Homeఆంధ్రప్రదేశ్‌తెలుగు రాష్ట్రాల్లో నిప్పులు చెరుగుతున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో నిప్పులు చెరుగుతున్న ఎండలు


తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. సాధారణ ఉష్ణోగ్రత కంటే 5 డిగ్రీలు ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్‌ మొదటివారం వరకు ఎండల తీవ్రత ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.

రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తీవ్రతరమవుతున్నాయి. వడగాల్పులు, ఎండల తీవ్రతతో జనం అల్లల్లాడిపోతున్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళల పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. కేరళను రుతుపవనాలు తాకితే తప్ప వాతావరణంలో మార్పు సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

జూన్ 8 కల్లా రుతుపవనాలు వస్తాయని తొలుత భావించినప్పటికీ అవి కూడా అందని పండులా మరో ఐదు రోజులు రాకపోవచ్చన్న మరో పిడుగులాంటి వార్త ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అప్పటి వరకు ఎండలకు తోడు వడగాలుల ప్రభావం కూడా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

మండుటెండలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలు విలవిల్లాడుతున్నాయి. జనం ఇంటి నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. లాక్‌డౌన్ సడలింపుంల నేపథ్యంలో క్రమేపి జనజీవనం తిరిగి ప్రారంభమైనా ఎండ వేడిమికి ఇళ్ల నుంచి బయటకు వచ్చే కన్నా ఇళ్లల్లోనే ఉండి సెదతీరడం ఎంతో శ్రేయస్కరమని భావించిన ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇళ్లకే పరిమితమవుతున్నారు.

దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ప్రచండ భానుడి ప్రకోపం ఇంకెంత కాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఎపిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడగాల్పులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరింది.

రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నట్లు తెలిపింది. ఉదయం 11 గంటలకే ఎపిలోని పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. సాయంత్రం మూడు గంటలకు 47 డిగ్రీలు దాటే సూచనలున్నాయని పేర్కొంటున్నారు.

వడగాల్పులు తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు ఎండల్లో తిరగకుండా ఉండాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్దులు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, గుంటూరు, విజయనగరం చిత్తూరు, కృష్ణ, అనంతపురం జిల్లాలతోపాటు విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు ఉష్ణోగ్రతలు 45 నుండి 47 డిగ్రీలకు పైగా నమోదవుతాయని తెలిపింది.

ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 నుండి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని చెప్పింది.

ఇక తెలంగాణలో కూడా హైదరాబాద్‌ మొదలుకొని ఆదిలాబాద్‌ వరకూ ఇదే పరిస్థితి నెలకొన్నది. వడగాడ్పుల వల్ల భూమి వేడెక్కి ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 4 నుంచి 7 డిగ్రీలు అధికంగా నమోదౌతున్నాయని, దీంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపింది.

ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని, మరో ఐదురోజుల వరకు చాలాచోట్ల వడగాడ్పుల తీవ్రత కొనసాగుతుందని తెలిపారు. హైదరాబాద్‌లోనూ ఎండలు దడపుట్టిస్తున్నాయి. ఈ నెలలో రెండుసార్లు పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటి నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular