
టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ను అరెస్ట్ చేసేందుకు శ్రీకాకుళం పోలీసులు రంగం సిద్దం చేశారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు తహశీల్దారు రామకృష్ణను బెదిరించి, దూషించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేశారు.
సోమవారం తెల్లవారుజామునే అరెస్ట్ చేసేందుకు ఇంటిని పోలీసులు చుట్టుముట్టగా, అర్దరాత్రే ఇంటి నుండి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈనెల 16వ తేదీన గోరింట గ్రామంలో రామసాగరం చెరువులో అక్రమంగా మట్టితవ్వుతున్న కూన రవి తమ్ముడుకు చెందిన రెండు జెసీబీలు, నాలుగు టిప్పర్లను తహశీల్దారు రామకృష్ణ సీజ్ చేశారు.
దీంతో రవి కుమార్ తహశీల్దార్‌ను బెదిరించారు. రామకృష్ణకు ఫోన్ చేసి కూన రవి దుర్భాషలాడిన ఆడియో ఆలస్యంగా వెలుగుచూసింది. కూన రవిది రాక్షసత్వమని తహశీల్దారు రామకృష్ణ ఆరోపించారు. కూన రవి తనను చాలాసార్లు దుర్బషలాడారని పేర్కొన్నాయి.
కాగా, టీడీపీ నేత కూన రవికుమార్‌పై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశాయి.