
గతంలో రంజాన్ నెల ప్రారంభం కాగానే హలీమ్ కోసం జనాలు హోటళ్ల ముందు క్యూ కట్టేవారు. ఇంట్లో చేసుకోవటానికి వీలులేకో లేదా బయట షాపుల్లో అమ్మేంతగా రుచిగా ఇళ్లలో వండకో హలీమ్ దుకాణాల ముందుకు చేరేవారు. కానీ, ఈ సారి ఆ పరిస్థితి లేదు. దింతో హలీం ప్రియుల ఆశలు నిరాశగా మారాయి. వరసగా పొడిగిస్తున్న లాక డౌన్ కారణంగా హైదరాబాద్ ప్రాంతానికి చెందిన హలీమ్ అమ్మే ప్రముఖ దుకాణాలు సైతం చేతులెత్తేశాయి. ఈ సంవత్సరం హలీమ్ అమ్మటం లేదని స్పష్టం చేశాయి.
ఈ సంవత్సరం రంజాన్ సందర్భంగా ఏ హోటల్ లోనూ హలీం తయారు చేయరాదని హైదరాబాద్ హలీం మేకర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. గత నెల 25వ తేదీ నుంచి రంజాన్ నెల ప్రారంభమైంది. రంజాన్ పండుగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది హలీం. ప్రతీ ఏటా రంజాన్ మాసం ప్రారంభమైందంటే ముస్లీంలతో పాటు హైదరాబాద్ వాసులంతా హలీమ్ తినేందుకు క్యూ కట్టేవారు. చికెన్, మటన్, వెజ్ హలీమ్‌లను లొట్టలేసుకుంటూ తినేవారు. కానీ ఈ ఏడు ఆ పరిస్థితి లేదు.
హైదరాబాద్ ను ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ లో హలీమ్ ఒకటి. రంజాన్ మాసంలో మాత్రమే దొరికే హలీమ్ ను ఇష్టపడని వారంటూ ఉండరు. చాలామంది హలీం ప్రియులు రంజాన్ మాసం ఎప్పుడొస్తుందా ఎప్పుడు హలీం తిందామా అని కూడా వెయిట్ చేస్తుంటారు.రంజాన్ పండగ సమయంలో తప్పకుండా తినాలనిపించే ఆహారపదార్థాలు చాలా ఉన్నాయి. హలీం, ఖుర్బానీ కా మీఠా, డబుల్ కా మీఠా, రుమాలీ రోటి, చికెన్ టిక్కా, షామీ, దహీవడ ప్రధానమైనవి.
మంచి రుచితో పాటు…ఉపవాస సమయంలో ఆరోగ్యానికి అవసరమైన.. శక్తిని కూడా అందివ్వడమే ఈ రుచుల ప్రత్యేకత. హైదరాబాదీ ఫుడ్ వెరైటీలలో ముఖ్యమైనది మాత్రం హలీం. మటన్, చికెన్, బీఫ్, ఒంటె… మాంసాలతో… హలీమ్ తయారు చేస్తుంటారు. రోజా సమయంలో హలీం తింటే వెంటనే శక్తినిచ్చే ఫుడ్ అని ప్రసిద్ధికెక్కింది. కానీ కరోనాతో హలీంకు ఎఫెక్ట్ పడింది.హైదరాబాద్ హలీం తయారీ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా హలీం తయారు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు హలీం మేకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, పిస్తా హౌస్ ఎండీ ఎంఏ మాజిద్ తెలిపారు. లాక్ డౌన్ కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి కరోనా నివారణకు ప్రభుత్వం చేసిన పోరాటానికి సహరించాలని కోరారు. ప్రతి రంజాన్ సీజన్ లో ఒక్క హైదరాబాద్‌లోనే రూ.1200 కోట్ల మేర హలీం అమ్మకాలు జరుగతాయని అంచనా. ఇక్కడి నుంచి హలీం రుచులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి.