Home Blog Page 8488

బస్సులు నడపాలని సీఎం ఆదేశం..!


రాష్ట్రంలో బస్సు సర్వీసులు ప్రారంభించాలని, దశలవారీగా ఈ సర్వీసులు పెంచుకుంటూ వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై విధివిధానాలు తయారుచేయాలని అధికారులకు సూచించారు. కోవిడ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బస్సులు నడపడిపే విషయం చర్చించారు. బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌ వరకూ బస్సులు ఉండాలని, మధ్యలో ఎక్కేందుకు అనుమతి ఉండకూడదన్నారు. బస్టాండులో ప్రయాణికులు దిగిన తర్వాత పరీక్షలు నిర్వహించాలని, బస్సు ఎక్కిన ప్రతి వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రయాణికులు ఎక్కడ నుంచి బయల్దేరారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నదానిపై వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

దీని వల్ల వ్యక్తి ట్రేసింగ్‌ సులభం అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో భౌతిక దూరం పాటిస్తూ బస్సు సర్వీసులు బస్సులో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బస్సులలో సగం సీట్లు మాత్రమే నింపాలని సూచించారు. ప్రైవేటు బస్సులకూ అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల నుంచి రాష్ట్రానికి రావాలనుకుంటున్న వారి కోసం బస్సులు నడపాలని సూచించారు. రాష్ట్రంలో బస్సు సర్వీసులు ప్రారంభించడానికి ముందు వలస కార్మికుల తరలింపు పూర్తి చేయాలన్నారు. బస్సు సర్వీసులు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయన్న అంశంపై మూడు నాలుగు రోజుల్లో తేదీ ప్రకటించాలని నిర్ణయించారు. ప్రజల భాగస్వామ్యంతో కరోనా నివారణ సాధ్యమని చెప్పారు. కారులో ముగ్గురు మాత్రమే, బస్సులో 20 మందికే ప్రతి దుకాణంలో 5గురు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.పెళ్లిళ్లు లాంటి కార్యక్రమాలకు 50 మందికే అనుమతి ఉంటుందన్నారు.

వలస కార్మికులను ఆదుకునే విషయంలో అధికారులు బాగా పనిచేశారని అభినందించారు. రాష్ట్రం గుండా నడిచివెళ్తున్నవారికి సహాయంగా నిలిచారన్నారు. యుద్ధప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ తీసుకున్నట్లు చెప్పారు. మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన సమయమని తెలిపారు.

రెస్టారెంట్ల వద్ద టేక్‌ అవే కు అనుమతి ఇవ్వాలన్నారు. టేక్‌ అవే సమయంలో భౌతిక దూరం పాటించాల్సిందేనని,నైట్‌ కర్ఫ్యూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకూ కొనసాగించాలన్నారు. అన్ని దుకాణాలూ ఉదయం 7 గంటలనుంచి రాత్రి 7 గంటలవరకూ తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వమని అధికారులకు సూచించారు. కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారు తమకు తాము స్వచ్చందంగా ఆరోగ్య పరిస్థితులను తెలియజేయడంపై దృష్టిపెట్టాలన్న ఆదేశించారు. ప్రజల్లో ఆందోళన, భయం తొలగిపోయేలా పెద్ద ఎత్తున్న ప్రచారం నిర్వహిస్తామని అధికారులు సీఎంకు వివరించారు.

వార్డు క్లినిక్స్‌ ఏర్పాటుపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలని, వచ్చే మార్చి నాటికి ఇవి పూర్తికావాలని చెప్పారు. విలేజ్, వార్డు క్లినిక్స్‌ ద్వారా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పూర్తి పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాలకు హాజరయ్యేలా చూడాలని సమావేశంలో నిర్ణయించారు.

కేసీఆర్ కి కేంద్రమంత్రి కితాబు!

తెలంగాణలో కరోనా వైరస్ ని నియంత్రించడానికి సీఎం కేసీఆర్ సాహసోపేత చర్యలు తీసుకున్నారని, అందుచేత వైరస్ కట్టడిలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందని కేంద్ర జలశక్తి అభియాన్ మంత్రి రతన్ లాల్ కటారియా పేర్కొన్నారు.

కరోనా వైరస్ కేసుల సంఖ్య అదుపులోనే ఉందని.. రాజధాని హైదరాబాద్ లోనే రెడ్ జోన్లు ఉన్నాయని, మిగతా జిల్లాల్లో ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో పగలు లాక్ డౌన్, రాత్రిళ్లు కర్ఫ్యూ పకడ్బందీగా కొనసాగుతోందన్నారు. కరోనా కట్టడి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత చర్యలు చేపట్టారని రతన్ లాల్ కటారియా ఈ సందర్భంగా అభినందించారు.

తెలంగాణలో ఆదివారం నాటికి కరోనా బాధితుల సంఖ్య 1551కి చేరుకుంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 525 మంది చికిత్స పొందుతుండగా.. ఆదివారం మరో 42 మంది ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. దీంతో ఆరోగ్యవంతులుగా ఇళ్లకెళ్లినవారి సంఖ్య 992కు చేరింది. ఇప్పటివరకూ మహమ్మారి బారినపడి 34 మంది మరణించారు.

తెలుగు హీరోలపై హీరోయిన్ల చిన్నచూపు..!


టాలీవుడ్ హీరోలపై కొందరు హీరోయిన్లు చిన్నచూపు చూస్తున్నారు. ఇతర భాష హీరోయిన్లకు టాలీవుడ్ దర్శక నిర్మాతలు పెద్దపీఠ వేస్తుంటే వాళ్లు మాత్రం టాలీవుడ్ హీరోల క్రేజీని తక్కువచేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు. టాలీవుడ్లో ఆఫర్లు కోసం ఒకప్పుడు వెంపర్లాడిన హీరోయిన్లు వారికి కొంతపేరు రాగానే అన్ని మరిచిపోతున్నారు. టాలీవుడ్ హీరోలను తక్కువ చేసి ఇతర భాషల హీరోలు తోపులన్న రీతిలో కొందరు హీరోయిన్ల వ్యాఖ్యలు చేస్తుండటంపై టాలీవుడ్ ప్రేక్షకులు ఫైరవుతోన్నారు.

ఇటీవల త్రిషకు సోషల్ మీడియాలో లైవ్లో అభిమానుల నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. మీకు నచ్చిన ముగ్గురు హీరోల గురించి చెప్పండి? అని ప్రశ్నించగా ఆమె కోలీవుడ్ నుంచి కమలాహాసన్, మల్లువుడ్ నుంచి మోహన్ లాల్, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ పేర్లను చెప్పింది. టాలీవుడ్ నుంచి ఒక్క హీరో పేరు కూడా వెల్లడించలేదు. చెన్నైకి చెందిన ఈ అమ్మడికి టాలీవుడ్ ఇండస్ట్రీ వల్లే సినిమాల్లో గుర్తింపు వచ్చింది. కెరీర్ తొలినాళ్లలో ఆమె ఇతర భాషల్లో చేసిన సినిమాలేవీ ఆమెకు గుర్తింపు తీసుకురాలేదు. టాలీవుడ్లో ప్రభాస్ నటించిన ‘వర్షం’ మూవీతోనే త్రిష విజయాల బాట పట్టింది. టాలీవుడ్లోని అగ్రనటులందరికీ సరసన నటించిన త్రిష వీళ్లను కాదని తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వని అమీర్ ఖాన్ పేరు చెప్పడంపై నెటిజన్లు మండిపడుతోన్నారు. ఆమె టాలీవుడ్ హీరోలను మరిచిపోవడం చూస్తుంటే కావాలనే త్రిష ఇలా చేసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి.ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ నుంచి క్రియేటీవ్ డిఫెరెన్స్ పేరుతో ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా ముఖంగా ప్రకటించి త్రిష అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ అమ్మడికి టాలీవుడ్లో అవకాశాల్లేకపోవడంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటుందని పలువురు విమర్శిస్తున్నారు.

తాజాగా టాలీవుడ్లో బీజీగా స్టార్ గా మారిన పూజా హెగ్డే సైతం టాలీవుడ్ హీరోలను తక్కువ చేసే ప్రయత్నం చేసింది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫ్యాన్స్ గుస్సా అవుతోన్నారు. లాక్డౌన్ సమయంలో మీరు ఏ హీరోతో స్వీయనిర్భంధంలో ఉండాలని అనుకుంటున్నారని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు హృతిక్ రోషన్ అంటూ సమాధానం ఇచ్చింది. టాలీవుడ్లో మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి హీరోలతో నటించి పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ హీరో పేరును వెల్లడించడంపై ఫ్యాన్స్ గుస్సా అవుతున్నాయి. అయితే ఈ అమ్మడు తెలివిగా అవకాశం వస్తే అందరితో స్వీయనిర్భంధంలో ఉంటానని చెప్పింది. హృతిక్ రోషన్ అంటే తనకు చిన్నప్పటి నుంచి క్రష్ ఉందని చెప్పింది. ఈ విషయంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతోంది. హీరోయిన్లు వారికి నచ్చిన హీరోల పేర్లు వెల్లడిస్తే తప్పేంటీ? అని ప్రశ్నిస్తుండగా మరికొందరు మాత్రం వాళ్లను తప్పుబడుతున్నారు. ఇప్పటికే సీనియర్ హీరోయిన్ త్రిష టాలీవుడ్ ప్రేక్షకులు ఆగ్రహానికి గురవుతోండగా తాజాగా పూజా హెగ్డే చేరింది. ఇప్పటికైనా టాలీవుడ్ దర్శక, నిర్మాతలు, హీరోలు పరభాష హీరోయిన్లకు ప్రాధాన్యాన్ని తగ్గించి తెలుగు భామలకు అవకాశాలిచ్చే వారిని ఎంకరేజ్ చేయాలని టాలీవుడ్ ఫ్యాన్స్ కోరుతున్నారు. మున్మందు ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే..!

ఒబామా ఒక అసమర్థుడు: ట్రంప్

అమెరికా అధ్యక్ష్యుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి మాజీ అమెరికా అధ్యక్ష్యుడు ఒబామాపై విరుచుకుపడ్డారు. తాజాగా అమెరికా వైట్‌ హౌస్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్ష్యుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ.. మాజీ అమెరికా అధ్యక్ష్యుడు బరాక్‌ ఒబామా ఓ అసమర్థ అధ్యక్ష్యుడని దుయ్యబట్టారు. ఆయన గూర్చి అంతకన్నా ఎక్కువుగా చెప్పలేనని చెప్పారు.

అయితే శనివారం ఒబామా ఓ కార్యక్రమంలో కరోనా కట్టడిలో అమెరికా ప్రభుత్వ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి అమెరికా నాయకత్వాన్ని బహిర్గతం చేసిందని అన్నారు. అన్నింటికీ మించి భాధ్యతాయుత పదవుల్లో ఉన్న వారు తమ భాద్యతను ఏ విధంగా సమర్థంగా నిర్వహిస్తున్నారో చెప్పాలని పేరు చెప్పకుండా ట్రంప్ పై ప్రశ్నలు సంధించారు. అలాగే చాలా మంది భాద్యత వహిస్తున్నట్లు నాటకం ఆడుతున్నారని విమర్శించారు. దీనిపై ఘాటుగా స్పందించాడు ట్రంప్..”ఒబామా ఒక అసమర్థ అధ్యక్షుడు.. ఆయన గురించి అంతకన్నా ఏం చెప్పలేను’ అని తీవ్రంగా స్పందించారు.

మరోవైపు అమెరికాలో ఇంకా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు అక్కడ నమోదైన కేసుల సంఖ్య 15.26 లక్షలు దాటింది. తాజాగా, 24 గంటల్లో 18 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం మృతుల సంఖ్య 90,931కి చేరువైంది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదైన దేశంగా అగ్రరాజ్యం కొనసాగుతోంది. ఇక రష్యా, స్పెయిన్‌, ఇంగ్లాండ్‌, బ్రెజిల్‌ దేశాల్లోనూ వైరస్‌ ఉగ్రరూపం కొనసాగుతోంది. అగ్రరాజ్యం తర్వాత ఈ దేశాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

జేడీ, జగన్ తో జోడి?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ జగన్ పార్టీలో చేరుతున్నారా? అంటే ప్రస్తుత పరిస్థితులు బట్టి అవుననే సమాధానం వస్తుంది. ఈ మధ్య ఒక టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు చాలామంది రాజకీయ నాయకులు చేయరు. కానీ జగన్ అందుకు భిన్నంగా.. మేనిఫెస్టోలో ఉన్న అంశాలను ప్రాధాన్యంగా చేస్తున్నారని కితాబిచ్చారు. ప్రజలే మేనిఫెస్టో తయారు చేసి రాజకీయ నేతల దగ్గర హామీ తీసుకోవాలని.. సంతకాలు పెట్టించుకోవాలన్నారు.

సీబీఐలో పనిచేసిన సమయంలో చాలా కీలకమైన కేసుల్ని దర్యాప్తు చేసినట్లు లక్ష్మీనారాయణ చెప్పారు. తన విధుల్ని నిర్వహించానని.. వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా ద్వేషం లేదని.. ఎవరిపైనా కక్షగట్టాల్సిన అవసరం లేదన్నారు. జగన్ కేసు దర్యాప్తు సమయంలో ఆయన తనకు విమానాశ్రయంలో ఎదురుపడ్డారని.. నమస్కారం అంటే నమస్కారం అంటూ పలకరించుకున్నామని ఆసక్తికర విషయాలు చేప్పారు. ఇక జగన్ ఆస్తుల కేసులో లక్షకోట్లు అంటూ జరుగుతున్న ప్రచారం గురించి తనకు తెలియదని.. ఆ కేసులో తాను ఉన్నంత వరకు రూ.1500కోట్ల వరకు ఛార్జ్‌షీట్లు వేశామన్నారు. తర్వాత కొన్ని జరిగాయనుకుంటున్నాను అన్నారు. సీబీఐలో పనిచేసే సమయంలో తనకు బెదిరింపులు వచ్చాయన్నారు మాజీ జేడీ. శత్రవులు కచ్చితంగా ఉంటారని.. తనకు బెదిరింపు లేఖలు వచ్చేవని.. కుటుంబంపై హాని చేస్తామని కొందరు బెదిరించారన్నారు.

పవన్ పై జేడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఫుల్ టైం పాలిటిక్స్ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానన్నారు లక్ష్మీనారాయణ. పవన కళ్యాణ్ ఫుల్ టైం కాదన్నారని.. తాను మాత్రం అలా కాదన్నారు. జనసేనను వీడేంందుకు కారణాలు చెప్పి బయటకు వచ్చానని.. రాజీనామాకు ముందు పవన్‌ ను కలవలేదన్నారు. ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయం తీసుకులేదని.. ఏ వేదిక కావాలి అనుకున్న రోజు.. ఏ వేదిక మార్పు తెస్తుంది అనుకుంటే ఆవైపు వెళ్లాలని నిర్ణయించుకుంటాను అన్నారు. వేరే పార్టీ అవసరం అనుకుంటే ఆ దిశగా వెళతానని చెప్పుకొచ్చారు. యువతలో మార్పు తేవాలనే ఉద్దేశమన్నారు.

మెగాస్టార్ తో నటించాలని ఉందంటున్న సీనియర్ హీరోయిన్


ఒకప్పుడు చిత్రసీమలో స్టార్ హీరోయన్ గా రమ్యకృష్ణ హవా కొనసాగింది. సౌత్ లోని అగ్ర హీరోలందరి సరసన రమ్యకృష్ణ నటించింది. గ్లామర్ పరంగానే కాకుండా నటనపరంగా అభిమానులను అలరించింది. ఆ తర్వాత దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకుంది. కొద్దిరోజులపాటు సినిమాలకు దూరంగా ఉన్న రమ్యకృష్ణ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సంగతి తెల్సిందే. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’లో రాజమాత శివగామిగా అద్భుతంగా నటించి మెప్పించింది. పలు సినిమాలతో బీజీగా మారిన రమ్యకృష్ణ తాజాగా ఆమె మెగాస్టార్ తో మరోసారి నటించాలనే కోరికను వెలిబుచ్చింది.

చిత్రసీమలో ఒకప్పుడు సత్తాచాటిన హీరోయిన్లంతా ప్రస్తుతం వెబ్ సీరిసులలో నటిస్తున్నారు. ఈ కోవలోనే రమ్యకృష్ణ కూడా తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితాధారంగా నిర్మిస్తున్న ‘క్వీన్’ వెబ్ సీరిసులో నటించింది. ఈ వెబ్ సీరిసులో తమిళనాడులో విశేష ప్రజాదరణ లభించింది. ఈనేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవితో కలిసి తెలుగులో ఓ వెబ్ సీరిస్ చేయాలను ఉందనే ఆకాంక్షను రమ్యకృష్ణ వెలిబుచ్చింది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా థియేటర్లు, షూటింగులు వాయిదాపడటంతో సెలబ్రెటీలంతా ఓటీటీ ప్లాట్ ఫామ్స్, వెబ్ సీరిసులవైపు చూస్తున్నారు. ఈమేరకు మెగాస్టార్ చిరంజీవి కూతురు సుప్రియ కూడా త్వరలోనే వెబ్ సీరిసులను నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. మెగా హీరోలతో సొంతంగా వెబ్ సీరిసులను తీసి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో విడుదల చేయాలని భావిస్తోంది. సుప్రియ నిర్మించే వెబ్ సీరిసులో నటించేందుకు మెగాస్టార్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈనేపథ్యంలో రమ్యకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతోన్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే మెగాస్టార్ తో రమ్యకృష్ణ త్వరలో నటించే అవకాశం లేకపోలేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ మూవీలుగా నిలిచాయి. రమ్యకృష్ణ వ్యాఖ్యలను మెగా అభిమానులు కూడా స్వాగతిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వెబ్ సీరిస్ వస్తే బాగుంటుందని అభిమానులు అంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే..!

దూసుకొస్తున్న ఎంఫాన్ తుఫాన్!

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. మరింత బలపడంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఎంఫాన్ తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎంఫాన్  తుఫాన్ మరింత బలపడటంతో పెద్ద పెద్ద ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలలోనూ అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుఫాన్ వల్ల ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

మే 20వ తేదీ మధ్యాహ్నానికి  హతియా దీవులు, సాగర్ ద్వీపాల మధ్య తుఫాను తీరం దాటి భారత్ ను తాకనుంది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

క్లైమాక్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఆర్జీవీ


సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం ‘క్లైమాక్స్’. అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో సస్పెన్స్ థిల్లర్ గా ‘క్లైమాక్స్’ ను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదల చేయగా కేవలం రెండ్రోజుల్లో మినియన్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని వర్మ స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అలాగే మియా మాల్కోవాపై షూట్ చేసిన ‘జస్ట్ డూ ఇట్.. ఫ్రీక్ అవుట్’ అనే మ్యూజికల్ వీడియోను శనివారం విడుదల చేసి ఆకట్టుకున్నాడు. కాగా నేడు క్లైమాక్స్ ట్రైలర్ ను విడుదల చేశారు. వర్మ సోషల్ మీడియాలో విడుదల చేసిన కొద్దిసేపటికే ఈ ట్రైలర్ ట్రెండింగ్లోకి దూసుకెళ్లడం గమనార్హం.

క్లైమాక్స్ టీజర్కు కొనసాగింపుగా నేడు విడుదలైన ట్రైలర్ వర్మ అభిమానులను ఆకట్టుకుంటోంది. సస్పెన్స్, గ్లామర్ థిల్లర్ గా క్లైమాక్స్ మూవీని తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. మియా మాల్కోవా తన ప్రియుడితో కలిసి నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశిస్తుంది. వారిని ఓ ముసుగు వేసుకున్న బృందం వెంటాడుతోంది. మియా మాల్కోవా ప్రియుడిని దుండగులు హతమారుస్తారు.. వారిని మియా మాల్కోవా ఎలా ఎదుర్కొంటునేదని సస్పెన్స్ ను తలపిస్తోంది. ఇక ఎడారిలో మియా మాల్కోవా అందాల ప్రదర్శన యువతను కిక్కించేలా ఉన్నాయి. మొత్తానికి క్లైమాక్స్ టీజర్ వర్మ అభిమానులకు కనువిందు చేస్తుందడనడంలో సందేహం లేదు. తాజగా ఈ మూవీని వర్మ మే 29న ఉదయం 11గంటలకు వర్మ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ యాప్ లో విడుదల చేయనున్నట్లు వర్మ ట్వీట్ చేశాడు.

ప్రజారవాణాపై కీలక నిర్ణయాలు!

తెలంగాణలోని ప్రజారవాణా పై ఈ రోజు కీలక ఆదేశాలు వెలువడనున్నాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు. ఆర్టీసీ బస్సులు నడిపే విషయమై అధికారులతో మంత్రి చర్చిస్తున్నారు. సాయంత్రం కేబినెట్‌ భేటీ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడిపే విషయంపై సాయంత్రం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే కేబినెట్‌ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరస్పర అంగీకారంతో వాహనాలు, బస్సులు తదితర ప్రజారవాణాకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులు, వాహనాల్ని నడిపే అంశంలో రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనే తుది నిర్ణయమని కేంద్రం ప్రకటించింది. ఇక ఇప్పటికే ముంబయి, పంజాబ్‌ తో పాటు ఇతర ప్రాంతాల్లో బస్సు సర్వీసులను పునరుద్ధరించారు.

మరోవైపు ఇకపై క్వారంటైన్‌ కు ఒప్పుకున్న వారికే ప్రత్యేక రైళ్ల టికెట్లు జారీ చేయాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. ఈ మేరకు వెబ్‌ సైట్‌ లో అంగీకారం తెలపాలి. లేదంటే టికెట్‌ బుకింగ్‌ వీలుకాదు. 14న ప్రత్యేక రైలులో బెంగళూరు వెళ్లిన కొందరు క్వారంటైన్‌ కు ససేమిరా అనడంతో ఐఆర్‌సీటీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఖమ్మంలో మరోసారి కరోనా కలకలం!

Telangana


ఖమ్మం జిల్లాలోని ఇటీవల ఒకేసారి ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ఘటన మరువక ముందే తాజాగా మధిర మండలం మహాదేవపురంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతుంది. ఇటీవల మహారాష్ట్ర నుండి 17 మంది ప్రత్యేక బస్సులో ఆ గ్రామానికి వచ్చారు. అయితే వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాలతి తెలిపారు. మొత్తం ఏడుగురిని కరోనా టెస్టులకు తరలించగా వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు ఆమె వెల్లడించారు. ముంబై నుండి ఆ బస్సులో వచ్చిన మిగిలిన వారిని బయటకి పంపించలేదని వారందరిని కూడా ఐసోలాషన్ కి తరలించినట్లు మాలతి తెలిపారు.

ఏప్రిల్ 6వ తేదీన ఖమ్మంలో తొలి క‌రోనా పాజిటివ్ కేసు నమోదయింది. ఆ తర్వాత మరో కేసు ఖమ్మం రూరల్ పరిధిలోని పెద్ద తండాలో నివాసం ఉంటున్న 45 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొద్ది రోజుల క్రితం మహబూబాబాద్ నుంచి నిజాముద్దీన్ సభకు ఢిల్లీకి వెళ్లిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అతనితో కలిసి ప్రయాణం చేసిన వారిని క్వారంటైన్‌ కి తరలించి బ్లడ్ శాంపిల్స్ పంపించారు. ఈ విధంగా క్వారంటైన్ లో ఉన్న‌వారిలో ఖమ్మంకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతన్ని కలిసిన 40 మంది వ్యక్తులను క్వారంటైన్‌ కి తరలించి టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. అయితే ఎటువంటి సింట‌మ్స్ లేకపోయినా బాధితుడికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌వో మాలతి తెలిపారు.

క్యాబ్ యజమానులకు గుడ్ న్యూస్..!


వైఎస్ఆర్ వాహన మిత్ర లబ్ధిదారులకు 2వ సంవత్సరం ఆర్థిక సహాయ కార్యక్రమంలో భాగంగా వాహనా యజమానులకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ పథకంలో భాగంగా ఆటో రిక్షా, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాహనాల యజమానులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందజేయనున్నారు. ఈ  కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 4న ప్రారంభించడం జరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు.

విజయవాడ ఆర్టీసీ రాష్ట్ర కార్యాలయం పరిపాలనా భవనంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. సమావేశంలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్ టి కృష్ణబాబు, కమిషనర్ పి ఎస్ ఆర్ ఆంజనేయలు పాల్గొన్నారు. అయితే ఈ పథకం కోసం గతేడాది రెండు విడతలుగా దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 2,36,340 మందికి రెండు విడతల్లో ఆర్థిక సహాయం అందించారు. ఇందుకోసం రూ.230 కోట్లలను ప్రభుత్వం విడుదల చేసింది.

ఆర్థిక మంత్రి హరీష్ రావు లేదా వినోద్ కుమార్!


తెలంగాణ ఆర్ధిక మంత్రి ఎవ్వరు? ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మేనల్లుడు టి హరీష్ రావు ఆర్ధిక మంత్రి అని అందరికి తెలుసు. అయితే వాస్తవానికి ఆర్ధిక అంశాలపై నేడు తరచుగా మాట్లాడుతున్నది రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మెన్ బి వినోద్ కుమార్ మాత్రమే. దానితో ప్రస్తుతం ఆర్ధిక మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కరోనా అలజడి ప్రారంభమైనప్పటి నుండి గత మూడేళ్ళుగా హరీష్ రావు ఆర్ధిక వ్యవహారాలపై ఒక సమీక జరిపినట్లు గాని, మీడియా ముందుకు వచ్చిన్నట్లు గాని ఎక్కడా లేదు. ఆయన ఎక్కువగా తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతున్నారు. మంత్రివర్గ సమావేశాలు లేదా మరేవైనా ముఖ్యమైన సమావేశాలు జరిగితేనే హైదరాబాద్ లో కనిపిస్తున్నారు.

కేంద్రం ప్రకటియించిన ఆర్ధిక ప్యాకేజీపై వరుసగా వినోద్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ హరీష్ రావు ఎక్కడ మాట్లాడినట్లు లేదు. కనీసం లాక్ డౌన్ కారణంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందుల గురించి కూడా ఎక్కడా ప్రస్తావించడం లేదు. ప్రస్తావిస్తే సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తున్నారు లేదా వినోద్ కుమార్ మాట్లాడుతున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాను జాతీయ రాజకీయాలకు వెడితే ముఖ్యమంత్రి పదవి కుమారుడు కేటీఆర్ కు అప్పచెప్పడం కోసం, మరో అధికార కేంద్రం లేకుండా చేయాలనీ హరీష్ రావు ను మంత్రివర్గంలోకి తీసుకోలేదు.

అయితే కేటీఆర్ ఆశించిన విధంగా పార్టీలో, ప్రభుత్వంలో తగు పట్టు సంపాదించుకోలేక పోవడం, పార్టీలో అసంతృప్తి చెలరేగుతున్నట్లు గ్రహించి తర్వాత హరీష్ రావు ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

హరీష్ రావు కు కీలకమైన ఆర్ధిక మంత్రి పదవి ఇచ్చినా గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా క్రియాశీలంగా వ్యవహరించినట్లు ఇప్పుడు కనబడటం లేదు. కేవలం అలంకారం కోసమే మంత్రి పదవీ ఇచ్చారు గాని, అధికారాలు ఏమీ ఇవ్వలేదని అభిప్రాయం కలుగుతున్నది. దానితో హరీష్ రావు సహితం ఎక్కువగా రాజధానికి దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఆర్ధిక అంశాల గురించి మాట్లాడవద్దని హరీష్ రావు ను కట్టడి చేస్తున్నారా? ఆ శాఖ ఉన్నతాధికారులు అందరు నేరుగా సీఎం కేసీఆర్ ను కలుస్తూ హరీష్ రావు ను నిర్లక్ష్యం చేస్తున్నారా? ప్రతికూల పరిస్థితులను గమనించి వ్యూహాత్మకంగా హరీష్ రావు వెనుకడుగు వేస్తున్నారా? వంటి పలు సందేహాలు ఇప్పుడు టి ఆర్ ఎస్ వర్గాలకే కలుగుతున్నాయి.

హరీష్ రావు కు సన్నిహితుడిగా పేరున్న ఆరోగ్య మంత్రి ఈటెల రాజేంద్రర్ సహితం కరోనా మహమ్మారి కట్టడిలో తొలుత చాలా క్రియాశీలకంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ గత నెలరోజులుగా ఆయన ప్రాధాన్యత కూడా తగ్గుముఖం పడుతూ వస్తున్నది. పరోక్షంగా ఆయన వ్యవహారాలలో సహితం కేటీఆర్ జోక్యం చేసుకొంటున్నారని తెలుస్తున్నది.

ఏది ఏమైనా టి ఆర్ ఎస్ లో రాజకీయ వ్యవహారాలు అంత సవ్యంగా లేవని భావించవలసి వస్తున్నది. మొత్తం పార్టీ, ప్రభుత్వంపై ఆధిపత్యం వహించేందుకు ఒక వంక కేటీఆర్ కు అవకాశం కల్పిస్తున్నారు. అయితే కేటీఆర్ వ్యవహార శైలి పట్ల పార్టీలో, ప్రభుత్వంలో నెలకొంటున్న అసంతృప్తిని సహితం కేసీఆర్ తేలికగా తీసుకోలేక పోతున్నారు.

చికెన్ ధరకి సమ్మర్ ఫార్ములా!

కరోనా వైరస్‌ కి చెక్ పెట్టాలంటే… ప్రోటీన్ ఉండే మాంసం తిని, ఇమ్మ్యూనిటి శక్తిని పెంచుకోవాలని అప్పుడెప్పుడో సీఎం కేసీఆర్ చెప్పడంతో… ఆ మాటను ప్రజలు సీరియస్‌ గా తీసుకున్నారు. క్రమం తప్పకుండా చికెన్ బాగా తిని అర్జంట్ గా ఇమ్మ్యూనిటి శక్తిని పెంచుకుంటున్నారు. ఐతే… దీన్ని అడ్డం పెట్టుకొని చికెన్ దుకాణాల వాళ్లు రేట్లు అమాంతం పెంచేశారు. కేజీ ఎంతంటే… ఏకంగా రూ.300 నుంచి రూ.310కి అమ్ముతున్నారు. దుకాణం దగ్గరకు వెళ్లాక… ప్రజలు జేబులు తడుముకోవాల్సి వస్తోంది.

ఒక్కసారిగా ఎందుకు ఇంత రేటు పెంచారని అడిగితే… “ఏంచేస్తాం… ఎండాకాలం… కోళ్లు సరిగా మేత తినట్లేదు… నీరే తాగుతున్నాయి. అందువల్ల బరువు పెరగట్లేదు… దాంతో కోళ్లకు కొరత వచ్చింది, మాంసం రేటు పెరిగింది” అని సమ్మర్ ఫార్ములా చెబుతున్నారు.
వాళ్లు చెప్పినదాంట్లో కొంత నిజం ఉంది. అలాగని… కేజీ రూ.150 నుంచి రూ.180 ఉండే చికెన్ ధరను ఏకంగా రూ.300 దాకా పెంచేస్తే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించడంలో తప్పేముంది?

మామూలుగా తెలంగాణలో రోజుకు 7.5 లక్షల కేజీల నుంచి 8 లక్షల కేజీల కోడి మాంసం అమ్ముతారు. 24 లక్షల కేజీల దాకా అవుతుంది. లాక్‌ డౌన్‌ కు ముందు తెలంగాణలో నెలకు 4.20 కోట్ల కోడి పిల్లల్ని ఉత్పత్తి చేసేవారు. ఇప్పుడు వాటి సంఖ్య 2.8 కోట్లకు తగ్గింది. దాంతో… కోళ్లకు కొరత వచ్చింది. అయితే కేజీ చికెన్‌ రూ.276కి మాత్రమే అమ్మాల్సి ఉండగా కొన్ని షాపుల్లో రూ. 300కు పైగా అమ్ముతున్నారు.

రూ 20 లక్షల కోట్ల ప్యాకేజి అంకెల గారడీయా!


కరోనా కారణంగా కుదేలైన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి ప్రకటించినప్పుడు దేశంమంతా హర్షం వ్యక్తమైనది. ప్రజలలో నూతన ఆశలు చేకూరాయి. కానీ ఊరించి, ఊరించి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదు రోజులపాటు వరుసగా ప్రకటించిన ప్యాకేజి వివరాలు అస్పష్టతను కలిగించాయి.

ఇంతకు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారని అడిగితే “మేము ఎన్ని నిధులు ఇచ్చామని కాదు … ప్రజలకు ఏమి అందిందో చూడండి” అంటూ ఆమె సమాధానం ఇచ్చారు. గతంలో ఉన్న పథకాలకు కొద్దో, గొప్పో అదనంగా అంకెలు కలిపారు. వివిధ సంస్థల ద్వారా కొన్ని వెసులుబాట్లు కల్పించారు. కానీ అవన్నీ ప్రజలకు ఏమేరకు, ఏ విధంగా చేరతాయో స్పష్టత లేదు. దానితో ఇదంతా అంకెల గారడీనే అని విపక్షాలు ధ్వజమెత్తాయి.

రూ. 20 లక్షల కోట్లలో ప్రభుత్వం అందించిన ఉద్దీపన రూ.3.22 లక్షల కోట్లు మాత్రమేనని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ విమర్శించింది. మోదీ సర్కారు చెప్తున్నట్లుగా దేశ జీడీపీలో ఈ ప్యాకేజీ విలువ దాదాపు 10 శాతం ఎంతమాత్రం కాదని, 1.6 శాతమేనని ఆ పార్టీ అధికారప్రతినిధి ఆనంద్‌ శర్మ మండిపడ్డారు. దేశ ప్రజలను మోసపూరిత, అసత్య, జిత్తులమారి ప్రకటనలతో కేంద్ర ప్రభుత్వం మభ్యపెట్టాలని చూస్తున్నదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

‘కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోడానికి, పేద ప్రజలు, చిన్న, మధ్యతరహా సంస్థల చేతుల్లోకి నగదును అందించేందుకు ప్రధాని మోదీ తప్పక మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందే’ అని శర్మ డిమాండ్‌ చేశారు. ఈ ప్యాకేజీపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చకు సవాల్‌ విసిరారు.

ఇక మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఈ ఉద్దీపన ప్యాకేజీ ప్రభుత్వ అదనపు ఆదాయం, ఖర్చుల కోసం ప్రకటించిందే తప్ప కరోనా బాధిత రంగాల కోసం కాదని ఎద్దేవా చేశారు.

కేంద్రం ప్రకటించిన కరోనా ప్యాకేజీ రూ.20 లక్షల కోట్లుగా ఉన్నా.. బడ్జెట్‌పై ప్రభావం మాత్రం రూ.1.50 లక్షల కోట్లేనని బార్క్‌లేస్‌ దేశీయ ప్రధాన ఆర్థికవేత్త రాహుల్‌ బజోరియా తెలిపారు. జీడీపీలో ఇది 0.5 శాతమేనని గుర్తుచేశారు. ఈ అంచనా కరోనా సాయం కంటే ద్రవ్యలోటు కట్టడికే మోదీ సర్కారు ప్రాధాన్యత ఇచ్చిందన్న విషయాన్ని ధ్రువపరుస్తుండటం గమనార్హం.

మొత్తం ప్యాకేజీలో ఆర్బీఐ గతంలో ప్రకటించిన నిర్ణయాల విలువే రూ.8 లక్షల కోట్లుగా ఉన్నది. మరోవైపు మొత్తం ప్యాకేజీలో ఖజానాపై పడుతున్న భారం చాలా తక్కువేనని ఈవై ఇండియా చీఫ్‌ పాలసీ సలహాదారు డీకే శ్రీవాత్సవ పేర్కొన్నారు.

కాగా, ప్యాకేజీపై రిటైలర్ల సంఘం కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమను ఏమాత్రం ఆదుకోలేదని భారతీయ రిటైలర్ల సంఘం సీఈవో కుమార్‌ రాజగోపాలన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీలో రెడ్ జోన్ ప్రాంతాలు ఇవే..!


రాష్ట్రంలో కరోనా కేసులు ఉధృతి కొంత మేర తగ్గినప్పటికీ రోజు కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,205 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 49 మంది ప్రాణాలు విడిచారు. అటు 1,353 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇది ఇలా ఉంటే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల లిస్టును జిల్లాల వారీగా వెల్లడించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తన ట్విట్టర్ ఖాతా ఆరోగ్య ఆంధ్ర లో ట్వీట్ చేసింది. అత్యధిక రెడ్ జోన్ లు గల జిల్లాగా పశ్చిమ గోదావరి 15 మండలాలతో మొదటి స్థానంలో ఉండగా 14 మండలాలలో కర్నూలు నిలిచాయి. కేంద్రం లాక్ డౌన్ ను ఈ నెల 31 వరకూ పొడిగించడంతో, రాష్ట్రంలో ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రెడ్ జోన్ లలో లాక్ డౌన్ పూర్తి స్థాయిలో అమలు అవుతుంది. ఆరంజ్, గ్రీన్ జోన్ లలో మాత్రం లాక్ డౌన్ కు మరిన్ని సడలింపులు ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా రెడ్ జోన్ వివరాలు ఇలా ఉన్నాయి.

కృష్ణా జిల్లా:

జగ్గయ్యపేట, విజయవాడ రూరల్, విజయవాడ అర్బన్, పెనమలూరు, మచిలీపట్నం, నూజీవిడు, ముసునూరు.

కర్నూలు జిల్లా:

ఆదోని, చిప్పగిరి, ఆస్పరి, తుగ్గలి, ఆత్మకూరు, కోడుమూరు, కర్నూలు టౌన్, నందికోట్కూరు, పాణ్యం, బనగానిపల్లె, నంద్యాల, గడివేముల, చాగలమర్రి, పాములపాడు.

కడప జిల్లా:

మైదుకూరు, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కడప టౌన్, బద్వేల్, పులివెందుల, కమలాపురం.

నెల్లూరు జిల్లా:

నెల్లూరు టౌన్, నాయుడుపేట, వాకాడు, సూళ్ళురుపేట, తడ ప్రాంతాలు.

ప్రకాశం జిల్లా:

కారంచేడు, చీరాల, ఒంగోలు టౌన్, గుడ్లూరు ప్రాంతాలు.

అనంతపురం జిల్లా:

హిందూపూర్, కల్యాణదుర్గం, అనతపురం టౌన్

చిత్తూరు జిల్లా:

శ్రీకాళహస్తి, తిరుపతి అర్బన్, రేణిగుంట, పరదయపాలెం, సత్యవేడు, నాగలాపురం, నగిరి, పుత్తూర్, వెంకటగారికోట.

తూర్పుగోదావరి జిల్లా:

సామర్లకోట, పెద్దాపురం, కొత్తపేట, రాజమండ్రి అర్బన్, పిఠాపురం, శంఖవరం.

గుంటూరు జిల్లా:

మాచర్ల, దాచేపల్లి, అచ్చంపేట, నరసరావుపేట, గుంటూరు టౌన్, తాడేపల్లి, మంగళగిరి.

విశాఖపట్నం జిల్లా:

పెదగంట్యాడ, నర్సీపట్నం, కశింకోట, పెందుర్తి, విశాఖపట్నం అర్బన్, పద్మనాభం.

విజయనగరం జిల్లా:

బొందపల్లె, పూసపాటిరేగ, కొమరాడ, బలిజిపేట ప్రాంతాలు.

పశ్చిమ గోదావరి జిల్లా:

పోలవరం, గోపాలపురం, టి. నరసాపురం, కొవ్వూరు, చాగల్లు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉండ్రాజవరం, పెనుగొండ, భీమడోలు, ఏలూరు, ఆకివీడు, ఉండి, భీమవరం, నరసాపురం.

పరిహారం ఇచ్చారు పరిష్కారం ఎప్పుడు?:పవన్

 

విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో స్టైరీన్‌ విష వాయువుతో వందలమంది ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.. ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కరోనాతో సహజీవనం చేయాలని గతంలో ఏపీ సీఎం జగన్ చెప్పిన మాటను గుర్తుచేస్తూ.. ఈ స్టైరీన్‌ విష వాయువుతో కూడా సహజీవనం చేయాలా?అని ఏపీ ప్రభుత్వాన్ని పవన్‌ ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ ఘటనలో బాధితులకు పరిహారం ఇచ్చారు సరే.. పరిష్కారం ఎప్పుడు? అని నిలదీశారు. దైన్యంగా మిగిలిన బాధితులను తక్షణం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

కరోనాతో కలిసి జీవించే పరిస్థితి తప్పదని చెబుతున్న ప్రభుత్వం.. స్టైరీన్‌ మృత్యువాయువుతో సైతం సహజీనం చేయాల్సిందేనని తన చర్యల ద్వారా ప్రభుత్వం చెప్పకనే చెబుతోందని పవన్‌ ఎద్దేవాచేశారు. పారిశ్రామిక వృద్ధి ముఖ్యమే అని, అదే సమయంలో ప్రజల ప్రాణాలు కూడా అంతకంటే ముఖ్యమని పవన్‌ అన్నారు.

పారిశ్రామికాభివృద్ధి పర్యావరణ హితంగా, ప్రజల జీవన విధానం మెరుగుపడే విధంగా ఉండాలన్నారు. ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై నమోదు చేసిన క్రిమినల్ కేసులను చూసి నిపుణులు సైతం నివ్వెరపోతున్నారని దుయ్యబట్టారు.

సారూ…ప్రజలేమైన పిచ్చోళ్లా..?

“అందర్నీ కొన్ని సార్లు మోసం చేయొచ్చు, కొందరిని అన్ని సార్లు మోసం చేయొచ్చు, కానీ అందర్నీ అన్ని సార్లు మోసం చేయడం కుదరదు” అన్నాడు ఓ మహానుభావుడు. ఇదే సూక్తి ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ మెడకు చుట్టుకునేలా ఉంది. రాష్ట్రంలో తెలంగాణ కేసులు గణనీయంగా తగ్గిపోయాయని సీఎం కేసీఆర్ ఇప్పటివరకు చేకుంటూ వచ్చారు. అంతేకాకుండా ఏపీతో పొల్చుంటే కరోనా కేసుల విషయంలో మనమే మెరుగ్గా ఉన్నామని కూడా చెబుతున్నారు. కానీ తాజాగా వెలువడిన రెండు వార్తలు తెలంగాణ సర్కార్ డొల్ల తనాన్ని బయట పెట్టాయి.

తెలంగాణ లో నిన్న ఒక్క రోజే కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు బయటపడటం కలవర పెడుతుంది. కోవిద్ కేసులు సింగిల్ డిజిట్ కి పడిపోయాయని చెప్పుకుంటున్న కేసీఆర్ సర్కార్ కి ఇది చెంప పెట్టుగా మారింది. అదేసమయంలో గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 25 కరోనా కేసులే నమోదు కావడం విశేషం.

“మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు” కరోనా టెస్టుల విషయంలో మరో సంచలన వార్త వెలువడింది. ఇప్పటివరకు తెలంగాణలో 23,388 మందికి కరోనా టెస్టులు చేశారు. మొత్తంగా రాష్ట్రంలో ఆదివారం నాటికి కరోనా బాధితుల సంఖ్య 1551కి చేరుకుంది. అంటే ప్రతి 16 మందిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక ఆంధ్ర విషయానికి వస్తే రాష్ట్రంలో 2,01,196 కరోనా టెస్టులు చేయడం విశేషం. మొత్తం కేసుల సంఖ్య 2,380 అంటే ప్రతి 94మందిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది.

మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కరోనా పాజిటివ్ కేసులు మా రాష్ట్రంలో తక్కువ అని చెప్పుకునే కేసీఆర్, టెస్టులు తక్కువుగా చేయడం వల్ల ప్రమాదం అనే విషయం ఎందుకు అర్థంకావడం లేదో తెలియడం లేదు. టెస్టుల విషయంలో ఆజాగ్రత్త వహిస్తే కరోనా వ్యాప్తి మూడో స్టేజికి వెళ్లే ప్రమాదం పొంచిఉందని నిపుణులు హెచ్చరికను కేసీఆర్ ఎందుకు పెడచెవిన పెడుతున్నారో అర్థంకావడం లేదు. రాష్ట్రంలో అనేక కార్యక్రమాలకు సడలింపులు ఇస్తున్న ప్రస్తుత సమయంలో టెస్టులు ఎక్కువగా చేసి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మున్ముందు తెలంగాణ ప్రజలు ఇటలీ తరహాలో పెను విపత్తునే ఎదుర్కోవాల్సి వస్తుంది.