Home Blog Page 8472

వేలంపై వెనక్కి తగ్గిన టీటీడీ..!


శ్రీవారి భూముల వేలం వివాదాస్పదం అవడంతో ఈ వ్యవహారంపై టిటిడి వెనక్కి తగ్గింది. ప్రతిపక్షాలు, హిందూ సంస్థలు, స్వపక్షం నుంచి వచ్చిన వత్తిడికి ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. గత పాలకవర్గ నిర్ణయాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా, టీటీడీ బోర్డు సమావేశంలోనూ ప్రధానంగా భూములు, ఆస్తులు, భక్తులు సమర్పించిన కానుకలు ఎట్టిపరిస్థితుల్లోనూ విక్రయించకూడదని నిర్ణయం తీసుకుంది. పాలకవర్గ సమావేశం వివరాలను టీటీడీ చైర్మన్ వివరిస్తూ నిరుపయోగ ఆస్తులు అన్యాక్రాంతం అవకుండా ఉండేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు, ఈ కమిటీలో పాలక మండలి సభ్యులు, పీఠాధిపతులు, భక్తులకు చోటు కల్పిస్తామని చెప్పారు.

టీటీడీఆస్తులు విక్రయిస్తున్నారనే దుష్ప్రచారంపై సమగ్ర విచారణ జరిపించాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో టిటిడి పాలకమండలిపై ఇలాంటి ఆరోపణలు రాకుండా ఉండాలంటే సమగ్ర విచారణ జరిపించాల్సిందేనని బోర్డు తీర్మానించిందని చెప్పారు. అలాగే టీటీడీ పరిధిలోని అతిథి గృహాలను నిబంధనలకు విరుద్ధంగా ఎవరికీ కేటాయించలేదని స్పష్టం చేశారు. అతిథి గృహాల కేటాయింపులో పారదర్శకత ఉండాలని బోర్డు తీర్మానించినట్లు వివరించారు. ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందించాలని టీటీడీ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. డొనేషన్‌ స్కీమ్‌లోనూ అర్హులకే అతిథి గృహాలు ఇచ్చేలా మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు వెల్లడించారు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించాకే భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భౌతికదూరం పాటించి దర్శనాలకు అనుమతి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

టీటీడీకి చెందిన భూములపై శ్వేత పత్రం విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. టీటీడీ కి చెందిన సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కాకూడదని అన్నారు. గతంలో వివిధ దశల్లో విక్రయించినవి, దురాక్రమణ కు గురైనవి, అందుబాటులో ఉన్న ఆస్తుల సమగ్ర సమాచారం శ్వేత పత్రంలో ఉండాలని సూచించినట్లు చెప్పారు. 2016 లో ఆస్తుల విక్రయానికి గత ప్రభుత్వం నియమించిన బోర్డు నిర్ణయం తీసుకున్న నాటి నుంచి నేటి వరకు ఈ ఆస్తుల అమ్మకం ప్రక్రియకు సంబంధించి వివిధ దశల్లో ఎక్కడ ఏం జరిగిందో తేల్చేందుకు సమగ్ర విచారణకు కోరుతూ ప్రభుత్వానికి వెంటనే లేఖ రాయాలని అధికారులను ఆదేశించానని తెలిపారు.

బ్యాంకులకు పెను శాపంలా ఉద్దీపనల ప్యాకేజీ


కరోనా లాక్ డౌన్ కారణంగా కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనల ప్యాకేజీ బ్యాంకులకు పెను శాపంలా పరిణమించే అవకాశంఉన్నట్లు బ్యాంకింగ్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు రూ.21 లక్షల కోట్లతో కూడిన ఈ ప్యాకేజీలో బ్యాంకుల నుంచి వివిధ రంగాలకు బలవంతంగా ఇప్పించే రుణాలు అధికంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంటున్నారు.

ఇలాంటి బలవంతపు రుణాల వల్ల బ్యాంకుల ఆస్తుల నాణ్యత మరింత క్షీణించడం ఖాయమని అంతర్జాతీయ రేటింగ్స్‌ సంస్థ ‘ఫిచ్‌’ వారించింది. దీని ఫలితంగా రానున్న రెండేండ్లలో బ్యాంకుల మొండి బకాయిలు లేదా నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 200 నుంచి 600 బేసిస్‌ పాయింట్ల (6 శాతం) మేరకు పెరుగవచ్చని తాజా నివేదికలో ‘ఫిచ్‌’ హెచ్చరించింది.

కేంద్ర ప్రభుత్వం తన ఉద్దీపన చర్యల్లో భాగంగా బ్యాంకులకు రుణ పరిమితుల విషయంలో అనేక సడలింపులు ఇవ్వడంతోపాటు సమస్యాత్మక రుణాల గుర్తింపునకు ఇంతకుముందు 90 రోజులుగా ఉన్న మారటోరియంను 180 రోజులకు పొడిగించిన విషయం తెలిసిందే. ఇలాంటి చర్యలతో బ్యాంకులపై తీవ్రమైన భారం పడుతుందని, ప్రధానంగా ఇప్పటికే బ్యాలెన్స్‌ షీట్లు బలహీనంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులకు అధిక నష్టం వాటిల్లుతుందని ‘ఫిచ్‌’ పేర్కొన్నది.

మోదీ సర్కార్‌ ప్రకటించిన ఉద్దీపన చర్యల వల్ల సమస్యాత్మక రుణాల గుర్తింపు ప్రక్రియ జాప్యమవుతుందని, బ్యాంకుల నుంచి బలవంతంగా రుణాలను ఇప్పించడమంటే వాటి బ్యాలెన్స్‌ షీట్లను కుంగదీయడమే అవుతుందని తెలిపింది. ముఖ్యంగా మొండి బకాయిలు గణనీయంగా పేరుకుపోయిన ఐడీబీఐ లాంటి బ్యాంకులు కుదేలవుతాయని ‘ఫిచ్‌’ స్పష్టం చేసింది.

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కొవిడ్‌-19 కేసుల సంఖ్య అదుపులోకి వచ్చేవరకు వస్తు వినిమయ డిమాండ్‌, ఉత్పత్తి పెరుగకపోవచ్చని, దీని వల్ల అనేక రంగాలు నష్టపోయే అవకాశమున్నదని ‘ఫిచ్‌’ తెలిపింది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎక్కువ నష్టం జరుగుతుందని, నిరుద్యోగ సమస్య గణనీయంగా పెరుగుతుందని ‘ఫిచ్‌’ అభిప్రాయపడింది.

ప్రభుత్వరంగ బ్యాంకులకు త్వరలో కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను సమకూర్చనున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఈ బ్యాంకుల మొండి బకాయిలు రెట్టింపు అవుతాయన్న భయాందోళనలే ఇందుకు కారణమని ప్రభుత్వ, బ్యాంకింగ్‌ రంగానికి చెందిన అధికారులు వెల్లడించారు.

విమానంలో వైరస్ విజృంభణ!

దేశంలో విమాన ప్రయాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అనంతరం కరోనా వైరస్ విజృంభిస్తోంది. నాలుగురోజుల్లో దేశీయ విమానాల్లో ప్రయాణించిన 23 మంది ప్రయాణికులకు కరోనా వైరస్ సోకడం సంచలనం రేపింది. లాక్‌ డౌన్ వల్ల రెండునెలల అనంతరం దేశీయ విమాన సర్వీసులకు పౌరవిమానయాన శాఖ పచ్చజెండా ఊపింది. ఈ నెల 25 నుంచి 28వతేదీ వరకు కేవలం నాలుగురోజుల్లోనే పలు విమానాల్లో ప్రయాణించిన 23 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో కలవరం మొదలైంది. కరోనా వచ్చిన విమాన ప్రయాణికులను ఆసుపత్రుల్లోని క్వారంటైన్ కు తరలించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ప్రయాణించిన విమానాల్లో ప్రయాణించిన ప్రయాణికులు, విమాన సిబ్బందిని గుర్తించి వారికి కరోనా పరీక్షలు చేయించారు. వారందరినీ ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్ చేశారు. విమానాల్లో కరోనా బాధితులు వెలుగుచూడటంతో పౌరవిమానయాన శాఖ అధికారులు మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భౌతిక దూరం పాటించడం, ఫేస్ మాస్క్ లు, ఫేస్ షీల్డులు ధరించడం, విమానాలను శానిటైజ్ చేసే పనులు చేపట్టారు.

లాక్ డౌన్ 5.0లో కట్టింగ్ షాప్ లో టవల్ రూల్?

స

ఈనెల 31 కి నాలుగో దశ లాక్‌ డౌన్ ముగియనుండటంతో లాక్ డౌన్ 5.0పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈ నాలుగో దశ లాక్ డౌన్ లో ప్రభుత్వాలు ఎన్నో సడలింపులు ఇచ్చాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ తప్ప అన్ని దుకాణాలు తెరచుకున్నాయి. ఇక చాలా రోజుల తర్వాత ఇటీవలే హెయిర్ సెలూన్లు కూడా ఓపెన్ అయ్యాయి. అయితే అన్ని షాపుల్లో భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ నిబంధనలు సూచిస్తున్నాయి. అయితే మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా యంత్రాంగం మరిన్ని కఠిన నిబంధనలు విధించారు. బార్బర్ షాప్‌ కు వెళ్లే కస్టమర్లు ఎవరి టవల్ వారే తీసుకెళ్లాలి. అంతేకాదు ప్రతి బార్బర్ షాప్ నిర్వాహకుడు కత్తెరలు, దువ్వెనలు, హెయిర్ బ్రష్‌లును శానిటైజ్ చేయాలి. షాప్‌ లో కస్టమర్లు మూడు అడుగుల భౌతిక దూరం పాటించాలి.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్5.0 లో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

టీ కాంగ్రెస్ లో మళ్లీ అలజడి..

tcongress


అమావాస్య, పౌర్ణమికి వచ్చే చంద్రుడి వలే టీకాంగ్రెస్ తీరు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొన్నటికి మొన్న ధాన్యం కొనుగోళ్లపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ దీక్షలతో సందడి చేశారు. ఆ తర్వాత పక్షం రోజులకు మరో ఎజెండాతో ఇప్పుడు కాంగ్రెస్ లో మళ్లీ అలజడి నెలకొంది. ఈసారి ప్రజా సమస్యలే ఎజెండా టీకాంగ్రెస్ కార్యాచరణ ఉండబోతోందట.. మొట్టమొదటిగా వలస కార్మికుల ఎజెండాను కాంగ్రెస్ చేపట్టింది. ఆ తర్వాత నీళ్ల పోరాటం.. ఉద్యోగుల వేతనాలపై ముందుకెళుతోంది. నిరుపేదలకు జీవనోపాధి కల్పించే అంశంపై కూడా పోరుబాటకు శ్రీకారం చుట్టబోతోందని సమాచారం.

*వలస కార్మికులదే మొదటి ఎజెండా?
లాక్ డౌన్ ఆంక్షల వల్ల సమస్యల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులపై టీ కాంగ్రెస్ మొదటి ఎజెండా రూపొందించుకున్నట్టు తెలిసింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ స్వయంగా రంగంలోకి దిగి.. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఒడిషా కార్మికుల కష్టాలకు చెలించి ఏకంగా బస్సు సౌకర్యాన్ని కల్పించి పంపించారు కాంగ్రెస్ నేతలు.. వారికి 10వేల రూపాయల సాయం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

*ప్రాంతీయ నీళ్ల పోరాటానికి కాంగ్రెస్ సై
ఇక ప్రాంతీయ నీళ్ల పోరాటానికి కాంగ్రెస్ సై అంటోంది. మంజీరా డ్యామ్ కు నీళ్ల సమస్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రజా ఉద్యమం చేసేందుకు సిద్ధమయ్యారు. వచ్చేనెల 4న టీకాంగ్రెస్ నేతృత్వంలో మంజీరాడ్యామ్ వద్ద ధర్నాకు టీపీసీసీ పిలుపునిచ్చింది.

*ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై కాంగ్రెస్ పోరాటం..
ప్రభుత్వ ఉద్యోగులతోపాటు.. పెన్షనర్స్ కు మూడు నెలలుగా సగం జీతం ఇవ్వడంపై కాంగ్రెస్ పోరుబాటకు సిద్ధమైంది. ధనిక రాష్ట్రమన్న కేసీఆర్.. ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించడం ఏంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.

ఇలా వరుసగా మూడు సమస్యలపై కార్యాచరణ దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. వలస కార్మికులు.. నీళ్ల పోరాటం.. ఉద్యోగుల వేతనాలను ఎజెండాగా తీసుకొని ముందుకెళ్లడానికి కాంగ్రెస్ రెడీ అవుతోంది. మరి ఈసారి తెలంగాణ సర్కార్ కు ప్రతిపక్ష కాంగ్రెస్ ఏ మేరకు సెగ చూపిస్తుందన్నది వేచి చూడాలి.

-నరేశ్ ఎన్నం

ఎన్టీఆర్ ఆశీర్వాదం వారిద్దరికి ఉంటుంది: లక్ష్మీపార్వతి


నేడు తెలుగు రాష్ట్రాలను పరిపాలిస్తున్న కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు ఎన్టీఆర్ కు నిజమైన వారసులని ఎన్టీఆర్ సతీమణి, ఏపీ తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి అన్నారు. గురువారం ఎన్టీఆర్ 98వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ సమాధి వద్ద పూలమాలలు వేసి ఆమె ఘనంగా నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పేదలకు సేవ చేయాలన్నదే ఎన్టీఆర్ ముఖ్య ఆశయమని అన్నారు. ఆయన ఆకాంక్షలను నెరవేరుస్తూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్న ప్రతీఒక్కరికి ఎన్టీఆర్ ఆశీర్వాదం ఉంటుందని లక్ష్మీపార్వతి అన్నారు.

ఎన్టీఆర్ నిజమైన అనుచరులే ఆంధ్రప్రదేశ్, తెలంగాణను పరిపాలించడం అదృష్టమని ఆమె అన్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ ఎన్టీఆర్ ఆదర్శాలను అనుగుణంగా పని చేస్తున్నారని ఆమె కొనియాడారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ నుంచి బయటికి వెళ్లి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి టీడీపీకి వ్యతిరేకంగా పార్టీని స్థాపించారు. ప్రస్తుతం వీరివురు తెలుగు రాష్ట్రాల సీఎంలుగా ఉంటూ పరిపాలన సాగిస్తున్నారు. టీఆర్ఎస్, వైసీపీలు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని భూస్థాపితం చేసేలా పావులా కదుపుతుండగా ఆయన సతీమణి వారిపై ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ఎన్టీఆర్ ఆశ్వీర్వాదం ఏపీలో జగన్మోహన్ రెడ్డికి, తెలంగాణలో కేసీఆర్ కు ఉంటుందని ఆమె చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

బాలకృష్ణ వర్సెస్ నాగబాబు


తాజాగా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర దూమారం రేపుతోన్నాయి. ఇటీవల చిరంజీవి ఇంట్లో పెట్టిన సినీపెద్దల మీటింగ్ కు గానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ తో జరిగిన మీటింగ్ కు సంబంధించిగానీ తనను ఎవరు పిలువలేదని అన్నారు. టీవీల్లో, పేపర్లలోనే ఆ మీటింగులకు సంబంధించిన విషయాలు తెలిశాయని అన్నారు. అంతటితో ఆగకుండా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి భూములు పంచుకుంటున్నారా? అంటూ ఆరోపణలు చేశారు. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు తీవ్రస్థాయిలో బాలకృష్ణపై మండిపడ్డారు. తన యూట్యూబ్లో ఛానల్లో ఈ విషయంపై నాగబాబు స్పందించారు.

లాక్డౌన్ కారణంగా కార్మికులను ఆదుకునేందుకు సెలబ్రెటీలంతా ముందుకొచ్చారని తెలిపారు. అయితే సినిమా షూటింగులకు ప్రారంభించేందుకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చిరంజీవి ఇంట్లో మీటింగ్ పెట్టారని చెప్పారు. అయితే ఈ మీటింగ్ బాలకృష్ణను పిలిచారా? లేదా అన్నది తనకు తెలియదని అన్నారు. అయితే బాలకృష్ణను ఎవరూ పిలువలేదని కోపగించుకోవడం సబబే అయినప్పటికీ ఆయన నోరుజారడం కరెక్ట్ కాదన్నారు. భూములు పంచుకుంటున్నారంటూ.. అందుకే కలిసారని బాలకృష్ణ అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలోని వ్యక్తిగా తనకు బాధను కలిగించాయని నాగబాబు అన్నారు. బాలకృష్ణ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని నాగబాబు హితవు పలికారు.

భూములు అమ్ముకుంటున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఆరోపణలు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కూడా బాలకృష్ణ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. ఇక్కడ ఎవరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంలేదని ఒకసారి ఆంధ్రకు వెళ్లి చూస్తే టీడీపీ హయాంలో ఎవరు రియల్ వ్యాపారం చేసి సర్వనాశనం చేశారో అర్థమవుతుందన్నారు. మీరు ఇండస్ట్రీకి కింగ్ కాదని.. మీరొక హీరో మాత్రమే అంటూ నాగబాబు ఘాటుగా స్పందించారు. బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్ గా నాగబాబు మాట్లాడటంతో ఈ వివాదం మరింత ముదిరేలా కన్పిస్తుంది. వీరిద్దరి వ్యాఖ్యాలతో ప్రస్తుతం టాలీవుడ్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఈ వివాదం మున్ముందు ఎలా మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే..!

లాక్ డౌన్ 5.0పై ఊపందుకున్న ఊహాగానాలు!

lock down 5.0

lock down 5.0

కోవిద్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు లాక్ డౌన్5.0 పై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న నాలుగో దశ లాక్ డౌన్ ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఐదో దశ లాక్ డౌన్ పొడగింపుపై వివిధ రకాల ఊహాగానాలు వినొస్తున్నాయి. దీనిపై కేంద్ర వర్గాలు స్పందిస్తూ, లాక్డౌన్ మరో రెండు వారాల పాటు పొడగించే అవకాశాలు ఉన్నాయని సూచన ప్రాయంగా వెల్లడించారు. అయితే, దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం జరిగే మన్ కీ బాద్ కార్యక్రమలో స్పష్టతనిస్తారని పేర్కొన్నారు. అంతేకాకుండా, లాక్ డౌన్ సమయంలో ఆంక్షలు విధింపు, సడలింపులపై నిర్ణయాధికారం ఆయా రాష్ట్రాలకే అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే కరోనా కట్టడికి కేంద్రం దశలవారీగా లాక్‌ డౌన్‌ ను పొడిగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే నాలుగు విడుతలు లాక్‌ డౌన్‌ అమలు చేసినప్పటికీ కేసుల సంఖ్య తగ్గకపోవడమే కాకుండా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 5వ విడుత లాక్‌ డౌన్‌ లో ప్రధానంగా కేసులు పెరిగే ప్రాంతాలపై కేంద్రం దృష్టిసారించనుంది.

దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల్లో కేవలం 11 నగరాల్లోనే 70 శాతం కేసులు నమోదయ్యాయి. ఈ నగరాల జాబితాలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్‌, కోల్‌కతా, పుణె, థానె, ఇండోర్‌, జైపూర్‌, సూరత్‌ ఉన్నాయి. ఈ 11 నగరాల్లో కేసులను నియంత్రించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. 5వ విడుత లాక్‌ డౌన్‌ ను మరో రెండు వారాలు పొడిగించే అవకాశముందని తెలుస్తుంది.

మిడతల్ని ఏమి చేదాం.. కేసీఆర్ సమీక్ష!

Locusts
Locusts Attack in Telangana

Locusts

మహారాష్ట్ర నుండి తెలంగాణ వైపు దూసుకువస్తున్న మిడతల దండుపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మిడతల దండు రాష్ర్టానికి వస్తే చేపట్టాల్సిన చర్యలపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి అధికారులు, శాస్ర్తవేత్తలు, నిపుణులు హాజరయ్యారు.

పాకిస్తాన్ నుంచి భారత్‌ లోకి ప్రవేశించిన మిడతలు.. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ లో పంటలకు నష్టం కలిగించాయి. మధ్యప్రదేశ్ నుంచి కొన్ని మిడతలు ఝాన్సీ గుండా ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించగా.. ఇంకొన్ని మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చేరాయి. ఈ కీటకాల గుంపు తెలంగాణవైపునకే దూసుకొచ్చే అవకాశాలుండటంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. కొద్దిరోజులుగా పశ్చిమభారతానికే పరిమితమైన ఎడారి మిడతల దండు క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు దూసుకొస్తున్నది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఎగురుతూ వాటి దారిలో కనిపించే ప్రతీ చెట్టూ చేమను తినేసే ఈ మిడుతలను మహారాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేకపోతే రెండుమూడు రోజుల్లో మన రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రమాదముంది. ప్రస్తుతం 17 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక మిడతల గుంపు మహారాష్ట్రలోని అమరావతి సమీపంలోకి చేరుకుంది.

దాంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నిజామాబాద్‌, కామారెడ్డి, అసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలకు వీటితో ప్రమాదం పొంచి ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ కమిషనర్‌ బీ జనార్దన్‌రెడ్డి  అధికారులను ఆదేశించారు. మిడతల దండు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సమస్యపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సరిహద్దు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో నిఘాబృందాలు, గ్రామ కమిటీలను ఏర్పాటుచేసి మిడతల దండుతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ఒక మిడతల దండు రోజులో దాదాపు 35000 మందికి సరిపోయే ఆహారాన్ని తినేస్తాయని నిపుణులు చెప్తున్నారు.

‘రంగుల’ రాజకీయం.. వెనక్కి తగ్గని జగన్


ఏపీ సీఎం జగన్ ఎంతకూ తగ్గనంటున్నాడు. రంగుల రాజకీయంలో హైకోర్టు ఆదేశించినా కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. టీడీపీ హయాంలో అన్ని పచ్చగా ఉండగా లేనిది.. తన హయాంలో తన పార్టీ రంగు ఉంటే తప్పేంటని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు వేసిన పార్టీ రంగులను తొలగించేందుకు సిద్ధంగా లేనట్లుగా తెలుస్తోంది.

* వైసీపీ రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కగానే వైసీపీ ప్రజాప్రతినిధులు కొందరు స్వతహాగా.. ప్రభుత్వం మరికొంత ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయించింది. వైసీపీ ప్రభుత్వం ఉండడంతో యథాలాపంగా ఆ పార్టీ రంగులే వేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్నింటికి పసుపు కలర్ ఉండేది. అన్యాక్యాంటీన్లు సహా అన్నింటికి ఉన్న నాడు వైసీపీ అభ్యంతరం పెట్టలేదు. కానీ నేడు టీడీపీ హైకోర్టుకెక్కి రంగులను మార్చాలని తీర్పును రాబట్టింది.

*డబ్బుల్లేవ్.. రంగులపై సుప్రీంకు జగన్ ప్రభుత్వం
గ్రామ పంచాయితీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై ప్రభుత్వం ఉత్తర్వులు జీవో నంబర్ 623 జారీ చేసింది. అయితే గత వారం రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. రంగులు మార్చాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.అయితే జగన్ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో మే 28లోగా పంచాయితీరాజ్ కమిషనర్ స్పందించకపోతే ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. దీంతో జగన్ సర్కార్ లాక్డౌన్ వేళ రంగులు మార్చడానికి డబ్బులు లేవని.. అన్ని కార్యాలయాలకు రంగులు మార్చడానికి కోట్లు వ్యయం అవుతుందని కాబట్టి రంగులు అలాగే ఉంచాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేసింది.

*స్వయంగా హైకోర్టుకు ఏపీ సీఎస్
హైకోర్టు ధిక్కార నోటీసుకు తమ వివరణ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం తరుఫున ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, పంచాయతీ రాజ్ కార్యదర్శి గిరిజా శంకర్ ఇద్దరూ హైకోర్టుకు హాజరయ్యారు. వారు వివరణాత్మక అఫిడవిట్లు సమర్పించి, ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రత్యేక లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలియజేసింది. ఫలితంగా ధిక్కార పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం వాయిదా వేసింది.

దీంతో జగన్ సర్కార్ పంతం నెగ్గినట్టైంది. రంగుల రాజకీయం సుప్రీం కోర్టుకు చేరింది . సుప్రీం ఏం తీర్పునిస్తుందనేది ఆసక్తిగా మారింది. జగన్ మాత్రం వెనక్కితగ్గకూడదని ఈ విషయంలో పట్టుదలగా ఉండడం విశేషం.

ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..!

mahanadu


టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో భాగంగా గురువారం ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నలు దిశలా చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అని చెప్పారు.

అటువంటి వ్యక్తికి తగిన గుర్తింపు ఇవ్వాల్సిన భాద్యత కేంద్రంపై ఉందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఎన్టీఆర్ కు భారత రత్న పురస్కారాన్ని ప్రకటించాలని కోరారు. ఈ అంశంపై మహానాడులో తీర్మానం ఆమోదించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై, ప్రతిపక్షాలపైన దాడులు మానాలని హితవు పలికారు. సవాళ్లు పార్టీకి కొత్తకాదని స్పష్టం చేశారు.

కార్యకర్తలే పార్టీకి శక్తి అని, వారి శక్తి యుక్తులతో పార్టీని మరింత ముందుకు తీసుకువేళతామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు, ప్రజలు, దళితులు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలపై దాడులకు వ్యతిరేకంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు. నిన్న ఏడు తీర్మానాలు చేశారు. ఈ రోజు మరో ఏడు తీర్మానాలను ఆమోదించనున్నారు.

ట్రాఫిక్ ఫ్రీ నగరానికి మరో ముందడుగు!

Kamineni Flyover

Kamineni Flyover

హైదరాబాద్‌ మహానగరాన్ని ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వ్యూహాత్మకంగా రోడ్లు నిర్మాణం చేపట్టి ఆ విధంగా ట్రాఫిక్ లేని రాజధానిగా మార్చాలని కేసీఆర్ సర్కార్ ఆలోచిస్తుంది. అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా నిర్మించిన ఎల్బీనగర్‌ రింగ్‌ రోడ్‌ అండర్‌ పాస్‌, కామినేని జంక్షన్‌ లో కుడివైపు నిర్మించిన ఫ్లై ఓవర్‌ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఫ్లై ఓవర్‌ ప్రారంభంతో నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ కు, సాగర్‌ రింగ్‌ రోడ్డు నుంచి నాగోల్‌ వెళ్లే వాహనదారులు, ప్రయాణికులకు ట్రాఫిక్‌ కష్టాలు తీరాయి. అండర్‌ పాస్‌ తో ఓవైసీ జంక్షన్‌, శ్రీశైలం హైవేకు రాకపోకలు సులభతరం కానున్నాయి. రూ.14 కోట్ల వ్యయంతో ఎల్బీనగర్‌ రింగ్‌ రోడ్డు అండర్‌ పాస్‌ నిర్మాణం చేపట్టారు. కామినేని జంక్షన్‌ లో రూ. 43 కోట్లతో ఫ్లై ఓవర్‌ ను నిర్మించారు. మొత్తానికి ఎల్బీనగర్‌ రింగ్‌ రోడ్డు సిగ్నల్‌ ఫ్రీ జంక్షన్‌ గా మారింది.

సీఎం జగన్ ‘ప్రత్యేక హోదా’ కీలక వ్యాఖ్యలు


రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై చాలా కాలం తరువాత ముఖ్యమంత్రి జగన్ పాత పాటే పాడారు. ఎన్నికల ముందు 20 ఎంపీ సీట్లు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన ఆయన 22 సీట్లు ఇచ్చినా హోదా విషయం గురించి కొంతకాలంగా మాట్లాడం లేదు. ప్రస్తుతం హోదా గురించి మాట్లాడక పోవడమే మంచిదంటూ తన మనసులో మాట తాజాగా బయట పెట్టారు.

మన పాలన – మీ సూచన కార్యక్రమంలో పరిశ్రమ ఏర్పాటు అంశంపై ప్రసంగిస్తూ ఆయన ప్రత్యేక హోదా విషయంపై మాట్లాడారు. ప్రత్యేక హోదా కల్పిస్తే రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చేవన్నారు. స్థానికంగా ఎంతో మందికి ఉపాధి లభించేదని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీకి ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని అందించారని, 175 శాసనసభ స్థానాలకు 151, అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలకు 23 సీట్లు ఇచ్చారన్నారు. జాతీయ స్థాయిలో 4వ అతి పెద్ద పార్టీగా వైసీపీ ఉన్నదని తెలిపారు. బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన వాటి కంటే పార్లమెంట్ స్థానాలు ఎక్కువ వచ్చాయని దీంతో ఆ పార్టీకి వైసీపీ మద్దతు అవసరం లేకుండా పోయిందన్నారు.

ప్రస్తుతం ప్రత్యేక హోదా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. బీజేపీకి సీట్లు తక్కువగా వస్తే హోదా అడిగేందుకు అవకాశం ఉండేదన్నారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కొత్తలో ఇదే విధంగా మాట్లాడారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ టీడీపీ ప్రత్యేక హోదా సాధించలేకపోయిందని విమర్శించారు.

జగన్ ప్రభుత్వంపై బాలకృష్ణ జోస్యం..!


గత కొంతకాలంగా రాజకీయ ప్రకటనలకు దూరంగా ఉంటూ వస్తున్న సినీ నటుడు, టిడిపి ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ నేడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వం త్వరలో పతనం కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

ప్రస్తుతం జరుగుతున్న టిడిపి మహానాడులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఐదేళ్లూ అధికారంలో ఉండదని, త్వరలోనే టిడిపి అధికారంలోకి వస్తుందని భరోసా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పరిపాలన పడక వేసిన్నట్లు ధ్వజమెత్తుతూ ఎక్కడ చూసినా రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతుందని దుయ్యబట్టారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా జగన్ వైఖరిలో మార్పు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు.

వైసిపి ఒక్కసారి అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందని బాలకృష్ణ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులను వేధింపులకు గురిచేస్తున్నారని, కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండి పడ్డారు. టిడిపి నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసులు బనాయిస్తూ జైలుకు పంపుతున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో అధికారపార్టీ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని పేర్కొంటూ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని టిడిపి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, నిత్యం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

టిడిపికి బలం పార్టీ కార్యకర్తలే అని అంటూ వారే ఎన్ని కష్టాలు ఎదురైనా, ఇబ్బందులకు గురికావలసి వచ్చినా పార్టీని కాపాడుకొంటూ వస్తున్నారని కొనియాడారు. ఎన్‌టిఆర్‌ వారసులం తాము కాదని, కార్తకర్తలే నిజమైన వారసులని స్పష్టం చేశారు.

కష్ట కాలంలో పార్టీకి సమర్ధవంతమైన నాయకత్వం అందిస్తున్నారని అంటూ పార్టీ అధినేత, తన బావమరిది చంద్రబాబు నాయుడును కొనియాడారు. ఎన్‌టిఆర్‌ కలలను చంద్రబాబు నాయుడు సాకారం చేస్తున్నారని ప్రశంసించారు.

త‌ల‌సాని గారి కృషి అభినంద‌నీయం: మెగాస్టార్

సినీ-టీవీ కార్మికులకు సాయం అందించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్, తలసాని సాయికిరణ్ యాదవ్ ముందుకు వచ్చారు. 14 వేల మంది సినీకార్మికుల‌ కుటుంబాలకు త‌ల‌సాని ట్రస్ట్ ద్వారా నిత్యావ‌స‌రాల సాయం ఈ కార్యక్రమాన్ని గురువారం ఉదయం ప్రారంభించారు. వారిలో 12 వేల మంది సినీ , 2 వేల మంది టీవి కార్శికుల కు మొత్తం 14 వేల మందికి నిత్యావసరాల పంపిణీ అన్నపూర్ణ 7ఎకర్స్ లో సరుకుల పంపిణీ ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్కినేని నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు, కొరటాల శివ ,రాధాకృష్ణ, రామ్ మోహనరావు , తలసాని సాయి, ఎన్.శంకర్ , సి.కళ్యాణ్, అభిషేక్, కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
సినీ ప్రముఖులు అక్కినేని నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు, కొరటాల శివ ,రాధాకృష్ణ, రామ్ మోహనరావు , తలసాని సాయి, ఎన్.శంకర్ , సి.కళ్యాణ్ చేతుల‌మీదుగా కార్శిక యూనియన్ నాయకుల ద్వారా నిత్యావసర వస్తువులను అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనాల్సి ఉండ‌గా కార‌ణాంత‌రాన ఆయ‌న రాలేక‌పోయారు. ఈ సంద‌ర్భంగా ఒక వీడియో సందేశాన్ని పంపారు.

త‌ల‌సాని గారి కృషి అభినంద‌నీయం : మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ-“మా మిత్రులు, శ్రేయోభిలాషులు మ‌న సిసిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ గారు త‌ల‌సాని సేవా ట్ర‌స్ట్ ద్వారా 14 వేల మంది సినీ-టీవీ కార్మికుల్ని ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చినందుకు సంతోషం. కేవ‌లం సినీరంగంలోని వారే కాకుండా టీవీ రంగంలోని వారికి సాయం చేస్తుండ‌డం మంచి విష‌యం. సినీప‌రిశ్ర‌మ త‌ర‌పున ధ‌న్య‌వాదాలు. నిజానికి ఈరోజు కార్య‌క్ర‌మానికి నేను కూడా హాజ‌రు కావాల్సి ఉంది. కానీ స‌మీప బంధువులు చ‌నిపోవ‌డం వ‌ల్ల రాలేక‌పోయాను. ప‌రిశ్ర‌మ‌కు క‌ష్ట కాలంలో త‌ల‌సాని గారి కృషి అభినంద‌నీయం. గ‌త నెల‌లో సీసీసీ ద్వారా నిత్యావ‌స‌రాల సాయం అందించిన విషయం తెలిసిందే. ప‌రిశ్ర‌మ‌కు ప్రభుత్వానికి సంధాన క‌ర్త‌లుగా కావాల్సిన సాయం అందిస్తున్న ఆయ‌న ఇప్పుడిలా సేవా కార్య‌క్ర‌మం చేయ‌డం సంతోషాన్ని క‌లిగిస్తోంది. క‌ష్ట‌కాలంలోనూ అన్నివిధాలా చేదోడువాదోడుగా ఉంటున్నందుకు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు“ అని అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో నిప్పులు చెరుగుతున్న ఎండలు


తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. సాధారణ ఉష్ణోగ్రత కంటే 5 డిగ్రీలు ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్‌ మొదటివారం వరకు ఎండల తీవ్రత ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.

రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తీవ్రతరమవుతున్నాయి. వడగాల్పులు, ఎండల తీవ్రతతో జనం అల్లల్లాడిపోతున్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళల పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. కేరళను రుతుపవనాలు తాకితే తప్ప వాతావరణంలో మార్పు సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

జూన్ 8 కల్లా రుతుపవనాలు వస్తాయని తొలుత భావించినప్పటికీ అవి కూడా అందని పండులా మరో ఐదు రోజులు రాకపోవచ్చన్న మరో పిడుగులాంటి వార్త ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అప్పటి వరకు ఎండలకు తోడు వడగాలుల ప్రభావం కూడా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

మండుటెండలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలు విలవిల్లాడుతున్నాయి. జనం ఇంటి నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. లాక్‌డౌన్ సడలింపుంల నేపథ్యంలో క్రమేపి జనజీవనం తిరిగి ప్రారంభమైనా ఎండ వేడిమికి ఇళ్ల నుంచి బయటకు వచ్చే కన్నా ఇళ్లల్లోనే ఉండి సెదతీరడం ఎంతో శ్రేయస్కరమని భావించిన ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇళ్లకే పరిమితమవుతున్నారు.

దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ప్రచండ భానుడి ప్రకోపం ఇంకెంత కాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఎపిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడగాల్పులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరింది.

రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నట్లు తెలిపింది. ఉదయం 11 గంటలకే ఎపిలోని పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. సాయంత్రం మూడు గంటలకు 47 డిగ్రీలు దాటే సూచనలున్నాయని పేర్కొంటున్నారు.

వడగాల్పులు తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు ఎండల్లో తిరగకుండా ఉండాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్దులు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, గుంటూరు, విజయనగరం చిత్తూరు, కృష్ణ, అనంతపురం జిల్లాలతోపాటు విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు ఉష్ణోగ్రతలు 45 నుండి 47 డిగ్రీలకు పైగా నమోదవుతాయని తెలిపింది.

ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 నుండి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని చెప్పింది.

ఇక తెలంగాణలో కూడా హైదరాబాద్‌ మొదలుకొని ఆదిలాబాద్‌ వరకూ ఇదే పరిస్థితి నెలకొన్నది. వడగాడ్పుల వల్ల భూమి వేడెక్కి ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 4 నుంచి 7 డిగ్రీలు అధికంగా నమోదౌతున్నాయని, దీంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపింది.

ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని, మరో ఐదురోజుల వరకు చాలాచోట్ల వడగాడ్పుల తీవ్రత కొనసాగుతుందని తెలిపారు. హైదరాబాద్‌లోనూ ఎండలు దడపుట్టిస్తున్నాయి. ఈ నెలలో రెండుసార్లు పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటి నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

డబుల్ బెడ్ రూం ఇండ్లపై మంత్రులు గుడ్ న్యూస్!

సిఎం కేసీఆర్ సంకల్పం మేరకే రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు శర వేగంగా జరుగుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిరుమలగిరిలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించారు. 80 డబుల్ బెడ్ రూమ్‌ లను లబ్ధిదారులకు మంత్రి జగదీష్ రెడ్డి అందజేసిన సందర్భంగా మాట్లాడారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నాణ్యతలో ఎలాంటి రాజీ పడలేదని, డబుల్ బెడ్ రూం లబ్ధి దారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని, అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

గతంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లపై  సమీక్ష నిర్వహించి, తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని, పెండింగ్ లో ఉన్న అన్ని ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌ లో చాలా చోట్ల 80 శాతానికి పైగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని చోట్ల లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను పంపిణీ చేశామని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే మిగిలిన నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని కేటిఆర్ చెప్పారు.