
టాలీవుడ్లో సినిమా పోస్టు ప్రొడక్షన్, షూటింగులకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో సందడి మొదలైంది. సినిమాలైతే రీ స్టాట్ అవుతున్నాయిగానీ హీరోలు మాత్రం ఇప్పుడే షూటింగుల్లో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదని టాక్ విన్పిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మరో రెండు మూడు నెలలు గ్యాప్ తీసుకొని షూటింగుల్లో పాల్గొనాలని మెజార్టీ హీరోలు భావిస్తున్నారట. దీంతో ప్రస్తుతానికి హీరోలు లేకుండా సినిమాలను పట్టాలెక్కించేందుకు దర్శక, నిర్మాతలు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సినిమాలను త్వరగా స్టాట్ చేసేందుకు సీనియర్ హీరోలు మొగ్గుచూపుతుండగా జూనియర్లు మాత్రం లైట్ తీసుకుంటున్నారు.
దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘RRR’. ఈ చిత్ర షూటింగుల్లో ఇప్పట్లో భారీ సన్నివేశాలు ఉండబోవని తేల్చేశారు. చిన్నచిన్న సన్నివేశాలతోనే తెరకెక్కిస్తామని ఇటీవలే రాజమౌళి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎదుట తెలిపారు. దీంతో ఈ సినిమా ప్రారంభమైనప్పటికీ ఇందులో మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాల్గొనే అవకాశాల్లేవని తెలుస్తోంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ‘సరిలేరునీకెవ్వరు’ రిలీజై బ్లాక్ బస్టర్ హిట్టుందుకుంది. దీంతో ఇప్పటికిప్పుడు ఆయన సినిమా చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో ఆయన కొత్త సినిమా ప్రారంభించినప్పటికీ షూటింగ్లో ఇప్పట్లో పాల్గొనే అవకాశం లేదనే టాక్ విన్పిస్తుంది.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తొలిసారి ‘అలవైకుంఠపురములో’ మూవీతో 200కోట్ల మార్కును అందుకున్నాడు. తాజాగా దర్శకుడు సుకుమార్ తో కలిసి ‘పుష్ప’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా బన్నీ కొత్త లుక్కులో దర్శనివ్వనున్నాడు. ఈ సినిమాలో ఇంకా హీరో పార్ట్ మొదలు కాలేదు. దీంతో ఇప్పట్లో బన్నీ సినిమా షూటింగులో పాల్గొనే అవకాశం లేదు. మరో యంగ్ హీరో నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ మరో పదిశాతం మాత్రమే పెండింగ్ ఉంది. ఇది మహా అయితే మరో రెండు వారాల్లో పూర్తికానుంది. దీంతో నాగచైతన్య కూడా రిలాక్స్ అవుతున్నాడు.
ఇక సినిమా షూటింగులకు పర్మిషన్ ఇవ్వండని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవిలు షూటింగులు ప్రారంభం కాగానే పాల్గొనే అవకాశం ఉంది. నాగార్జున ‘వైల్డ్ డాగ్’ మూవీ ఇప్పటికే 50శాతం పూర్తయింది. దీంతో ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోలోనే పూర్తి చేయాలనే పట్టుదలతో నాగ్ ఉన్నాడని టాక్ విన్పిస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ 30శాతమే పూర్తయింది. శరవేగంగా పూర్తి చేయాలనుకున్న ప్రతీసారి సినిమాకు ఏదో ఆటంకం వచ్చిపడుతూనే ఉంది. దీంతో ఈ మూవీ స్టాట్ కాగానే చిరంజీవి షూటింగులో పాల్గొనే అవకాశం ఉంది. చిరంజీవి సెట్లో ఉంటే పనులు చకచకా పూర్తవుతాయని దర్శకుడు భావిస్తున్నారట.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ‘వకీల్ సాబ్’ మూవీ కోసం జూన్లో దిల్ రాజు కాల్షీట్లు కేటాయించారు. దీంతో ఆయన కూడా త్వరలోనే షూటింగ్లో పాల్గొననున్నాడు. కోర్టు సీన్లు పెండింగ్లో ఉండటంతో ముందుగా వాటిని తెరకెక్కించేందుకు సన్నహాలు చేస్తున్నారట. ఇక విక్టరీ వెంకటేష్ నారప్పలో యాక్షన్ సీన్స్ పెండింగ్లులో ఉండటంతో కొంత గ్యాప్ తీసుకొనే అవకాశ ఉందని టాక్. అలాగే హీరో బాలయ్య దర్శకుడు బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మూవీని కూడా వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది. ఏదిఏమైనా టాలీవుడ్లో సినీ సందడి మొదలవడంతో కార్మికులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.