
ఏపీ సీఎం జగన్ ఎంతకూ తగ్గనంటున్నాడు. రంగుల రాజకీయంలో హైకోర్టు ఆదేశించినా కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. టీడీపీ హయాంలో అన్ని పచ్చగా ఉండగా లేనిది.. తన హయాంలో తన పార్టీ రంగు ఉంటే తప్పేంటని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు వేసిన పార్టీ రంగులను తొలగించేందుకు సిద్ధంగా లేనట్లుగా తెలుస్తోంది.
* వైసీపీ రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కగానే వైసీపీ ప్రజాప్రతినిధులు కొందరు స్వతహాగా.. ప్రభుత్వం మరికొంత ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయించింది. వైసీపీ ప్రభుత్వం ఉండడంతో యథాలాపంగా ఆ పార్టీ రంగులే వేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్నింటికి పసుపు కలర్ ఉండేది. అన్యాక్యాంటీన్లు సహా అన్నింటికి ఉన్న నాడు వైసీపీ అభ్యంతరం పెట్టలేదు. కానీ నేడు టీడీపీ హైకోర్టుకెక్కి రంగులను మార్చాలని తీర్పును రాబట్టింది.
*డబ్బుల్లేవ్.. రంగులపై సుప్రీంకు జగన్ ప్రభుత్వం
గ్రామ పంచాయితీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై ప్రభుత్వం ఉత్తర్వులు జీవో నంబర్ 623 జారీ చేసింది. అయితే గత వారం రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. రంగులు మార్చాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.అయితే జగన్ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో మే 28లోగా పంచాయితీరాజ్ కమిషనర్ స్పందించకపోతే ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. దీంతో జగన్ సర్కార్ లాక్డౌన్ వేళ రంగులు మార్చడానికి డబ్బులు లేవని.. అన్ని కార్యాలయాలకు రంగులు మార్చడానికి కోట్లు వ్యయం అవుతుందని కాబట్టి రంగులు అలాగే ఉంచాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేసింది.
*స్వయంగా హైకోర్టుకు ఏపీ సీఎస్
హైకోర్టు ధిక్కార నోటీసుకు తమ వివరణ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం తరుఫున ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, పంచాయతీ రాజ్ కార్యదర్శి గిరిజా శంకర్ ఇద్దరూ హైకోర్టుకు హాజరయ్యారు. వారు వివరణాత్మక అఫిడవిట్లు సమర్పించి, ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రత్యేక లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలియజేసింది. ఫలితంగా ధిక్కార పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం వాయిదా వేసింది.
దీంతో జగన్ సర్కార్ పంతం నెగ్గినట్టైంది. రంగుల రాజకీయం సుప్రీం కోర్టుకు చేరింది . సుప్రీం ఏం తీర్పునిస్తుందనేది ఆసక్తిగా మారింది. జగన్ మాత్రం వెనక్కితగ్గకూడదని ఈ విషయంలో పట్టుదలగా ఉండడం విశేషం.