Home Blog Page 8550

లాక్ డౌన్ ఉంటే నాకేంటి అన్న పిజ్జా బాయ్


2012 లో వచ్చిన పిజ్జా చిత్రం తో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన తమిళ్ హీరో విజయ్ సేతుపతి.. ఆ తరవాత తెలుగు ప్రేక్షకులకు రజనీ కాంత్ హీరోగా వచ్చిన ‘పేట’ చిత్రంలో నెగెటివ్ రోల్ లో కనిపించి అలరించాడు. ఇక మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం ‘ సైరా నరసింహా రెడ్డి’ లో కూడా.. ఓ ముఖ్య పాత్ర పోషించాడు. అలాగే మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ఉప్పెన’ చిత్రంలో కూడా హీరోయిన్ తండ్రిగా `రాయనం`పాత్రలో విలనిజం చూపించనున్నాడు. అలాగే అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న భారీ చిత్రంలోనూ నటించ బోతున్నాడు అలాగే తమిళంలో హీరో గా విజయాలు అందుకొంటూ మరో పక్క విజయ్ లాంటి స్టార్ హీరోలతో విలన్ గా తలపడుతున్నాడు ..అలాంటి బిజీ హీరో లాక్ డౌన్ బ్రేక్ చేసిన ఘటన చెన్నైలో జరిగింది.

నిజానికి అది పొగరుతోనో, నిర్లక్ష్యం తోనో చేసిన పని కాదు. దానికి సహేతుక కారణం ఉంది. విజయ్ సేతుపతి స్నేహితుడు, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అయిన నెల్లాయ్ భారతి మరణించడం వల్లే అలా లాక్ డౌన్ బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నెల్లాయ్ భారతి .. ఈ శుక్రవారం రాత్రి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడట. ఆ విషయం తెలుసుకున్న విజయ్ సేతుపతి లాక్ డౌన్ ఉన్నప్పటికీ …నెల్లాయ్ భారతి ఇంటికి చేరుకుని.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సంతాపాన్ని తెలపడంతో పాటు అంత్యక్రియలకు అయ్యే ఖర్చులు అన్నీ తానే పెట్టుకుని.. ఆర్ధిక సాయం కూడా చేయడమే గాక భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఎటువంటి కష్టం వచ్చినా.. నేను అండగా ఉంటాను అని భరోసా కూడా ఇచ్చాడట .. ఈ పిజ్జా బాయ్.

3000 దాటినా కరోనా కేసులు!

దేశంలో గత కొన్నిరోజుల వ్యవధిలో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఉదయానికి 2902 కేసులు నమోదు కాగా, మధ్యాహ్నం తర్వాత వెల్లడించిన వివరాల ప్రకారం పాజిటివ్ కేసుల సంఖ్య 3,188కి పెరిగింది. అటు మృతుల సంఖ్య ఉదయం 68గా ఉండగా, ఇప్పుడా సంఖ్య 94కి చేరింది.

దీన్నిబట్టే భారత్ లో ఇప్పుడు కీలకదశ నెలకొందని అర్థమవుతోంది. ఇటీవల ఢిల్లీలో తబ్లిగీ జమాత్ పేరిట ఓ మతపరమైన కార్యక్రమం జరిగింది. అప్పటినుంచి కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో జమాత్ కు హాజరైన వారికోసం అధికారవర్గాలు ఇప్పటికీ గాలిస్తున్నాయి. ఓ వారం రోజులుగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికం జమాత్ కు హాజరైన వారే కావడం గమనార్హం.

మధ్యాహ్ననికి 32.74 శాతం మందికి నగదు పంపిణీ!


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల వరకు 32.74 శాతం బియ్యం కార్డుదారులకు లాక్ డౌన్ సందర్భంగా రూ. వెయ్యి ప్రత్యేక సాయం పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 43,56,048 బియ్యం కార్డు దారులకు రూ. 435.60 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. 15,001 గ్రామ సచివాలయాల పరిధిలో రూ.వెయ్యి ప్రత్యేక సాయం పంపిణీలో 2, 39,159 మంది వాలంటీర్లు పాలుపంచుకున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 33.22 శాతం, అర్బన్ ప్రాంతాల్లో 31 12 శాతం లబ్ధిదారులకు ప్రత్యేక నగదు సాయం పంపిణీ పూర్తి చేశామని చెప్పారు.

కరోనా వైరస్ నియంత్రణ వల్ల లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన పేదలకు చేయూత అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర లోని 1.33 కోట్ల బియ్యం కార్డుదారులకు రూ. 1330 కోట్లు కేటాయించారని, ప్రతి కార్డుదారుకు రూ.1000 అందచెయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. దారిద్ర్య రేఖ దిగువన వున్న కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి ఇంటింటికి వెళ్లి బియ్యం కార్డుదారులకు వెయ్యి నగదును వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారన్నారు.

ప్రధాని మోదీ `దీపం’ పిలుపుపై మరో దుమారం


కరోనాపై యుద్ధంలో భారతీయులంతా గెలుస్తారని ధీమా వ్యక్తం చేయడంతో పాటు మరోసారి దేశ పౌరులంతా కరోనాను తరిమికొట్టేందుకు ఈ ఆదివారం రాత్రి దీపాలు వెలిగించడానికి ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై మరో రాజకీయ దుమారం చెలరేగుతుంది.

రాజకీయాలను అటుంచితే, ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా పారిశ్రామిక, వాణిజ్య, ఇతర కార్యక్రమాలు ఆగిపోవడంతో 40 శాతం కూడా విద్యుత్ వినియోగం మాత్రమే జరుగుతున్నని, ఇప్పుడు ప్రధాని పిలుపు అందుకొని దేశంలోని దీపాలు అన్నిన్నిట్నీ ఒకేసారి ఆర్పివేస్తే విద్యుత్ గ్రిడ్లు దెబ్బతినే అవకాశం ఉన్నదంటూ వివాదం లేవనెత్తుతున్నారు.

మొదటగా మహారాష్ట్ర విద్యుత్ మంత్రి నితిన్ రౌత్ ఈ పిలుపుపై ప్రధాని మోదీ పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఒకేసారి లైట్లన్నీ ఆర్పేయడం వల్ల విద్యుత్ గ్రిడ్ల దెబ్బతినే అవకాశంతో పాటు ఎమర్జెన్సీ సర్వీసులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యుత్ దీపాలను ఎవరూ ఆర్పవద్దని పిలుపునిచ్చారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సహితం అంటీముట్టన్నట్లు స్పందించారు. తాను కరోనాను నియంత్రించాలా? లేదా రాజకీయాలు చేయాలా? అని సూటిగా ప్రశ్నిస్తూ ప్రధాని, తనకు మధ్య రాజకీయుద్ధానికి ఎందుకు తెర లేపుతున్నారు? దయచేసి రాజకీయ యుద్ధానికి తెరలేపకండని మీడియాకు ఆమె విజ్ఞప్తి చేశారు.

ప్రధాని ఇచ్చిన పిలుపును ‘వ్యక్తిగత అంశం’ గా బెనర్జీ అభివర్ణించారు. మీరు పాటించాలనుకుంటే పాటించండని, నన్నెందుకు అడుగుతున్నారని ఆమె విలేకరులను ఎదురు ప్రశ్నించారు.

ఒకేసారి దేశం మొత్తం లైట్లు ఆఫ్‌ చేస్తే విద్యుత్‌ గ్రిడ్‌ కుప్పకూలే ప్రమాదం ఉందని విద్యుత్‌ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ పవర్‌గ్రిడ్‌ సురక్షితంగా ఉందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు భరోసా వ్యక్తం చేశారు.

ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పేయడం వల్ల తెలంగాణ పవర్‌గ్రిడ్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం..గ్రిడ్‌కు ఎలాంటి సమస్యా ఉండదు. లైట్లు ఆపితే గ్రిడ్‌ కుప్పకూలుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

కాగా, ఈ నేప‌థ్యంలో రాష్ట్రాల విద్యుత్ సంస్థ‌ల‌కు కేంద్రం తాజాగా ఆదేశాలు జారీచేసింది. దీపం వెలిగించే కార్య‌క్ర‌మం వ‌ల్ల ఎలాంటి విద్యుత్ అవాంత‌రాలు త‌లెత్త‌కుండా చూడాల‌ని విద్యుత్ సంస్థ‌ల‌కు సూచించింది. విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ కేంద్రాల ద‌గ్గ‌ర విధుల్లో ఉండాల‌ని, అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి త‌లెత్తినా దాన్ని ప‌రిష్క‌రించేందుకు సిద్ధంగా ఉండాల‌ని కోరింది.

కరోనాపై పోరుకు హలీవుడ్ సూపర్ స్టార్ విరాళం


చైనాలోని వూహాన్లో సోకిన కరోనా(కోవిడ్-19) ప్రస్తుతం ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతం అన్ని దేశాలకు కరోనా పాకింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలాడిపోతున్నాయి. ఇండియాలో కరోనా ఎంట్రీతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. కరోనాపై పోరాటానికి పలువురు ధనవంతులు, సెలబెట్రీలు, దాతృత్వం ఉన్నవారు సాయమందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

కరోనా పోరాటానికి తాజాగా హాలీవుడ్ సూపర్ స్టార్ చేరారు. కండల వీరుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ కరోనాపై పోరాటానికి మద్దతుగా నిలిచారు. 1.43 మిలియన్ల డాలర్ల భారీ విరాళంగా అందజేశారు. అదేవిధంగా 50వేల మాస్కులను కరోనా బాధితులకు వైద్యం చేస్తున్న వైద్యులకు ఆర్నాల్డ్ సమకూర్చారు. ఆర్నాల్డ్ సాయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కండల వీరుడు ఆర్నాల్డ్ పలు యాక్షన్ మూవీల్లో నటించి మెప్పించారు. ప్రజలకు ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు.. నేను ఇంట్లో కూర్చోలేనని.. నాకు చాతనైన సహాయం చేయాలనుకుంటానని ఆర్నాల్డ్ ప్రకటించాడు. ప్రస్తుతం కరోనాతో ఆసుపత్రుల్లో పోరాడుతున్న రియల్ హీరోలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తనవంతు బాధ్యతగా సాయం చేసేందుకు విరాళం ఇవ్వడం గొప్ప మార్గమని భావిస్తున్నానని ప్రకటించారు. కరోనాపై పోరులో తాను భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నానని ఆర్నాల్డ్ పేర్కొన్నారు.

జగన్ కు కాంట్రాక్టర్ల పై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు: లోకేష్


జగన్ కు కాంట్రాక్టర్ల పై ఉన్న ప్రేమ ప్రజలు, రైతులు, డాక్టర్లు, ఉద్యోగస్తులు పై లేకపోవడం బాధాకరం అని తెలుగు దేశం పార్టి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. సిఎం జగన్ మీ ఇంటికొస్తే ఎం ఇస్తారు, మా ఇంటికొస్తే ఎం తెస్తారు అనే రకమని ట్వీట్ చేశారు.

గత ఏడాది కంటే రూ.30 వేల కోట్లు అధిక ఆదాయం ఉన్నా డాక్టర్ల కు ఇచ్చే మాస్కులు, ఉద్యోగస్తుల జీతాల నుండి ప్రజలకు అందించే సహాయం వరకూ కోతలు పెడుతున్నారని తెలిపారు. మరోవైపు కాంట్రాక్టర్ల కు బిల్లుల రూపంలో చెల్లించిన రూ. 6,400 కోట్లు ఆకాశం నుండి ఊడిపడ్డాయా అని ప్రశ్నించారు.

కరోనా నేపథ్యంలో కేంద్రం చేస్తున్న సహాయం తాను చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం ఏమి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న 5 కేజీలు ఉచిత బియ్యం, ఒక కేజీ కందిపప్పు ఇప్పటివరకు రాష్ట్రంలో లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయలేదని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల 16 రకాల నిత్యావసరాలు ఉచితంగా ఇస్తున్నారని, సర్వం కోల్పోయిన ప్రజలకు కొన్ని రాష్ట్రాల్లో రూ. 5 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. జగన్ గారు మాత్రం బీద అరుపులతో సరిపెడుతున్నారని ఎద్దేవా చేశారు.

కరోనా ఎఫెక్ట్.. ప్రపంచకప్‌ వాయిదా


చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా(కోవిడ్-19) ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. క్రమంగా అన్ని దేశాలకు వ్యాపించింది. 10లక్షలకు పైగా కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యాయి. కరోనా ప్రభావం అన్నిరంగాలపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య, సినిమా, క్రీడలపై దీని ప్రభావం కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీలు వాయిదా పడిన సంగతి తెల్సిందే. తాజాగా ఫిపా అండర్-17 మహిళల వరల్డ్ కప్ వాయిదా వేస్తున్నట్లు ఫిపా శనివారం ప్రకటించింది.

భారత్‌ వేదికగా 2020 నవంబర్‌లో ఫిఫా అండర్‌-17మహిళల ప్రపంచకప్‌ జరుగాల్సి ఉంది. షెడ్యూల్‌ ప్రకారంగా అయితే నవంబర్‌ 2నుంచి 21వరకు కోల్‌కతా, గువహటి, భువనేశ్వర్‌, అహ్మదాబాద్‌, నవీ ముంబై వేదికల్లో ఈ టోర్ని నిర్వహించాల్సి ఉంది. ఈ ప్రపంచకప్ టోర్నీలో మొత్తం 16 జట్లు పోటీలో ఉన్నాయి. తొలిసారిగా భారత్‌ పోటీలో నిలిచింది. టోర్నీకి సంబంధించిన కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఫిఫా వెల్లడించింది.

ఫిపా అండర్-17 మహిళల ప్రపంచ కప్ తోపాటు పనామా, కోస్టారికా వేదికగా ఆగస్టు-సెప్టెంబర్లో నిర్వహించాల్సిన అండర్‌-20మహిళల ప్రపంచకప్‌ కూడా వాయిదా పడింది. ప్రపంచంలో కరోనా మహమ్మరి విజృంభిస్తున్న తరుణంలో ఫిఫా తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత ఫుట్‌ బాల్‌ సమాఖ్య ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.

బియ్యం పంపిణీ నెల రోజులు వరకు పొడిగింపు!

రాష్ట్ర వ్యాప్తంగా.. తెల్ల రేషన్ కార్డు దారులకు ఈ నెల మొత్తం బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బియ్యం రావడం లేదని ఎవరు ఆందోళన చెందవద్దని.. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 12 కిలోలు చొప్పున బియ్యం పంపిణీ చేసేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. బియ్యం పంపిణీపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు పడుతూ గంటల తరబడి రేషన్ షాపుల వద్ద క్యూ లైన్ లలో నిలడవద్దు. గుంపులు గుంపులుగా రేషన్ షాప్ ల వద్దకు చేరుకోవడం వలన సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.

బయోమెట్రిక్ సర్వర్ ప్రాబ్లమ్స్ ఏర్పడటం వలన బియ్యం పంపిణీలో కొంత జాప్యం జరుగుతుంది. సర్వర్ ప్రాబ్లమ్స్ ను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే మ్యానువల్ విధానంలో బియ్యం పంపిణీ చేసే ఆలోచనను ప్రభుత్వం చేస్తుందని ఆయన తెలిపారు.

మత సమ్మేళనాలకు దూరంగా ఉండండి: గవర్నర్ విజ్ఞప్తి


రాష్ట్రంలోఅన్ని రకాల మత సమ్మేళనాలను పూర్తిగా నిలిపివేయాలని, శారీరక దూరం పాటించాలనని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వా భూశన్ హరిచందన్ తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే కరోనావైరస్ యొక్క వ్యాప్తిని అరికట్టడంలో పరిపాలనకు మద్దతుగా ఇతర మార్గదర్శకాలను పాటించాలని కోరారు. కోవిడ్ -19 మొత్తం మానవాళికి తీవ్ర ప్రమాదం కలిగిస్తుంది అంగీకరించబడిన ఆరోగ్య ప్రోటోకాల్‌లకు అనుగుణంగా ఐక్య పద్ధతిలో అన్ని విశ్వాసాలకు చెందిన ప్రజల సహకారం ముఖ్య మన్నారు. కేవలం సహకారంతో మాత్రమే ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు అని పేర్కొన్నారు. 24 x 7 గంటలు పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్ వైద్య సిబ్బందికి ప్రజలు సంఘీభావం తెలుపుతూ వారి విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో సహాయపడాలని గవర్నర్ అన్నారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి ఇంటింటికీ నిఘా పెట్టడం, గుర్తించడం, పరీక్షించడం మరియు బాధిత వ్యక్తులను వేరుచేయడం వంటి వాటిలో ప్రజలు వైద్య సిబ్బందికి తమ సహాయాన్ని అందించాల్సి ఉందన్నారు. వైద్య సేవలను దుర్వినియోగం చేయడం లేదా హింస చర్యలకు పాల్పడటం మానుకోవాలని శ్రీ హరిచందన్ తెలియచేసారు.

సినీ కార్మికులకు నయనతార భారీ విరాళం


చైనాలోని వూహాన్లో సోకిన కరోనా(కోవిడ్-19) ప్రస్తుతం ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలకు కరోనా పాకింది. దీంతో జనజీవనం స్తంభించిందిపోయింది. ప్రజా రవాణ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలాడిపోతున్నాయి. ఇండియాలో కరోనా ఎంట్రీతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. దీంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ పడ్డాయి. సినిమా షూటింగ్ లు వాయిదా పడగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో రోజువారి దినసరి వేతనంపై పని చేసే సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో సీని కార్మికులను ఆదుకునేందుకు పలువురు సెలబ్రెటీలు తమవంతు సహకారం అందిస్తున్నారు. తాజాగా సౌత్ ఇండియా క్వీన్, లేడి సూపర్ స్టార్ నయనతార సీని కార్మికుల కోసం రూ.20లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియాకు రూ.20లక్షల విరాళం ప్రకటించింది. కరోనాని జయించేందుకు ప్రతీఒక్కరు ఇళ్లల్లోనే నయనతార కోరుతుంది. ఇప్పటివరకు హీరోయిన్లు ప్రకటించిన విరాళాల్లో నయనతారనే టాప్ ప్లేస్ లో నిలుస్తుంది. నయనతార సినీ కార్మికులకు భారీ విరాళం అందించడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

‘మహానటి’ పెళ్లి ఫిక్సయిందా?


‘మహానటి’ మూవీలో పాతతరం సావిత్రిగా నటించి కీర్తి సురేష్ జాతీయ అవార్డు దక్కించుకుంది. ‘నేను శైలజ’ మూవీతో కీర్తి తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. ఈ మూవీటో కీర్తి నటనకు టాలీవుడ్ ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. కుర్రకారులో కీర్తి సురేష్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు, తమిళం, మళయాళ సినిమాల్లో నటిస్తూ కీర్తి ప్రస్తుతం బీజీగా ఉంది. ఇదిలా ఉండగానే కీర్తి సురేష్ పెళ్లి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఆసక్తికరంగా మారింది.

గత కొన్ని రోజులుగా నేషనల్ మీడియాలో ‘మహానటి’ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నదనే ప్రచారం జరుగుతుంది. ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధానికి ఒకే అన్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ఓ ప్రముఖ వ్యాపారవేత్త కొడుకును కీర్తీ సురేష్ పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతుంది. దీనిపై కీర్తీ సురేష్, ఆమె తల్లిదండ్రులు స్పందించక పోవడంతో పెళ్లి వార్తలపై క్లారిటీ రావడంలేదు. కీర్తీ సురేష్ సన్నిహితులు మాత్రం పెళ్లి వార్తను కొట్టిపడేస్తున్నారు.

ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో నితిన్‌కు జోడీగా ‘రంగ్‌దే’, త‌మిళంలో ర‌జినీకాంత్‌తో కలిసి ‘అణ్ణాత్త’ మూవీల్లో నటిస్తుంది. సినిమాలతో బీజీగా ఉన్న సమయంలో కీర్తి సురేష్ పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తుండటంతో ఈ వార్తలపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెళ్లి వార్తలపై కీర్తీ ఎలా రియాక్టవుతుందో వేచి చూడాల్సిందే.

డ్రోన్ల సాయంతో కరోనా స్క్రీనింగ్ పరీక్షలు..!


కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మూకుమ్మడి థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ కోసం ఉపయుక్తమయ్యే డ్రోన్ల పరిజ్ఞానాన్ని గువహటి ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో మానవ ప్రమేయం లేకుండా ఆకాశం నుంచే ఆ ప్రాంత ప్రజల శరీర ఉష్ణోగ్రతలను ఈ పరికరం ద్వారా కొలవవచ్చు. ‘మారుత్ డ్రోన్ టెక్’ పేరుతో స్టాటప్ గ్రూప్ ను ఏర్పాటు చేసిన ఈ విద్యా సంస్థ ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కరోనా సమస్యకు పరిష్కారాలపై పరిశోధనలు చేస్తోంది.

‘ఈనెల 14వ తేదీన ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే జనం ఒకేసారి గుంపులు గుంపులుగా రోడ్ల పైకి వస్తారు. అటువంటి సందర్భంలో భౌతిక దూరం నిబంధన అమలు కాదు. దీంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఓ ప్రాంతంలో అనుమానిత కేసులు ఎక్కువగా ఉంటే ఈ డ్రోన్ పరికరంతో గుర్తించేందుకు సులభంగా ఉంటుంది’ అని పరిశోధకులు తెలిపారు.

ఈ డ్రోన్‌కు అమర్చిన పరారుణ కెమెరా బృందాలుగా ధర్మల్ స్క్రీనింగ్ చేస్తుంది. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నచోట డ్రోన్లోని లౌడ్‌స్పీకర్‌ హెచ్చరికలు జారీ చేస్తుంది. అవసరమైన సూచనలుచేస్తుంది.

రైళ్ల పున:ప్రారంభంపై రైల్వే శాఖ కీలక ప్రకటన


కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ అమలు చేయడంతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. గూడ్స్ మినహా ఇతర రైళ్లు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. ఈ నెల 14వ తేదీతో లాక్‌డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో రైల్వే సేవల తిరిగి ప్రారంభం, టికెట్ల బుకింగ్‌పై రోజుకో వార్త బయటకొస్తోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టత ఇచ్చింది.

ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల పున:ప్రారంభంపై ఈ నెల 12వ తేదీ తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పింది. అదే సమయంలో రైల్వే టికెట్ల బుకింగ్ ప్రక్రియ ఎప్పుడూ నిలిచిపోలేదని స్పష్టం చేసింది. 120 రోజుల ముందే టికెట్ల రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ముందు నుంచే ఉందని తెలిపింది. కేవలం లాక్‌డౌన్ అమల్లో ఉన్న తేదీల్లో (మార్చి 24 నుంచి ఏప్రిల్ 14) జరిగే ప్రయాణాలకు మాత్రమే బుకింగ్స్ ను రద్దు చేసినట్టు పేర్కొన్నది.

మూడు నెలల ముందు నుంచే బుకింగ్స్ చేసుకునే సౌకర్య ఉండడంతో వేసవి సెలవుల దృష్ట్యా ఇప్పటికే భారీ సంఖ్యలో అడ్వాన్స్ రిజర్వేషన్లు జరిగాయి. దూర ప్రాంత రైళ్లలో రిజర్వేషన్లకు ఇప్పుడు ‘నో రూమ్‌’ అని వస్తోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ పై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే తాము ఒక నిర్ణయానికి వస్తామని రైల్వే శాఖ తెలిపింది. డిమాండ్‌ను బట్టి ప్రత్యేక రైళ్లను నడిపే ఆలోచన చేస్తున్నట్టు అధికారులు చెప్పారు.

మన హీరోలకు ప్రధాని అభినందనలు


కరోనా విలయతాండవం చేస్తున్న వేళ మన తెలుగు సినిమా పరిశ్రమ విపరీతంగా స్పందిస్తోంది మన హీరోలు విరాళాల తో ఆర్ధిక సహకారం అందించడం తో పాటు వివిధ మాధ్యమాల ద్వారా కరోనా నివారణ చర్యల ప్రకటనలతో ప్రజల్ని చైతన్య పరుస్తున్నారు .కరోనా వైరస్ ని ఎదుర్కునేందుకు తెలుగు సినీ పరిశ్రమ చేస్తున్న కృషి యావత్ భారత దేశం గుర్తిస్తోంది. చివరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలుగు హీరోల కృషిని గుర్తించడం జరిగింది. .

ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి పరిస్థితి మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కాస్త తక్కువే అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం కరోనాను వ్యాప్తి కానివ్వకుండా గట్టి జాగ్రత్తలను తీసుకొంటోంది.

నిజానికి ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ని కొందరు సీరియస్‌గా తీసుకుంటుంటే, మరికొందరు మాత్రం తేలికగా తీసుకుంటున్నారు. అయితే కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నివారణ చర్యలకు మద్ధతుగా మన టాలీవుడ్ అందరికంటే ముందు నిలిచింది. కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న సందేశాన్ని ఓ పాట రూపంలో ” మెగా స్టార్ చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, సంగీత దర్శకుడు కోటి ” అందించారు . ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ ` మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు` అంటూ చిరంజీవి బృందానికి ప్రశంసలు అందించడం జరిగింది.

లాక్ డౌన్ ఎత్తేయగానే చెర్రీ రోమాన్స్ షూరు!


దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరెకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. వీరిద్దరి ఒకేమూవీలో స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురంభీం పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇటీవల ఈ మూవీ టైటింగ్, మోషన్ పోస్టర్ రిలీజై అభిమానుల్లో సినిమాపై అంచనాలను పెంచేశాయి.

‘ఆర్ఆర్ఆర్’లో రాంచరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా నటిస్తున్నారు. అలాగే సీనియర్ హీరోయిన్ శ్రియ, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోయిన్ ఒలీవియా గతంలో కొన్నిరోజులు షూటింగ్ పాల్గొని తిరిగి హాలీవుడ్ వెళ్లింది. ఇంకా ఆమె కొన్ని సన్నివేశాలను చిత్రీకరించేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ‘ఆర్ఆర్ఆర్’లో ఇప్పటివరకు బాలీవుడ్ భామ అలియా భట్ ఒక్క సీన్లో కూడా పాల్గొన లేదు. లాక్ డౌన్ కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ వాయిదా పడిన సంగతి తెల్సిందే.

దేశంలో లాక్ డౌన్ ఎత్తేయగానే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తోంది. అలియాభట్ అందాల అరబోతతో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతుంది. రాజమౌళి ముందుగా చెర్రీ-అలియాలపై ఓ స్పెషల్ సాంగ్ తెరకెక్కించి ఆ తర్వాత మిగతా షూటింగ్ ను తెరకెక్కించేందుక ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అలియా రాగానే చెర్రీ రోమాన్స్ మొదలవనుందట. ఇక ఈ సినిమాను 2021 జనవరి 8న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది.

ఏపీలో 180కి కరోనా బాధితుల సంఖ్య


ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 180కి చేరింది. వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం శుక్రవారం రాత్రి పది గంటల అనంతరం 16 కొత్త కేసులు నమోదైనట్లు స్టేట్ కరోనా నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాలో 23, నెల్లూరు జిల్లాలో 32, ప్రకాశం జిల్లాలో 18, కడప జిల్లాలో 23, కృష్ణా జిల్లాలో 27, పశ్చిమ గోదావరి జిల్లాలో 15, విశాఖపట్నం జిల్లాలో 15, తూర్పుగోదావరి జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 10, అనంతపురం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 4 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో శుక్రవారం నాటికి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు అయిన జిల్లాగా నెల్లూరు జిల్లా ఉంది. కొత్తగా కృష్ణాజిల్లాలో 4, కడప జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, చిత్తూరు, ప్రకాశం జిల్లాలలో ఒక్కొక్కటి చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

పోలీసు సైరన్ కు భయపడి.. ఇద్దరి మృతి


పోలీసు వ్యాన్ సైరన్ విని భయంతో పరుగులు పెట్టిన ఇద్దరు వ్యక్తులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమగోదావరి జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. పాలకొల్లులోని లజపతిరాయ్‌పేటలో నిన్న ఉదయం జనం పెద్ద సంఖ్యలో గుమికూడారు. అదే సమయంలో పోలీసులు వస్తున్నట్టు సైరన్ రావడంతో వారికి దొరక్కుండా ఉండేందుకు తలా ఓ దిక్కుకు పరుగులు తీశారు. ఇదే వారిపాలిట శాపమైయ్యింది.

పరిగెత్తే క్రమంలో పట్టణానికి చెందిన వేండ్ర వీరాంజనేయులు (57) గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. చింతలపూడి మండలం వెంకటాపురంలో జరిగిన మరో ఘటనలో పసుమర్తి భాస్కరరావు (55) పోలీసు వ్యాన్ సైరన్ విని తప్పించుకునేందుకు పరుగులు పెడుతూ స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్టు ప్రకటించారు. దీంతో రెండు కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయినట్లయ్యింది. ఈ సంఘటనలపై మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.