్నారన్నారు. అందులో భాగంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోలు రూమును విజయవాడలో ఏర్పాటుచేశామన్నారు. కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో మార్కెటింగ్ కమీషనర్ పి.ఎస్. ప్రద్యుమ్న, చేనేత జౌళి శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, సీనియర్ ఐపిఎస్ అదికారులు వినీత్ బ్రిజ్ లాల్, హరికృష్ణ, విశాల్ గున్నీ, మార్కెటింగ్ సెక్రటరీ మదుసూదనరెడ్డి తదితరులు అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రతి జిల్లాలో కూడా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇటువంటి కమాండ్ కంట్రోలు రూములు ఏర్పాటుచేస్తామన్నారు. కమాండ్ కంట్రోల్ రూం నుండి నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్న వాహనాలకు ఎటువంటి ఆటంకం లేకుండాను, వ్యాపారులు అధిక ధరలకు అమ్మకుండా 24 గంటలు పర్యవేక్షిస్తున్నామన్నారు. సమస్యలు ఫిర్యాదులు తెలియజేయడానికి 1902 టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటుచేశామని ఇది 24/7 పనిచేస్తుందన్నారు. సరకు రవాణా చేస్తున్న వాహనాలకు ఏవైనా సమస్యలు ఎదురైనా, వ్యాపారులు అధిక ధరలకు అమ్ముతున్నా 1902 నెంబరుకు ఫోన్ చేస్తే వాటిని వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఆదివారం వరకు 1563 ఫిర్యాదులు అందాయని వాటిలో 1353 పరిష్కరించామన్నారు. ఆర్టిజిఎ లో వాటి స్టేటస్ ఎప్పటి కప్పుడు చూసుకోవచ్చని తెలిపారు. నిత్యావసర వస్తువులకు సంబంధించిన వాహనాల రాకపోకలలో రాష్ట్రంలోగాని లేదా ఇతర రాష్ట్రాలలోగాని ఏవైనా ఇబ్బందులుంటే తెలియజేస్తే తక్షణం స్పందించి పరిష్కరిస్తామన్నారు.

నిత్యావసర వస్తువులకు సంబంధించిన ఉత్పత్తి మరియు సరఫరా వంటివి నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఈ-పాస్లు ఇస్తామని కావలసినవారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి వెంటనే జారీచేస్తామన్నారు. జిల్లాస్థాయిలో ధరల నిర్ణయించి మానిటరింగ్ చేయడానికి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. నిర్ణయించిన ధరలకంటే ఎక్కువకు అమ్మకుండా జిల్లాస్థాయి కమిటీలు చూస్తాయన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ కంటే ముందు 101 రైతు బజార్లు పనిచేస్తుండగా రద్దీని తగ్గించడానికి 350 తాత్కాలిక రైతుబజార్లు, 131 మొబైల్ రైతు బజార్లు ఏర్పాటుచేశామన్నారు. రోజుకు 20 వేల టన్నుల కూరగాయలు రైతుబజార్ల ద్వారా సరఫరా జరుగుతుండగా వాటిలో 20 శాతం డోర్ డెలివరీ ద్వారా ఇస్తున్నామన్నారు. నిత్యావసరాలను కావలసిన వారికి సూపర్ మార్కెట్ల ద్వారా డోర్ డెలివరీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమీషనర్లకు ఆదేశాలిచ్చామన్నారు. కిరాణా వర్తకులు కూడా డోర్ డెలివరీకి తమకు అవకాశం కల్పించమని కోరారని కమర్షియల్ టాక్సు డిపార్టుమెంటు ద్వారా ఆదేశాలిస్తామన్నారు. ఈ కార్యకలాపాలన్నీ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చెయ్యడం ద్వారానే చెయ్యాలన్నారు. నిత్యావసరాలకు సంబంధించి ఇతర రాష్ట్రాల మార్కెట్లు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకొంటూ ఎప్పటికప్పుడు ఆ అధికారులతో చర్చిస్తున్నామన్నారు. ఉల్లికి మహారాష్ట్రతోను, కడప అనంతపురం జిల్లాల హార్టీకల్చర్‌కు సంబంధించి డిల్లీ అధికారులతో సంప్రదించి సమస్యలు లేకుండా చేశామన్నారు. నిత్యావసర సరుకుల సరఫరాకు ఎలాంటి అవరోధాలు లేకుండా అన్ని చర్యలు తీసుకొంటున్నామని ఆయన పేర్కొన్నారు. ట్రాలీ ఆటోలున్నవారు రైతుబజారులో దరఖాస్తు చేసుకుంటే మొబైల్ రైతు బజారుకు అనుమతినిస్తామని వారు 10 శాతం లాభంతో అమ్ముకోవచ్చన్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular