
టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో భాగంగా గురువారం ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నలు దిశలా చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అని చెప్పారు.
అటువంటి వ్యక్తికి తగిన గుర్తింపు ఇవ్వాల్సిన భాద్యత కేంద్రంపై ఉందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఎన్టీఆర్ కు భారత రత్న పురస్కారాన్ని ప్రకటించాలని కోరారు. ఈ అంశంపై మహానాడులో తీర్మానం ఆమోదించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై, ప్రతిపక్షాలపైన దాడులు మానాలని హితవు పలికారు. సవాళ్లు పార్టీకి కొత్తకాదని స్పష్టం చేశారు.
కార్యకర్తలే పార్టీకి శక్తి అని, వారి శక్తి యుక్తులతో పార్టీని మరింత ముందుకు తీసుకువేళతామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు, ప్రజలు, దళితులు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలపై దాడులకు వ్యతిరేకంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు. నిన్న ఏడు తీర్మానాలు చేశారు. ఈ రోజు మరో ఏడు తీర్మానాలను ఆమోదించనున్నారు.