Home Blog Page 8479

తెలుగు తమ్ముళ్లకు సామాజిక దూరం వర్తించదా?


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు నెలల తరువాత రాష్ట్రానికి వస్తున్న సంతోషంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు లాక్ డౌన్ నిబంధనలు గాలికొదిలేశారు. చంద్రబాబు కాన్వాయ్ తెలంగాణా బోర్డర్ ఏపీలో ప్రవేశించిన క్రమంలో స్వాగతం పలికేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు సామాజిక దూరం, మాస్క్ లు ధరించడం చేయలేదు.కంచికచర్ల, నందిగామ నియోజకవర్గ కేంద్రాలలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ లు శ్రీరామ్ రాజగోపాల్, తంగిరాల సౌమ్య వందల సంఖ్యలో కార్యకర్తలతో వచ్చి బాబు, లోకేష్ లకు స్వాగతం పలికారు. ఎక్కడా సామాజిక దూరం కనిపించలేదు.

అక్కడున్న పోలీసులు వారిస్తున్నా తెలుగు తమ్ముళ్లు పట్టించుకోకుండా బాబుకు స్వాగతం చెప్పేందుకు ఎగబడుతున్నారు. ఈ వ్యవహారం చంద్రబాబు వ్యక్తిగత భద్రతా సిబ్బందికి ఇబ్బందిగా మారింది. ఇటువంటి పరిస్థితి ఉంటే తాము కరోనా భారిన పడక తప్పదని ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులే రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి కారణమంటూ విమర్శించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు తన పర్యటనలో చోటు చేసుకున్న సంఘటనకు ఎం సమాధానం చెబుతారో మరి. వైసీపీ నాయకులకు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి సమాధానం చెప్పేందుకు మంచి అవకాశం దొరికిందని ఉత్సహంగా ఉన్నారు.

అడ్డేడ్డే… వలస కూలీలు వెళ్లిపోయారే…!

కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలు అష్ట కష్టాలు పడి చాలా మంది వారి వారి ప్రాంతాలకు వెళ్లిపోయారు. కాంట్రాక్టర్లకు, బడా వ్యాపారులకు చేతిలో డబ్బుంది, వ్యాపారం ఉంది. పని చేయడానికి పనివాళ్ళు లేక నానా అవస్థలు పడుతున్నారు. దీంతో నిర్మాణ కూలీల కొరత ఏర్పడింది. చేపట్టిన భారీ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో కరోనా వల్ల ఎంత నష్టం వస్తోందో… కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లిపోవడం వల్ల కూడా అంతే నష్టం వచ్చేలా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాంట్రాక్టర్ల ఆందోళన

హైదరాబాద్ మెట్రోలో పనిచేసే ఒక కాంట్రాక్టర్ ఆందోళన చెందుతున్నాడు. అయనకు చెందిన చాలా మంది వర్కర్లు… గత నెల్లో తమ తమ రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు పనులు ముందుకు సాగట్లేదు. కొత్త వారు దొరకట్లేదు. హైదరాబాద్ లో ఉండే చాలా మంది కాంట్రాక్టర్లకు కార్మికులు దొరకట్లేదు. అందరూ శ్రామిక్ రైళ్లలో ఇళ్లకు వెళ్లిపోయారు. మూడు వారాలైతే వర్షాలొచ్చేస్తాయి. ఆలోగా పూర్తి చేయాల్సిన పనులు హైదరాబాద్ వ్యాప్తంగా కొండల్లా పేరుకుపోయాయి. వలస కూలీలే అభివృద్ధికి డ్రైవింగ్ ఫోర్స్‌ లా ఉండేవారనీ… వారు లేకపోవడంతో… హైదరాబాద్ సహా… అన్ని మెట్రో నగరాల్లో కార్మికుల కొరత ఉందని చెబుతున్నారు. హైదరాబాద్‌ లో ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులతోపాటూ… ప్రైవేట్ హౌసింగ్ ప్రాజెక్టులు వందల కొద్దీ ఉన్నాయి. హైవేల పనులు, మెట్రో పనులు కూడా భారీగానే ఉన్నాయి. కానీ పనివారు లేరని ఆందోళన వ్యక్తం చేశారు.

గాడ్సేపై మరో రెండు పోస్టులు వైరల్!

నటుడు నాగబాబు ఇటీవల నాథురామ్ గాడ్సే పై వరస ట్వీట్లు చేసి విమర్శల పాలైన విషయం తెలిసిందే… ఈ ఘటన ఇంకా ప్రజలలో నలుగుతున్న తరుణంలోనే గాడ్సే పై మరో రెండు ట్వీట్లు వైరల్ గా మారాయి.

రూ.10 కరెన్సీ నోటుపై మహాత్మాగాంధీ బొమ్మ స్థానంలో నాథురామ్ గాడ్సే బొమ్మను క్లోన్‌ చేసిన ఘటన మధ్యప్రదేశ్‌ లో చోటుచేసుకుంది. అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ)తో సంబంధమున్న సిధి జిల్లాకు చెందిన శివమ్‌ శుక్లా మే 19న గాడ్సే 111 వ జయంతిని పురస్కరించుకొని ‘లాంగ్ లివ్ నాథురామ్ గాడ్సే’ అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న మధ్యప్రదేశ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరో పోస్ట్‌ లో.. రఘుపతి రాఘవ రాజా రామ్‌, దేశ్‌ బచ్చా గే నాథూరాం’ (నాథూరాం దేశాన్ని రక్షించారు) అని పేర్కొన్నారు. అదే పోస్ట్‌ లో ‘శుక్లా గాడ్సేను మహాత్మా’ అని సంభోదించి.. ‘పూజ్య పండిట్‌ నాథూరాం గాడ్సే అమర్‌ రహీన్‌’ అంటూ పోస్ట్‌ చేశారు.

ఇదే విషయంపై నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఎన్‌ఎస్‌యూఐ) కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం శుక్లాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు శుక్లాను గుర్తించడానికి సైబర్‌ నిపుణుల సహాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన ఏబీవీపీ.. సంబంధం లేని విషయాల్లో తమ పేరును తప్పుగా వాడుతున్నట్లు కాంగ్రెస్‌ పై ఫిర్యాదు చేసింది.

టిడిపి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ కు రంగం సిద్ధం


టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ను అరెస్ట్‌ చేసేందుకు శ్రీకాకుళం పోలీసులు రంగం సిద్దం చేశారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు తహశీల్దారు రామకృష్ణను బెదిరించి, దూషించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేశారు.

సోమవారం తెల్లవారుజామునే అరెస్ట్‌ చేసేందుకు ఇంటిని పోలీసులు చుట్టుముట్టగా, అర్దరాత్రే ఇంటి నుండి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈనెల 16వ తేదీన గోరింట గ్రామంలో రామసాగరం చెరువులో అక్రమంగా మట్టితవ్వుతున్న కూన రవి తమ్ముడుకు చెందిన రెండు జెసీబీలు, నాలుగు టిప్పర్లను తహశీల్దారు రామకృష్ణ సీజ్‌ చేశారు.

దీంతో రవి కుమార్‌ తహశీల్దార్‌ను బెదిరించారు. రామకృష్ణకు ఫోన్‌ చేసి కూన రవి దుర్భాషలాడిన ఆడియో ఆలస్యంగా వెలుగుచూసింది. కూన రవిది రాక్షసత్వమని తహశీల్దారు రామకృష్ణ ఆరోపించారు. కూన రవి తనను చాలాసార్లు దుర్బషలాడారని పేర్కొన్నాయి.

కాగా, టీడీపీ నేత కూన రవికుమార్‌పై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశాయి.

కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ..


కోవిడ్ వ్యాధిని ఎదుర్కొవటానికి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన నిధులను, ఎలా ఖర్చు పెట్టారో, వివరిస్తూ శ్వేత పత్రం విడుదల చెయ్యాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు వ్రాసిన ఒక లేఖలో ప్రధాని నరేంద్రమోదీ దూరదృష్టితో ఆలోచించి దేశ, రాష్ట్రాల బాగు కోసం ఆత్మనిర్భర్‌ ప్యాకేజీని ప్రకటించారని గుర్తు చేశారు..

అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్యాకేజి పైన లేని పోని విమర్శలు చేస్తూ ఉపయోగించిన భాషను కేసీఆర్ విజ్ఞతకే వదిలి వేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. రైతు బంధు ఆర్థిక సహాయాన్ని, పంటల నియంత్రిత పద్ధతితో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసంమో స్పష్టం చెయ్యాలని కరీంనగర్ ఎంపీ డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా, రైతులకు క్రమం తప్పకుండా, అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నదని గుర్తు చేసారు. అయితే రైతు బంధు ద్వారా, రైతులకు ఇలా అందడం లేదని విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తారా లేదా చెప్పమని సంజయ్ కేసీఆర్ ను నిలదీశారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు, రాష్ట్రానికి కోవిడ్ నిధులను ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. ఎన్ డి ఆర్ ఎఫ్ కింద ఇచ్చిన రూ 224 కోట్లు, మెడికల్ పరికరాల కోసం ఇచ్చిన రూ 216 కోట్లు, డివల్యూషన్ నిధులలో తొలి విడతగా ఇచ్చిన రూ 982 కోట్లు ఎలా ఖర్చు చేశారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.

ఇచ్చిన నిధులను ఎలా ఖర్చు పెట్టారో చెప్పకుండా, రాష్ట్ర ప్రజలకు ఏవేవో మాయమాటలు చెప్తున్నారని మండిపడ్డారు. పీఎం కేర్స్ నిధుల నుంచి ప్రధాని రూ 3100 కోట్లను వెంటిలేటర్ ల తయారీకి, వలస కార్మికుల కోసం, వాక్సిన్ అభివృద్ధికి కేటాయించారని గుర్తు చేశారు.

మరి, సీఎం రిలీఫ్ ఫండ్ కు, మీ కొడుకు కేటిఆర్ కు అందిన విరాళాలు మొత్తం ఎంత? మీరు వాటిని ఎలా ఖర్చు పెట్టారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. వలస కార్మికుల తరలింపు కోసం, మీరు ఖర్చు పెట్టారని చెపుతున్న డబ్బులు, కేంద్రం ఇచ్చిన విపత్తు నిధి నుంచా? లేదా వేరే నిధుల నుండి ఇవి వచ్చాయా? అంటూ నిలదీశారు.

‘మైండ్ బ్లాక్’ పాటకు వెరైటీగా డ్యాన్స్ చేసిన వార్నర్


టిక్-టాక్‌లో తెలుగు హీరోల పాటలకు డ్యాన్సులు చేస్తూ, డైలాగులు చెబుతూ టాలీవుడ్ అభిమానులను ఆకర్షిస్తోన్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ట్విట్టర్‌లో మరో వీడియో పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను అలరించాడు.

రీసెంట్‌గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘పక్కా లోకల్’ సాంగ్‌ చేసి బర్త్ డే విషెస్ తెలియజేసిన సంగతి తెలిసిందే.

మహేశ్ బాబు నటించిన ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమాలో మైండ్ బ్లాక్ పాటలో ‘వాడిని కొట్ట‌మ‌ను డప్పూ’ వ్యాఖ్యకు డ్యాన్స్‌ రూపంలో కాకుండా.. వార్నర్ వెరైటీగా ఈ వీడియో చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

ఇకపై వాటికి దూరం.. అంటున్న బ్యూటీ


హీరోయిన్ అన్నాక రోమాన్స్, కిస్ సన్నివేశాలు చేయాల్సిందే.. హీరో పైన, కింద నలగాల్సిందే.. ఇవన్నీ ప్రతీ సినిమాలోనూ ఉండేవే.. అలాంటివి చేయనంటే ఇండస్ట్రీలో నెగ్గురావడం కష్టం. తాజాగా ఓ హీరోయిన్ మాత్రం తాను అలాంటి సన్నివేశాల్లో నటించనంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం దేశంలో మహమ్మరి కారణంగా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలంతా ఇంటికే పరిమితయ్యారు. ఏదైనా పనిమీద బయటికెళ్లాల్సిన వచ్చినా మాస్కులు ధరించి.. భౌతిక దూరం పాటిస్తున్నారు. అయినప్పటికీ వారిలో ఏదో ఒక మూలన ఈ మహమ్మరిపట్ల అభ్రదతా భావం కన్పిస్తూనే ఉంది. తాజాగా టాలీవుడ్లో షూటింగులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. షూటింగుల సందడి మొదలవుతుండగానే హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాజాగా తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే సినిమా షూటింగులను ప్రారంభించేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు సంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ప్రస్తుతం షూటింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మహ్మమరిని ఎలా కట్టడి చేస్తూ సినిమాలను చిత్రీకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల కాలంలో సినిమాల్లో ముద్దు సీన్లు, రోమాంటిక్ సన్నివేశాలు కామన్ అయిపోయాయి. వీటికి ప్రేక్షకులు కూడా అలవాటైపోయారు. అలాంటిది ఇప్పుడు ఈ సన్నివేశాలు లేకుండా సినిమాలు తీసారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ విషయంపై కుండబద్దలు కొట్టింది. షూటింగ్‌లు ప్రారంభించినా ఇంతకుముందులా కౌగిలింత, ముద్దు సన్నివేశాలను తెరకెక్కించడం అంత ఈజీ కాదని అంటోంది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించాలంటే చాలా ఆలోచించాల్సిందే.. ఇకపై అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి వస్తే నేను `నో` చెబుతాను.. ప్రస్తుతానికి అలాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిది.. మన ఆరోగ్యం, చుట్టూ ఉన్న వారి ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాన’ని లావణ్య త్రిపాఠి చెబుతోంది. లావణ్య చెబుతున్నది వాస్తవమే అయినప్పటికీ సినిమాల్లో రోమాన్స్ సన్నివేశాలు లేకుండా తీయడం కూడా కష్టమే. దీంతో ఇలాంటి సన్నివేశాలను ఎలా తీయాలని దర్శకులు తలలు పట్టుకున్నారు. దీంతో కొన్ని రోజులపాటు ఈ సన్నివేశాలను వాయిదా వేస్తారా? లేక మొత్తానికే తొలగిస్తారా? అనేది వేచి చూడాల్సిందే..!

చిరంజీవి అల్లుడిపై సెటైర్ వేసిన శ్రీజ


దేశంలో లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు వాయిదాపడిన సంగతి తెల్సిందే. దీంతో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితయ్యారు. ఈ లాక్డౌన్ సమయాన్ని ఒక్కోరు ఒక్కోలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడు బీజీగా గడిపే స్టార్లు తమకు దొరికిన ఈ సమయాన్ని ఫ్యామిలీతో గడిపేందుకే ఇష్టపడుతున్నారు. తమ అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ వారిని అలరిస్తున్నారు. ఇక తెరపై యాక్షన్ సీన్లతో అదరగొట్టే హీరోలంతా లాక్డౌన్లో వైరటీగా వంటింటికి పరిమితమయ్యారు. కుకింగ్ చేస్తూ తమ నలభీమ ప్రావీణ్యాన్ని అభిమానులకు చూపించి అభిమానులను ఆకట్టుకున్నారు. అలాగే తమ ఇష్టమైన వారికి నచ్చిన వంటకాన్ని చేసి వారి అప్యాయతను చూరగొన్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి స్వయంగా దోశవేసి తన తల్లికి వడ్డించి ఆకట్టుకున్నాడు. అదేవిధంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన వైఫ్ ఉపాసన కోసం చేప కర్రీ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు.

తాజాగా చిరంజీవి రెండో అల్లుడు కల్యాణ్ దేవ్ ఇంట్లో చపాతి చేశారు. తన భార్య శ్రీజ కోసం కల్యాణ్ దేవ్ స్వయంగా చపాతీలు చేసి ఆకట్టుకున్నాడు. ఇంటి నుంచే కల్యాణ్ దేవ్ చపాతీతో తన భార్యకు ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఇండియాలను చూపించాడు. ఈ చపాతీలను చూసిన శ్రీజ చాలా ముచ్చటపడింది. ఈ చపాతి మనం వెళ్లిన ఆస్ట్రేలియాలా ఉంది.. ఇంకో చపాతి చూసి మనం వెళ్లాలనుకున్న ఆఫ్రికా ఇదేనంటూ సైటర్ వేయడం ఆకట్టుకుంది. కల్యాణ్ దేవ్ కూడా మరో చపాతి తీసుకొని ఇది ఇండియా అంటూ చూపించాడు. వీరిద్దరి మధ్య సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. ఏదిఏమైనా చపాతిలకు ఆకారం ముఖ్యం కాదని.. టెస్టీనే ముఖ్యమని కల్యాణ్ దేవ్-శ్రీజ దంపతులు చెప్పడం అలరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను శ్రీజ తన ఇన్ స్ట్రాలో పోస్టు చేసింది. మీరేవరైనా మీకు నచ్చిన స్లైల్లో చపాతీలను చేసి ఆ ఫొటోలను పంపిస్తే వాటిని తన ఇన్ స్ట్రాలో పెడుతునంటూ శ్రీజ తెలిపింది. దీంతో మెగా అభిమానులు వైరటీ చపాతీలు చేసే పనిలో పడ్డారు.

https://www.instagram.com/p/CAhzpBFhMY4/

కవిత, మానవీయ కోణంలో మంచి సాయం!

నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత మనవీయకోణంలో మంచి సహాయం చేశారు. రోడ్డు ప్రమాదంలో భార్య, కూతుర్ని కోల్పోయి.. గల్ఫ్ నుంచి రాలేక.. వీడియో కాల్ ద్వారా అంత్యక్రియలు చూసి కుమిలిపోయిన ఓ వ్యక్తికి అండగా నిలిచారు. అతనికి కోట్ల రూపాయల డబ్బులేమి ఇవ్వలేదు, విలువైన వస్తువులు కొన్నివ్వలేదు కానీ, అంతకంటే గొప్పపని చేసి కవిత మానవత్వం చాటుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన శ్రీనివాస్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. మే 15న మందమర్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడి భార్య సుజాత, పెద్ద కుమార్తె కావ్య ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్ నుంచి వచ్చే అవకాశం లేకపోవడంతో.. శ్రీనివాస్ చిన్నకూతురే అంత్యక్రియలు నిర్వహించింది.

వందే భారత్ మిషన్‌ లో భాగంగా శ్రీనివాస్ రెండు రోజుల క్రితం హైదరాబాద్ తిరిగొచ్చాడు. నిబంధనల ప్రకారం అతణ్ని ప్రభుత్వం క్వారంటైన్ లో ఉంచింది. తన భార్య అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన శ్రీనివాస్.. పెద్ద కర్మలకు కూడా హాజరు కాలేకపోతానేమోనని ఆందోళన చెందాడు. దుబాయ్‌ లో ఉన్న తన మిత్రులకు ఈ విషయాన్ని తెలియజేశాడు.

వారు ఈ విషయాన్ని మాజీ ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డికి విషయాన్ని వివరించారు. డీజీపీ అనుమతి తీసుకొని తన ఆఫీస్ సిబ్బంది ద్వారా ప్రత్యేక వాహనంలో శ్రీనివాస్‌ ను సొంతూరు పంపించారు. కవిత సహకారంతో భార్య, కూతురి పెద్ద కర్మలో పాల్గొన్న శ్రీనివాస్.. చిన్న కూతుర్ని, తల్లిని కనీసం తాకడానికి కూడా వీల్లేకపోవడంతో కుమిలిపోయాడు. అతణ్ని ఓదార్చిన పోలీసులు ఓ కుర్చీలో కూర్చోబెట్టారు. దశ దిన కర్మలు పూర్తయిన అనంతరం అతణ్ని తిరిగి హైదరాబాద్ తీసుకెళ్లారు.

‘నో పెళ్లి’ అంటున్న మెగా హీరోలు


లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు వాయిదా పడగా, థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి టాలీవుడ్లో పోస్టు ప్రొడక్షన్ పనులు, షూటింగులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సందడి మొదలైంది. లాక్డౌన్లో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. సోషల్ మీడియాలో తమ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. అప్పుడప్పుడు ‘ది రియల్ మేన్ ఛాలెంజ్’, ‘పిల్లో ఛాలెంజ్’, ‘మేకప్ ఛాలెంజ్’ అంటూ అలరించారు. కొందరు హీరోయిన్లు హాట్ హాట్ ఫొటోలతో వేసవిని మరింత హీటెక్కించి అందరి అటెన్షన్ వాళ్ల వైపు తిప్పుకున్నారు. హీరోలైతే ఫ్యామిలీతో గడిపేందుకే మొగ్గుచూపారు. తాజాగా షూటింగులు పట్టాలెక్కనుండటంతో విడుదలకు సిద్ధంగా ఉన్న మూవీలు ప్రమోషన్లకు సిద్ధమవుతున్నాయి.

తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటరు’ మూవీ నుంచి ‘నో పెళ్లి’ సాంగ్ రిలీజైంది. ఈ మూవీని హీరో నితిన్ విడుదల చేశాడు. సాంగ్లో సాయిధరమ్ తేజుతోపాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దగ్గుపాటి రానా కన్పించారు. పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే అనర్థాలను ఈ పాటలో మెగా హీరోలు విన్నించారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న నితిన్ ఈ పాటను విడుదల చేయగా రానా నో పెళ్లి పాటలో కన్పించడం ఆసక్తిని రేపుతోంది. ‘సోలో బ్రతుకే సో బెటరు’ మూవీకి సుబ్బు దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతాన్ని అందించాడు. ఎస్వీసీసీ బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. లాక్డౌన్లో లేకపోతే ఇప్పటికే ఈ మూవీ థియేటర్లో రిలీజయ్యేది. ప్రస్తుతం సినిమా షూటింగు చివరి దశకు చేరుకోవడంతో త్వరలో సినిమాను పూర్తి చేసి థియేటర్లలో విడుదల చేయనున్నారు. దీంతో ఇప్పటి నుంచి సినిమా ప్రమోషన్ పై ‘సోలో బ్రతుకే సో బెటరు’ మూవీ చిత్రబృందం దృష్టిసారించింది. ఈ మూవీలో సాయిధరమ్ కు జోడీగా నభానటేష్ నటిస్తుంది.

తొందరపడుతున్న సీనియర్లు.. రిలాక్స్ అవుతున్న జూనియర్లు


టాలీవుడ్లో సినిమా పోస్టు ప్రొడక్షన్, షూటింగులకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో సందడి మొదలైంది. సినిమాలైతే రీ స్టాట్ అవుతున్నాయిగానీ హీరోలు మాత్రం ఇప్పుడే షూటింగుల్లో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదని టాక్ విన్పిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మరో రెండు మూడు నెలలు గ్యాప్ తీసుకొని షూటింగుల్లో పాల్గొనాలని మెజార్టీ హీరోలు భావిస్తున్నారట. దీంతో ప్రస్తుతానికి హీరోలు లేకుండా సినిమాలను పట్టాలెక్కించేందుకు దర్శక, నిర్మాతలు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సినిమాలను త్వరగా స్టాట్ చేసేందుకు సీనియర్ హీరోలు మొగ్గుచూపుతుండగా జూనియర్లు మాత్రం లైట్ తీసుకుంటున్నారు.

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘RRR’. ఈ చిత్ర షూటింగుల్లో ఇప్పట్లో భారీ సన్నివేశాలు ఉండబోవని తేల్చేశారు. చిన్నచిన్న సన్నివేశాలతోనే తెరకెక్కిస్తామని ఇటీవలే రాజమౌళి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎదుట తెలిపారు. దీంతో ఈ సినిమా ప్రారంభమైనప్పటికీ ఇందులో మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాల్గొనే అవకాశాల్లేవని తెలుస్తోంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ‘సరిలేరునీకెవ్వరు’ రిలీజై బ్లాక్ బస్టర్ హిట్టుందుకుంది. దీంతో ఇప్పటికిప్పుడు ఆయన సినిమా చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో ఆయన కొత్త సినిమా ప్రారంభించినప్పటికీ షూటింగ్లో ఇప్పట్లో పాల్గొనే అవకాశం లేదనే టాక్ విన్పిస్తుంది.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తొలిసారి ‘అలవైకుంఠపురములో’ మూవీతో 200కోట్ల మార్కును అందుకున్నాడు. తాజాగా దర్శకుడు సుకుమార్ తో కలిసి ‘పుష్ప’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా బన్నీ కొత్త లుక్కులో దర్శనివ్వనున్నాడు. ఈ సినిమాలో ఇంకా హీరో పార్ట్ మొదలు కాలేదు. దీంతో ఇప్పట్లో బన్నీ సినిమా షూటింగులో పాల్గొనే అవకాశం లేదు. మరో యంగ్ హీరో నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ మరో పదిశాతం మాత్రమే పెండింగ్ ఉంది. ఇది మహా అయితే మరో రెండు వారాల్లో పూర్తికానుంది. దీంతో నాగచైతన్య కూడా రిలాక్స్ అవుతున్నాడు.

ఇక సినిమా షూటింగులకు పర్మిషన్ ఇవ్వండని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవిలు షూటింగులు ప్రారంభం కాగానే పాల్గొనే అవకాశం ఉంది. నాగార్జున ‘వైల్డ్ డాగ్’ మూవీ ఇప్పటికే 50శాతం పూర్తయింది. దీంతో ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోలోనే పూర్తి చేయాలనే పట్టుదలతో నాగ్ ఉన్నాడని టాక్ విన్పిస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ 30శాతమే పూర్తయింది. శరవేగంగా పూర్తి చేయాలనుకున్న ప్రతీసారి సినిమాకు ఏదో ఆటంకం వచ్చిపడుతూనే ఉంది. దీంతో ఈ మూవీ స్టాట్ కాగానే చిరంజీవి షూటింగులో పాల్గొనే అవకాశం ఉంది. చిరంజీవి సెట్లో ఉంటే పనులు చకచకా పూర్తవుతాయని దర్శకుడు భావిస్తున్నారట.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ‘వకీల్ సాబ్’ మూవీ కోసం జూన్లో దిల్ రాజు కాల్షీట్లు కేటాయించారు. దీంతో ఆయన కూడా త్వరలోనే షూటింగ్లో పాల్గొననున్నాడు. కోర్టు సీన్లు పెండింగ్లో ఉండటంతో ముందుగా వాటిని తెరకెక్కించేందుకు సన్నహాలు చేస్తున్నారట. ఇక విక్టరీ వెంకటేష్ నారప్పలో యాక్షన్ సీన్స్ పెండింగ్లులో ఉండటంతో కొంత గ్యాప్ తీసుకొనే అవకాశ ఉందని టాక్. అలాగే హీరో బాలయ్య దర్శకుడు బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మూవీని కూడా వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది. ఏదిఏమైనా టాలీవుడ్లో సినీ సందడి మొదలవడంతో కార్మికులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్ల పనులపై కేటిఆర్ అభినందన ట్వీట్!

సాధారణ రోజుల్లో నగరంలో రోడ్ల పనుల కోసం చాలా తక్కువ సమయం కేటాయించే వారు కానీ లాక్‌ డౌన్‌ టైంను సద్వినియోగం చేసుకుని రోడ్ల పనులు పూర్తి చేసినందుకు అధికారులను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. రద్దీ లేని రహదారులపై వేగంగా పనులు చేపట్టి రోడ్లను అద్దంలా తీర్చిదిద్దారు. ఇప్పుడు నగర రోడ్లపై ప్రయాణం సాఫీగా సాగిపోతున్నది. సాధారణంగా నగరంలో రోడ్ల పనులకు రోజుకు 3 నుంచి 4 గంటలు మాత్రమే కేటాయించేవారు. కానీ లాక్‌ డౌన్‌ నేపథ్యంలో 14 నుంచి 18 గంటల పాటు అధికారులు, కూలీలు శ్రమించారు. కేవలం 40 రోజుల్లోనే బీటీ, వీడీసీసీ, తదితర అభివృద్ధి పనులు పూర్తి చేశారు. అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయడానికి కృషి చేసినమేయర్‌ బొంతు రామ్మోహన్‌ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తో పాటు ఇంజినీరింగ్‌ అధికారులను కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా అభినందించారు.

అధికార వైసీపీకి కొత్త తలనొప్పి!


పార్టీ మీద విపరీతాభిమానంతో వ్యవస్థలను కించపరిచేలా చేస్తున్న వ్యాఖ్యలు కొత్త చిక్కులు తెచ్చేలా కనిపిస్తున్నాయి. అధికార వైసీపీకి ఏడాది కాలంలో 60కి పైగా అంశాల్లో హైకోర్టు నుంచి మొట్టికాయలు పడ్డాయి. ఆయా అంశాల్లో ప్రభుత్వం చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించకపోవడమే అందుకు కారణం. అయితే వైసీపీ అభిమానులు, కార్యకర్తలు మాత్రం ఈ సున్నిత కారణాలను పట్టించుకోకుండా తమ ప్రభుత్వం, తమ నాయకుడికి వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ పని చేస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టింగులకు దిగుతున్నారు. ఈ పరిణామాలు శృతి మించడంతో.. కోర్టు ధిక్కరణ కింద సుమోటోగా పరిశీలించాలని కోరుతూ హైకోర్టులో లక్ష్మీ నారాయణ అనే న్యాయవాది లేఖ రాశారు. ఇప్పటికే న్యాయస్థానంలో పదే పదే ఎదురుదెబ్బలు తగులుతున్న అధికార పక్షానికి ఈ వ్యవహారం అదనపు తలనొప్పిగా మారింది.

హైకోర్టు తీర్పులపై వైసీపీ నాయకుల వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైద్యుడు సుధాకర్ అరెస్ట్ చేసిన సందర్భంగా చోటు చేసుకున్న అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వైసీపీ ఎంపీ సురేష్ మీడియా సమావేశంలో కొన్ని ఆరోపణలు చేశారు. కోర్టులను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని, కోర్టు తీర్పులు ఈయనకు ముందే తెలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు పరోక్షంగా హైకోర్టుకు సంభందించినవిగా ఉన్నాయి. ఇదే అంశంపై ఆ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ మీడియాతో మాట్లాడుతూ సుధాకర్ కేసు ఒక పెటీ కేసు అని, ఆ కేసుపై సీబీఐ విచారణ వేయడంపై యావత్ రాష్ట్రం విస్తుపోయిందని హైకోర్టు తీర్పుపై వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదంటూనే.. ఇలాంటి తీర్పులతో న్యాయస్థానాలపై నమ్మకం పోతోందని పేర్కొన్నారు. కరోనా లేకపోతే హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఆందోళన చేసి ఉండేవాడినని చెప్పుకొచ్చారు. చిన్న చిన్న కేసులకు కూడా సీబీఐ విచారణ చేపడితే ప్రతి పొలీస్‌స్టేషన్‌కు అనుబంధంగా సీబీఐ ఆఫీసులు పెట్టాల్సి ఉంటుందన్నారు.

మరోవైపు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు హైకోర్టు తీర్పులపై పెట్టిన పోస్టులు హైకోర్టు కించపరిచేవిగా ఉన్నాయి. ఏపీ హైకోర్టు మీద, జడ్జిల మీద దూషణలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై సుమోటోగా తీసుకోమని హైకోర్టు సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. ఏపీలో ఇప్పుడు ప్రభుత్వానికి రెండు అపోజిషన్ లు అనే మాట గట్టిగా వినిపిస్తోందని, అందులో ఒకటి తెలుగుదేశం కాగా మరొకటి ఏపీ హైకోర్టు అని వైసీపీ మద్దతు దారులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారని తెలిపారు. ఆ పార్టీ నేతలే న్యాయస్థానాల తీర్పులపై అనుమానాలు కలిగించేలా మాట్లాడుతుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు కూడా హైకోర్టును, జడ్జ్ లను విపరీతమైన భాషతో ట్రోల్ చేస్తూ పోస్ట్లు పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయం మీద పోస్టింగ్ లు చేసిన వారిపై కేసును సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తం పదకొండు మంది సోషల్ మీడియాలో రాసిన స్క్రీన్ షాట్ లను ఆయన తన లేఖకు జత చేశారు. అందులో ఆయన నలుగురి పేర్లను ప్రస్తావించారు. ఈ లేఖను హైకోర్టు ఈ రోజు పరిశీలించే అవకాశం ఉంది. సుమోటోగా విచారణ చేపడితే వైసీపీ నేతలకు, సోషల్ మీడియా కార్యకర్తలకు ఇబ్బందులు తప్పవు.

ప్రయాణికుల కోసం కొత్త మార్గదర్శకాలు!

లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయినా వారు బస్సులు, రైళ్ళు, విమానాలల్లో సొంత ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కి సంబంధించిన నిబంధనల్ని ఆయా రాష్ర్టాలు రూపొందించుకోవచ్చని పేర్కొన్నది.

ప్రయాణికుల మార్గదర్శకాలు ఇవే..

  • నిర్ణీత దూరం, మాస్కు ధరించడం, ఆరోగ్యసేతు యాప్‌ తప్పనిసరి చేసింది.
  • ప్రయాణ ప్రాంగణాల్లో ప్రకటించే సూచనలను ప్రయాణికులు తప్పకుండా పాటించాలి.
  • ప్రయాణానికి ముందు, తర్వాత థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్ష తప్పనిసరి. లక్షణాలు లేనివారికే అనుమతి.
  • ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే దగ్గర్లోని ఐసోలేషన్‌ సౌకర్యం ఉన్న దవాఖానకు తరలించాలి.
  • తీవ్ర కరోనా లక్షణాలు ఉంటే కొవిడ్‌-19 చికిత్స కేంద్రాలకు తరలించాలి.
  • ఐసోలేటెడ్‌ వార్డుకు తరలించిన తర్వాత ఎవరికైనా నెగిటివ్‌ వస్తే.. వారిని వారంపాటు అక్కడే ఉంచి ఇంటికి పంపాలి. వారు ఆ తర్వాత మరోవారంపాటు హోం క్వారంటైన్‌ లో ఉండేలా జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలి.
  • విమానాశ్రయాలు/రైల్వేస్టేషన్లు/బస్టాండ్‌ లను తరచూ శానిటైజ్‌ చేయాలి. ప్రయాణికులకు సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
  • విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్‌ లో ఉండాలి. ఇందులో ఏడు రోజుల పాటు సొంత ఖర్చులతో ఇన్‌స్టిట్యూషనల్‌  క్వారంటైన్‌ లో, మరో వారంపాటు హోం క్వారంటైన్‌ లో ఉండాలి.
  • తీవ్ర ఒత్తిడికి గురయ్యే వారు, గర్భిణిలు, కుటుంబంలో మరణం సంభవించిన వారు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, 10 ఏండ్లలోపు పిల్లలు, వారి తల్లిదండ్రులకు క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. వీరు తప్పనిసరిగా 14రోజుల పాటు హోం క్వారంటైన్‌ లో ఉండాలి.

ఎట్టకేలకు ఏపీకి పయనమైన బాబు..!


టీడీపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రెండు నెలల సుదీర్ఘ విరామం తరువాత ఏపీకి బయలుదేరారు. మార్చి 22కి ముందు హైదరాబాద్ కు వెళ్లిన ఆయన కేంద్రం విధించిన లాక్ డౌన్ కారణంగా రాష్ట్రానికి వచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మే మొదటి వారంలో డీజీపీ లేఖ రాసినా, అనుమతి రాలేదు. తాజాగా రాసిన లేఖతో ప్రభుత్వం స్పందించింది.

చంద్రబాబు హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖ చేరుకుని ఎల్.జి బాధితులను పరమర్శించాలని, అక్కడి నుంచి అమరావతి రావాలని ప్లాన్ చేసుకోగా ప్రభుత్వం ఎయిర్ పోర్టు లో విమానాల రాకపోకలు నిలిచిపోయేలా చేసింది. వైజాగ్ ఎయిర్ పార్ట్ లో సోమవారం ఎటువంటి ఫ్లైట్స్ ల్యాండ్ అవడానికి అవకాశం లేదని ఎయిర్ పోర్ట్ అధికారులు చెప్పిన నేపథ్యంలో బాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ నుండి రోడ్ మార్గంలో తొలుత అమరావతికి చేరుకుంటారు. ఆయన వెంట తనయుడు లోకేష్ ఉన్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు విశాఖ పర్యటన అడ్డుకోవడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోందని ఆ పార్టీ నేత అచ్చన్నాయుడు అన్నారు. అనుమతి ఇచ్చినట్టు ఇచ్చి, రాష్ట్రంలో విమాన సర్వీసులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. చంద్రబాబు విశాఖ వెలితే గ్యాస్ లీకేజ్ వెనుక నిజాలు బయటపడతాయనే భయంతో పర్యటన అడ్డుకోవడమే లక్ష్యంగా చివరి నిమిషంలో ఫ్లైట్స్ రద్దు చేశారని విమర్శించారు.

రెండు నెలల తర్వాత ప్రారంభం..అంతలోనే రద్దు!

రెండు నెలల తర్వాత దేశ‌వ్యాప్తంగా దాదాపు అన్ని విమానాశ్ర‌యాల నుంచి దేశీయ విమాన స‌ర్వీసులు ప్రారంభం అయ్యాయి. అయితే కొన్ని చోట్ల విమానయాన సర్వీసులను ర‌ద్దు చేశారు.  దీంతో ప్ర‌యాణికులు తీవ్ర అయోమ‌యానికి లోన‌వుతున్నారు.  టికెట్ బుకింగ్ చేసుకుని ఎయిర్‌ పోర్ట్ వ‌చ్చిన త‌ర్వాత‌.. విమానం ర‌ద్దు అయిన‌ట్లు వారికి స‌మాచారం ఇస్తున్నారు.  దీంతో ఆ ప్ర‌యాణికులు ఏం చేయాలో అర్థంకాక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ముంబై విమానాశ్ర‌యం నుంచి పాట్నా వెళ్ల‌వ‌లిసిన విమానాన్ని ఇవాళ ర‌ద్దు చేశారు. ఉద‌యం ప్రారంభం కావాల్సిన ఆ విమానంను ర‌ద్దు చేశారు. దీంతో ఎయిర్‌ పోర్ట్‌కు వ‌చ్చిన వారంతా షాక‌య్యారు.

బెంగుళూరులో కూడా ఇలాంటి స‌మ‌స్య త‌లెత్తింది. బెంగుళూరు నుంచి హైద‌రాబాద్‌ కు రావాల్సిన విమానాన్ని అక‌స్మాత్తుగా ర‌ద్దు చేశారు.  ఎయిర్‌ లైన్స్ నుంచి త‌మ‌కు ఎటువంటి స‌మాచారం లేద‌ని ప్ర‌యాణికులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  బోర్డింగ్ పాస్‌ ల‌ను స్కానింగ్ చేస్తున్న స‌మ‌యంలో త‌మ విమానం ర‌ద్దు అయిన‌ట్లు సిబ్బంది తెలియ‌జేశార‌ని ఓ ప్ర‌యాణికుడు ఆరోపించాడు.  ఢిల్లీ విమానాశ్ర‌యంలో ఇవాళ 80 విమానాలను ర‌ద్దు చేశారు. దాంట్లో డిపార్చ‌ర్స్ , అరైవ‌ల్స్ ఉన్నాయి. ముంబై విమానాశ్ర‌యంలో 25 టేకాఫ్‌ లు, 25 ల్యాండిగ్స్‌ కు అనుమ‌తి ఉన్న‌ది. చెన్నైలో 25 విమానాలకు మాత్ర‌మే అరైవల్ అనుమ‌తి ఉన్న‌ది.

గతవారం 5వేలు, ఈ వారం 6వేలు?

భారత్ లో కరోనా కేసులు గత వారం రోజుకు 5వేల కేసులు దాకా నమోదు కాగా… ఇప్పుడు ఏకంగా నిన్న ఒక్క రోజే 6,977 కొత్త కేసులు వచ్చాయి. మరణాలు కూడా నిన్న 154 నమోదయ్యాయి. అంటే దేశంలో కొత్త కేసులు, మరణాలూ… రెండూ ఎక్కువగానే నమోదవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,38,845 కి చేరింది. వీటిలో 57,720 కేసుల్లో రికవరీ లేదా డిశ్చార్జి అయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 4,021కి చేరింది. అందువల్ల ప్రస్తుతం యాక్టివ్ కేసులుగా 77,103 ఉన్నాయి. ఈ లెక్కలన్నీ భారత్ లో కరోనా ఉద్ధృతిని చూపిస్తున్నాయి.

దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ర్టాల్లో మహారాష్ట్ర మొదటిస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 50,231 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్‌తో 1,635 మంది మరణించారు. 16,277 పాజిటివ్‌ కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉన్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 111 మంది మరణించారు. ప్రధాని సొంతరాష్ట్రమైన గుజరాత్‌ లో ఇప్పటివరకు 14,056 కరోనా కేసులు నమోదయ్యాయి. అక్కడ 858 మంది మృతిచెందారు. ఢిల్లీ 13,418 కేసులు, రాజస్థాన్‌ 7,028 పాజిటివ్‌ కేసులు, మధ్యప్రదేశ్‌ 6,665, ఉత్తరప్రదేశ్‌ 6268 పాజిటివ్‌ కేసులతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి. ఆ తర్వాత పై 4 రాష్ట్రాలతో పోల్చితే… తెలుగు రాష్ట్రాల్లో జోరు తగ్గింది. ఇకపైనా రెండు ప్రభుత్వాలూ… ఇలాగే జాగ్రత్త చర్యలు తీసుకుంటే… తెలుగు రాష్ట్రాలకు కరోనా సమస్య పెద్దగా ఉండకపోవచ్చు. కానీ… ఈ రెండు రాష్ట్రాలకూ సరిహద్దుల్లో తమిళనాడు, మహారాష్ట్ర ఉన్నాయి. కాబట్టే… తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా టెన్షన్ ఉంటోంది.