
భారత్ లో కరోనా కేసులు గత వారం రోజుకు 5వేల కేసులు దాకా నమోదు కాగా… ఇప్పుడు ఏకంగా నిన్న ఒక్క రోజే 6,977 కొత్త కేసులు వచ్చాయి. మరణాలు కూడా నిన్న 154 నమోదయ్యాయి. అంటే దేశంలో కొత్త కేసులు, మరణాలూ… రెండూ ఎక్కువగానే నమోదవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,38,845 కి చేరింది. వీటిలో 57,720 కేసుల్లో రికవరీ లేదా డిశ్చార్జి అయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 4,021కి చేరింది. అందువల్ల ప్రస్తుతం యాక్టివ్ కేసులుగా 77,103 ఉన్నాయి. ఈ లెక్కలన్నీ భారత్ లో కరోనా ఉద్ధృతిని చూపిస్తున్నాయి.
దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ర్టాల్లో మహారాష్ట్ర మొదటిస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 50,231 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్‌తో 1,635 మంది మరణించారు. 16,277 పాజిటివ్ కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉన్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 111 మంది మరణించారు. ప్రధాని సొంతరాష్ట్రమైన గుజరాత్ లో ఇప్పటివరకు 14,056 కరోనా కేసులు నమోదయ్యాయి. అక్కడ 858 మంది మృతిచెందారు. ఢిల్లీ 13,418 కేసులు, రాజస్థాన్ 7,028 పాజిటివ్ కేసులు, మధ్యప్రదేశ్ 6,665, ఉత్తరప్రదేశ్ 6268 పాజిటివ్ కేసులతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి. ఆ తర్వాత పై 4 రాష్ట్రాలతో పోల్చితే… తెలుగు రాష్ట్రాల్లో జోరు తగ్గింది. ఇకపైనా రెండు ప్రభుత్వాలూ… ఇలాగే జాగ్రత్త చర్యలు తీసుకుంటే… తెలుగు రాష్ట్రాలకు కరోనా సమస్య పెద్దగా ఉండకపోవచ్చు. కానీ… ఈ రెండు రాష్ట్రాలకూ సరిహద్దుల్లో తమిళనాడు, మహారాష్ట్ర ఉన్నాయి. కాబట్టే… తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా టెన్షన్ ఉంటోంది.