
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడమంటే ఇదే.. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను లాగడమే పనిగా పెట్టుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలను లాగి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. కానీ వైసీపీ అధినేత, సీఎం జగన్ మాత్రం రాజకీయ విలువలకు కట్టుబడి ఇన్నాళ్లు టీడీపీ ఎమ్మెల్యేలను నేరుగా చేర్చుకోలేదు. కానీ ఇప్పుడు గంపగుత్తగా టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకొని అసెంబ్లీలో టీడీపీని వైసీపీలోకి విలీనం దిశగా అడుగులు వేస్తున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి..
*ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలు జంపేనా?
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవమైన ‘మహానాడు’కు ముందే చంద్రబాబుకు భారీ షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రాబోతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ పునాదులు కదలబోతున్నాయి. ఇన్నాళ్లు పక్కరాష్ట్రంలో ఉన్న చంద్రబాబుకు దిమ్మదిరిగే షాక్ ను టీడీపీ ఎమ్మెల్యేలు ఇవ్వబోతున్నారట. ఈ మేరకు ధ్రవపరుస్తున్నాయి వైసీపీ సన్నిహిత వర్గాలు. తాజాగా వారి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈరోజు సాయంత్రం సీఎం జగన్ సమక్షంలో ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరబోతున్నారట.. ఇదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లోనే టీడీపీలో పెను సంక్షోభం చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
*మంత్రి బాలినేని మంత్రాంగం?
టీడీపీ నుంచి వైసీపీలోకి ఏడుగురు ఎమ్మెల్యేలు చేరడానికి రంగం సిద్ధమైనట్లు రాజకీయా వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ మేరకు రంగం కూడా సిద్ధమైనట్టు సమాచారం. ఈ విషయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈరోజు ఒంగోలులోని మంత్రి బాలినేని నివాసంలో తెదేపా ఎమ్మెల్యేలు అనగాని సత్య ప్రసాద్, ఏలూరి సాంబశివరావులు భేటి కావడం ఈ రాజకీయ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. వీరితోపాటు మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారని ప్రస్తుతం చర్చలు సాగుతున్నట్టు వార్తలు లీక్ అవుతున్నాయి.
*గొట్టిపాటి కూడా అదే వైసీపీలోకేనా?
అద్దంకికి చెందిన మరో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ కూడా వైయస్ఆర్సిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఒక చర్చ కూడా ఉంది. ప్రకాశం జిల్లాలో తన ప్రధాన వ్యాపారమైన మైనింగ్ వ్యాపార కార్యకలాపాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాలని.. అందుకోసమే వైసీపీలో చేరబోతున్నాడని తెలుస్తోంది.
*కోరికలు తీరిస్తే కండువా పసుపు మార్చడమే..
ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడానికి రెడీ అయ్యారని.. వారంతా తమ కోరికలు, వైసీపీలో ప్రాధాన్యంపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని కాసేపట్లో తాడేపల్లి బయలుదేరి సాయంత్రం లోపు సీఎం జగన్ సమక్షంలో తెదేపా ఎమ్మెల్యేలు వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే ఏపీ రాజకీయాలే షేక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
*ఇప్పటికే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు దూరం
ఇప్పటికే, ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు – గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు (పశ్చిమ) ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణ మూర్తి – వైయస్ఆర్సికి విధేయతగా ఉన్నారు. టీడీపీని వదిలి వైసీపీకి మద్దతు తెలిపారు. వారు అధికారికంగా టిడిపికి రాజీనామా చేసి వైయస్ఆర్సిలో చేరలేదు, కానీ వారు తమ అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోకుండా ఉండటానికి జగన్ ప్రభుత్వానికి మాత్రమే తమ మద్దతును అందించారు.
*అసెంబ్లీలో వైసీపీలోకి టీడీపీ విలీనమేనా?
టీడీపీ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు కనుక చేరితే అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోయి టీడీపీ మొత్తం పార్టీ వైసీపీలో విలీనం అవుతుంది. ఇదే జరిగితే టీడీపీ కి అంతకంటే అవమానం మరోటి ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
–నరేశ్ ఎన్నం