Home Blog Page 8477

పవర్ – ఠాక్రే భేటీపై మహారాష్ట్రాలో రాజకీయ కలకలం


మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతున్నా నిత్యం ఏదో ఒక రాజకీయ సంక్షోభం ఎదురవుతూనే ఉంది. మొన్నటి వరకు ఆరు నెలలలోగా ఠాక్రే శాసన మండలికి ఎన్నిక కాగలరా అనే ఉత్కంఠత నెలకొనగా తాజాగా కరోనా కట్టడి చేయడంలో భాగస్వామ్య పక్షాల మధ్యనే విబేధాలు చెలరేగుతున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి.

ఉద్ధవ్ థాకరేను ముంబై మాతోశ్రీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కలుసుకొని గంటన్నర సేపు మంతనాలు జరపడంతో రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది. ఎందుకంటె ఆయన అంతకు ముందే నిన్న సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని పవార్ కలుసుకున్నారు.

పవర్ గవర్నర్ ను కలుసుకున్న ఆ వెంటనే బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే కూడా గవర్నర్‌ను కలుసుకున్నారు. కరోనాను కట్టడి చేయలేకపోతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ తరుణంలో పవార్-ఉద్ధవ్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

దేశం మొత్తంలో మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఆందోళనకరంగా ఉండడం, ముఖ్యంగా ముంబై నగరం మాస్కో నగరం తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా కేసులు వస్తున్న నగరంగా పేరు పొందడంతో ఆందోళన కలిగిస్తున్నది. దేశంలోని కేసులలో ఆరొవంతు, కరోనా మరణాలలో నాలుగోవంతు ముంబై నగరం నుండే వస్తున్నాయి.

శివ‌సేన నేతృత్వంలోని కూట‌మిలో చీల‌క‌లు వ‌చ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఆ ఇద్ద‌రూ భేటీ అయిన‌ట్లు తెలుస్తోంది. కానీ త‌మ మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని శివ‌సేన స్ప‌ష్టం చేసింది. నిజానికి థాకరే, శ‌ర‌ద్ ప‌వార్‌లు గంట‌న్న‌ర సేపు చ‌ర్చించుకున్నార‌ని, ప్ర‌భుత్వ స్థిర‌త్వంపై ఎవ‌ర‌న్న కామెంట్ చేశారంటే, అది వారి క‌డుపు నొప్పిగా భావించాల‌ని సంజ‌య్ రౌత్ విమ‌ర్శించారు. త‌మ ప్ర‌భుత్వం బ‌లంగా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. దీంట్లో ఎటువంటి ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని స్పష్టం చేశారు.

లాక్‌డౌన్ ఎత్తివేయకపోతే ఆర్ధికంగా కోలుకోవడం కష్టమని పవార్ చెప్పడం థాకరేకు నచ్చలేదని తెలుస్తోంది. కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో లాక్‌డౌన్ ఎత్తివేసేందుకు థాకరే విముఖంగా ఉన్నారు. ఈ అంశంలో ఇద్ద‌రి మ‌ధ్య భేదాభిప్రాయాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. కానీ త‌మ మ‌ధ్య ఎటువంటి స‌మ‌స్య‌లు లేవ‌ని రెండు పార్టీలు స్ప‌ష్టం చేశాయి. అధికారం కోసం కాచుకు కూర్చున్న బీజేపీయే ఈ ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్లు రెండు పార్టీలు పేర్కొన్నాయి.

క్లాప్‌ కొట్టొచ్చు కానీ.. కండిషన్స్ అప్లై!


కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. ఇది అది అని కాకుండా అన్ని రంగాలూ కుదులేయ్యాయి. ఈ రంగాల్లో ప్రధానమైనది సినీ పరిశ్రమ. ప్రపంచ వ్యాప్తంగా సినిమా, సీరియల్ షూటింగ్‌లకు బ్రేక్‌ పడడంతో లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇండియాలో సుదీర్ఘ లాక్‌డౌన్‌ కారణంగా బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి ముందుకు రావడంతో గుర్తింపు ఉన్న సినీ కార్మికులకు రెండు నెలలుగా నిత్యావసరాలు అందుతున్నాయి.

కానీ, టాలీవుడ్‌లో గుర్తింపు కార్డులు లేని కార్మికులు, దినసరి వేతనంతో పని చేసే వాళ్లు మరెంతో మంది ఉన్నారు. పని లేక రోడ్డున పడ్డ వాళ్లంతా షూటింగ్‌లు ఎప్పుడెప్పుడు మొదలవుతాయా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇటీవల చిరంజీవి నివాసంలో సినీ పెద్దలు సమావేశమై.. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావును కలిశారు. పరిశ్రమ పెద్దల విజ్ఞప్తి మేరకు.. కార్మికుల సంక్షేమం దృష్ట్యా షూటింగ్‌లకు సీఎం కేసీఆర్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. జూన్‌ మొదటి వారం నుంచి సినిమా, సీరియల్‌ షూటింగ్‌లతో పాటు ఇతర పనులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దాంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఆనందం నెలకొంది. ఎప్పుడెప్పుడు క్లాప్ కొడదామా? షూటింగ్‌లు మొదలు పెడదామా? అని ఆత్రుతగా ఉన్నారు. అయితే, ఆత్రుత ఉంటే సరిపోదు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. క్లాప్ కొట్టేందుకు ఓకే అంటున్నా.. కండిషన్స్ అప్లై అంటోంది. అంటే.. షూటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన మార్గనిర్దేశకాలు జారీ చేసింది. వాటిని పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ గైడ్‌ లైన్స్‌ ప్రకారం షూటింగ్‌ సెట్స్‌లో పరిమిత సంఖ్యలో మాత్రమే సిబ్బందిని అనుమతించాలి.

అలాగే, ప్రతి ఒక్కరూ మాస్క్, గ్లౌజ్‌ ధరించాలి. అంతేకాదు మేకప్ మెన్, హెయిర్ డ్రెస్సర్స్ తప్పనిసరిగా పీపీఈ కిట్లు వేసుకోవాలి. మేకప్ చేసిన తర్వాత చేతులను శానిటైజర్స్‌తో శుభ్రం చేసుకోవాలి. ఇప్పటికి ఔట్‌డోర్ షూటింగ్స్‌కు అనుమతి లేదు. ఇండోర్, స్టూడియాల్లో మాత్రమే చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉంటుంది. అలాగే, షూటింగ్కు హాజరయ్యే ప్రతి ఒక్కరి టెంపరేచర్ చెక్‌ చేశాకే అనుమతించాలి. వారి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది. సెట్స్‌లో జూనియర్ డాక్టర్, నర్స్‌ను కూడా అందుబాటులో ఉంచుకోవాలని మార్గనిర్దేశకాల్లో స్పష్టం చేశారు. అంతేకాదు 60 ఏళ్ల పైబడిన వ్యక్తులను షూటింగ్‌కు అనుమతించకూడదు. మరి, ఈ కండిషన్స్‌ను పాటిస్తూ షూటింగ్స్‌ ఎలా జరుగుతాయో చూడాలి.

లాక్ డౌన్ ముందు గొయ్యి తర్వాత నుయ్యి!

Lock down7.0

ఈ నెల 31కి లాక్ డౌన్ కాలపరిమితి ముగుస్తుండడంతో పొడిగింపుపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. లాక్ డౌన్ పొడిగింపు మంచిదా? కాదా? అన్నదానిపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌ డౌన్‌ ను పోడిగింపు మంచిదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ విషయంపై సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సిసిఎంబి) సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘కొత్త కేసులు రాకెట్ వేగంతో నమోదవుతున్నాయి. గంటగంటకూ పాజిటివ్ కేసులు, మరణాలూ పెరిగిపోతున్నాయి.. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే జూన్‌ చివరినాటికి ఇండియాలో కరోనా అత్యంత తీవ్ర స్థాయికి చేరుతుంది. ప్రస్తుతం లక్షా 38వేల కేసులు ఉండగా… జూన్ చివరి నాటికి కేసుల సంఖ్య 20 లక్షలకు చేరుతుందని సిసిఎంబి చెబుతోంది.

మరోవైపు ఇక లాక్ డౌన్ పొడిగిస్తే.. ఆర్థిక వినాశనానికి దారితీస్తుందని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా వ్యాఖ్యానించారు. దీంతో పాటు వైద్యపరంగా మరో సంక్షోభం కూడా తలెత్తుతుందని పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యంపై లాక్‌డౌన్‌ ప్రతికూల ప్రభావాలు, కోవిడ్‌ యేతర రోగులు నిర్లక్ష్యానికి గురయ్యే భారీ రిస్కులను గురించి తాను గతంలో ప్రస్తావించిన కథనాన్ని ఆయన గుర్తు చేశారు. కరోనా వైరస్‌ కేసులు పెరుగుతూనే ఉంటాయని, ఆస్పత్రులలో ఆక్సిజన్‌ అందుబాటులో ఉండే పడకల సంఖ్య వేగంగా, గణనీయంగా పెంచాల్సి ఉంటుందని మహీంద్రా తెలిపారు. ఆర్మీకి ఈ విషయంలో అపార అనుభవం ఉందని పేర్కొన్నారు.

ఈ విధంగా లాక్ డౌన్ ‘ముందు గొయ్యి వెనుక నుయ్యి’ అనే పరిస్థితిలో పాలకులు ఏ నిర్ణయం తీసుకుంటారో అని అందరిలో ఆసక్తి నెలకొన్నది.

14 వేల మంది సినీ కార్మికుల‌ కుటుంబాలకు తలసాని సాయం


రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున ప‌డ్డారు. ముఖ్యంగా టాలీవుడ్ లో వేలాది మంది సంఘ‌టిత అసంఘ‌టిత సినీ కార్మికులు తిండికి లేక ఇబ్బంది ప‌డుతున్నార‌న్న గ‌ణాంకాల్ని ఇటీవ‌ల సినీపెద్ద‌లు గుర్తించారు. మెగాస్టార్ చిరంజీవి క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) పేరుతో సినీకార్మికుల‌కు నిత్యావ‌స‌రాల సాయం చేసిన సంగ‌తి తెలిసిందే. సీసీసీ సాయంపై ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు స‌హా అన్ని వ‌ర్గాల‌నుంచి ప్ర‌శంస‌లు కురిసాయి.

ఇదే కోవ‌లో సినీ-టీవీ కార్మికుల సాయం కోసం తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ ముందు‌కొచ్చారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న‌ దాదాపు 14 వేల మంది సినీకార్మికుల‌ కుటుంబాలకు త‌ల‌సాని ట్రస్ట్ ద్వారా నిత్యావ‌స‌రాల సాయం అందించేందుకు ప్ర‌ణాళిక‌ను సిద్దం చేశారు. ఈ సేవా కార్య‌క్ర‌మం గురువారం నుంచి ప్రారంభం కానుంది. సినీ, టీవీ కార్మికుల క‌ష్టాల‌పై త‌ల‌సాని ఇటీవ‌ల సినీపెద్ద‌ల స‌మావేశంలోనూ ఆరా తీసి నిత్యావ‌స‌రాల్ని సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మ‌హ‌మ్మారీ ప్ర‌భావం ఇత‌ర రంగాల‌తో పోలిస్తే సినీ రంగంపైనే అధికంగా ప‌డింది. టాలీవుడ్ లో డెయిలీ వేజెస్ కార్మికుల‌కు జీత భ‌త్యాలు లేక అల్లాడుతున్నారు. అవ‌స‌రం మేర పెద్ద‌ల స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకుని త‌న‌కు తానుగానే ఈ సేవాకార్య‌క్ర‌మానికి త‌ల‌సాని ట్ర‌స్ట్ ద్వారా నిత్యావసర సరుకులను ఇవ్వడానికి శ్రీ‌కారం చుడుతున్నారు. గురువారం మొద‌లు నిత్యం 14 వేల మంది సినీ కార్మికుల కుటుంబాలకు అందే వరకు ఈ సేవా కార్య‌క్ర‌మం కొన‌సాగ‌నుంద‌ని సినిమాటోగ్రఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ వెల్ల‌డించారు.

వెబ్ సీరిస్ వైపు చూస్తున్న టాలీవుడ్ స్టార్స్


సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం డిజిటల్ హవా కొనసాగుతోంది. లాక్డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకులు ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలను వీక్షిస్తున్నారు. రెండునెలలు సినిమా థియేటర్లు మూతపడటంతో ఇంటి నుంచి సినిమాలను చూసేందుకు సగటు ప్రేక్షకుడు అలవాటు పడిపోయాడు. విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త సినిమాలన్నీ డైరెక్టుగా ఓటీటీల్లో రిలీజవుతుండటం వీటికి మరింత కలిసొస్తుంది. టీవీల్లోనూ పాత షోలే రిపిట్ చేస్తుండటం, కొత్తతరహాలో వెబ్ సీరిసులు వస్తుండటంతో ప్రతీఒక్కరు వీటిని ఆదరిస్తున్నారు. దీంతో టాలీవుడ్ స్టార్లు కూడా వెబ్ సీరిసులను నిర్మించడంతోపాటు నటించేందుకు సిద్ధమవుతున్నారు. వెబ్ సీరిసులను తక్కువ ఖర్చుతో నిర్మించి ఎక్కువ లాభాలను ఆర్జించే అవకాశం ఉండటంతో వీటిపై టాలీవుడ్లోని క్రేజీ స్టార్లు దృష్టిసారిస్తున్నారు.

ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు సినిమాల్లో, వెబ్ సీరిసుల్లో నటిస్తూ రెండుచేతుల సంపాదిస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అన్నిట్లోనూ వెబ్ సీరీసుల హవా కొనసాగుతోంది. వీటిల్లో ఆయా పరిశ్రమలకు చెందిన క్రేజీ స్టార్లు నటిస్తుండటంతో ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ కోవలోనే సీనీయర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితాధారంగా నిర్మిస్తున్న ‘క్వీన్’ వెబ్ సీరిసులో నటించింది. ఈ వెబ్ సీరిసులో తమిళనాడులో విశేష ప్రజాదరణ లభించింది. అదేవిధంగా నమిత, ప్రియమణి వెబ్ సీరిసుల్లో నటించేందుకు సిద్ధపడుతున్నారు. తెలుగులోనూ పలువురు స్టార్లు వెబ్ సీరిసుల్లో నటించేందుకు సిద్ధపడుతున్నారు. అక్కినేని కోడలు సమంత అమెజాన్ ది ఫ్యామిలీ మెన్-2 వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. సమంత బాటలోనే కాజల్ అగర్వాల్, మిల్కీ బ్యూటీ తమన్నా, షాలినీ పాండే తదితర స్టార్స్ పయనించేందుకు సిద్ధపడుతున్నారు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్-దర్శకుడు సుకుమార్ కాంబోలో ఓ వెబ్ సీరిసు తెరకెక్కనుందని సమాచారం. అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్ సిరీస్ కోసం వీరిద్దరి కలిసి పనిచేయనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ విన్పిస్తుంది. దీంతో మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత కూడా వెబ్ సీరీసులను నిర్మించేందుకు సిద్ధపడుతుండట. మెగా హీరోలతో వెబ్ సీరిసులను నిర్మించి ప్రత్యేకంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో విడుదల చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. యంగ్ హీరో విజయ్ దేవరకొండ బడా నిర్మాత అల్లు అరవింద్ చేపట్టిన ‘ఆహా’ ఓటీటీ కోసం రెండు వెబ్ సీరీసుల్లో నటించనున్నారట. విజయ్ దేవరకొండ ఇప్పటికే ‘ఆహా’కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. అదే విధంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్మాథ్ ఓ బోల్డ్ వెబ్ సీరిసు తెరకెక్కించేందుకు సిద్ధపడుతున్నారని టాక్ విన్పిస్తుంది. లాక్డౌన్ సమయంలో ఇందుకోసం స్క్రీప్ట్ కూడా రెడీ చేసుకున్నారట. ‘పైటర్’ మూవీ పూర్తికాగానే ఈ వెబ్ సీరిస్ పట్టాలెక్కనుందట. ఇలా టాలీవుడ్ స్టార్స్ ఒక్కొక్కరుగా వెబ్ సిరీసులవైపు అడుగులు వేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

రాశీ ఖన్నాలో ఈ టాలెంట్‌ కూడా !


అందం, అభినయంతో పాటు ప్రతిభ కూడా ఉన్న కొద్ది మంది హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు. ఉత్తారాది నుంచి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో పాగా వేసిన రాశీ తన తొలి చిత్రం ఊహలు గుసగుసలాడే తోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్‌లో ఇప్పుడు డిమాండ్‌ ఉన్న నటిగా ఎదిగింది. ఆరంభంలో కొస్త బొద్దుగా ఉన్నా.. తర్వాత స్లిమ్‌గా మారిన ఆమె వరుస సినిమాలతో దూసుకెళ్తోంది.

ఈ మధ్యే ప్రతిరోజూ పండగే, వెంకీమామ, వరల్డ్‌ ఫేమస్‌ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు తమిళ ఇంటస్ట్రీపై కూడా దృష్టి పెట్టిందామె. ఈ ఏడాదే ఏకంగా నాలుగు సినిమాలకు సంతకం చేసింది. ఈ ఢిల్లీ బ్యూటీ నటనే కాదు గాత్రం కూడా మధురంగా ఉంటుంది. ఇప్పటికే జోరు సినిమాలో టైటిల్ సాంగ్, బాలకృష్ణుడు చిత్రంలో తరైరా.. జవాన్‌లో బంగారూ.. ప్రతి రోజు పండగే మూవీలో యు ఆర్ మై హై పాటలు పాడి ఆకట్టుకుంది. పలు ఈవెంట్లలో స్టేజ్‌పై కూడా పాటలు పాడిన రాశీ ఖన్నా ఇప్పుడు మరో టాలెంట్‌ను బయట పెట్టింది.

సింగింగ్‌తో పాటు గిటార్ ప్లేయర్ చేయడంలో కూడా రాశిది అందెవేసిన చేయిలా ఉంది. లాక్‌డౌన్‌ టైమ్‌లో ఇంటికి పరిమితమైన ఈ ఢిల్లీ బ్యూటీ… గిటార్ ప్లే చేస్తూ పాట పాడి అలరించింది. తన ఫేవరెట్ ‘గెట్‌ యు ద మూన్‌’ అనే ఇంగ్లిష్ సాంగ్‌ను చాలా అందంగా పాడి ఆకట్టుకుంది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇప్పటిదాకా రాశి నటన, గాత్రానికి ఫిదా అయిన వాళ్లు ఆమె కొత్త టాలెంట్‌ను మెచ్చుకుంటున్నారు. రాశీలో ఈ టాలెంట్‌ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.

https://twitter.com/RaashiKhanna/status/1264533356240236545

అస్సలు తగ్గేదే లేదంటోన్న అనుష్క


బాలీవుడ్ నటిగానే కాకుండా భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్యగా దేశ, విదేశాల్లో క్రేజ్ సంపాదించుకుంది అనుష్క శర్మ. పెళ్లికాకముందు కోహ్లీతో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ బాలీవుడ్ బ్యూటీ పలు క్రికెట్‌ మ్యాచ్‌లకు హాజరైంది. మైదానంలో కోహ్లీ ఫోర్లు, సిక్సర్లు, సెంచరీలు కొడుతుంటే.. స్టాండ్స్‌ నుంచి గాల్లోకి ముద్దులు విసురుతూ కనిపించేది. ఒకరకంగా హీరోయిన్‌గా కంటే కోహ్లీ లవర్, వైఫ్ గానే ఆమె ఎక్కువ ఫేమస్ అయ్యిందని చెప్పొచ్చు.

అలాగని అనుష్క టాలెంట్‌ను తక్కువ చేయడానికి లేదు. ‘పీకే’ వంటి బ్లాక్‌బస్టర్చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఒకవైపు నటిస్తూనే నిర్మాతగా మారిందామె. కంటెంట్‌ ఉన్న సినిమాలను ప్రొడ్యూస్‌ చేస్తోంది. ఎన్ హెచ్ 10, ఫిల్లౌరి, పారి సినిమాలు ఆ కోవకు చెందినవే. నిర్మాణ రంగంలో మరో అడుగు ముందుకేసిన ఆమె తాజాగా వెబ్‌ సిరీస్‌ల్లో కూడా అడుగుపెట్టింది. ఇప్పుడు అమెజాన్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘పాతాల్‌ లోక్‌’ అనే హిందీ వెబ్‌ సిరీస్‌కు అనుష్క శర్మనే నిర్మాత. అయితే, ఈ సిరీస్‌ వివాదాల్లో చిక్కుకుంది. రెండో ఎపిసోడ్‌లో గూర్ఘా వర్గాన్ని కించపరిచే సంభాషణలు ఉన్నాయంటూ ఆల్ అరుణాచల్‌ ప్రదేశ్‌ గూర్ఘా యూత్..‌ ఈ సిరీస్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఓ న్యాయవాది అనుష్కకు నోటీసులు కూడా పంపించారు.

ఈ వెబ్‌ సిరీస్‌పై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్కు సిక్కిం లోక్‌ సభ ఎంపీ ఇంద్ర హంగ్‌ సుబ్బ లేఖ రాయడంతో వివాదం మరింత ముదిరింది. కానీ, ఇంత జరుగుతున్నా అనుష్క శర్మ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. విమర్శలను పట్టించుకోవడం లేదు. పైగా అమెజాన్‌ అంగీకరిస్తే ఈ వెబ్‌ సిరీస్‌లో రెండో సీజన్‌ను తెరకెక్కించేందుకు రెడీ అని చెప్పడం ఆమె ధైర్యానికి నిదర్శనం. తాము నిజాయితీగా కథలు చెప్పాలకుంటున్నామని, భవిష్యత్తులో కూడా ఇదే పద్ధతి కొనసాగుతుందని కోహ్లీ భార్య స్పష్టం చేసింది. రెండో సీజన్‌ వచ్చే అవకాశం ఉందని చెప్పింది. అయితే, దాని గురించి ఇప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుందని తెలిపింది. ఏదేమైనా క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ ఎలాంటి మొండిఘటమో.. సినిమాల విషయంలో అనుష్క శర్మ కూడా అదే కోవకు చెందిన వ్యక్తి అన్నమాట. అందుకే ఈ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయ్యారు అనొచ్చు.

‘ఆచార్య’ రీ స్టాట్ ఎప్పుడంటే?


దేశంలో లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు వాయిదాపడగా, థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే.. అయితే ఇటీవల టాలీవుడ్ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో బేటీ అయి షూటింగులు ప్రారంభించేందుకు తగిన చర్యలు చేపట్టారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఖ్యమంత్రి కేసీఆర్ లతో వరుసగా బేటీలు నిర్వహించారు. సినీ పెద్దల సమస్యలను విన్న కేసీఆర్ సినిమా పోస్టు ప్రొడక్షన్, షూటింగులకు గ్రీన్ ఇచ్చారు. అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో షూటింగులకు అనుమతి ఇచ్చారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ తరఫున తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎట్టకేలకు షూటింగులకు అనుమతి రావడంతో టాలీవుడ్లో సందడి మొదలైంది.

అయితే సినిమా షూటింగులను ప్రారంభించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది దానిపై టాలీవుడ్ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ తిరిగి సినిమాలను ప్రారంభించేందుకు దర్శక, నిర్మాతలు సన్నద్దమవుతోన్నారు. ఈనేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’ మూవీని రీ స్టాట్ చేసేందుకు దర్శకుడు కొరటాల శివ సన్నహాలు చేస్తున్నారు. సినిమా షూటింగులను ఏవిధంగా ప్రారంభించాలనేది మెగాస్టార్ తన మూవీ ద్వారా ఇతర దర్శక, నిర్మాతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు జూన్ 15నుంచి ‘ఆచార్య’ మూవీ పట్టాలెక్కబోతుందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ విన్పిస్తుంది. దాదాపు రెండునెలలుగా షూటింగులు బంద్ అవడంతో సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ మూవీని ప్రారంభిస్తే టాలీవుడ్లో ఓ కొత్త జోష్ వస్తుందని కార్మికులు, అభిమానులు భావిస్తున్నారు. ఈ మూవీలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఓ కీలక పాత్రల్లో నటించనున్నాడు. మెగాస్టార్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఈ మూవీని 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తోంది.

ఆర్ఎస్ఎస్ సూచనతోనే టిటిడి ఆస్తులపై జగన్ వెనుకడుగు!


ఎందరు వ్యతిరేకించినా, చివరకు కోర్ట్ లు మొట్టికాయలు వేసినా ఒక సారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి వెనుకడుగు వేయడం తెలియదు. ఈ విషయంలో సొంత పార్టీ వారి అభిప్రాయాలను కూడా ఖాతరు చేయరు.

అయితే టిటిడి భూముల వేలంపాట విషయంలో ఆయన వెనుకడుగు వేయడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. పైగా ఈ నిర్ణయానికి వ్యతిరేకత ఎదురైనా అంత బలంగా లేదు. సోషల్ మీడియా లోనే ఎక్కువగా కనిపించింది. లాక్ డౌన్ కారణంగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపే పరిస్థితులలో లేవు.

పైగా ఆస్తుల అమ్మకపు నిర్ణయాన్ని సమర్ధవంతంగా సమర్ధించుకోవడంలో జగన్ కు సన్నిహిత బంధువైన టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ విజయం సాధించారు. గత టిడిపి పాలనలోనే ఆస్తుల అమ్మకపు నిర్ణయం తీసుకున్నారని బలమైన వాదన చేయగలిగారు.

అయితే ఆయన స్వరంలో అకస్మాత్తుగా సోమవారం మార్పు వచ్చింది. ఆబ్బె వేలంవేసే నిర్ణయం తీసుకోలేదని, కేవలం ప్రతిపాదన దశలో మాత్రమే ఉన్నదని చెప్పుకొంటూ వచ్చారు. టిటిడి ఆస్తుల వేలం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోమని రాజ్యసభ నామినేట్ సభ్యుడైన ప్రముఖ ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతకర్త రాకేష్ సిన్హా కోరగానే ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం గమనార్హం.

టిటిడి ట్రస్ట్ బోర్డు లో ఆయన ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నారు. అంటే ఆర్ ఎస్ ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు స్పష్టం అవుతున్నది. బిజెపి నాయకత్వంతో కన్నా ఆర్ ఎస్ ఎస్ నాయకత్వంతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం పట్ల జగన్ చాల ఆసక్తిగా ఉన్నట్లు ఈ అంశం వెల్లడి చేస్తుంది.

2019 ఎన్నికలలో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు మూకుమ్మడిగా మద్దతు ఇవ్వడంతోనే జగన్ అనూహ్యంగా 151 సీట్లు గెల్చుకున్నారని గమనార్హం. జగన్ క్రైస్తవ సంబంధాల పట్ల ఆర్ ఎస్ ఎస్ లో ఆయనంటే కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పట్ల గల ద్వేష భావన కారణంగా జగన్ ను పూర్తిగా వ్యతిరేకించలేక పోతున్నారు.

అందుకనే జగన్ ఆర్ ఎస్ ఎస్ కు తగు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు సుబ్బారెడ్డి వారధిగా ఉంటున్నారు. ఆయన కనీసం మూడు సార్లు విజయవాడ లోని ఆర్ ఎస్ ఎస్ కార్యాలయంపై వెళ్లి, ఆ సంస్థ ప్రముఖ నాయకులతో మంతనాలు జరిపారు.

టిటిడి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు సమయంలో బిజెపి నుండి నలుగురికి ప్రాతినిధ్యం ఇవ్వాలని జగన్ భావించారు. అందుకు పేర్లు సూచించమని రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కోరారు. కన్నా వెంటనే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను సంప్రదించగా ఆయన స్పష్టంగా తిరస్కరించారు. జగన్ ప్రభుత్వంలో తమకు ఎటువంటి నామినేట్ పదవులు ఆశించడం లేదని స్పష్టం చేశారు.

బిజెపి నిరాకరించినా ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంత వేత్త రాకేష్ సిన్హాకు టిటిడి బోర్డు లో జగన్ సభ్యత్వం కల్పించడం గమనిస్తే ఆర్ ఎస్ ఎస్ నాయకత్వం వద్ద ఆయనకు గల పలుకుబడిని వెల్లడి చేస్తుంది.

నల్లగా ఉన్నావన్నారు, లైంగికంగా వేధించారు..


ఐశ్వర్యా రాజేశ్. మన తెలుగమ్మాయే. ఒకప్పటి తెలుగు నటుడు రాజేశ్ కుమార్తె ఆమె. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి తెరంగేట్రం చేసిన ఐశ్వర్య తర్వాత తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ‘కౌసల్య కృష్ణమూర్తి’లో క్రికెటర్గా నటించి ఆకట్టుకున్న ఆమె.. విజయ్‌ దేవరకొండ తాజా చిత్రం ‘వరల్డ్‌ ఫేవస్‌ లవర్’లో సువర్ణ పాత్రలో ఒదిగిపోయింది.ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా.. సీనయ్య (విజయ్‌), సువర్ణ పాత్రలు మాత్రం ప్రేక్షకులను ఫిదా చేశాయి.

తెలుగుతో పాటు తమిళంలో కూడా బిజీగా మారిన ఐశ్వర్య.. చిత్ర పరిశ్రమలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని, కెరీర్ తొలినాళ్లలో లైగింక వేధింపులకు గురయ్యానని తెలిపింది. తాను కొంచెం నల్లగా ఉండడంతో పరిశ్రమకు చెందిన వాళ్లు హేళన చేశారని చెప్పింది. ‘నువ్వు హీరోయిన్‌ మెటీరియల్ కాదు. కమెడియన్ పక్కన తప్ప హీరో పక్కన సెట్‌ అవ్వవు’ అని ఒక దర్శకుడు కించపరిచేలా మాట్లాడాడని తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి ఐశ్వర్య గుర్తు చేసుకుంది. అయితే, ఇలాంటి ఇబ్బందులు ఎన్ని ఎదురైనా తాను ఆగిపోలేదని తెలుగమ్మాయి చెప్పింది. వాటన్నింటినీ దాటి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపింది.

ఐశ్వర్య సినీ ప్రయాణంలోనే కాదు జీవిత ప్రయాణంలోనూ ఎన్నో అవరోధాలున్నాయి. ఆమె లైఫ్‌లో సినిమా కష్టాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఎనిమిదో ఏటనే ఐశ్వర్య తన తండ్రి రాజేశ్‌ను పోగొట్టుకుంది. తండ్రిలోటు లేకుండా తల్లి పెంచింది. కానీ, ఆ తర్వాత రెండేళ్ల వ్యవధిలో ఐశ్వర్య ఇద్దరు అన్నలు మరణించడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో నిలిచింది. ఆ సమయంలో తమ ఫ్యామిలీకి ఎవ్వరూ అండగా లేకపోవడంతో చాలా భయపడ్డానని ఐశ్వర్య తెలిపింది. కుటుంబ పోషణ కోసం సీరియల్స్‌లో నటించానని, కానీ, పారితోషికం చాలా తక్కువగా ఇచ్చేవారని చెప్పింది. తల్లి సలహాతో సినిమా అవకాశాల కోసం వెతికితే వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపింది. తొలుత చిన్న పాత్రల్లో నటించిన ఐశ్వర్య కెరీర్ ని ‘కాకా ముట్టై’ చిత్రం మలుపు తిప్పంది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో పాటు ఎంతో కష్టపడి మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వర్య జీవిత ప్రయాణం స్ఫూర్తిదాయకం.

లాజిక్ లేని లాక్ డౌన్.. జూన్ లో ఊహించని ఫిగర్!

భారత్ లో లాక్ డౌన్ పొడిగింపు, సడలింపులు వ్యవహారం చిత్ర, విచిత్రంగా ఉంది. ఒకప్పుడు కరోనా తక్కువగా ఉన్న సమయంలో… లాక్‌ డౌన్ నిబంధనలు ఎంతో పక్కాగా అమలయ్యాయి. తీరా కరోనా కేసులు బాగా పెరిగాక… నిబంధనలు సడలించారు. ఫలితంగా రోజూ కొత్త కేసులు రాకెట్ వేగంతో నమోదవుతున్నాయి. గంటగంటకూ పాజిటివ్ కేసులు, మరణాలూ పెరిగిపోతున్నాయి. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సిసిఎంబి) అంచనా ప్రకారం జూన్‌ చివరినాటికి ఇండియాలో కరోనా అత్యంత తీవ్ర స్థాయికి చేరుతుంది. ప్రస్తుతం లక్షా 38వేల కేసులు ఉండగా… జూన్ చివరి నాటికి కేసుల సంఖ్య 20 లక్షలకు చేరుతుందని చెబుతోంది.

నిబంధనలు సడలించడమే కేసులు పెరుగుతుండటానికి కారణం అని సిసిఎంబి భావిస్తోంది. ప్రధానంగా శ్రామిక్ రైళ్లను వెయ్యడం, వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లడం, రవాణా సడలింపులు వంటివి కరోనా విజృంభించేందుకు కారణం అవుతున్నట్లు చెబుతోంది. ఇన్నాళ్లూ పల్లెల్లో పెద్దగా లేని కరోనా వైరస్… ఇప్పుడు అక్కడ కూడా బాగా విస్తరిస్తోందని సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్ శర్మ తెలిపారు. దేశంలో నిజానికి కరోనా చాలా ఎక్కువగానే ఉందనీ… టెస్టులు ఎక్కువగా చెయ్యకపోవడం వల్ల అది బయటకు తెలియట్లేదని అంటున్నారు రాకేశ్ శర్మ. ప్రస్తుతం 10 లక్షల మందిలో 1744 మందికి మాత్రమే టెస్టులు చేస్తున్నారనీ… ఇంత తక్కువగా టెస్టులు మరే దేశంలోనూ జరగటలేదని… వైరాలజీ ఎక్స్‌పర్ట్ జమీల్ తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో కరోనా వైరస్ మూడో స్టేజీలో ఉందని ఆయన అంటున్నారు.

వారం నుంచి ఇండియాలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. శుక్ర, శని, ఆదివారం… ఈ మూడ్రోజులూ రోజూ 6వేలకు పైగా కేసులొచ్చాయి. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం అంటున్నారు నిపుణులు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలూ… ఈ విషయాన్ని సీరియస్‌ గా తీసుకోవాలని కోరుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల్లో కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోదనీ… కనీసం 3 నుంచి 4 ఏళ్లపాటూ వైరస్ బతికి ఉండే ఛాన్స్ ఉంటుందని సిసిఎంబి నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో 2022 వరకూ కరోనా ప్రభావం కనిపిస్తూనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్రాలు ఈ దిశగా సుదీర్ఘ ప్రణాళికతో ముందుకెళ్లాలంటున్నారు.

పెళ్లి కాలేదు కానీ.. తల్లి అయిన సీనియర్ హీరోయిన్..!


చిత్రసీమలో హీరోయిన్ శోభన గురించి తెలియని వారుండరేమో.. శోభన హీరోయిన్ గానే కాకుండా నట్య కళాకారిణిగా దేశవిదేశాల్లో ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. ఇక తెలుగు ప్రేక్షకులకు శోభన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కల్లేదు. 1980, 90లో శోభన తెలుగులో అగ్ర కథానాయికగా కొనసాగారు. నాడు టాలీవుడ్లోని అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడారు. మెగాస్టార్ చిరంజీవి, నటసింహా బాలయ్య, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్, నటకిరిటీ రాజేంద్రప్రసాద లతో నటించారు. ఆమె ఖాతాలో ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయి. అందం, అభినయం, అమాయకత్వం, పక్కంటి అమ్మాయిల్లో కన్పించే చలాకీతనంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ భామ సీనియర్ అయ్యాక అడుపదడుప సినిమాల్లో కన్పిస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే మరోవైపు ఈ భామ వ్యక్తిగత జీవితంతో అంత సక్సస్ కాలేదని అన్పిస్తోంది. హీరోయిన్, నట్యకళాకారిణిగా ఎంతో స్టార్డమ్ సంపాదించినప్పటికీ ప్రేమ, పెళ్లి విషయంలో శోభన సక్సస్ కాలేదనే టాక్ విన్పిస్తుంటోంది. ఆమె స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే ఓ హిరోతో ప్రేమలో పడిందని.. పెళ్లి కూడా చేసుకోబోతుందని ప్రచారం జరిగింది. సదరు హీరో పెళ్లి విషయంలో ముఖంచాటేసి వేరే ఆమెను పెళ్లి చేసుకోవడంతో శోభన హార్ట్ అయ్యి .. నాటి నుంచి ప్రేమ.. పెళ్లి దూరంగా ఉందనే ప్రచారం ఫిల్మ్ వర్గాల్లో విన్పిస్తుంటుంది. ప్రస్తుతం ఒంటిగానే ఉంటున్న శోభన ఓ పాపను దత్తత తీసుకుంది. చైన్నెలోని తన నివాసంలో ఆ పాపతో కలిసి ఉంటుంది. ఐదుపదుల వయస్సు దగ్గరపడుతుంటంతో ఇక పెళ్లి వద్దు.. పాపే ముద్దు.. అంటోంది. ప్రస్తుతం శోభన నేటి యువతరానికి నాట్యంలో శిక్షణ ఇస్తోంది. తాజాగా దుల్కర్ సల్మాన్ నటించిన ‘వారనే ఆశ్యముందే’ మూవీలో శోభన కన్పించి అభిమానులను అలరించింది. తెలుగులో మంచి ఆఫర్ వస్తే నటించేందుకు సిద్ధమేనని అంటోంది. అయితే శోభన ఓ పాపను దత్తత తీసుకోవడంపై ఆమెను పలువురు అభినందిస్తున్నారు.

శ్రీశైలంలో నిధుల స్వాహాలో అధికార పార్టీ నేత హస్తం!


ఒక వంక తిరుమల శ్రీవారి ఆస్తుల వేలంపై వివాదం చెలరేగుతున్న సమయంలో మరో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఉద్యోగులే అక్రమాలకు పాల్పడి నిధుల స్వాహా ఉదంతం తెరపైకి రావడంతో జగన్ పాలనలో హిందూ దేవాలయాల పాలన తీరుతెన్నుల పట్ల అనుమానాలు చెలరేగుతున్నాయి.

సుమారు నాలుగేళ్లుగా అక్రమాలు జరుగుతూ ఉండగా, రెండు నెలలుగా ఇఓ రామారావు జరిపిన విచారణలో ఒకొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. సుమారు రూ 3 కోట్ల మేరకు నిధులను కైవసం చేసిన్నట్లు ప్రాధమిక అంచనాకు వచ్చారు. ఉద్యోగులే ఆలయంలో సాఫ్ట్‌వేర్ మార్చి ఈ దురగాతానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు.

శ్రీఘ్ర దర్శనాలు, అభిషేకం టికెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టికెట్ల ద్వారా స్వామివారికి వచ్చే ఆదాయంలో ఆలయ సిబ్బంది చేతివాటం చూపించారు. రూ. 150 శ్రీఘ్ర దర్శనంలో కోటి రూపాయలు, రూ 1,500 అభిషేకం టికెట్లలో రూ. 50 లక్షలను, అకామిడేషన్ (వసతి గృహం)లో మరో రూ 50 లక్షలను కాజేశారని వెల్లడైనది.

అదే విధంగా, ఆలయ పరిధిలోని టోల్ గేట్, పెట్రోల్ బంకుల నిర్వహణలో మరో రూ.40 లక్షలు, రూ 500 టిక్కెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టికెట్లలో మరో రూ 50 లక్షలు దుర్వినియోగం జరిగిందని చెబుతున్నారు.

అయితే ఈ కుంభకోణంలో కీలకమైన ఉద్యోగులను తప్పించి టికెట్ కౌంటర్లలోని కాంట్రాక్టు ఉద్యోగులపైకి నెట్టివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తున్నది. రాజకీయ జోక్యంతోనే ఈ విధంగా ముఖ్యులను తప్పిస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి.

స్థానిక వైసిపి ప్రముఖుడికి సన్నిహితంగా ఉండే ఇద్దరు కీలక ఉద్యోగులను ఈ కేసు నుండి తప్పించడం ఈ సందర్భంగా పలు అనుమానాలకు దారితీస్తుంది. ఆ ఇద్దరిలో ఒకరు స్థానిక వైసిపి ప్రముఖుడికి సమీప బంధువని చెబుతున్నారు.

శాఖాపరమైన విచారణ జరపడం ద్వారా అసలు నిందితులను పట్టుకొనే అవకాశం ఉండబోదని, సిఐడి విచారణ జరపవలసిందే అని ఉద్యోగ సంఘాలలో పలువురు కోరుతున్నారు.

భారత్ – చైనా సరిహద్దులో ఉద్రిక్తత..


ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా సరిహద్దుల్లో భారత్, చైనా సేనలు పెద్ద ఎత్తున మోహరింపు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడేళ్ళ క్రితం 2017లో డోక్లామ్ వద్ద జరిగిన సేనల మోహరింపు తర్వాత పెద్ద ఎత్తున మోహరించడం ఇదే ప్రధమం అని చెబుతున్నారు.

దీనితో లడఖ్ ప్రాంతంలో నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. పాంగాంగ్ సో, గ‌ల్వాన్ వ్యాలీ వ‌ద్ద ద‌ళాల‌ను రెట్టింపు చేసిన‌ట్లు భార‌త ఆర్మీ పేర్కొన్న‌ది. ఇవే ప్రాంతాల్లో చైనా ఆర్మీ సుమారు 2500 ద‌ళాలను మోహ‌రిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ల‌డాఖ్ ప్రాంతంలో భార‌త సైన్యాన్ని ప‌టిష్టం చేసిన‌ట్లు ఓ అధికారి తెలిపారు. గల్వాన్ వ్యాలీలో ఉన్న డ‌ర్బూక్‌-ష‌యాక్‌-డౌల‌త్ బెగ్ ఓల్డీ రోడ్డులో ఉన్న భారత్ పోస్టు కేఎం120 వ‌ద్ద చైనా త‌మ ద‌ళాలను కేంద్రీక‌రిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో భార‌త్ కూడా త‌మ బ‌ల‌గాల‌ను మోహ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

గ‌ల్వాన్ ప్రాంతంలోకి చైనా ద‌ళాలు రావ‌డం ఆక్షేప‌ణీయ‌మ‌ని మాజీ నార్త‌ర్న్ ఆర్మీ కమాండ‌ర్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ డీఎస్ హూడా తెలిపారు. డోక్లామ్ ఉద్రిక్తల తర్వాత 2018లో ఉభయ దేశాల అధినేతలు చైనాలోని ఉహాన్ వద్ద సమావేశంపై తమ తమ సేనలను సంయమనం పాటించమని చెప్పాలని నిర్ణయించారు. ఆ తర్వాత పరిస్థితులు కొంతమెరుగుపడ్డాయి.

అయితే లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా గత ఏడాది భారత్ చేసినప్పటి నుండి అది తమ భూభాగం అంటూ చైనా నిరసన ధ్వనులు వినిపిస్తూ వస్తున్నది. ప్రస్తుతం మొత్తం ప్రపంచం కరోనా మహమ్మారితో తలమునకలై ఉన్న సమయంలో చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తలకు దారితీయడం గమనార్హం.

గల్వాన్ వ్యాలీలో చైనా బ‌ల‌గాలు సుమారు వంద టెంట్ల‌ను వేసిన‌ట్లు చెబుతున్నారు. దీంతో స‌మ‌స్యాత్మ‌కంగా మారిన డెమ్‌చోక్‌, దౌల‌త్ బెగ్ ఓల్డీ ప్రాంతాల్లో భార‌త ద‌ళాలు పెట్రోలింగ్‌ను పెంచాయి.

వలస కూలీల బస్సు బోల్తా..!


ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా వలస కూలీలకు ప్రమాదాలు తప్పడం లేదు. తాజాగా కర్ణాటక రాష్ట్రం నుంచి పశ్చిమ బెంగాల్ వెళుతున్న వలస కూలీల బస్సు ప్రమాదానికి గురి అయ్యింది. ఈ ఘటనలో 32 మంది గాయాలయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి సంభందించిన వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వలస కూలీలు పని చేస్తున్నారు. వీరంతా స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులలో వీరిని పశ్చిమ బెంగాల్ కు పంపింది. వీరు ప్రయాణిస్తున్న బస్సుకు మార్గమధ్యంలో శ్రీకాకుళం జిల్లా, మందస మండలం, బాలిగాం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది.

వలస కూలీల బస్సు ఈ రోజు ఉదయం బాలిగాం దగ్గర అదుపు తప్పి బోల్తా కొట్టింది. దాంతో బస్సులోని 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు క్షత గాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం 42 మంది ఉన్న ఈ బస్సు బోల్తా వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

లాక్‌డౌన్‌ పై సందిగ్ధతలో కేసీఆర్


ఈ నెలాఖరుతో ముగియనున్న లాక్‌డౌన్‌ పొడిగుంపుపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సందిగ్థతలో ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కనబడుతున్నా టెస్టులు ఎక్కువగా జరపగా పోవడమే కారణమని స్వయంగా కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రీతి సుడాన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ వ్రాయడం గమనార్హం.

మరోవంక ప్రైవేట్ ల్యాబ్ లలో పరీక్షలు జరుపవద్దని ప్రభుత్వం నిషేధించినా వారంతా బహిరంగంగానే జరుపుతున్నారని, ప్రభుత్వం సహితం చూసీచూడన్నట్లు వ్యవహరిస్తున్నదని తెలుస్తున్నది. ప్రైవేట్ ఆసుపత్రులలో సహితం కరోనా చికిత్సలు చేస్తున్నారు. ఆ విధంగా వేలకొలది పరీక్షలు ప్రైవేట్ గా జరుగుతూ ఉండడంతో అవన్నీ ప్రభుత్వ లెక్కలలోకి రావడం లేదు.

ప్రభుత్వం సహితం కరోనా అనుమానాలపై మృతి చెందిన వారికి పరీక్షలు జరపడం లేదు వారిని కరోనా మృతులలో చేర్చడం లేదు. అందుచేత వైరస్ కట్టడిలో ఉన్నట్లు పైకి చెబుతున్నా రాష్ట్రంలో తీవ్రంగానే ఉన్నట్లు భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేయడం ప్రమాదకరమని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

కరోనా, వానకాల వ్యవసాయం, రాష్ట్ర అవతరణ వేడుకలపై చర్చించేందుకు బుధవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలుపై ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో సరి, బేసి విధానంలో దుకాణాలను తెరుస్తున్నారు. మరికొంత కాలం ఇదే పద్ధతిని కొనసాగించాలా? మార్పులు చేయాలా? అనే విషయంపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే చాలావరకు సడలింపులు ఇచ్చారు. అవసరమైతే మరికొన్ని సడలింపులు ఇచ్చి లాక్‌డౌన్‌ ను మరికొంతకాలం పొడిగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

సినిమా షూటింగ్ లకు సడలింపులు ఇవ్వనున్నట్లు ఇప్పటికే కేసీఆర్ సంకేతం ఇచ్చారు. అయితే హోటళ్లు, రెస్టారెంట్లును తెరిచే విషయం పరిశీలింపవలసి ఉంది. ఇప్పటికే రోడ్లపై ఎక్కువగా తిరుగుతున్నందున అవి లేకపోవడంతో చాల ఇబ్బంది పడుతున్నారు.

తొలిరోజే చంద్రబాబుకు ఎదురుదెబ్బ..!


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు నెలలు సుదీర్ఘ విరామం తరువాత అమరావతి చేరుకున్నారు. వచ్చిన రోజే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ విమర్శల పాలయ్యారు. ఇదే విషయంలో బాబు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఇబ్బడి ముబ్బడిగా విమర్శలు గుప్పించి, పోలీసు కేసులు, హైకోర్టులో పిటీషన్ లు వేయించడంతో కసితో ఉన్నారు. టీడీపీ నేతలు ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూస్తున్న వైసీపీ నేతలకు నేరుగా టీడీపీ అధినేత చిక్కారు.

బాబు రాక సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు లాక్ డౌన్ నిబంధనలు గాలికొదిలేశారు. చంద్రబాబు కాన్వాయ్ తెలంగాణా బోర్డర్ ఏపీలో ప్రవేశించిన క్రమంలో స్వాగతం పలికేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు సామాజిక దూరం, మాస్క్ లు ధరించ చేయలేదు. గారికపాడు చెక్ పోస్టు, కంచికచర్ల, నందిగామ, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ ప్రాంతాల్లో టీడీపి నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో వచ్చి బాబు, లోకేష్ లకు స్వాగతం పలికారు. ఎక్కడా సామాజిక దూరం కనిపించలేదు.

దీంతో ఎమ్మెల్సీ వి.గోపాలరెడ్డి హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు అమరావతిలోని తన నివాసానికి చేరుకునే సమయంలో లాక్ డౌన్ నిబంధనలు పాటించలేదని, వందల సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు గుంపులుగా ఉంటూ, సామాజిక దూరం పాటించకుండా, మాస్క్ లు ధరించకుండా ఉన్నారని, కరోనా వ్యాప్తికి అనుకూలంగా వ్యవహరించారని పిర్యాదులో పేర్కొన్నారు.