
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో బీజీగా ఉన్నాడు. దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)లో రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా నటిస్తున్నాడు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కన్పించబోతున్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ టీం చరణ్ బర్త్ డే సందర్భంగా ‘బీమ్ ఫర్ సీతరామరాజు’ పేరిట విడుదల చేసిన వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వీడియో తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై మెగా, నందమూరి ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ ‘సైరా’ దర్శకుడితో పని చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది.
దర్శకుడు సురేందర్-రాంచరణ్ కాంబినేషన్లో ‘ధృవ’ మూవీ వచ్చింది. స్టైలీష్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న సురేందర్ రెడ్డి ‘ధృవ’లో రాంచరణ్ ను కొత్తగా చూపించి సక్సస్ అయ్యాడు. ఆ తర్వాత చిరంజీవి డ్రిమ్ ప్రాజెక్టు ‘సైరా నర్సింహారెడ్డి’ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు.పాన్ ఇండియా మూవీగా ‘సైరా’ను తెరకెక్కించి మంచి విజయం అందుకున్నాడు. ఈ మూవీ తెలుగులో భారీ విజయం సాధించినప్పటికీ మిగతా భాషల్లో అనుకున్నంత కలెక్షన్లు సాధించలేకపోయింది. అయినప్పటికీ దర్శకుడిగా సురేందర్ రెడ్డి మంచి మార్కులే పడ్డాయి. తాజాగా సురేందర్ రెడ్డి ఇటీవల చెప్పిన ఓ కథ నచ్చడంతో ఈమేరకు చెర్రీ తన తదుపరి మూవీ ఛాన్స్ ఇస్తానని మాట కూడా ఇచ్చాడట. రాంచరణ్ ‘ఆర్ఆర్ఆర్’ చేస్తూనే మరోపక్క ‘ఆచార్య’ మూవీలో నటించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు మూవీలు కాంప్లీట్ అయ్యాక సురేందర్ రెడ్డి మూవీ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. మరోసారి ‘ధృవ’ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంపై మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతోన్నారు.