Home Blog Page 8487

ఫేస్ బుక్ లో పోస్టు.. వృద్ధురాలి అరెస్టు..!


విశాఖలో ప్రమాదకరమైన స్టెరీన్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు  గుంటూరులో ఒక వృద్దురాలిపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. గుంటూరు నగరంలోని లక్ష్మిపురం నగర్ లో నివాసముంటున్న పూదోట రంగనాయకమ్మ తనకు సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టు ను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. ఇది విశాఖపట్నం ఎల్.జి పాలిమర్స్ దుర్ఘటనకు సంబంధించి 20 ప్రశ్నలు సంధించారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందంటూ సీఐడీ అధికారులు రంగనాయకమ్మపై సెక్షన్ 41(ఏ) కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి, పూచీకట్టుపై విడుదల చేశారు.

ఈ సందర్భంగా రంగనాయకమ్మ మీడియాతో మాట్లాడుతూ తాను కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోస్ట్ పెట్టలేదని, తనకు వచ్చిన పోస్టు చూసి ప్రజలు మోటివేట్ అవుతారని మాత్రమే పోస్టు చేశానని చెప్పారు. ఇది యాదృచ్చికంగా చోటుచేసుకున్న సంఘటన అని చెప్పారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా, టిడిపి నాయకులు చిట్టిబాబు తదితరులు రంగనాయకమ్మ ఇంటికి వెళ్లి పరామర్శించారు. టీడీపీ అండగా ఉంటుందన్నారు. ఈ విషయాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు.

కేసీఆర్ పాలన-దొరల పాలన:కిషన్ రెడ్డి

లాక్ డౌన్ కారణంగా కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజిపై ఇంకా దుమారం కొనసాగుతూనే ఉంది. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన విమర్శలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో దొరల పాలన నడుస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. కరోనా సంక్షోభ సమయంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం సరికాదని ఆయన అన్నారు.

కేసీఆర్ భాష కూడా సరిగా లేదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.దేశంలో సంస్కరణలు రావాలని, ఒకే దేశం,ఒకే కార్డ్ విదానం అమలు కావాలని ఆయన తెలిపారు. తాత్కాలికమైన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ కష్ట సమయంలో ఆలోచన చేయడం సరికాదన్నారు. దేశ హితం కోసం తెచ్చిన ఆర్థిక ప్యాకేజీ అన్ని రాష్ట్రాలకు ఉపయోగకరమన్నారు. ప్రధాని మోదీ హయాంలో ఒక్క రూపాయి దుర్వినియోగమైందా? అని మంత్రి ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన రూ.21లక్షల కోట్ల ప్యాకేజీతో తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతోందో కేసీఆర్ వివరించాలన్నారు. తాము తప్ప ఏపార్టీ ఉండకూడదనే సంకుచిత ధోరణిలో కెసిఆర్ ఉన్నారని, ఆయనది దొరల పాలన అని కిషన్ రెడ్డి ద్వజమెత్తారు.

వర్మ.. షూటింగ్ షూరు?


వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లాక్డౌన్లో మూవీని ప్లాన్ చేశాడు. సంచనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ తొలుగునాట మరో సంచలనాన్ని సృష్టించబోతున్నాడు. లాక్డౌన్ కారణంగా రెండునెలలుగా థియేటర్లు మూతపడగా, సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. దీంతో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. సెలబ్రెటీలంతా సోషల్ మీడియాకే పరిమితంకాగా దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం ఈనెల మొదట్లోనే సినిమా షూటింగ్ ప్రారంభించినట్లు సమాచారం. కరోనా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ లిమిటెడ్ మెంబర్స్ తో ఓ చిన్న ఫీచర్ ఫిల్మ్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

లాక్డౌన్లో పూర్తిచేసిన తొలి చిత్రంగా వర్మ ఫీచర్ ఫిల్మ్ రికార్డు సృష్టించబోతుంది. వర్మ శిష్యుడు ఆగస్త్య ముంజు ఈ ఫీచర్ ఫిల్మ్ కు దర్శకత్వంగా వహించగా రాంగోపాల్ వర్మ పర్యవేక్షించినట్లు సమాచారం. తక్కువ బడ్జెట్లో ఈ మూవీని ఒకే లోకేషన్లో, అతికొద్ది మందితో ముందస్తు జాగ్రత్తలు తీసుకొని నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వర్మ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా వర్మ అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో గతంలో తెరకెక్కించిన ‘క్లైమాక్స్’ మూవీకి లాక్డౌన్లో పోస్టు ప్రొడక్షన్ పనులు చేశారు. ‘క్లైమాక్స్’ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్లను లాక్డౌన్లోనే విడుదల చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ మూవీని ఆర్జీవీ వరల్డ్ థియేటర్స్ యాప్ లో ఈనెల 29న విడుదల రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఇకపై కూడా కరోనాకు దొరక్కుండా మరిన్ని ఫిల్మ్ తీసేందుకు వర్మ ప్లాన్ చేస్తుండటం విశేషం. అయితే పెద్ద సినిమాల షూటింగులపై ఇంకా క్లారిటీ రాలేదు. లాక్డౌన్ 4.0ముగిశాకైనా దీనిపై క్లారిటీ వస్తుందో? లేదో చూడాలి..!

కమిట్మెంట్ అడిగితే నిర్మాతకు చుక్కలు చూపించిన హీరోయిన్


సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంశం నివురుగప్పిన నిప్పులా ఉంటోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు చిత్రసీమలో తమకు ఎదురైన లైంగిక వేధిపులపై గళమెత్తారు. మీటు ఉద్యమ ప్రభావంతో పలువురు తారలు ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముఖంగా పంచుకుంటున్నారు. తాజాగా మరాఠీ హీరోయిన్ శృతి మరాతే కాస్టింగ్ కౌచ్ అంశంపై ఓ ఇంటర్య్వూలో సంచలన కామెంట్స్ చేశారు.

సినిమా అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను కొందరు కీచకులు టార్గెట్ చేస్తుంటారని వీరిపట్ల అప్రమత్తంగా ఉండాలని శృతి మరాతే సూచించారు. తనకు కూడా సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదురయ్యాయని తెలిపారు. అయితే వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నట్లు ఆమె చెప్పారు. ఓ నిర్మాత తన సినిమాలో ఛాన్స్ కావాలంటే ఒక రాత్రి తనతో గడుపాలని అడిగాడని ఆరోపించింది. కమిట్మెంట్ అయితే అవకాశాలు వస్తాయంటూ చిరాకు తెప్పించే మాటలు మాట్లాడడని చెప్పింది. దీంతో ఆమె ‘నా విషయం పక్కన పెట్టండి.. హీరోని కూడా ఇలానే అడిగావా? అతను కూడా పడుకోవాల్సిందేనా? అలా అయితేనే నీ సినిమాలో అవకాశం ఇస్తావా’ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు చెప్పింది. దీంతో సదరు నిర్మాత తన సినిమాలో అవకాశం ఇవ్వలేదని తెలిపింది.

అయితే ఆ విషయం గురించి తానేప్పుడు బాధపడలేదని తెలిపింది. ఇలాంటి విషయాల్లో మహిళలు ధైర్యంగా ఉండాలని సూచించింది. మన విలువలను కాపాడుకుంటూనే చిత్రసీమలో ముందుకెళ్లాలని శృతి మరాతే అంటోంది. కొందరు కీచకులు సినిమా అవకాశాల కోసం అమ్మాయిలను టార్గెట్ చేస్తుంటారని వారిని ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కోకుండా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. అయినప్పటీకీ ఇంకా మహిళలపై వేధింపులు ఆగకపోవడం శోచనీయంగా మారింది. ఏదిఏమైనా శృతి మరాతే నిర్మాతకు చుక్కలు చూపించడంపై ఆమెకు అభినందలు వెల్లువెత్తుతున్నాయి.

కేసీఆర్ సర్… రాయలసీమకు గోదావరి జలాలు ఎలా తరలిస్తారు?


రాయలసీమకు కృష్ణా నదీ జలాల మళ్ళింపును కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించరట – సముద్రం పాలౌతున్న గోదావరి వరద జలాలను మాత్రం వాడుకోమని ఉచిత సలహా పారేశారట. ఎంత ఉదార స్వభావమో! రాయలసీమకు గోదావరి వరద నీటిని ఎలా తరలించాలో కేసీఆర్ సెలవిస్తారా అంటూ రాజకీయ విశ్లేషకులు, జలవనరుల నిపుణులు టి లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.

బచావత్ అవార్డు ప్రకారం తమకు కేటాయించిన నీటి నుండే తమ ప్రాజెక్ట్ లు అన్ని రూపొందిస్తున్నామని స్పష్టం చేస్తూ, తెలంగాణయే అన్ని నిబంధనలను గాలికి వదిలివేసి పలు ప్రాజెక్ట్ లను కృష్ణ, గోదావరి నదులపై నిర్మిస్తున్నదని అంటూ ఏపీ ప్రభుత్వం ఘాటుగా కృష్ణ బోర్డు కు సమాధానం ఇచ్చిన అనంతరం కేసీఆర్ గోదావరి జలాలు వాడుకోమని ఉచిత సలహా ఇవ్వడం గమనార్హం.

పైగా ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలపై నోరు మెదపడానికి సహితం వెనుకాడారు. `ఇప్పుడు వివాదాలలోకి పొదలచుకోలేదు’ అంటూ గౌరవంగా తప్పుకున్నారు. కృష్ణా నదీ జలాల వినియోగంలో శ్రీశైలం జలాశయం గుండెకాయ వంటిదని అందరికి తెలిసిందే.

శ్రీశైలం జలాశయం నుండి తెలంగాణ చేబడుతున్న ఏ ఒక్క ప్రాజెక్టుకైనా నికర జలాల కేటాయింపు ఉన్నదా? శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ (19), కె.సి.కెనాల్ (10), చెన్నయ్ త్రాగు నీటికి (15), మొత్తం 44 టియంసిల నికర జలాలు శ్రీశైలం జలాశయం నుండే సరఫరా కావాలసి ఉంది. కానీ ఈ జవాబు చెప్పడానికి కేసీఆర్ ఎప్పుడు సిద్ధంగా ఉండరు. ఎదురు దాడితో బుకాయించే ప్రయత్నం చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న తెలుగు గంగ (29), గాలేరు – నగరి (38) లకు మిగులు/వరద జలాలను, రాయలసీమకు త్రాగు నీటికి 3 టియంసి, మొత్తం 70 టీయంసిలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండే సరఫరా చేయాల్సి ఉంది.
.
విభజన చట్టంలో తెలంగాణకు సంబంధించిన కల్వకుర్తి, నెట్టంపాడు ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. కడకు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఎస్.ఎల్.బి.సి. ప్రస్తావన లేక పోయినా కేసీఆర్ పట్టించుకోలేదు. కేసీఆర్ విభజన చట్టంలో పేర్కొన్న దక్షిణ తెలంగాణ ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేస్తూ, ఉత్తర తెలంగాణలో ఎటువంటి అనుమతులు లేని ప్రాజెక్ట్ లపైననే శ్రద్ద చూపిస్తూ ఉండటం తెలిసిందే.

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెండింగ్ ప్రాజెక్టు అయితే విభజన చట్టంలో ఎందుకు పేర్కొన లేదు? ఈ ప్రశ్నలకు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉన్నదని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

ఆ.ప్ర. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హంద్రీ – నీవా (40), వెలుగొండ (43.5), మొత్తం 83.5 టీయంసి మిగులు/వరద జలాలు కూడా శ్రీశైలం జలాశయం నుండే సరఫరా కావాలి.

మరోవంక, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా నెల్లూరు జిల్లాను కూడా రాయలసీమతో కలిపి లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నట్లు కనబడుతున్నది.

శ్రీశైలం నుండి నికర జలాలు ఎస్.ఆర్.బి.సి.(19),కె.సి.కెనాల్(10)టియంసిలు, మిగులు/వరద జలాలు తెలుగు గంగ(29),హంద్రీ నీవా(40),గాలేరు-నగరి(38),ప్రకాశం జిల్లాలోని వెలుగొండ(43.5),త్రాగు నీరు(3),మొత్తం 182.5 టియంసిలను సరఫరా చేయవలసి ఉంది.

పెన్నా నదిపై ఆధారపడి నెల్లూరు జిల్లాలో నిర్మించిన సోమశిల,కండలేరు ప్రాజెక్ట్ లు కృష్ణానదిపై ఆధారపడినవి కాదని గమనించాలి.

పది పరీక్షలకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

పదవ తరగతి పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జూన్‌ మొదటివారం తర్వాత టెన్త్‌ పరీక్షలు నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. జూన్‌ 3న పరిస్థితిని సమీక్షించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అప్పటికీ కేసుల తీవ్రత పెరిగితే.. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు  వెల్లడించింది.

ఇదిలా ఉంటే ఏపీలో మాత్రం జూలైలో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. కరోనా తీవ్రతను బట్టి షెడ్యూల్ ప్రకటిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇలాంటి తరుణంలో ఎగ్జామ్స్  కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు తెలంగాణ హైకోర్టు గుడ్‌ న్యూస్ చెప్పింది. వచ్చే నెలలోనే పరీక్షలు నిర్వహించాలని పచ్చజెండా ఊపింది.

ఉత్సాహంగా రోడ్లపైకి!

కరోనా భయంతో లాక్ డౌన్ కారణంగా 55 రోజులుగా ఇళ్ళకే పరిమితమైన ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు సడలింపులు ఇవ్వడంతో ఉత్సాహంగా రోడ్లపైకి వస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ లో ఈ ఉత్సహం మరింతగా కనిపిస్తోంది. సాధారణ కార్యకలాపాలకు అనుమతివ్వడంతో ఉద్యోగులు, కార్మికులు తమ విధులకు వెళ్తున్నారు. నగరంలో సాధారణ పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి రోడ్లపైకి వస్తున్నారు. అన్ని దుకాణాల వద్ద భౌతిక దూరం పాటిస్తున్నారు. చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్‌ తో శుభ్రం చేసుకుంటున్నారు.

ఇక దుకాణాలకు సరి – బేసి విధానంలో అనుమతివ్వడంతో.. తమ దుకాణాలను శుభ్రం చేసుకునే పనిలో యజమానులు బిజీ అయిపోయారు. కంటైన్‌ మెంట్‌ జోన్లలో తప్ప అన్ని ప్రాంతాల్లో యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వాణిజ్యపరమైన ఏరియాల్లో దుకాణాల యజమానులు, ఉద్యోగులతో సందడి నెలకొంది. ఉదయం 9 గంటలకే తమ విధుల్లో చేరిపోయారు. సికింద్రాబాద్‌, కోఠి ఏరియాల్లో చిరు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తూ తమ జీవనోపాధికి బాటలు వేసుకుంటున్నారు.

‘సైరా’ దర్శకుడికి మరో ఛాన్స్..!


మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో బీజీగా ఉన్నాడు. దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)లో రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా నటిస్తున్నాడు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కన్పించబోతున్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ టీం చరణ్ బర్త్ డే సందర్భంగా ‘బీమ్ ఫర్ సీతరామరాజు’ పేరిట విడుదల చేసిన వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వీడియో తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై మెగా, నందమూరి ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ ‘సైరా’ దర్శకుడితో పని చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది.

దర్శకుడు సురేందర్-రాంచరణ్ కాంబినేషన్లో ‘ధృవ’ మూవీ వచ్చింది. స్టైలీష్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న సురేందర్ రెడ్డి ‘ధృవ’లో రాంచరణ్ ను కొత్తగా చూపించి సక్సస్ అయ్యాడు. ఆ తర్వాత చిరంజీవి డ్రిమ్ ప్రాజెక్టు ‘సైరా నర్సింహారెడ్డి’ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు.పాన్ ఇండియా మూవీగా ‘సైరా’ను తెరకెక్కించి మంచి విజయం అందుకున్నాడు. ఈ మూవీ తెలుగులో భారీ విజయం సాధించినప్పటికీ మిగతా భాషల్లో అనుకున్నంత కలెక్షన్లు సాధించలేకపోయింది. అయినప్పటికీ దర్శకుడిగా సురేందర్ రెడ్డి మంచి మార్కులే పడ్డాయి. తాజాగా సురేందర్ రెడ్డి ఇటీవల చెప్పిన ఓ కథ నచ్చడంతో ఈమేరకు చెర్రీ తన తదుపరి మూవీ ఛాన్స్ ఇస్తానని మాట కూడా ఇచ్చాడట. రాంచరణ్ ‘ఆర్ఆర్ఆర్’ చేస్తూనే మరోపక్క ‘ఆచార్య’ మూవీలో నటించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు మూవీలు కాంప్లీట్ అయ్యాక సురేందర్ రెడ్డి మూవీ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. మరోసారి ‘ధృవ’ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంపై మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతోన్నారు.

తెలంగాణలో కూడా శ్రమదోపిడికి రంగం సిద్ధం?

ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, మధ్యప్రదేశ్ లోని శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కాలరాసి, కార్పొరేట్‌ సంస్థలకు వత్తాసు పలికిన ఈ ప్రభుత్వాలు, కార్మికులకు ఆరోగ్యం, రక్షణ, కనీస అవసరాలను తీర్చే చట్టాలను తుంగలో తొక్కి, బడా బాబులకు, వ్యాపార యజమానులకు బ్యాంక్ బాలన్స్ పెంచే పనిలో పడ్డాయి. తాజాగా తెలంగాణలో కూడా కార్మిక చట్టాలను సవరించాలన్న డిమాండ్ పెరుగుతోంది. పారిశ్రామిక సంఘాల వారు ఈ విషయమై ప్రభుత్వానికి వినతులు పంపుతున్నారు. కార్మిక చట్టంలోని పలు నిబందనలను సడలించడం, ఎనిమిది గంటల షిప్ట్ బదులు పన్నెండు గంటల షిప్టులు పెట్టడం తదితర చర్యలు తీసుకోవాలని పరిశ్రమలవారు కోరుతున్నారు.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి బిజెపి పాలిత రాష్ట్రాల తరహాలో తెలంగాణలో కూడా కార్మిక చట్టాలను కాలరాయలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. ఈ మూడు నెలల కాలంలో ఉత్పత్తి లేక చాలా నష్టపోయామని, ఎనిమిది గంటల షిప్టుకే పరిమితం అయితే తాము అదనంగా పనిచేయిస్తే అదనపు వేతనాలు ఇవ్వవలసి ఉంటుందని, దానిని భరించలేమని అంటున్నారు.

ఈ కార్మిక చట్టాల విషయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి మొత్తం 38 కార్మిక చట్టాలకు 35 చట్టాలను రద్దు చేయడం ఆయన అవివేక ఆలోచనలకు నిదర్శనమని ఎకనామిక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా శివరాజ్ సింగ్ ప్రభుత్వం కూడా ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు కార్మికులతో పని చేయించుకోవచ్చనే కొత్త చట్టం చేయడం శ్రమదోపిడి తత్వానికి పరాకాష్ట. గతంలో గుజరాత్ హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ ప్రభుత్వాలు కూడా కార్మికుల పని గంటలను 8 నుండి 12 గంటలకు పెంచాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. ఒకవేళ తెలంగాణలో కూడా ఈ తరహా శ్రమదోపిడికి తెగబడినట్లయితే నియంత పాలన కేంద్రంలోనే కాదు తెలంగాణలో కూడా కేసీఆర్ మొదలపెట్టినట్లే అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జలవివాదం


పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచేందుకు ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోతో తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జలవివాదం మరింత ముదురుతోంది. నదీజలాల విషయంలో రాష్ట్రానికి నష్టం జరిగితే ఉపేక్షించే ప్రసక్తేలేదని సీఎం కేసీఆర్‌ మరోమారు స్పష్టం చేశారు.

నీళ్ల విషయంలో తనకు స్పష్టమైన, స్ఫటిక సదృశమైన అవగాహన ఉందని చెప్పుకొచ్చారు. రాయలసీమ పట్ల తనకు సానుభూతి ఉన్నప్పటికీ కృష్ణాజలాలను అదనంగా తరలిస్తామంటే ఊరుకొని ప్రసక్తి లేదని స్పష్టమైన సంకేతం ఇచ్చారు.

సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను రాయలసీమకు తరలించామని సలహా ఇచ్చామని చెబుతూ, గోదావరి జలాలను ఎంతగా వాడుకున్నా తమకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు.

ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు డైవర్షన్‌ కెనాల్‌ విస్తరణపై తమ వ్యూహాలు తమకున్నాయని కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిపిన కేటాయింపుల మేరకు మనం అన్ని ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం మని స్పష్టం చేస్తూ తమ ప్రాజెక్ట్ లపై ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలనుఁ తోసిపుచ్చారు.

ఆ ప్రకారమే అందరూ ఉండాలని కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ వివాదాల జోలికి తనకు పొదలచుకోలేదని, సమయం వచ్చినప్పుడు అంతా మాట్లాడతానని తెలిపారు.

మరోవంక, తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని అతిక్రమించి ప్రాజెక్టులు చేపడుతోందని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబి) కి ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఫిర్యాదు చేశారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా మిగులు జలాలు ఉన్నాయని, 5 కొత్త ప్రాజెక్టులు తెలంగాణ చెప్పట్టిందని ఆయ‌న ఆరోపించారు.

అపెక్స్ కౌన్సిల్, సిడబ్యుసి, కేఆర్ఎంబి అనుమతి లేకుండానే తెలంగాణ ప్రాజెక్టులు చేపట్టిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్ లు సమర్పించాలని కేంద్రం గతంలోనే కోరినా, ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం డిపిఆర్ లు సమర్పించలేదని గుర్తు చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు పొందిన ప్రాజెక్టులను రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగు నీటి అవసరాల కోసం అనుమతి ఇచ్చారనీ కేఆర్ఎంబి కి తెలిపారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు వారిగా వాడుకున్న నీటి లెక్కలతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఇచ్చిన అనుమతుల వివరాలను కేఆర్ఎంబి చైర్మన్ కు ఏపీ అధికారులు అందించారు.

దేశంలో నియంత పాలన: కేసీఆర్

దేశంలో కేంద్ర ప్రభుత్వ పాలన నియంత తరహాలో ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ పై స్పందించిన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలకు ప్రకటించిన ప్యాకేజి పూర్తిగా మోసపూరితంగా ఉందని, రాష్ట్రాలను బిక్షగాళ్లు గా భావించినట్లు ఉందని ఆయన అన్నారు. రాష్ట్రాలకు ఆదాయాలు లేని పరిస్థితిలో నిధులు ఇవ్వాలని అడిగితే ఇంత దిక్కుమాలిన తనంగా కేంద్రం ప్రవర్తించిందని, ఇది ఒక ప్యాకేజీనా అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాలపట్ల కేంద్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గం గా వ్యవహరిస్తుందా అని అన్నారు. రుణ పరిమితి కూడా షరతులతో పెడతారా? మున్సిపాల్టీలలో పన్ను పెంచి, 2000 కోట్ల అప్పు ఇస్తారట. వన్ నేషన్ ,వన్ రేషన్ కార్డు, ఈజ్ ఆఫ్ డూయింగ్ అని మరో కండిషన్ పెట్టడం ఇది పచ్చి మోసం అని కేసీఆర్ అన్నారు.

20 లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటించి కేంద్రం తన పరువు తానే తీసుకుందని కెసిఆర్ అన్నారు.ఈ మాటలు అంటున్నందుకు విచారిస్తున్నానని, రాష్ట్రాల మీద పెత్తనం చెలాయించడం ఫెడరలిజానికి విఘాతం అని ఆయన అన్నారు. చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారని కెసిఆర్ అన్నారు. ఏ మాత్రం వాంచనీయం కాదని అన్నారు.మూడు కండిషన్ లు భర్తీ చేయగలం, కరెంటు సంస్కరణలను ఒప్పుకోం అని ఆయన అన్నారు. కేంద్రం నియంత లా వ్యవహరించిందని కెసిఆర్ అన్నారు.రాష్ట్రాలకు మరిన్ని బాద్యతలు ఉన్నాయని, కేంద్రానికంటే ఎక్కువ బాద్యతలు ఉన్నాయని ఆయన అన్నారు.

ప్రియాంక వాద్రాకు ముచ్చెమటలు పట్టించిన యోగీ


వలస కార్మికుల పట్ల కొద్దీ రోజులుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక వాద్రా సానుభూతి చూపిస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్రాల నుండి తరలించిన వలస కార్మికులకు ఆమె సొంతంగా టికెట్ డబ్బు ఇస్తున్నట్లు పోస్టర్లు కూడా వెలిశాయి.

అయితే ఈ ప్రచారం బెడిసి కొట్టడంతో సరికొత్త పంధాతో మళ్ళీ ఈసారి ప్రియాంకా వాద్రాను రంగంలోకి దించారు. “ఉత్తర ప్రదేశ్‌లో మేము పార్టీ తరపున 1000 బస్సులనైనా ఏర్పాటు చేసి, కార్మికులను వాళ్ళ ఇళ్ళ వద్ద దించుతాం, అందుకు సిద్దం..” అంటూ కార్మికులను రెచ్చగొట్టేలా ప్రియాంక చేత ప్రకటన విడుదల చేయించారు.

మండుతున్న ఎండలో కార్మికులు నడచి పోతున్నా పట్టించుకోవడం లేదని యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస కార్మికులను ఇండ్లకు దింపేందుకు ప్రభుత్వానికి చేతగాని పక్షంలో తమకు చెప్తే బస్సులు ఏర్పాటుచేస్తామని అంటూ ఆమె ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసే రీతిలో మాట్లాడారు.

అయితే యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆమె మాటలను సీరియస్ గా తీసుకొని గట్టి ఝలక్ ఇవ్వడంతో కాంగ్రెస్ వారంతా ఖంగు తినవలసి వచ్చింది. ఆమె ప్రకటన వచ్చిన కొద్దీ సేపటికే ఉత్తర ప్రదేశ్ హోం కార్యదర్శి అవినాష్ అశ్వతి ద్వారా నేరుగా ప్రియాంకకు ఉత్తరం వెళ్ళింది..

మీరు ఏర్పాటు చేస్తున్న 1000 బస్సులు ఎక్కడ..??
వాటి నంబర్లు, డ్రైవర్ల ఫోన్ నంబర్లు, ఏ ఏ లొకేషన్ల నుంచి ఏ ఏ లొకేషన్లకు ఆ బస్సులను నడుపుతారో వెంటనే తెలపండి., శ్రామికులకు సమాచారం ఇచ్చి బస్సుల వద్దకు తీసుకువస్తాం” అంటూ ఆ ఉత్తరంలో పేర్కొన్నారు.. దానితో ఖంగుతిన్న ప్రియాంక తన ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఎటువంటి ప్రత్యుత్తరమూ ఇవ్వలేదనే కధనం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

హైకోర్టుకు చేరిన సుధాకర్ రావు వ్యవహారం..!


నర్సీపట్నం మత్తు డాక్టర్ సుధాకర్ రావు వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ నెల 16న పోలీసులు సుధాకర్ రావుపై అమానుషంగా వ్యవహరించారని పేర్కొంటూ రైల్యే మాజీ ఉద్యోగి వెంకటేశ్వర్లు పిల్ దాఖలు చేశారు. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలతో టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖనే సుమోటో పిల్ గా స్వీకరించిన ధర్మాసనం వైద్యుడు సుధాకర్ రావును తన ముందు హాజరు పరచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయాలని పార్టీలు భావిస్తున్నామని ప్రభుత్వ ఏజి ధర్మాసనానికి వివరించారు. అనిత అందించిన వీడియో ఎడిట్ చేయబడిందని, సుధాకర్ రావు మద్యం సేవించి కనిపించిన వారందరినీ అసభ్యకరంగా దూషించాడని, ప్రధాని, ముఖ్యమంత్రిలను అదేవిధంగా దూషించాడని తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది.

అదేవిధంగా మచిలీపట్నంలో మడ అడవుల నరికివేతపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది. మడ అడవులు నరికి పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీకి శ్రీకారం చుట్టిందని ఇద్దరు మత్స్యకారులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అడవి నరికివేత చట్ట విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. దీంతో అడవుల నరికివేతపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. దీనిపై 4 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కేసీఆర్ దూకుడుకి జగన్ చెక్..!


ఏపీ, తెలంగాణా నీటి వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుంది. వారం రోజులుగా రెండు రాష్ట్రల్లో ఈ అంశమే హాట్ టాపిక్ గా మారింది. పోతిరెడ్డిపాడుపై తెలంగాణా అనవసర రాద్ధాంతం చేస్తుందని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం తెలంగాణా దూకుడుకి కళ్లెం వేసేందుకు మరో మార్గంలో ముందుకు వెళ్ళింది.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచేందుకు జారీ చేసిన 203 జీఓపై తెలంగాణా ప్రభుత్వం నానా యాగీ చేస్తోంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కు పిర్యాదు చేసింది. తెలంగాణా రాష్ట్రంలో ప్రతిపక్ష ఈ విషయంలో ఏపీ నిర్ణయాన్ని తప్పు పట్టాయి.

ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిలో ఏపీకి రావాల్సిన 512 టీఎంసీలు తప్ప అధికంగా ఒక్క చుక్క నీరు తీసుకోమని సముద్రంలోకి పోయే మిగులు జలాలు మాత్రమే వినియోగించుకొనున్నట్లు ఇన్ని రోజులుగా చెప్పుకొచ్చింది. ఈ వాదనలను ఏ మాత్రం పట్టించుకోని తెలంగాణా ప్రభుత్వం పంచాయతీని కృష్ణా బోర్డులో పెట్టింది. బోర్డు కు తన వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్న ఏపీ సోమవారం స్పెషల్ సీఎస్ అదిత్యనాద్ దాస్ ను పంపి బోర్డు ముందు తన అభిప్రాయాలు, రాయలసీమ దుస్థితి వివరించింది. ఇదిలా ఉంటే మరోవైపు తెలంగాణ గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులపై గోదావరి బోర్డుకు పిర్యాదు చేసింది. తెలంగాణాకు చెక్ పెట్టాలంటే ఇదే సరైన నిర్ణయంగా భావించిన జగన్ వెంటనే గోదావరి నదిపై కాళేశ్వరం, తుపాకుల గూడెం, సీత రామ ప్రాజెక్టులతో పాటు చిన్నాచితకా ఇతర ప్రాజెక్టులతో తెలంగాణా ప్రభుత్వం గోదావరి జలాలను 450 టి.ఎం.సీల వరకూ అదనంగా వాడుకుంటుందని పూర్తి వివరాలతో గోదావరి బోర్డు వద్ద మరో పంచాయతీ పెట్టారు.

దీంతో కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డారు. మీడియా సమావేశంలో ఆయన ఈ విషయంపై సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేసీఆర్ కు అన్ని తెలుసు, ఏక్కడెక్కడ ఎంత వాటాలు రావాలో తెలుసు అంటూ ముక్త సరిగా సమాధానం చెప్పారు. అయితే గత ఏడాది స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి వెళ్లి మీట నొక్కిన జగన్ ఇప్పుడు ఆ ప్రాజెక్టుపై ఫిర్యాదు చేయడం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించనిదిగా భావిస్తున్నారు.

బాబు ఆదేశాలు బేఖాతరు…!


తెలుగుదేశం పార్టీలో పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంపు అంశం దుమారాన్ని రేపుతోంది. ఈ అంశంపై టీడీపీ ఇంత వరకు తన వైఖరిని వ్యక్తం చేయలేదు. పోతిరెడ్డిపాడుపై మాట్లాడవద్దని పార్టీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కావాలనే జగన్, కేసీఆర్ ఈ వ్యవహారాన్ని ఎప్పుడు తెరపైకి తెచ్చారనే వాదనను ఆ పార్టీ వినిపిస్తోంది. కరోనా, విశాఖ దుర్ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ నాటకం ఆడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో కొంత కాలం వేచి చూసే ధోరణి అవలంభించాలని టీడీపీ నాయకులకు సూచించారు

అధికార పక్షం వైసీపీ టీడీపీని ఈ లాగేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా సమావేశాల్లో టీడీపీ వైఖరి ఏంటని ప్రశ్నిస్తుంటే, ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ సోషల్ మీడియాలో అదే పనిలో ఉంది. అయినప్పటికీ టీడీపీ నేతలు పోతిరెడ్డిపాడుపై నోరువిప్పడం లేదు.

రాయలసీమ నాయకులు అధినేత వైఖరి విషయంలో అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పోతిరెడ్డిపాడుపై ఎటువంటి ప్రకటన చేయకుండా తాత్సారం చేయడంవల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, సీమ ప్రజలకు దూరమై పార్టీ మరింత నష్టపోవాల్సి వస్తుంది ఆ ప్రాంత నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ఇతర పార్టీల వలె రాయలసీమకు నీళ్లు నీళ్లు ఇవ్వాల్సిందేనని స్పష్టమైన వైఖరి తెలియజేయటమే సరైన నిర్ణయం అవుతుందని అంటున్నారు.

ఈ విషయంలో ఇతర నేతల్లా అంతర్మధనం చెందకుండా టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి ఈ విషయంలో కొంత చొరవ తీసుకుని ఆయన వైఖరిని స్పష్టం చేశారు. ప్రభుత్వం తెచ్చిన జిఓ 203కు తన మద్దతును తెలుపుతూనే, గట్టి హెచ్చరికలు చేశారు. ఎట్టి పరిస్థితులలో రాయలసీమ నీటి హక్కుల విషయంలో తెలంగాణతో రాజీ పడితే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మీ వ్యాపారం కోసం రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దని జగన్ కు హితవు పలికారు. ఇది అధిష్టానంపై అసంతృప్తికి నాంధిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పోతిరెడ్డిపాడు వ్యవహారంలో టీడీపీ ఇరకాటంలో పడినట్లు అయ్యింది.

ఎల్.జి దుర్ఘటనకు బాధ్యులను వదిలిపెట్టం..!


విశాఖ ఎల్.జి భాదితుల్లో ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగనివ్వనని, ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా ఆదుకుంటానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రకటించారు. గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనకు బాధ్యులెవరైనా వదిలిపెట్టబోమని, ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీని తరలిస్తామన్న ముఖ్యమంత్రి, ఇప్పటికే కంపెనీ నుంచి 13 వేల టన్నుల స్టెరైన్‌ కొరియా పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ప్రభావానికి గురైన వెంకటాపురం, వెంకటాద్రినగర్, పద్మనాభపురం, ఎస్సీ బీసీ కాలనీ, నందమూరినగర్, ఆర్‌ ఆర్‌ వెంకటాపురంలో ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని సోమవారం వారి ఖాతాలకు జమ చేశారు. ఆయా గ్రామాల్లో అధికారుల పక్కా ఎన్యూమరేషన్‌‌ ప్రకారం బాధితుల సంఖ్య 19,893 మందిని తేల్చగా, వారందరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఇంకా కేవలం 12 ఇళ్లలోని వారి బ్యాంక్‌ ఖాతాల వివరాలు అందాల్సి ఉందని ఈ సందర్భంగా విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. ఆయా గ్రామాల్లో ఆంధ్ర వైద్య కళాశాలకు చెందిన 10 మంది వైద్య నిపుణులతో వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఘటన చాలా బాధాకరం అన్న ముఖ్యమంత్రి, ఇలాంటిది ఎక్కడా జరగకూడదని ఆకాంక్షించారు. ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించాలన్నది తాను విపక్షంలో ఉన్నప్పుడు చూశానంటూ, తాను విపక్షనేతగా ఉన్నప్పుడు ఓఎన్జీసీ గ్యాస్‌ లీక్‌ అయి 22 మంది చనిపోతే ఆ గ్రామానికి వెళ్లి పరిస్థితి చూశానని చెప్పారు. అప్పుడు వారికి ఓఎన్జీసీ రూ.20 లక్షలు, కేంద్రం రూ.3 లక్షలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.2 లక్షలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇలాంటివి జరిగినప్పుడు పెనాల్టీ చాలా ఉంటుందని ఆ కంపెనీ భావిస్తే, అవి చాలా జాగ్రత్త తీసుకుంటాయన్న ముఖ్యమంత్రి, ఇలాంటి ఘటనలు విదేశాల్లో జరిగితే, ఎలా పరిహారం ఇస్తారో ఇక్కడా అలాగే ఇవ్వాలని కోరానని తెలిపారు. అందుకే ఆరోజు బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశానని వివరించారు.

విశాఖలో ఈ ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం, అధికార యంత్రాంగం చాలా వేగంగా స్పందించిందని చెప్పారు. తెల్లవారుజామున 4.30 గంటలకల్లా అధికారులంతా రోడ్ల మీదకు వచ్చారు. రెండు గంటల్లో ప్రజలను ఆస్పత్రులు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందు కోసం కలెక్టర్, కమిషనర్‌తో సహా, అధికారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటివి జరిగితే ప్రభుత్వం ఎలా స్పందించాలన్నది చూపమని అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గతంలో ఎక్కడా ఇలా ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇవ్వని విధంగా ఇప్పుడు రూ. కోటి ఇవ్వడమే కాకుండా, దర్యాప్తునకు కమిటీ కూడా ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చెప్పారు.10 మంది వైద్యులతో యుద్ద ప్రాతిపదికన కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా, అవసరమైన ఉపకరణాలు సమకూర్చామని వెల్లడించారు.

ఇలాంటివి జరిగినప్పుడు అందుకు కారణాలు, బాధ్యులను గుర్తించేందుకు పలు కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు, కంపెనీ నుంచి 13 వేల టన్నుల స్టెరైన్‌ను కొరియాకు పంపించామని గుర్తు చేశారు. అనుమతులన్నీ టీడీపీ హయాంలోనే ఇచ్చారన్నారు. ఈ కంపెనీకి ఒక్క క్లియరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు.

నిరాశలో హలీం ప్రియులు!

గతంలో రంజాన్‌ నెల ప్రారంభం కాగానే హలీమ్‌ కోసం జనాలు హోటళ్ల ముందు క్యూ కట్టేవారు. ఇంట్లో చేసుకోవటానికి వీలులేకో లేదా బయట షాపుల్లో అమ్మేంతగా రుచిగా ఇళ్లలో వండకో హలీమ్‌ దుకాణాల ముందుకు చేరేవారు. కానీ, ఈ సారి ఆ పరిస్థితి లేదు. దింతో హలీం ప్రియుల ఆశలు నిరాశగా మారాయి. వరసగా పొడిగిస్తున్న లాక డౌన్‌ కారణంగా హైదరాబాద్‌ ప్రాంతానికి చెందిన హలీమ్‌ అమ్మే ప్రముఖ దుకాణాలు సైతం చేతులెత్తేశాయి. ఈ సంవత్సరం హలీమ్‌ అమ్మటం లేదని స్పష్టం చేశాయి.

ఈ సంవ‌త్స‌రం రంజాన్ సంద‌ర్భంగా ఏ హోట‌ల్ లోనూ హ‌లీం త‌యారు చేయ‌రాద‌ని హైదరాబాద్ హలీం మేకర్స్ అసోసియేషన్ నిర్ణ‌యం తీసుకున్న విషయం తెలిసిందే.. గత నెల 25వ తేదీ నుంచి రంజాన్ నెల ప్రారంభమైంది. రంజాన్ పండుగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది హలీం. ప్రతీ ఏటా రంజాన్ మాసం ప్రారంభమైందంటే ముస్లీంలతో పాటు హైదరాబాద్ వాసులంతా హలీమ్ తినేందుకు క్యూ కట్టేవారు. చికెన్, మటన్, వెజ్ హలీమ్‌లను లొట్టలేసుకుంటూ తినేవారు. కానీ ఈ ఏడు ఆ పరిస్థితి లేదు.

హైద‌రాబాద్ ను ప్ర‌పంచ వ్యాప్తంగా పాపులర్ చేసిన ఫుడ్ ఐట‌మ్స్ లో హ‌లీమ్ ఒక‌టి. రంజాన్ మాసంలో మాత్ర‌మే దొరికే హ‌లీమ్ ను ఇష్ట‌ప‌డ‌ని వారంటూ ఉండ‌రు. చాలామంది హ‌లీం ప్రియులు రంజాన్ మాసం ఎప్పుడొస్తుందా ఎప్పుడు హ‌లీం తిందామా అని కూడా వెయిట్ చేస్తుంటారు.రంజాన్ పండ‌గ స‌మయంలో త‌ప్ప‌కుండా తినాలనిపించే ఆహార‌ప‌దార్థాలు చాలా ఉన్నాయి. హ‌లీం, ఖుర్బానీ కా మీఠా, డ‌బుల్ కా మీఠా, రుమాలీ రోటి, చికెన్ టిక్కా, షామీ, ద‌హీవ‌డ ప్ర‌ధాన‌మైన‌వి.

మంచి రుచితో పాటు…ఉప‌వాస స‌మ‌యంలో ఆరోగ్యానికి అవ‌స‌ర‌మైన‌.. శక్తిని కూడా అందివ్వ‌డమే ఈ రుచుల ప్రత్యేక‌త‌. హైద‌రాబాదీ ఫుడ్ వెరైటీల‌లో ముఖ్య‌మైన‌ది మాత్రం హ‌లీం. మ‌ట‌న్, చికెన్, బీఫ్‌, ఒంటె… మాంసాల‌తో… హ‌లీమ్ తయారు చేస్తుంటారు. రోజా స‌మ‌యంలో హ‌లీం తింటే వెంట‌నే శ‌క్తినిచ్చే ఫుడ్ అని ప్ర‌సిద్ధికెక్కింది. కానీ కరోనాతో హలీంకు ఎఫెక్ట్ పడింది.హైదరాబాద్ హలీం తయారీ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌ లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా హలీం తయారు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు హలీం మేకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, పిస్తా హౌస్ ఎండీ ఎంఏ మాజిద్ తెలిపారు. లాక్ డౌన్‌ కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి కరోనా నివారణకు ప్రభుత్వం చేసిన పోరాటానికి సహరించాలని కోరారు. ప్రతి రంజాన్ సీజన్‌ లో ఒక్క హైదరాబాద్‌లోనే రూ.1200 కోట్ల మేర హలీం అమ్మకాలు జరుగతాయని అంచనా. ఇక్కడి నుంచి హలీం రుచులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి.