Home Blog Page 8473

విమానంలో ఊరెళ్ళిన వలస కూలీలు!

migrants

migrants

బీహార్ కి చెందిన 10మంది వలస కూలీలు విమానంలో వారి సొంత ప్రాంతాలకు పంపించిన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. లాక్ డౌన్ కారణంగా లక్షలమంది వలస కార్మికులు వివిధ రాష్ట్రాలలో చిక్కకుపోయారు. వారంతా తమ సొంతూళ్లకు నడుచుకుంటునో, సైకిళ్ల మీదనో, లేకపోతే ఈ మద్యే ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్ల ద్వారానో చేరుకుంటున్నారు. అలా వెళ్తూ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతమంది అయితే ఎండ వేడి భరించలేక మార్గమధ్యలోనే చనిపోతున్నారు. ఇలాంటి టైం లో తన దగ్గర పనిచేసే కార్మికులు ఇటువంటి కష్టాలు పడకూడదని భావించిన ఓ యజమాని.. వారందరిని విమానంలో సొంతూళ్లకు చేరేలా ఏర్పాట్లు చేశాడు. ఢిల్లీకి చెందిన పప్పన్ సింగ్ గెహ్లాట్ టిగిపూర్ గ్రామంలో పుట్టగొడుగుల పంటను పండిస్తున్నాడు. ఆ వ్యవసాయ క్షేత్రంలో 10 మంది బీహారీ వలస కూలీలు పనిచేస్తున్నారు. లాక్డౌన్ వల్ల వారంతా తమ సొంతూరైన బీహార్ లోని శ్రీపూర్ గహార్ కు వెళ్లడానికి శ్రామిక్ రైలులో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. కానీ, వారికి సీట్లు కేటాయించలేదు. దాంతో ఇదే విషయాన్ని తమ యజమాని గెహ్లాట్ కు చెప్పారు. దాంతో ఆయన తన దగ్గర పనిచేసే వాళ్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అక్షరాల 68 వేలు ఖర్చుపెట్టి ఢిల్లీ నుంచి పాట్నాకు విమాన టిక్కెట్లు కొన్నాడు. ఆ తర్వాత వారందరికీ వైద్య పరీక్షలు చేయించి.. గురువారం ఉదయం విమానాశ్రయంలో దింపాడు. అంతేకాకుండా.. పాట్నా నుంచి తమ గ్రామానికి చేరుకోవడానికి బస్సు చార్జీలకు కావలసిన డబ్బును కూడా అందజేశాడు. వారంతా గురువారం విమానంలో పాట్నా చేరుకొని.. అక్కడి నుంచి బస్సులో శ్రీపూర్ గహార్ చేరుకుంటారు.

ఈ విషయంపై నవీన్ అనే కార్మికుడు మాట్లాడుతూ.. ‘మేం విమానం ఎక్కడం ఇదే మొదటిసారి. విమానం ఎక్కడమనేది మాకు ఆర్థికంగా కష్టమైన పని. ఇలా ప్రయాణిస్తామని ఎప్పుడూ అనుకోలేదు. నేను, నా తమ్ముడు ప్రవీణ్ విమానంలో వస్తున్నామని చెబితే మా తల్లి అసలు నమ్మలేదు. నా తండ్రి లఖ్వీందర్ రామ్ 27 సంవత్సరాలుగా గెహ్లాట్ దగ్గరే పనిచేస్తున్నారు. దాంతో మేం కూడా అక్కడే పనిచేస్తున్నాం. మా యజమాని గత రెండు నెలలుగా మాకు కావలసిన ఆహారం ఏర్పాటు చేశాడు. మాకు లాక్డౌన్ వల్ల ఎటవంటి సమస్య రాలేదు. కానీ, మా కుటుంబ సభ్యులు మాత్రం మేం ఎలా ఉన్నామో అని ఆందోళన చెందారు. మేమంతా ఇంటికి తిరిగి రావాలని కోరుకున్నారు. కార్మికుల ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ప్రమాదాల్లో మరణించినట్లు వార్తలు రావడంతో మా యజమాని మాకు విమాన టిక్కెట్లను బుక్ చేశాడు. మమ్మల్ని జాగ్రత్తగా విమానంలో పంపించిన మా యజమానికి కృతజ్ఞతలు. పుట్టగొడుగుల సీజన్ ప్రారంభంకాగనే మేమంతా ఆగస్టులో తప్పనిసరిగా తిరిగి వస్తాం’అని తెలిపాడు.

లక్షలాది మంది వలసకార్మికుల మాదిరిగా నా దగ్గర పనిచేసే కార్మికులు కూడా ఇబ్బందిపడకూడదనే నేను ఇలా చేశాను. వారు రోడ్డు మీద ఇబ్బందికర పరిస్థితులలో ప్రయాణించి ప్రమాదంలో పడకూడదని అనుకున్నాను. రైలు టిక్కెట్లను బుక్ చేస్తే.. సీట్లు కన్ఫర్మ్ కాలేదు. దాంతో విమాన ఖర్చులను భరించి వారిని సోంతూళ్లకు పంపాలని నిర్ణయించుకున్నాను. అందుకు ప్రతిఫలంగా నేను ఏమీ ఆశించను’అని యజమాని గెహ్లాట్ తెలిపారు.

‘సర్కార్ పాట’ పాడుతున్న సూపర్ స్టార్..!

sarkar-paata

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ప్రారంభంలోనే బ్లాక్ బ్లస్టర్ హిట్టందుకున్నాడు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా ‘సరిలేరునీకెవ్వరు’తో అభిమానులను పలకరించాడు. మహేష్ కెరీర్లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ రిలీజై నాలుగైదు నెలలు గడుస్తున్నా మహేష్ కొత్త మూవీ ప్రారంభం కాలేదు. ‘సరిలేరునీకెవ్వరు’ తర్వాత వంశీపడిపైల్లి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే వంశీపైడిపల్లి స్క్రీప్ట్ పనులు పూర్తి చేయకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆలస్యం అయింది. దీంతో మహేష్ బాబు ఇతరుల దర్శకుల చెప్పిన కథలను విన్నాడు. దర్శకుడు పర్శురాం చెప్పిన కథ నచ్చడంతో మహేష్ బాబు అతడితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మహేష్ బాబు ప్రతీయేటా సూపర్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులకు ఏదోఒక అప్డేట్స్ ఇస్తుంటాడు. సినిమా రిలీజు, ఫస్టు లుక్, సాంగ్స్ విడుదల చేస్తూ అభిమానులను సర్ ప్రైజ్ గిప్ట్ ఇస్తుంటాడు. ఈనెల 31న సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈసారి మహేష్ బాబు కొత్త మూవీ అప్డేట్ ఉండదనుందని ప్రచారం జరుగుతుంది. ‘గీతా గోవిందం’ ఫేం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ 27వ మూవీని అధికారికంగా ప్రకటించనున్నట్లు ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది. మహేష్-పరశురామ్ కాంబోలో వచ్చే మూవీకి ‘సర్కార్ పాట’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు తన సినిమాలకు సంబంధించి పూజా కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం సెంటిమెంట్ గా వస్తోంది. దీంతో ఈ మూవీ పూజా కార్యక్రమాలను చిత్రబృందమే ప్రారంభించనుంది. రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబరు లేదా అక్టోబర్ లో పట్టాలెక్కనుందని సమాచారం. ‘సర్కార్ పాట’ టైటిల్ చూస్తుంటే ఇది రాజకీయ నేపథ్యంలో ఉండబోతుందా? అనే ఆసక్తి నెలకొంది. దీనిపై చిత్రబృందం త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

రాజధాని తరలింపు అప్పుడేనా?


మూడు రాజధానుల విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లాలనుకున్న ప్రభుత్వానికి మొదటి నుంచి నిరాశే ఎదురవుతోంది. అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత చేసిన 2 ప్రయత్నాలు వివిధ కారణాల వల్ల ఘోరంగా విఫలమయ్యాయి. వాస్తవానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండుంటే మే నెల 28వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధానిని ప్రారంభించాలని ప్రభుత్వ పెద్దలు భావించారు. అయితే కోర్టు కేసులు, పాలన వికేంద్రీకరణ బిల్లులు అమలుకు నోచుకోకపోవడం, ఎల్.జి పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన తదితర అంశాల వల్ల విశాఖ నుంచి ప్రభుత్వం పాలన ప్రారంభించ లేకపోయింది. అయితే ప్రభుత్వం త్వరలో మరో ముహూర్తం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు మరో అయిదు నెలల సమయం ఉంది.

విశాఖను రాజధానిగా మార్చడానికి ఈ ఏడాది అక్టోబర్ 25న విజయదశమి రోజున ముహూర్తాన్ని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎంకు ఆధ్యాత్మిక మార్గదర్శి విశాఖ శారదాపీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర ఈ ముహూర్తం ఖరారు చేశారని సమాచారం. అంతవరకూ మంచి రోజులు లేకపోవడంతో ఈ ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం, నివాసం కోసం ఇప్పటికే బీచ్ రోడ్డులోని గ్రేహౌండ్స్ కార్యాలయంలోని భవనాన్ని ఎంపిక చేశారు. ఉద్యోగులు, మిగిలిన విభాగాలకు కూడా భవనాలు అందుబాటులోనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే మార్చి 25 ఉగాది ముహూర్తం, మే 28 ముహూర్తాలను స్వామి సూచించినా అనుకోని విపత్తు అయిన కరోనా వల్ల తరలింపు సాధ్యం కాలేదు.

తాజాగా నిర్ణయించిన కొత్త ముహూర్తానికి ఇంకా ఐదు నెలల సమయం ఉండటంతో రాజధాని తరలింపునకు ఉన్న చిక్కులను తొలగించడానికి అవకాశం ఉంటుంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదింపునకు, కోర్టులో ఉన్న కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. బిల్లులు ఆమోదం పొందే వరకూ తరలించబోమని ఇప్పటికే ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది.

ఈ చిక్కులన్ని తొలగించుకుని ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజధానిని తరలించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే స్వామి పెట్టిన ఈ మూడవ ముహూర్తం గట్టి ముహూర్తమేననిపిస్తోంది. విశాఖను రాజధాని కాకుండా అడ్డుకోవడం ఎవరి తరం కూడా కాదని కూడా ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి కొద్ది రోజుల కిందట స్పష్టం చేసిన నేపథ్యంలో జరుగుతున్న ప్రచారం ఈ ముహూర్తానికి బలం చేకూర్చేలా ఉంది.

ఇదిలా ఉండగా.. శారదాపీఠం సోషల్ మీడియా విభాగం మాత్రం కొత్త ముహూర్తం విషయం ఇంకా నిర్ధారణ కాలేదని, తమనేవారూ సంప్రదించలేదని ప్రకటించడం కొసమెరుపు.

సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన లోకేష్..!


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పుడు మహానాడు, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.లోకేష్  లాక్ డౌన్ కారణంగా రెండు నెలల పాటు హైదరాబాద్ లో ఇంటికే పరిమితం అయ్యారు. ఇటీవలే హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్నారు. రెండు నెలల తరువాత ఆయనను చూసిన నాయకులు, కార్యకర్తలు అవాక్కయ్యారు. ఎందుకో కాదు..లోకేష్ బాబు స్లిమ్ అయ్యారని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడులో పార్టీ ముఖ్య నాయకులు ఈ అంశంపై చర్చించుకున్నారు. రెండు నెలల్లో 20 కిలోల బరువు తగ్గేనని లోకేష్ చెప్పారంట. బరువు తగ్గడానికి పాటించిన నియమాలను వెల్లడించారు. ఆహార నియమాలతో పాటు వ్యాయామం చెయ్యడం వల్ల ఇంత బరువు తగ్గానని నాయకులకు చెప్పారు.

మరోవైపు సోషల్ మీడియాలోను నారా లోకేష్ బరువు తగ్గిన విషయం వైరల్ అవుతుంది. టీడీపీ ఫాలోవర్స్ లోకేష్ ను మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతుంటే.. వైసీపీ ఫాలోవర్స్ మాత్రం సెటైర్లు గుప్పిస్తున్నారు. బరువు తగ్గితే సరిపోదు, బుర్ర పెరగాలంటూ వైసీపీ కార్యకర్తలు, ఫాలోవర్స్ ఓ ఆట అడ్డుకుంటున్నారు. వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారుల ట్వీట్లకు విస్తుపోవడం టీడీపీ నాయకుల వంతయ్యింది. రాజకీయమంటే బాడీ షేపింగ్ మాత్రమేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఇటు మహనాడులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా, అటు సోషల్ మీడియాలోను లోకేష్ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.

ఉద్యోగుల జీతాలలో కోత తప్పదు: కేసీఆర్

Telangana-Staff-Salary

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ మార్గాలన్ని ముసుకొనిపోవడంతో తెలంగాణలో గత రెండు నెలల నుంచి జీతాల కోతను అమలు చేస్తున్నారు. మే నెలలో కూడా ఉద్యోగుల జీతాలలో కోత తప్పదని కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. కేసీఆర్ అధ్యక్షతన లాక్ డౌన్ తీరుతెన్నులపై సమీక్ష నిర్వహించారు. ఈ అంశంపై ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. రాష్ర్టానికి ప్రతీ నెలా 12 వేల కోట్ల వరకు ఆదాయం రావాలి. కానీ లాక్‌ డౌన్‌ తో ఇది మొత్తం పడిపోయింది. మే నెలలో కేంద్రానికి వెళ్లే పన్నుల్లో రాష్ట్ర వాటాగా రావాల్సిన రూ.982 కోట్లతో కలిపి రూ.3,100 కోట్లే వచ్చాయి. లాక్‌ డౌన్‌ నిబంధనల్లో కొన్ని సడలింపులిచ్చినా ఆదాయం పెద్దగా పెరగలేదు. రిజిస్ర్టేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదు. వచ్చిన కొద్ది మొత్తంలోనే అవసరాలన్నీ తీరాలి. రాష్ట్రం ఏడాదికి రూ.37,400 కోట్ల మేర అప్పులకు కిస్తీలుగా చెల్లించాలని ఆ ప్రకటనలో తెలిపారు. ఇవి ప్రతీ నెలా కచ్చితంగా చెల్లించాల్సిందే. అప్పులను రీషెడ్యూల్‌ చేయాలని రాష్ట్రం కోరినా కేంద్రం ఆ పని చేయలేదని తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచినా.. కేంద్రం విధించిన షరతులతో అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితి లేదు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు పూర్తిగా చెల్లిస్తేనే రూ.3వేల కోట్లకు పైగా వ్యయమవుతుంది. ఖజానా ఖాళీ అవుతుంది. కాబట్టి తగిన వ్యూహం సిద్దం చేసుకోవల్సి ఉందని తెలిపారు.ఈ నేపథ్యంలో అప్పుల వాయిదాలను విదిగా చెల్లించాలని, ఆసరా పెన్షన్లు యదావిదిగా ఇవ్వాలని నిర్ణయించారు.’

లాక్‌ డౌన్‌ నేపథ్యంలో పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని మే నెలలోనూ అందించాలి. లాక్‌ డౌన్‌ సడలింపులతో కార్మికులకు మళ్లీ పని దొరుకుతుంది. కాబట్టి ప్రతీ కుటుంబానికి నెలకు 1500 నగదు ఇచ్చే పని మే నుంచి ఇవ్వరు. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75%, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60%, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50%, పెన్షన్లలో 25% కోతలను మే నెలలోనూ కొనసాగించాలి. ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

ఎన్టీఆర్ తో నటించడం నా అదృష్టం: మెగాస్టార్


ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు ఘన నివాళులు అర్పించారు. గురువారం ఉదయమే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ నాయకులు, అభిమానులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకొని నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ కుటుంబ సమేతంగా ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకొని ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ కూతురు పురంధరేశ్వరీ, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతీ, పలువురు టీడీపీ నాయకులు, అభిమానులు పెద్దఎత్తున చేరుకొని ఆయనకు నివాళులు అర్పించి ఆయనతో తమకున్న అనుబంధాన్ని తలుచుకున్నారు. ఎన్టీఆర్ సేవలను గుర్తుచేసుకున్నారు.

ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తూ ప్రముఖుల ట్వీట్స్..
ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేశారు. ‘తెలుగు జాతి పౌరుషం, తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం, నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం.. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ..’ అని ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫొటోను మెగాస్టార్ షేర్ చేశారు. కాగా ఎన్టీఆర్, చిరంజీవి కలిసి ‘తిరుగు లేని మనిషి’ మూవీలో నటించారు.

అదేవిధంగా ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ తాతయ్య జయంతి సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యాడు. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాత.. సదా మీ ప్రేమకు బానిసను.. మీరు లేని లోటు తీర్చనిది..’ అంటూ ఎన్టీయార్ ఫొటోను షేర్ చేసి తన ఫీలింగ్స్ ను అభిమానులతో పంచుకున్నాడు. వీరితోపాటు పలువురు సెలబెట్రీలు ఎన్టీఆర్ ను గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేస్తున్నారు.

పుల్వామా త‌ర‌హా భారీ ఉగ్ర‌కుట్ర‌ భ‌గ్నం


జ‌మ్మూక‌శ్మీర్‌లో పుల్వామా త‌ర‌హా భారీ ఉగ్ర‌కుట్ర‌ను భద్రతా దళాలు భ‌గ్నం చేశాయి. సుమారు 20 కిలోల పేలుడు ప‌దార్ధాల‌తో వెళ్తున్న ఓ కారును భ‌ద్ర‌తా ద‌ళాలు స్వాధీనం చేసుకొని, ప్రేలుడు పదార్ధాలను కాల్చివేశాయి.

పుల్వామాలోని అవిగుండ్ రాజ్‌పొరా ప్రాంతంలో న‌కిలీ రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్‌తో వెళ్తున్న వాహ‌నాన్ని ఇవాళ ఉద‌యం చెక్ పాయింట్ వ‌ద్ద భ‌ద్ర‌తా ద‌ళాలు అడ్డుకోగా, వాహనాన్ని ఆపకుండా బారికేడ్ల‌ను ఢీకొట్టి ముందుకు వెళ్లడంతో కాల్పులు జరిపారు. దానితో శాంట్రో కారును వ‌దిలేసి డ్రైవ‌ర్ త‌ప్పించుకుని వెళ్లాడు. ఐఈడీల‌తో ఉన్న వాహ‌నాన్ని అక్క‌డ వ‌దిలేసి వెళ్ళాడు.

ఉగ్ర‌దాడికి కుట్ర పణ్ణిన్నట్లు తమకు నిఘా వర్గాలు సమాచారం అందించడంతో నిన్నటి నుండి ఐఈడీల‌తో ఉన్న వాహ‌నం కోసం త‌నిఖీ నిర్వ‌హిస్తున్న‌ట్లు ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ విజ‌య్ కుమార్ తెలిపారు. ఇఈడీల‌తో ఉన్న కారును తర్వాత బాంబు స్క్వాడ్ పేల్చేసింది.

గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో పుల్వామాలోనే సీఆర్‌పీఎఫ్ వాహ‌న‌శ్రేణిని ఐఈడీల‌తో నిండిన వాహ‌నం ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో 40 మంది జ‌వాన్లు మృతిచెందిన విష‌యం తెలిసిందే. . ప‌రారైన ఉగ్ర‌వాదిని హిజ్బుల్ కార్య‌క‌ర్త‌గా భావిస్తున్నారు. ఈ కేసును ఎన్ఐఏకు అప్ప‌గించారు.

గ‌త రెండు నెల‌ల నుంచి జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్ర దాడులు ఊపందుకున్నాయి. సుమారు 30 మంది భ‌ద్ర‌తా సిబ్బంది ఆ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇదే స‌మ‌యంలో సుమారు 38 మంది ఉగ్ర‌వాదులు కూడా హ‌త‌మ‌య్యారు. ఇటీవ‌లే హిజ్బుల్ ముజాయిద్దిన్ క‌మాండ‌ర్ రియాజ్ నైకూను భ‌ద్ర‌తా ద‌ళాలు హ‌త‌మార్చిన విష‌యం తెలిసిందే.

పంటలు అమ్ముకునే రైతులపై జగన్ యూజర్ చార్జీలు


రైతుల పంటలను గ్రామాల్లో వారి పొలాల వద్దనే కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నా, ఆ విధంగా తమ ఉత్పత్తులను అమ్ముకొనే రైతులపై ఆయన ప్రభుత్వం యూజర్ చార్జీల భారం మోపుతున్నది. రవాణా, గోనెసంచులు, కాటా, ప్యాకింగ్‌, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ తదితర ఖర్చులను రైతులే భరించాలని అధికారుల ద్వారా అనధికార ఆదేశాలు జారీచేస్తున్నారు.

అన్ని ఖర్చులూ కలుపుకొని క్వింటాలుకు రూ.66 వంతున రైతులు పెట్టుకోవాలను అంటున్నారు. జొన్న‌, మొక్క‌జొన్న కొనుగోళ్లకు సంబంధించి కొన్ని జిల్లాల్లో జాయింట్‌ కలెక్టర్లు మౌఖిక సూచనలు చేయగా, కొన్ని చోట్ల అధికారికంగా సర్క్యులర్లు జారీ చేశారు. గ్రామాల్లోనే, అదీ పొలాల వద్దనే పంటలు కొనుగోలు చేసేటప్పుడు రవాణా ఛార్జీలకు సైతం వసూళ్లకు పాల్పడుతున్నారు.

సాధారణ రోజుల్లోనే రైతులు పండించిన ప్రతి గింజను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)పై సేకరిస్తామని సర్కారు హామీ ఇచ్చింది. కరోనా లాక్‌డౌన్‌ వేళ వివిధ ఛార్జీల రూపంలో రైతుల నుంచి అదనంగా వసూలు చేస్తామనడంతో రైతులు విస్తు పోతున్నారు. ఈ విధంగా కింటాలుకు రైతులు పెట్టుకోవాల్సిన ఛార్జీల మొత్తం రూ.66గా పేర్కొంటున్నా, వాస్తవానికి రూ.125 వరకు అవుతున్నది.

క్వింటాలుకు ట్రాన్స్‌పోర్టుకు రూ.30, గోనె సంచి రూ.20, కాటా, లోడింగ్‌, అన్‌లోడింగ్‌, ప్యాకింగ్‌లకు రూ.75 చొప్పున చాలా జిల్లాల్లో అనధికారికంగా రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. వ్యాపారులు, దళారులకు అమ్ముకుంటే ఎంఎస్‌పి రాదన్న భయంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఆశ్రయిస్తారు.

ఇక్కడ సైతం క్వింటాలుకు రూ.125 వరకు భరించాలనడంతో ఆందోళన చెందుతున్నారు. ఎకరంలో సగటున 30 క్వింటాళ్లు పండాయనుకుంటే రైతులు రూ.3 వేలు వినియోగ ఛార్జీల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీలను (రూ.66) లెక్కేసినా ఎకరానికి దాదాపు రూ.2 వేలు రైతులు తమ జేబుల్లో నుంచి పెట్టుకోవాల్సి వస్తున్నది.

జొన్న‌, మొక్కజన్న కొనుగోళ్లకు ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాల ప్రకారం రైతులు రూ.35 కోట్లకు పైన ఛార్జీలు కట్టాలి. రబీలో పండిన మొత్తం పంటతో నిమిత్తం లేకుండా మొక్కజన్న 3.64 లక్షల టన్నులు, జొన్న‌ లక్షన్నర టన్నులు సేకరించాలనుకున్నారు. ఈ మొత్తానికీ ప్రభుత్వం పేర్కొన్న విధంగా క్వింటాలుకు రూ.66 చెల్లించాలంటే రైతులపై రూ.34 కోట్లు, అనధికారికంగా క్వింటాలుకు వసూలు చేస్తున్న రూ.125 ప్రకారం అయితే సుమారు రూ.65 కోట్లు భారం పడుతుంది.

కరోనాపై వాస్తవాలు దాస్తున్న కెసిఆర్ ప్రభుత్వం


లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ తెలంగాణలో వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఏమీ లేదని ఒక వంక సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రజలు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే, అదే రోజు బుధవారం నాడు ఒకే రోజు రాష్ట్రంలో కరోనా కేసులు 108 పెరగడం, మరో ఆరుగురు మృతి చెందడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి.

దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,000 ను దాటి 2,099కు చేరుకున్నాయి. తెలంగాణలో ఒకేరోజు ఇన్ని కేసులు ఇంతవరకు నమోదు కాకపోవడం గమనార్హం. అట్లాగే మృతుల సంఖ్య 69కి పెరిగింది. కాగా, బుధవారం చనిపోయినవారిలో ఏడు రోజుల చిన్నారి, నాలుగు నెలల బాబు ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

పరిస్థితులు ఈ విధంగా ఉంటె ఆర్ టి సి కి ఆదాయం రావడం లేదని అంటూ రాత్రిపూట కర్ఫ్యూ నిబంధనల నుండి సడలింపు ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇక రాత్రి వేళల కూడా బస్సులు తిరగవచ్చు. బస్సుల నుండి దిగినవారు హైదరాబాద్ నగరంలో ఇళ్లకు వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు.

మరోవంక, కరోనా లెక్కలు వెల్లడించడంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బుధవారం రాత్రి పది గంటల తర్వాత విడుదల చేసిన బులెటిన్‌లో మొత్తం కేసుల సంఖ్య ఎంతన్నది స్పష్టంగా పేర్కొనలేదు. సాయంత్రం ఐదు గంటల నాటికి రాష్ట్రంలో ఇన్‌ఫెక్ట్ అయినవారి సంఖ్య 1,842 అని.. ఇందులో 39 కొత్త కేసులని పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 297 మందికి పాజిటివ్‌ వచ్చిందని.. అందులో 68 కొత్త కేసులని పేర్కొన్నారు. దీంతో కొత్త కేసుల సంఖ్య 108 అవుతుండగా.. మొత్తం కేసుల సంఖ్య 2,139 వస్తోంది. అయితే రాష్ట్రంలో మంగళవారం నాటి బులెటిన్‌లో మొత్తం కేసుల సంఖ్య 1,991గా ఉంది. దానికి బుధవారం నాటి 108 కేసులు కలిపితే 2,099 అవుతోంది.

అంటే మిగతా కేసులు ఏవి అన్నది గందరగోళంగా మారింది. బులెటిన్లో లెక్కలు తప్పుగా వచ్చాయని, మొత్తం కేసుల సంఖ్య 2,099గా పరిగణించాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ మెసేజ్ ఇచ్చారు. అయితే ఏ కేసుల లెక్కలో మార్పు చేయాలన్న వివరాలు వెల్లడించలేదు.

ఇక హెల్త్ డిపార్ట్మెంట్ రోజూ బులిటెన్లో ఏయే జిల్లాల్లో ఎన్ని కేసులు వచ్చాయన్న వివరాలు ఇచ్చేది. కానీ బుధవారం జిల్లాల వారీగా లెక్కలు, గ్రేటర్ హైదరాబాద్ లెక్కలు ఇవ్వలేదు. మృతులు ఎవరు, ఏ జిల్లా వారన్నది కూడా వెల్లడించలేదు.

ఆస్తులు అమ్మడం పాలన వైఫల్యమే..!


సంపద సృష్టించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళడం లేదని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు. సంపద సృష్టించకపోగా ఉన్న ఆస్తులు విక్రయిస్తున్నారని అన్నారు. ప్రజా ఆస్తులు అమ్మడం అంటే పాలన వైఫల్యమే అని స్పష్టం చేశారు. గుంటూరు నగరానికి ల్యాండ్ మార్క్ లాంటి పి.వి.కె.నాయుడు మార్కెట్ ను వేలానికి పెట్టి అమ్మేయాలనుకోవడం సరికాదు అన్నారు. గుంటూరు జిల్లా జనసేన నాయకులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో పవన్ మాట్లాడారు. గుంటూరు నగరంలోని పి.వి.కె.నాయుడు మార్కెట్ ను అమ్మాలనే ప్రభుత్వం నిర్ణయాన్నీ, పెరిగిన విద్యుత్ బిల్లుల తీరును వ్యతిరేకిస్తూ గత పది రోజులుగా గుంటూరు నాయకులు నిరాహార దీక్షలు చేస్తున్న నేపథ్యంలో పార్టీ పి.ఏ.సి. సభ్యులు బోనబోయిన శ్రీనివాస యాదవ్, పార్టీ లీగల్ విభాగం నాయకులు గాదె వెంకటేశ్వర రావు, సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యురాలు పాకనాటి రమాదేవి తదితరులు 24 గంటల దీక్ష చేపట్టారు. వీరికి పవన్ అభినందనలు తెలిపారు.

సంపద సృష్టించి, ఉపాధి కల్పించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అలా కాకుండా ఉన్న ఆస్తులు అమ్మేసి, వాటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడినవారిని రోడ్డున పడేయడం ఏమిటని ప్రశ్నించారు. గుంటూరు నగరంలో పి.వి.కె.నాయుడు మార్కెట్ ఒక ల్యాండ్ మార్క్ అన్నారు. ఈ మార్కెట్ తో నగర ప్రజలకు ఒక అనుబంధం కొన్ని దశాబ్దాలుగా ఉందని, ఆ మార్కెట్ మీద ఆధారపడి 5 వేల మంది చిరువ్యాపారులు బతుకుతున్నారని తెలిపారు. పేద వర్గాలకు చెందినవారికి ఆ మార్కెట్ ఒక ఉపాధి కేంద్రంగా ఉందన్నారు. ముస్లింలు, బీసీలు, పేద కులాలకు ఆ మార్కెట్ ఒక ఆధారంగా దాన్ని అమ్మేసి వారందరినీ రోడ్డున పడేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశించారు. గుంటూరు పరిసరాల నుంచి, పల్నాడు ప్రాంతం నుంచి ఎంతోమంది నిత్యం రైతులు తమ పంటలు అమ్ముకొనేందుకు నిత్యం పి.వి.కె.నాయుడు మార్కెట్ కు వస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రజా ఆస్తుల విక్రయించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మార్కెట్ ను అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఆస్తులు అమ్మడంతో తెలంగాణ ప్రజల్లో ఆగ్రహం ఏర్పడింది. పెట్టుబడులు వచ్చే మార్గాన్ని ఈ ప్రభుత్వం అన్వేషించడం లేదని స్పష్టం చేశారు. కరోనాతో ప్రజలందరూ ఆందోళనతో ఉంటే ప్రభుత్వం అండగా నిలవాల్సిందిపోయి విద్యుత్ బిల్లు పెంచేసి ఇబ్బందిపెడుతోందన్నారు. మరో వైపు ప్రజా ఆస్తులను అమ్మేస్తోందని జనసేన నాయకులు, శ్రేణులు ప్రజా ఆస్తుల వేలాన్ని వ్యతిరేకిస్తూ, విద్యుత్ బిల్లుల పెంపును నిరసిస్తూ చేస్తున్న దీక్షలు నా మనసును కదిలించాయన్నారు.

మత సామరస్యం-జాగృత హిందూ సమాజం (భాగం 8)

పోయినసారి హిందూ సమాజం లో కులం పాత్ర , రావాల్సిన మార్పులు గురించి విపులంగా చర్చించుకున్నాం. కులరహిత సమాజమే హిందూ మతానికి శ్రీరామ రక్ష అని కూడా నొక్కి వక్కాణించాం. స్వాతంత్రానంతర భారత్ లో హిందూ సమాజం ఎలా పరిణతి చెందిందో ఈ భాగం లో చర్చించుకుందాం. దేశ స్వాతంత్రం మతపర విభజన తో ప్రారంభమవటం ఓ మాయని మచ్చ. అది ప్రజల గుండెల్లో పెద్ద గాయాన్నే చేసింది. నిజం చెప్పాలంటే ఇందులో ప్రజల పాత్ర ఏమీలేదు. బ్రిటీష్ వాడు తన స్వార్ధం కోసం ప్రజల తో ఆడిన భయంకరమైన క్రీడ. దానితో ప్రజలు ఎన్నో బాధలు పడ్డారు. అది ఈరోజుకీ మనల్ని దహిస్తూనే వుంది. దానికి తోడు మన పాలకులు, రాజకీయ పార్టీలు ఈ మత గుర్తింపు రాజకీయాల్ని పెంచి పోషించారు.

రాజ్యాంగ చర్చలు, వాటి పర్యవసానం

రాజ్యాంగ సభ అతిరధ మహారధుల తో పూర్తి మేధోసంపత్తి తో వుండి  ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించటం జరిగింది. మతపరమైన విషయాలపై కూడా లోతుగా చర్చించారు. మొదటి రాజ్యాంగ సభ చర్చలకు కర్ఫ్యూ పాసులతో రావలసి వచ్చింది.అది డిసెంబర్ 1946 పరిస్థితి. డిల్లీ అంతా మత కల్లోలాలతో అట్టుడికి పోయింది. వచ్చే శరణార్ధులకు ఆశ్రయం కల్పించటం పెద్ద సమస్య అయ్యింది. ఈ నేపధ్యం లో 1947 ఫిబ్రవరి -మార్చి లో మొదలైన వుమ్మడి పౌర స్మృతి చర్చ చాలా ఘాటు గా జరిగింది. ప్రధానంగా డాక్టర్ అంబేద్కర్, కే ఎం మున్షి, మినూ మసాని వుమ్మడి పౌర స్మృతి వస్తేనే దేశం ఐక్యంగా ముందుకు సాగుతుందని వాదించారు. వీరికి మద్దతుగా మహిళా సభ్యులు రాజ్ కుమార్ అమ్రిత్ కౌర్ , హంసా మెహతా నిలిచారు. వీరి వాదన ఇంకోలా వుంది. అసలు అన్ని మతాలూ పురుషాధిక్య మతాచారాలతో కూడి వున్నాయి. వుమ్మడి పౌర స్మృతి ఒక్కటే మహిళలకు సమాన గౌరవం ఇస్తుందనేది వీరి వాదన. కానీ దీనిపై కమిటీ లోని నలుగురు ముస్లిం సభ్యులు ( ముస్లిం లీగ్ ) తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు అందరూ నెహ్రూ అభిప్రాయం వైపు చూసారు. నెహ్రూ వుమ్మడి పౌర స్మృతి కన్నా మతాచారాలకు లోబడి విడివిడిగా పౌర స్మృతి వుంటేనే ప్రస్తుత పరిస్థితుల్లో మంచిదని అభిప్రాయపడ్డాడు. చివరకు రాజీ మార్గంగా వుమ్మడి పౌర స్మృతి ని ఆదేశిక సూత్రాల్లోకి చేర్చారు. ఆ తర్వాత ఈ 72 సంవత్సరాల్లో కూడా దీనిపై దృష్టి సారించలేదు.

ఆరోజు పడిన రాజీనే కొంప ముంచింది. రాను, రాను మత పరమైన రాజకీయాలు పెరిగి మొక్క మానయి కూర్చుంది. 21 వ శతాబ్దం లో కూడా సమాజం మతపర వుద్రిక్తతలతో కొట్టు మిట్టాడుతుంది. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లో వుమ్మడి పౌర స్మృతి అమలు లో వుంది. అదే ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా వుంది. కమ్యూనిస్టు రాజ్యాల్లో కూడా వుమ్మడి పౌర స్మృతి అమలు లో వుంది. లేనిదల్లా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లోనే. అంబేద్కర్ హిందూ మతాన్ని వదిలిపెట్టినా హిందూ కోడ్ బిల్లు లు తీసుకొచ్చి హిందూ సమాజానికి ఎంతో మేలుచేశాడు. ముఖ్యంగా స్త్రీలు ఆత్మ గౌరవంగా సమభావం తో మెలగటానికి దోహదపడింది. ఆ తర్వాత 2005 లో వచ్చిన చట్టంతో ఆస్తి లో సమవాటా రావటం కూడా మహిళా సాధికారత కు దోహదపడింది. హిందువులు నూటికి ఆనాటికి 85 శాతం పైన వుండి కూడా ఈ దేశంలో కోరుకున్న వుమ్మడి పౌర స్మృతి ని తెచ్చుకోలేకపోవటం మన సెక్యులర్ రాజ్యాంగం డొల్ల తనాన్ని బయటపెట్టిందని చెప్పాల్సివుంది. అదేమీ హిందూ పౌర స్మృతి కాదని గుర్తించుకోవాలి. వాస్తవానికి ఆనాటి హిందూ సనాతన వాదులకు అది ఇష్టం లేదు. అలాగే తర్వాత వచ్చిన హిందూ కోడ్ బిల్లులు కూడా ఇష్టం లేదు. ఉదారవాదులు అధికంగా గల హిందూ సమాజం లో దేశప్రజలందరూ వుమ్మడి చట్టాల గొడుగులో వుండాలని కోరుకున్నారు. విచిత్రమేమంటే వుదారవాదులని , అభ్యుదయ వాదులని చెప్పుకునే వాళ్ళే ఆరోజు దీన్ని వ్యతిరేకించటం చూస్తుంటే భారత రాజకీయాల వైవిధ్యభరిత చిత్రపటం అవగతమవుతుంది. రాజ్యాంగ సభ మత రాజకీయాలకు స్వస్తి చెప్పే బంగారు అవకాశాన్ని కోల్పోయింది.

రాజకీయ అవకాశవాదం

అభ్యుదయవాదిగా ముద్రపడిన నెహ్రూ మతాలకతీతంగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. హిందూ కోడ్ బిల్లు విషయం లో సనాతన వాదులు వ్యతిరేకించినా కాదని ధైర్యంగా ముందడుగు వేసి శభాష్ అనిపించుకున్నాడు. అదే ముస్లిం పౌర స్మృతి విషయం లో సనాతనవాదులకు తలొగ్గి సంస్కరణలకు తిలోదకాలివ్వటం దురదృష్టం. దానివలన ఎక్కువ నష్టపోయింది ముస్లిం మహిళలు. ఈ ద్వంద వైఖరే అప్పట్నుంచీ ఇప్పటివరకూ ప్రభుత్వాలు పాటిస్తూ వచ్చాయి. ముస్లిం బుజ్జగింపు రాజకీయాలు పరిపాలన లో ఎన్నో జరిగాయి. చివరకు షాబానో కేసులో సుప్రీం కోర్టు తీర్పుని కూడా కాలరాచి చట్టం ద్వారా సనాతనవాదుల్ని సంతృప్తి పరచటం వీరి అవకాశవాదానికి పరాకాష్ట. వీరి చర్యలవలన ముస్లిం సమాజం తీవ్రంగా నష్టపోయింది. మిగతా మతస్తులు ఆధునిక విద్యలో దూసుకు పోతుంటే ముస్లిం పిల్లలు మదరసాలలోనే విద్య నభ్యసించటం వారిని ఆధునిక పౌరులుగా తయారుచేయకపోవటమే. ముమ్మూరు తలాక్ లాంటి కరుడుగట్టిన పురుషాధిక్య సమాజం లో వుండటం వలన నష్టపోయింది ముస్లిం మహిళలే. ముస్లిం బుజ్జగింపు రాజకీయాలతో వాళ్ళ బతుకులేమీ బాగుపడలేదు. బాగుపడిందల్లా రాజకీయనాయకులే. సచార్ కమిటీ నివేదిక తర్వాతైనా ముస్లిం మేధావుల్లో మార్పు రాకపోవటం శోచనీయం. సనాతన భావాలు గల మతపెద్దల మాటే చెల్లుబాటు అవుతూ వచ్చింది. ఒకవైపు ఈ అవకాశవాద రాజకీయాల వలన ముస్లిం లకు జరిగిన మేలు శూన్యమైనా రెండోవైపు ఈ బుజ్జగింపు రాజకీయాలతో మెజారిటీ హిందువుల్లో తమకన్యాయం జరుగుతుందని భావించే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. మొదట్లో ఈ వాదనను పెద్దగా పట్టించుకోని వాళ్ళు కూడా తర్వాత తర్వాత ఒక చెవి అటు వేయటం మొదలయ్యింది.

హిందూ సమాజం జాగృతం దిశగా అడుగులేసింది

మొదట్లో నెహ్రూ ప్రభావం లో వున్న హిందూ సమాజం మెల్లి మెల్లిగా మార్పునకు లోనయ్యింది. సెక్యులరిజం పేరుతో  బుజ్జగింపు రాజకీయాలు చేయటాన్ని ఈసడించు కోవటం మొదలుపెట్టారు. మొదట్లో వీళ్ళు భారతీయ జన సంఘ్ రాజకీయ పార్టీ కింద, ఆర్ఎస్ ఎస్ సంస్థ కింద సమీకరించబడ్డారు. 1967 వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బలహీనపడింది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ వ్యతిరేక కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అందులో జన సంఘ్ కూడా భాగస్వామి గా వుంది. తర్వాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించటం , ప్రతిపక్ష నాయకుల్ని జైళ్లలో వుంచటం జరిగింది. 1977 ఎన్నికల్లో మొట్టమొదటిసారి జనతాపార్టీ అధికారం లోకి రావటం అందులో పూర్వ జన సంఘ్ కి చెందిన అటల్ బిహారి వాజపేయి , లాల్ కృష్ణ అద్వాని మత్రులుగా వుండటం తో కేంద్రం లో హిందుత్వ అనుకూల శక్తులు అధికారం లోకి వచ్చాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జనతా పార్టీ విడిపోవటం , పూర్వ జన సంఘ్ నాయకులు భారతీయ జనతా పార్టీ ని స్థాపించటం జరిగింది. అప్పటికున్న  మూడు దశాబ్దాల అనుభవంతో జన సంఘ్ కి భిన్నంగా బిజెపి ని హిందువుల్లోని అన్నివర్గాల పార్టీగా మలుచుకోగలిగారు. వాజపాయి దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగాడు. వాజపాయ్-అద్వాని జంట నాయకత్వం కింద మెల్లి మెల్లిగా హిందువులు సమీకరించబడ్డారు. కాంగ్రెస్ , మిగతా సెక్యులర్ పార్టీల బుజ్జగింపు రాజకీయాలు వీరికి కలిసొచ్చాయి.

అద్వాని పార్టీ యంత్రాంగ నిర్మాణం, వాజపాయి ప్రజాదరణ బిజెపి ని కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా బలమైన పార్టీగా తయారుచేసాయి. 1990 దశకం లో అద్వాని రధయాత్ర హిందూ సమాజం లో పెద్ద సంచలనమే లేపింది. అప్పటిదాకా బిజెపి ని ఆదరించని వర్గాలు కూడా అద్వాని ఉపన్యాసాలకు ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా హిందువుల ఆరాధ్య దైవమైన రాముడి జన్మ స్థలం లో గుడి నిర్మాణం కోసం తను చేసిన వాదనలు హిందూ మతస్థులను ఆకర్షించాయి. ముఖ్యంగా పశ్చిమ, ఉత్తర భారతం ఈ ప్రభావానికి లోనయ్యింది. ఈ ప్రచారం తో పాటు ఇన్ని సంవత్సరాలు మెజారిటీ హిందువులపై ప్రభుత్వాలు ఏ విధంగా వివక్ష చూపించింది సోదాహరణం గా వివరించటం తో ఈ రెండు ప్రాంతాల్లో హిందువులు బిజెపి కింద సమీకృత మయ్యారు. అదే బాబ్రీ మసీదు కూల్చివేతకు దారి తీసింది. ఇక్కడ మనం ఒక్క విషయం గమనించాలి. ఇదేదో కొద్దిమంది ఆర్ ఎస్ ఎస్ , విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పూనుకొని చేసారనుకుంటే పొరపాటు. రాజకీయ పార్టీలు, మేధావులు ఇక్కడే పరిస్థితి ని అంచనా వేయటం లో పొరపాటు పడ్డారు.  ఈ రెండు ప్రాంతాల్లోని మెజారిటీ హిందువుల్లో  రామ జన్మ భూమి ఉద్యమం బలంగా పాతుకుపోయింది కాబట్టే వీళ్ళు ఈ పని చేయగలిగారు. మొదట్లో కొద్దిమంది కార్యకర్తల ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మలచటం లో ఫలప్రదం అయ్యారు కాబట్టే ఈ పని చేయగలిగారు. మతం, మత విశ్వాసాలు సమాజంలో ఎంతో ప్రభావితం చూపిస్తాయనే దానికి ఇదో పెద్ద ఉదాహరణ. ఇది హిందూ సమాజం జాగృతం అయ్యింది కాబట్టే సాధ్యమయ్యింది.

21 వ శతాబ్దం లో తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరణ

మొదటిసారిగా అటల్ బిహారీ వాజపాయ్ ప్రధానమంత్రిగా అయిదేళ్ళు పనిచేయటం ( 1999-2004) హిందూత్వ శక్తులకు ఊతం ఇచ్చింది. కొత్త ప్రాంతాలకు , కొత్త వర్గాలకు విస్తరించింది. అయితే మధ్యలో జరిగిన గోధ్రా సంఘటన , దాని పర్యవసానంగా జరిగిన గుజరాత్ అల్లర్లు మత సామరస్యానికి మాయని మచ్చ. అయినా ఆశ్చర్యంగా గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ని తిరిగి తిరిగి ఎన్నుకున్నారు. ఆ సంఘటనను మెజారిటీ హిందువులు దురదృష్టకర సంఘటన గా భావించినా, జాతీయ మీడియా మోడీ ని బాద్యుడిని చేసినా గుజరాత్ ప్రజల్లో ఆ భావం ఏర్పడలేదు. అప్పుడు జరిగిన సంఘటనలను చర్య-ప్రతీకార చర్యలుగానే గుజరాత్ ప్రజలు భావించారు. అయినా ఈ సంఘటనలు నాగరిక సమాజం లో క్షంతవ్యం కాదు. మత ఉద్రిక్తతలు మానవత్వాన్ని మంట గలుపుతాయనే దానికి ఈ రెండు ఘటనలు ఉదాహరణలు.

తర్వాత పది సంవత్సరాలు బిజెపి అధికారం లో లేకపోయినా హిందూత్వ వాదం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. యుపిఎ ప్రభుత్వం పై పెరిగిన అసంతృప్తి నేపధ్యం లో బిజెపి ని ప్రత్యామ్నాయంగా ప్రజలు చూసారు. దానితోపాటు మోడీ గుజరాత్ లో చూపించిన అభివృద్ధి నమూనా ప్రజల్లో ముఖ్యంగా యువతని ఆకర్షించింది. 2014 ఎన్నికల్లో ఈ రెండూ కలిసి మోడీని పెద్ద మెజారిటీ తో గెలిపించాయి. అది హిందూత్వ వాదానికి పరాకాష్ట. కానీ మోడీ గెలవటానికి మాత్రం అభివృద్ధి మంత్రమే ప్రధానం. ఆ రోజునుంచీ హిందుత్వ వాదానికి మహర్దశ వచ్చిందని చెప్పొచ్చు. మోడీ దీన్ని జాతీయవాదం గా మార్పు చేయగలిగాడు. మోడీ ఆరు సంవత్సరాల పరిపాలన లో ఎప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకంగా మాట్లాడటం జరగలేదు. తను తీసుకున్న సంక్షేమ పధకాలు అత్యంత పేదరికం లో వున్న ముస్లింల కే ఎక్కువగా ఉపయోగపడ్డాయి. ముమ్మూరు తలాక్ చట్టం తో, హాజ్ యాత్రకు మహిళలు ఒక్కరే వెళ్ళే పధకం తో ముస్లిం మహిళా సాధికారతకు పెద్దపీట వేసాడు. అలాగే బిజెపి పాలిత రాష్ట్రాలు ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో మదరసా ల్లో ఆధునిక విద్యను ఖచ్చితంగా అమలుచేసే విధంగా మార్పులు చేసారు. ఇందులో ముస్లిం వ్యతిరేక చర్యలేమీ లేవు. ఓ విధంగా ముస్లిం లకు ఉపయోగపడేవే. అయితే ఇవేవీ ముస్లిం మత పెద్దలకు రుచించలేదు. కొంతమంది కింది స్థాయీ నాయకుల రెచ్చగొట్టే ప్రకటనలనే భూతద్దం లో చూపించి మోడీ ముస్లిం వ్యతిరేకిగా చిత్రించే ప్రయత్నం చేసారు. మోడీ మాత్రం ప్రభుత్వం అందరినీ సమానంగానే చూస్తుందనే భావన కలిగించటానికి ప్రయత్నించాడు.

డిల్లీ అల్లర్లు మత ఉద్రిక్తతల సమాజానికి చిహ్నం 

అయితే వామపక్ష తీవ్రవాదులు, ఇస్లాం మతవాదులు ముస్లిం లలో మోడీ వ్యతిరేకత నూరిపోస్తూనే వున్నారు. చివరకు పౌరసత్వ సవరణ చట్టం వీరికి ఆయుధంగా మారింది. ముస్లిం సమాజం లో ఈ చట్టం పై అపోహలు కలిగించటం లో కొంతమేర సఫలీకృత మయ్యారు. దీనివలన దేశంలోని ముస్లిం ల పౌరసత్వానికి ముప్పు వస్తుందని ఆధారాలు లేని ఆరోపణలతో ముస్లిం లను రెచ్చగొట్టారు. దీని పరాకాష్టే డిల్లీ నిరసనలు. ప్రభుత్వం దీనిపై సంయమనం పాటించటం తో దీన్ని ఎలా ముగించాలో తెలియక అయోమయం లో వున్న సమయం లో అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన ఓ అవకాశంగా కన్పించింది. అంతర్జాతీయ సమాజం లో భారత్ ని ముస్లిం వ్యతిరేకిగా చిత్రీకరించటానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. ఇటీవలే పోలీస్ నివేదిక లో ఈ కుట్ర బహిర్గతమయ్యింది. అయినా అనుకున్న ప్రయోజనం నెరవేరింది. ట్రంప్ పర్యటన తో వచ్చిన అనేక అంతర్జాతీయ విలేకరులు దిల్లీ అల్లర్లు ముస్లిం లపై హిందువుల మూకుమ్మడి దాడిగా చిత్రీకరించటంతో వీరి ప్రయోజనం నెరవేరింది. వాస్తవానికి ఈ ఘర్షణల్లో ఇరువైపులా ప్రజలు చనిపోయారు. రెండు మతాలకు చెందిన ఆస్తులు ధ్వంసం అయ్యాయి. కానీ అంతర్జాతీయ ప్రచారం మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. ఘర్షణల్లో ఎప్పుడూ రెచ్చగొట్టే వాళ్ళు రెండువైపులా ఉంటారనేది అందరికీ తెలిసిందే. ఇంకో ముఖ్యవిషయం . అమెరికా అధ్యక్షుడు పర్యటన లో వున్నప్పుడు అధికార పార్టీ వారు ఇటువంటి అల్లర్లు సృష్టిస్తారనేది లాజిక్ కి అందని విషయం.

చరిత్రలో మైలురాయి 

ఈ ఆరు సంవత్సరాల్లో జరిగిందేమిటంటే హిందూత్వ శక్తులు పునరుత్తేజం పొందాయి. చరిత్రలో తమకు జరిగిన అన్యాయాల్ని సరిదిద్దే పని ని భుజాన వేసుకున్నట్లు అర్ధమవుతుంది. దేశ ప్రయోజనాల విషయం లో అదివరకటి ప్రభుత్వాల కన్నాధృడంగా వ్యవహరించటం తో వీళ్ళ ప్రతిష్ట పెరిగింది. ఒక దేశానికి కావాల్సిన బలమైన జాతీయవాదాన్ని ప్రజల్లో తీసుకు రాగలిగారు. పరిపాలనా పరంగా అదివరకటి ప్రభుత్వాలతో పోలిస్తే మెరుగ్గా చేయగలమని నిరూపించారు. అవినీతి విషయం లో యుపిఎ తో పోలిస్తే తక్కువ అవినీతి ప్రభుత్వం గా ముద్ర వేసుకోగలిగారు. అదే సందర్భం లో బుజ్జగింపు రాజకీయాలు లేకుండా ఎలా పరిపాలించ వచ్చో చూపించారు. హిందూ భక్తుల మనోభావాలతో ముడి పడిన రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించటం కూడా ఈ హిందూత్వ వాదానికి మరింత నైతిక బలం చేకూరింది. ఒకవిధంగా చెప్పాలంటే 1300 సంవత్సరాల తర్వాత తిరిగి హిందూ సమాజం ఉచ్చదశకి చేరిందని చెప్పొచ్చు. అతి ప్రాచీన నాగరికత కలిగిన , అతి ప్రాచీన మతమైన హిందూ మతం తిరిగి పునరుత్తేజం పొందటం వెనక ఆర్ ఎస్ ఎస్  కృషి ఎంతో వుంది. అది ఏర్పరిచిన పునాదిపైనే రాజకీయంగా మోడీ నాయకత్వాన బిజెపి హిందూ భావనతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పరచ గలిగింది. ఇది చరిత్రలో పెద్ద సంఘటన గా చెప్పుకోవల్సివుంది. ఇదీ పునరుత్తేజం చెందిన హిందూ సమాజ పురోగతి.

అంతమాత్రాన హిందూ సమాజానికి , అది ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వానికి అంతా పూల బాట కాదు. మధ్యలో ఎన్నో సవాళ్లు, అవాంతరాలు, అవరోధాలు పొంచివున్నాయి. అవేమిటో వచ్చే భాగం లో చర్చించుకుందాం.

 

రైతులకు కేసీఆర్ అభినందనలు!

యాసంగిలో వరి ఉత్పత్తిపై సీఎం కేసీఆర్‌ రైతులకు అభినందనలు తెలిపారు. ఈ యాసంగిలో తెలంగాణ నుంచే అత్యధికభాగం ధాన్యం సేకరణ చేశామని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సీఎండీ డీవీ ప్రసాద్‌ ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పెరిగిన సాగునీటి లభ్యతను, ఉచిత విద్యుత్‌ ను తెలంగాణ రైతులు సమర్థంగా వినియోగించుకొని, తమ వృత్తి నైపుణ్యంతో బ్రహ్మాండమైన పంటలు పండించారని సీఎం ప్రశంసించారు.

దేశానికి కావాల్సిన ఆహారం అందించడంలో తెలంగాణ నంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలిచిందని దీంతో తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా అవతరించిందని సీఎం కేసీఆర్ అభినందించారు. యాసంగిలో తాము సేకరించిన మొత్తం ధాన్యంలో 63 శాతం కేవలం తెలంగాణ నుంచి, మిగతా అన్ని రాష్ర్టాల నుంచి కలిపి 37 శాతం సేకరించినట్టు తెలుపడం రాష్ర్టానికి గర్వకారణమని చెప్పారు.

కరోనా నేపథ్యంలో ఎదురైన అనేక సవాళ్లను అధిగమించి ఈ సారి ప్రభుత్వ రంగ సంస్థలు రికార్డుస్థాయి కొనుగోళ్లు చేపట్టాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎఫ్‌సీఐ ఈ యాసంగిలో ఇప్పటిదాకా 83.01 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, అందులో తెలంగాణ నుంచే 52.23 లక్షల టన్నులు సేకరించినట్టు స్పష్టంచేశారు. ఈ సారి ఎఫ్‌సీఐ 91.07 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో సగానికి పైగా ఇప్పటికే తెలంగాణ సమకూర్చిందన్నారు. తెలంగాణలో ఈ యాసంగిలో ఎక్కువ వరి పంట పండినందున అది దేశ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడిందని ఎఫ్‌సీఐ విడుదల చేసిన ప్రకటన ద్వారా స్పష్టమైందని పేర్కొన్నారు.

ఒక్కరోజే వంద దాటినా కరోనా కేసులు!

Telangana

Telangana

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 107 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ లో పేర్కొంది. అందులో తెలంగాణకు సంబంధించి 39 కేసులు కాగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో 69 మందికి ఈ రోజు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వలస కూలీలు 19 మంది, సౌదీ అరేబియా నుంచి వచ్చిన 49 మందికి కరోనా వచ్చినట్టు నిర్ధారణ అయింది. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1842గా ఉంది. వలస కూలీలు, ఇతర రాష్ట్రాలు దేశాల నుంచి వచ్చిన వారికి కరోనా సోకిన వారి సంఖ్య 297గా ఉంది. ఇప్పటి వరకు తెలంగాణలో 1321 మంది డిశ్చార్జ్ అయ్యారు. 63 మంది ప్రాణాలు కోల్పోయారు. 714 మంది యాక్టివ్ కరోనా పేషెంట్లు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు కరోనాతో ఆరుగురు చనిపోయారు.

కరోనా విషయంలో ప్రజలు భయోత్పాతానికి గురి కావాల్సిన పనిలేదని, లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఏమీ లేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఒక వేళ రాబోయే రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినప్పటికీ, తగిన వైద్య సేవలు అందించడానికి వైద్య,ఆరోగ్య శాఖ సంసిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు.

తెలంగాణలో మంచి ఫలితాలకు కారణం మేమే:బాబు

Mahanadu

Mahanadu

మహానాడులో భాగంగా పార్టీ శ్రేణులనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వెబినార్‌ ద్వారా ప్రసంగించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు తెలంగాణలో మంచి ఫలితాలను ఇస్తోందని ఆయన అన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరం చేశామని ఆయన చెప్పారు. జంట నగరాలకు తోడుగా సైబరాబాద్ ను నిర్మించాం అని ఆయన చెప్పారు. అభివృద్ధికి అనుకూల వాతావరణం సృష్టించామని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేశామని ఆయన తెలిపారు. టిడిపి హయాంలో చేపట్టిన పథకాలు దేశానికి మార్గదర్శకం అయ్యాయని ఆయన తెలిపారు. కార్యకర్తల త్యాగాలు జీవితంలో మర్చి పోలేనని ఆయన చెప్పారు.గత ఏడాది దురదృష్టకర సంవత్సరమని ఆయన చెప్పారు. శారీరకంగా మానసికంగా, ఆర్థికంగా కార్యర్తలను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. చేయని తప్పుకు టిడిపి కార్యకర్తలు జైలుకు వెళ్లారని చంద్రబాబు ఆరోపించారు.

టీడీపీ కార్యాలయానికి కొవిడ్ నోటీసులు


గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి కొవిడ్‌ నోటీసులు అధికారులు అందజేశారు. టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నందున కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళగిరి తహసీల్దార్‌ నోటీసులు జారీ చేయగా టీడీపీ కార్యాలయ కార్యదర్శి రమణకు ఆత్మకూరు వీఆర్వో నోటీసులు అందజేశారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు జారీ చేయడాన్ని టీడీపీ నాయకులు తప్పుబట్టారు.

మరోవైపు లాక్ డౌన్ నిబంధనలను చంద్రబాబు ఉల్లంఘించారంటూ దాఖలైన పిటీషన్ పై విచారణ చేపట్టింది. ఈ అంశంపై అధికారులకు పిర్యాదు చేశారా అని పిటీషనర్ తరుపు న్యాయవాదిని ప్రశ్నించింది. గతంలో ఎటువంటి పిర్యాదులు లేకుండానే ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఇందుకు సంభందించిన కేసు విచారణ గురువారం విచారణ ఉందని, వాటితో కలిపి విచారణ చేపడతామని హైకోర్టు ఆదేశించింది.

వరి దిగుబడిలో తెలంగాణ సరికొత్త రికార్డు!

Paddy record

Paddy record

వరి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డ్ ని సొంతం చేసుకుంది. రాష్ట్రం ప్రజల ఆకలితీర్చే అన్నపూర్ణగా మారింది. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఈ ఏడాది ఆహార ధాన్యాల దిగుబడి వచ్చింది. వరి ధాన్యం సేకరణ, దిగుబడిలో దేశంలోనే తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. భారత్‌ లో వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానం సాధించింది. ఈ సంవత్సరం యాసంగి పంట వరి ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది.

ఈ రోజు వరకు దేశంలో 83.01 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించగా తెలంగాణ వాటానే 52.23 లక్షల టన్నులుగా ఉందని ఎఫ్‌సీఐ తెలిపింది. దేశం నిర్దేశించిన లక్ష్యంలో సగం కంటే ఎక్కువ తెలంగాణ నుంచే దిగుబడి వచ్చిందని పేర్కొంది. దేశం నిర్దేశించుకున్న లక్ష్యం 91.07 లక్షల టన్నులని వెల్లడించింది.

సీనిరంగానికి బెస్ట్ పాలసీ తీసుకొస్తాం: తలసాని


సినిమా పరిశ్రమకు బెస్ట్ పాలసీని తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం మాసాబ్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా షూటింగులకు అనుమతి, థియేటర్ల ఓపెనింగ్ వంటి అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సినీ పరిశ్రమ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. సినీ పరిశ్రమను నమ్ముకొని వేలాది మంది కార్మికులు జీవిస్తున్నారని తెలిపారు. లాక్డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో కళాకారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నివిధలా సహాయసహకారాలు అందిస్తుందని తెలిపారు.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ పెద్దలతో సమావేశం నిర్వహించిన సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సినీ పెద్దలతో సమావేశంలో నిర్వహించినన పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిని సావధానంగా విన్నారని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం పోస్టు ప్రొడక్షన్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. ఇక షూటింగులకు సంబంధించి మార్గదర్శకాలను పరిశ్రమలోని అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. థియేటర్ల ఓపెనింగ్ సంబంధించి కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3గంటలకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో సినీరంగంలోని పలువిభాగాలకు చెందిన ప్రముఖులు సమావేశమై చర్చించిన తర్వాత తగు నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సమావేశంలో నిర్మాతలు సి.కల్యాణ్, దిల్ రాజు, డైరెక్టర్ ఎన్.శంకర్, మా అధ్యక్షుడు నరేష్, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ రాంమోహన్ రావు, జీవిత, పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు.