Home Blog Page 8469

కరోనా కేసుల్లో ఏడో స్థానానికి చేరిన భారత్‌

ఒక వంక భారత్ దేశంలో లాక్ డౌన్ కు దాదాపు పూర్తి స్థాయిలో సడలింపులు ఇస్తుండగా మరోవంక దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్నది. కేసుల నమోదు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం నుండి ఆదివారం వరకు 8,380 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఇంతవరకు దేశంలో ఒకేరోజు ఇన్ని కేసులు నమోదు కాలేదు.

దేశంలో కరోనా కేసులు 2 లక్షల దగ్గరికి (1,90,809)కి చేరుకోవడంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కేసులు అత్యధికంగా ఉన్న దేశాలలో భారత్ ఏడో స్థానంకు చేరుకొంది. తొలి ఆరు స్థానాల్లో వరుసగా అమెరికా, బ్రెజిల్‌, రష్యా, స్పెయిన్‌, బ్రిటన్‌, ఇటలీ దేశాలు ఉన్నాయి.

ఈ వివరాల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఇప్పటి వరకూ 65,168 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ మూడో దశ పూర్తయ్యే సరికి కరోనా కేసులలో ప్రపంచంలో 9వ స్థానంలో ఉన్న భారత్, 4వ దశ పూర్తయ్యే సరికి 7వ స్థానంలోకి చేరుకొంది.

వైరస్‌ కారణంగా ఒక్కరోజులోనే 193 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 5,164కు చేరింది. వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 86,983 (47.76 శాతం)కు చేరింది. అంటే దాదాపు ప్రతి ఇద్దరి వ్యక్తులలో ఒకరు కోలుకుంటున్నారు

ఇలా ఉండగా, దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో సగం కేసులు నాలుగో విడత లాక్ డౌన్ లోనే నమోదయ్యాయి. మే 18 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 85,974 పాజిటివ్ కేసులు వచ్చాయి మొత్తం కేసుల్లో 47.20 శాతం ఈ సమయంలోనే రికార్డు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా చెబుతోంది.

మొదటి లాక్ డౌన్ మార్చి 25 నుంచి మొదలై 21 రోజులపాటు కొనసాగింది. అప్పుడు 10,877 కేసులు మాత్రమే వచ్చాయి. రెండో విడత ఏప్రిల్ 15 నుంచి మొదలై మే 3 వరకు కొనసాగితే.. 31,094 కేసులు నమోదయ్యాయి. మూడో దశ 14 రోజలపాటు కొనసాగి మే 17న ముగిసింది. ఈ సమయంలో 56,636 మందికి పాజిటివ్ వచ్చింది.

వైరస్‌ బాధితులను, వారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించడంలో పలు రాష్ట్రాలు విఫలమవ్వడం, లాక్‌డౌన్‌ విధించిన తర్వాత వలస కూలీలను సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతించడం వంటి కారణాల వల్ల వైరస్‌ కేసులు పెరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ (వైరస్‌ బాధితులతో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించడం) అతి ముఖ్యమైనది. అయితే, దీన్ని సమర్థమంతంగా నిర్వహించడంలో పలు రాష్ట్రాలు విఫలమయ్యాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) పేర్కొంది.

మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలు బాధితుల సన్నిహితుల్ని గుర్తించడం, వాళ్లకు పరీక్షల్ని నిర్వహించడంలో మెరుగ్గా వ్యవహరించలేదని వెల్లడించింది. జనాభా ఎక్కువగా ఉండటం దీనికి ఒక కారణంగా వివరించింది.

మరోవంక, ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరుగడానికి వలస కూలీలను సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతులనివ్వడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ 1.0 విధించిన మార్చి 25 కంటే ముందు దేశంలో వైరస్‌ కేసులు తక్కువగా ఉండేవని, అప్పుడే వలస కూలీలను స్వరాష్ట్రాలకు పంపే ఏర్పాట్లు చేస్తే ప్రస్తుతం కేసుల్లో ఇంత పెరుగుదల నమోదయ్యేది కాదని ఎయిమ్స్‌, జేఎన్‌యూ , బీహెచ్‌యూ నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణలో పెరుగుతున్న కేసులు, మరణాలు


లాక్ డౌన్ ను దాదాపు ఎత్తేసిన సమయంలో తెలంగాణలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. మరణాలు దేశ సగటు కన్నా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. దేశంలో 1.86 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా 5 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.

దేశంలో కరోనా మరణాల సగటు రేటు 2.83% గా ఉంటే తెలంగాణలో 3.1% గా నమోదైంది. నెల రోజులుగానే మరణాల సంఖ్య పెరుగుతోంది. చాలా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన దగ్గర మరణాల రేటు ఎక్కువగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

ఐసీఎంఆర్ నిబంధనల పేరుతో కొన్ని మరణాలను ప్రభుత్వం ప్రకటించాక పోయినా పెరుగుతూనే ఉన్నాయి. వాటిని కూడా కలిపితే మరింత ఎక్కువగా ఉండేదని డాక్టర్లు చెప్తున్నారు.

నెల రోజులుగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే పాజిటివ్ రేటు ఏకంగా 3.1 శాతం పెరిగింది. నెల రోజుల క్రితం ప్రతి 100 టెస్టుల్లో 5.1 శాతం మందికి వైరస్ పాజిటివ్ ఉంటే ఇప్పుడు అది 8.22 శాతానికి చేరింది.

మే 30 న నాటికి 30,388 మందికి టెస్టులు చేయగా.. 2,499 మందికి అంటే (8.22 శాతం) కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు నెలతో పోల్చుకుంటే ఇది 3.1 శాతం ఎక్కువ. ఈ లెక్కన రాష్ట్రంలో నెమ్మదిగా కరోనా వ్యాప్తి పెరుగుతోందన్నది స్పష్టంగా తెలుస్తోంది.

ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ రేటులో దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉండగా ఇప్పుడు మూడో స్థానానికి చేరింది. తొలి రెండు స్థానాల్లో మహారాష్ట్ర 14.5 శాతం, ఢిల్లీ 8.97 ఉన్నాయి. సరిగా టెస్టులు చేయిస్తున్నందునే పాజిటివ్ రేటు పెరుగుతోందని ప్రభుత్వం అంటోంది.

కానీ మొదట్లో చేసిన నిర్లక్ష్యం కారణంగా వైరస్ వ్యాప్తి పెరిగిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మొదట్లోనే కరోనా పాజిటివ్ కేసుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ ను గుర్తించి సరైన చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి ఎదురయ్యెడిది కాదని చెబుతున్నారు.

లాక్ డౌన్ సడలింపుల తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరగడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ లో వ్యాప్తి మరింత ఎక్కువ ఉంది. అసలు ఎవరి ద్వారా ఎవరికీ కరోనా సోకుతుందో కూడా తెలియటం లేదు.

వలస కార్మికుల రాక, జనం రద్దీ పెరగటం, జిల్లాల నుంచి హైదరాబాద్ కు రాకపోకల కారణంగా వైరస్ ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది. జిల్లాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. చాలా వరకు ఎసింప్టమాటిక్ క్యారియర్ల ద్వారా కరోనా ఎక్కువ మంది సోకే ప్రమాదం కనిపిస్తోంది.

ప్రభుత్వం మాత్రం లక్షణాలుంటేనే కరోనా టెస్టులు చేస్తామని చెబుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎసింప్టమాటిక్ కేసులే ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎంత ఎక్కువ టెస్టులు చేస్తే అంత మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. లేకుంటే కేసులు, మరణాలు భారీగా పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు.

పీసీసీ రేస్: రేవంత్ కు దక్కకుండా రంగంలోకి సీనియర్లు


‘100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని ఎవరో వచ్చి దెబ్బతీయాల్సిన పనిలేదని.. కాంగ్రెస్ నేతలే దెబ్బతీసుకుంటారని’ రాజకీయ వర్గాల్లో ఓ ఫేమస్ సామెత ఉంది. ఇప్పుడు అదే జరుగుతోంది. దేశంలో.. రాష్ట్రంలో అసలు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఉందా అన్న అనుమానం సగుటు నాయకుల్లో నెలకొంది.. కరోనా-లాక్ డౌన్ ఏ కాంగ్రెస్ నాయకుడు బయటకు రావడం లేదు. సహాయక చర్యల్లో పాల్గొనడం లేదు. పదవుల విషయం వచ్చేసరికి మాత్రం తాజాగా బయటకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి తమకే ఇవ్వాలని కోరుతున్నారు. ప్రత్యర్థులకు దక్కకుండా లాబీయింగ్ చేస్తున్నారు.. అలా కష్టకాలంలో రాని వీరంతా.. పదవుల భర్తీ సమయం వేళ బయటకొస్తుండడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇస్తే గిస్తే కాంగ్రెస్ లో అనాదిగా ఉన్న మాకే పీసీసీ పదవి ఇవ్వాలి.. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో దూకుడుగా ప్రవర్తిస్తున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు ఇదే డిమాండ్ తో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అంతా ఒక్కటవుతున్నారు. అవును.. పీసీసీ చీఫ్ రేసులో అయితే ఉత్తమే ఉండాలి.. లేదంటే తమలో ఒకరిని చేయాలి. అంతేకానీ రేవంత్ రెడ్డిని చేయడానికి వీల్లేదని తాజాగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ వ్యాఖ్యానించడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తాజాగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పీసీసీ చీఫ్ మార్పుపై మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయని.. ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాల్సిన అవసరం ఏముందని.. రేవంత్ ను చేయవద్దని రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని తేల్చిచెప్పారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వడానికి అభిప్రాయాలు కోరుతున్నారని జగ్గారెడ్డి బాంబు పేల్చారు. రేవంత్ కు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే తాను వ్యతిరేకిస్తానని జగ్గారెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించడం సంచలనమైంది.

రేవంత్ రెడ్డికి తప్పించి ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని జగ్గారెడ్డి అనడం చర్చనీయాంశమైంది. పీసీసీ రేసులో ఆది నుంచి కాంగ్రెస్ వాదులకే ఇవ్వాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే కోమటిరెడ్డి సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు. తనకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తే 50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగి కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తానని.. రేవంత్ కు ఇస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

ఇక కాంగ్రెస్ సీనియర్లు వీహెచ్, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు సహా పెద్దలంతా పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి దక్కకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇదివరకే కరోనాకు ముందు ఈ నియామకాన్ని ఆపేశారు. ఇప్పుడు మరోసారి అధిష్టానం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుండడంతో మరోసారి కాంగ్రెస్ సీనియర్లంతా ఏకమవుతున్నట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ కాకుండా అడ్డుకోవాలని తీవ్ర ప్రయత్నాలను చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

-నరేశ్ ఎన్నం

బురద రాజకీయానికి దూరంగా పవన్


ప్రస్తుతం జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకొని ఆ పార్టీతో సాగుతున్నారు. మొన్నటి 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి ఓడిపోయాక టీడీపీకి పూర్తిగా దూరం జరిగారు. జాతీయ పార్టీ బీజేపీతో అంటకాగుతున్నారు. అయితే 2014 ఎన్నికల్లో కలిసి పోటీచేసి విజయం సాధించడంతో చంద్రబాబు మళ్లీ జనసేనతో దోస్తీకి వెంపర్లాడుతున్నాడు. ఆ విషయం తెలిసి తాజాగా పవన్ వెనక్కి తగ్గడం చర్చనీయాంశమైంది. ఏపీ సీఎం జగన్ ఏడాది పాలన సందర్భంగా ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కేంద్రంలోని బీజేపీ స్వయంగా ఏపీ సీఎం జగన్ పాలనను మెచ్చుకుంది. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలకు షాకిస్తూ సీఎం జగన్ ఏడాది పాలనను ప్రశంసించడం విశేషం. దీంతో రాష్ట్ర బీజేపీ నేతల గొంతులో పచ్చివెలక్కాయపడ్డ చందంగా మారింది. రాష్ట్రంలో జగన్, కేంద్రంలో మోడీ పాలన పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాంమాధవ్.. మోడీకి, జగన్ కు మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని సంచలన విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇద్దరూ ప్రజల కోసం పనిచేస్తున్నారని.. ఏపీ అభివృద్ధి పథంలో జగన్ ధృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని రాంమాధవ్ ప్రశంసించడం విశేషం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిర్ణయాలకు పార్లమెంట్ లో వైసీపీ ప్రధాన మద్దతు లభిస్తోందని.. దీన్ని మోడీ సర్కార్ స్వాగతిస్తోందని రాంమాధవ్ పేర్కొన్నారు.

అయితే ఏపీలోకి వచ్చేసరికి మాత్రం రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ.. ప్రతీసారి టీడీపీ అధినేత చంద్రబాబు ట్రాప్ లో పడిపోయి ఆయన వైసీపీ ప్రభుత్వంపై లేవనెత్తి అంశాలపై ఆందోళనలు చేస్తూ టీడీపీ వాయిస్ గా కనిపిస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఏ ఆందోళన మొదలు పెట్టినా దాన్ని టీడీపీ హైజాక్ చేసి టీడీపీ, జనసేన ఒకటే అని ప్రజల్లోకి తీసుకెళుతోంది. జగన్ కు టీడీపీ, జనసేన బీజేపీలు వ్యతిరేకం ఒక కూటమి అన్నట్టుగా ప్రచారం చేస్తోంది.

కరెంట్ బిల్లుల పెంపుపై మొదట లేవనెత్తింది జనసేననాని పవన్ కళ్యాణే. ఇక రాజధాని రైతుల ఆందోళనకు పవన్ ముందుగా వెళ్లారు. ఈ రెండింటిపై చంద్రబాబు అందిపుచ్చుకొని పెద్ద రాద్ధాంతం చేశారు. పవన్ ఏదైనా కార్యక్రమం మొదలుపెడితే చాలు దాన్ని టీడీపీ తమకు అనుకూలంగా మలుచుకుంటోందని పవన్ కు అర్థమైంది. విశాఖలో పవన్ ఆందోళనను కూడా టీడీపీ హైజాక్ చేసింది.

అందుకే బీజేపీతో సఖ్యతతో మెలుగుతున్న పవన్ ఈసారి చంద్రబాబు ట్రాపులో పడలేదు. బీజేపీ పెద్దలంతా ఏపీ సీఎం జగన్ పాలనను కొనియాడుతుండడంతో పవన్ కళ్యాణ్ ఈసారి సైలెంట్ అయ్యారు. ఈసారి పవన్ ఆశ్చర్యకరంగా కేంద్రంలోని మోడీ ఏడాది పాలనను మెచ్చుకుంటూ వైఎస్ జగన్ ఏడాది పాలనపై ఎలాంటి విమర్శలు చేయలేదు.

పవన్ కళ్యాణ్.. ఏపీ సీఎం జగన్ పాలనపై విమర్శలు చేస్తే దాన్ని అందిపుచ్చుకొని తామంతా ఒకటే అని రచ్చ చేద్దామని చూసిన టీడీపీకి పవన్ కళ్యాణ్ షాకిచ్చారు. ఈసారి టీడీపీకి ఆ అవకాశం ఇవ్వకుండా బీజేపీ ఆలోచనల ప్రకారం వైసీపీ అధినేత జగన్ పై ఎలాంటి విమర్శలు ట్వీట్లు చేయలేదు. ఇలా బురద రాజకీయాలకు దూరంగా.. చంద్రబాబు ట్రాపులో పడకుండా పవన్ తెలివిగా వ్యవహరించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

-నరేశ్ ఎన్నం

చెన్నై మెట్రోను ఫాలో అవుతున్న హైదరాబాద్ మెట్రో..!


చైనా వైరస్ దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. రేపటి నుంచి లాక్డౌన్ 5.0 జూన్ 30వరకు కొనసాగనుంది. లాక్డౌన్ కారణంగా మెట్రో ట్రైన్ సర్వీసులు, దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. లాక్డౌన్ 5.0లో వీటికి అనుమతి లభిస్తుందని భావించినప్పటికీ కేంద్రం ఈ రంగాలకు సడలింపులు ఇవ్వలేదు. జూన్ నెల ఫేజ్-3లో పరిస్థితిని బట్టి కేంద్రం మెట్రో సర్వీసులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో మెట్రో ట్రైన్ సర్వీసులు ప్రారంభమైతే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నిర్వాహకులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా చెన్నై మెట్రో ఓ కొత్త విధానానికి నాంది పలికింది. మెట్రో స్టేషన్లలో ప్రతీఒక్కరు ఉపయోగించేది లిఫ్టు బటన్లపై దృష్టిసారించింది. వీటిని చేతులతో కాకుండా కాళ్లతో లిప్టు బటన్ నొక్కితే పనిచేసేలా రూపొందించారు. దీని ద్వారా వైరస్ నియంత్రించే అవకాశం ఉండటంతో ఈ ఐడియాకు ప్రయాణీకులు ఫిదా అవుతున్నారు.

లాక్డౌన్ అనంతరం మెట్రో స్టేషన్లో ట్రైన్లు పరిగులు తీయడం ఖాయం. ఇప్పటికే ప్రజలకు వైరస్ పై అవగాహన రావడంతో బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం వంటివి చేస్తున్నారు. సాధారణంగా బయటకు వెళ్లినప్పుడు ప్రతీఒక్కరు కొన్ని ప్రదేశాలను తాకాల్సి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు మెట్ల పక్కన ఉండే గ్రిల్స్, లిఫ్టు బటన్లు, డోర్ హ్యాండిళ్లు వంటివి. మెట్రో ట్రైన్లలో లిఫ్టు బటన్లు ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉండటాన్ని గుర్తించిన చెన్నై మెట్రో దీనికి సరికొత్త పరిష్కారాన్ని కనుక్కొంది. లిఫ్టు బటన్లు చేతితో కాకుండా కాళ్లతో నొక్కితే పనిచేసేలా మీటలను అమర్చారు.

కోయంబేడులోని చెన్నై మెట్రో ప్రధాన కార్యాలయంలో ఈ సదుపాయాన్ని ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చింది. ఇలా చేయడం వైరస్ నియంత్రణ సాధ్యమయ్యే అవకాశం ఉండటంతో అన్ని మెట్రో స్టేషన్లోలో ఈ తరహా ప్రయోగం చేయనున్నారు. ఇదే కోవలో హైదరాబాద్ మెట్రో సర్వీసులు ప్రారంభించే నాటికి మన దగ్గర కూడా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే హైదరబాద్ మెట్రోలోనూ ఈ తరహా లిప్టులు కన్పించే అవకాశం లేకపోలేదు. ప్రయాణీకుల సౌకర్యార్థం వినూత్న ఆలోచన చేసిన చైన్నె మెట్రోను ప్రతీఒక్కరు ప్రశంసిస్తున్నారు.

సూపర్ స్టార్ కు మెగాస్టార్ స్పెషల్ విషెస్


నేడు సూపర్ స్టార్ కృష్ణ 77వ పుట్టిన రోజు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పలువురు సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు, అభిమానులు పెద్దఎత్తున సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన హీరోగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా, స్టూడియో అధినేత‌గా తెలుగు చ‌ల‌న చిత్రసీమ‌పై చెర‌గ‌ని ముద్ర‌వేశారు. తెలుగు చిత్రసీమను సాంకేతికంగా కొత్తపుంత‌లు తొక్కించారు. ప్రస్తుతం ట్వీటర్లో ‘హ్యాపీ బర్త్ డే కృష్ణ గారు’ అనే హ్యాష్ ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణకు మెగాస్టార్ చిరంజీవి తన ట్వీటర్ ద్వారా స్పెషల్ విషెస్ తెలియజేశారు.

‘కథానాయకుడిగా 345 సినిమాలు.. దర్శకుడిగా 14చిత్రాలు.. నిర్మాతగా తెలుగుతోపాటు భారతీయ భాషల్లో 50చిత్రాలు.. మొదటి సినిమాస్కోప్ చిత్రం ఆయనదే.. మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే.. అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్.. సాహసానికి మారు పేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదినశుభాకాంక్షలు’ అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కృష్ణగారితో దిగిన ఫొటోన ట్వీటర్లో షేర్ చేశారు.

అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు తన కొత్త సినిమా మూవీ అప్డేట్ రిలీజ్ చేసి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’కు సంబంధించి ఫస్టు లుక్ కృష్ణ బర్త్ డే సందర్భంగా తన ట్వీటర్లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ‘నా ఎవ‌ర్ గ్రీన్ సూప‌ర్‌స్టార్‌. హ్య‌పీ బ‌ర్త్ డే నాన్న‌.. మీకెప్ప‌టికీ రుణ‌ప‌డి ఉన్నాను.. మీ రుణం తీర్చుకోడానికి ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాను’ అంటూ మహేశ్ ట్విట్టర్లో కృష్ణగారికి విషెస్ చెప్పారు. అలాగే మహేష్ సతీమణి న‌మ‌త్రా శిరోద్క‌ర్‌, మ‌న‌వ‌డు గౌత‌మ్‌, మ‌న‌వ‌రాలు సితార త‌దిత‌రులు కృష్ణ‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే కృష్ణ అల్లుడు సుధీర్ బాబు సూపర్ స్టార్ నటించిన 100వ చిత్రం ‘అల్లూరి సీతారామ‌రాజు’లోని క్లైమాక్స్ డైలాగ్‌ను డ‌బ్ స్మాష్ చేసి డిఫరెంట్ గా జన్మదిన విషెస్ చెప్పారు.ఈ వీడియోను తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. వీరితోపాటు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు, నటీనటులు కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల మద్దతుతో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం


ప్రజల మద్ధతుతో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం ‘’ 64 వ భాగంలో మాట్లాడుతూ కరోనాపై దేశమంతా యుద్ధం చేస్తోంది. క్లిష్ట సమయంలో పోలీసులు, వైద్యులు, మీడియా మిత్రులు ప్రాణాలొడ్డి పనిచేశారు. స్వచ్ఛంద సంస్థలు అన్నార్థులకు అండగా నిలిచాయని కొనియాడారు.

దేశంలో చాలావరకు ఆర్థిక కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయని చెబుతూ ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని హితవు చెప్పారు. కరోనా పోరాటంలో మన జీవన విధానమే మన బలం అని తెలిపారు.

కరోనా భారత్‌లోకి ప్రవేశిస్తే చాలా ప్రమాదమని అందరూ భావించారని గుర్తు చేశారు. అయితే వ్యాపారులు భౌతికదూరం పాటిస్తూ అమ్మకాలు జరుపుతున్నారని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారని పేర్కొంటూ భవిష్యత్తులో మనం మరింతపెంచుకోవాలని స్పష్టం చేశారు.

యోగాసానాల ద్వారా రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు. కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థికరంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని అంటూ కరోనా వల్ల వలసకూలీలు చాలా ఇబ్బందులు పడ్డారని విచారం వ్యక్తం చేశారు.

శ్రామిక్ రైళ్ల ద్వారా వలసకూలీలు తమ స్వస్థలాలకు వెళ్తున్నారని చెబుతూ వలసకూలీల కోసం వారి గ్రామాలలో కూడా క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశారని చెప్పారు. యావత్ దేశం వలస కూలీలకు అండగా నిలిచిందని కొనియాడారు.

లాక్డౌన్‌లో విద్యారంగంలో అనేక ఆవిష్కరణలు చేశారని పేర్కొంటూ ఆన్‌లైన్ పాఠాల కోసం కొత్త ఆవిష్కరణలు వచ్చాయని తెలిపారు. ఆత్మనిర్భర్ ప్యాకేజీ ద్వారా ముందుడుగు వేశామని చెబుతూ ఆయుష్మాన్ భారత్ పేద ప్రజలకు వరంగా మారిందని ప్రధాని చెప్పుకొచ్చారు.

ఆయుష్మాన్ భారత్ ద్వారా కోటిమందికి పైగా చికిత్స తీసుకున్నారని ప్రధాని వెల్లడించారు. ఆ కోటి మందిలో 80 శాతం మంది గ్రామీణులే అని చెప్పారు. పేదల డబ్బును ఆయుష్మాన్ భారత్ యోజన ఆదా చేస్తుందని చెప్పారు.

ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మరణాలు తక్కువ అని చెబుతూ కరోనా కట్టడిలో ఇతర దేశాల కంటే భారత్ ముందుందని ప్రధాని చెప్పుకొచ్చారు. కరోనాపై మన పోరాటం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రధాని స్పష్టం చేశారు.

మోడీ , కెసిఆర్ , జగన్ లు ఒక అంశం లో కలిసారు

స్వాతంత్రానంతర భారత్ మొత్తం రెండు రకాల ఆర్ధిక వ్యవస్థల నమూనా గా వర్గీకరించొచ్చు. మొదటి నాలుగు దశాబ్దాలు కమ్యూనిజానికి దగ్గరలోవుండే సోషలిస్టు , ప్రభుత్వరంగ ఆధారిత ఆర్ధిక నమూనాని అనుసరించింది. తేడా అల్లా కమ్యూనిస్టు దేశాల్లో లాగా నిర్బంధ, నియంతృత్వ పాలనా వ్యవస్థలు లేవు. భావ స్వేచ్చ, వాక్ స్వేచ్చ ప్రాధమిక హక్కులుగా గల ప్రజాస్వామ్య వ్యవస్థ కి లోబడే ఈ పరిపాలన సాగింది. ఇది దేశ పురోగతి కి వుపయోగపడలేదనేది చరిత్ర చెప్పిన సత్యం. తర్వాత మూడు దశాబ్దాల్లోనే ఆర్ధిక ప్రగతి వేగం పుంజుకొని ప్రస్తుతం 5 వ పెద్ద ఆర్ధిక వ్యవస్థ గా అవతరించింది. ఇది మానవత్వం లేని పెట్టుబడిదారీ నమూనా నో, భావ, వాక్, మత స్వేచ్చలేని కమ్యునిస్టు నమూనా నో కాకుండా మానవత్వం తో కూడిన సంక్షేమ నమూనా గా అవతరించింది. ఇది కొంతమేరకు యూరప్ సమాజాలకు దగ్గరలో వుంది. అదేసమయం లో ఇది భారత్ ప్రత్యేక లక్షణాలతో కూడిన  సంక్షేమ నమూనా గా చెప్పొచ్చు. అత్యధికంగా ప్రజలు పేదరికం నుండి బయటకు వచ్చింది ఈ మూడు దశాబ్దాల్లోనే. అదేసమయం లో ఇది పూర్తి సంక్షేమ దిశగా పయనించక , అసమానతలు పెరగటం కూడా ఆందోళన కలిగించే విషయం. అయినా పరిమితులతోనయినా ఇది సంక్షేమ దిశగానే అడుగులేస్తుందని చెప్పొచ్చు. దీన్నే పాలకులు తరతమ బేధం తో పాటిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం దేశం లో మోడీ , తెలుగు రాష్ట్రాల్లో కెసిఆర్, జగన్ లు పాలిస్తున్నారు. వీళ్ళు కూడా ఇదే నమూనాలను అనుసరిస్తున్నారు. అవేమిటో చూద్దాం.

మోడీ పాలన :  ఆరు సంవత్సరాల క్రితం అధికారం లోకి వచ్చిన తర్వాత ఇదే నమూనా ని పాటించినా ఇందులో కొన్ని మార్పులు , ప్రాధాన్యతలు ఎంచుకున్నాడు. గత యూపీఏ ప్రభుత్వం కుంభకోణాలు, అవినీతి లో కూరుకుపోయి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు. ఆ అనుభవం తో పరిపాలన లో జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. వాటితోపాటు సాంకేతికత ను అధికంగా వినియోగం లోకి తెచ్చి ప్రజల ఖాతాలోకే డబ్బులు జమ అయ్యే వ్యవస్థని తీసుకురావటం తో లబ్ది నూటికి నూరు శాతం కిందవరకు చేరటానికి అవకాశం వచ్చింది. ఇక ప్రాధాన్యత అంశాల్లోకి వచ్చేసరికి జాతీయ భద్రత, జాతీయ సమగ్రత , ప్రపంచపటం లో భారత ఖ్యాతి ముందుకొచ్చాయి. రక్షణ రంగాన్ని పటిష్టపరచటం, రక్షణాధికారి పోస్టు ని ఏర్పాటుచేయటం, పాకిస్తాన్, చైనా సరిహద్దుల్ని మరింత పటిష్టపరచటం, అత్యాధునిక ఆయుధాల్ని సమకూర్చుకోవటం లాంటి అనేక చర్యలు చేపట్టారు. ఇక జాతీయ సమగ్రత దిశగా జమ్మూ-కాశ్మీర్ ని రెండుగా విడదీసి కేంద్ర ప్రత్యక్షపాలన కిందకి తీసుకురావటం, ఆర్టికల్ 370 ని రద్దుచేయటం, అస్సాం లో గత యాభై సంవత్సరాలనుండి అపరిష్కృతం గా వున్న బోడో సమస్యను పరిష్కరించటం, గత 30 సంవత్సరాలుగా వున్న ‘బ్రు’ ఆదివాసుల సమస్యను పరిష్కరించటం, ఆర్ధికంగా వెనకబడిన తూర్పు, ఈశాన్య ప్రాంతాలకు అధిక ప్రాధాన్యతని కల్పించటం లాంటి అనేక చర్యలు దేశ సమగ్రతకు దోహదపడ్డాయి. ఇక ప్రపంచం లో భారత ప్రతిష్ట మోడీ హయాం లో ఎప్పుడూ లేనంతగా పైకి ఎగబాకింది. ఆర్ధిక రంగం లో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే అనేక సంస్కరణలను ప్రవేశపెట్టటం, సులభతర వాణిజ్యానికి కావలసిన అనేక పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవటం, పన్నుల విధానం లో సంస్కరణలు తీసుకురావటం లాంటి అనేక చర్యలు చేపట్టారు. ఇక సాంఘిక రంగం లో చూస్తే స్వచ్చ భారత్ పేరుతో పరిశుభ్రత కు, ప్రజల అలవాట్ల మార్పుకు దోహదం చేసారు.

కెసిఆర్ పాలన : ప్రధానంగా వ్యవసాయం, సాగునీటిపారుదల పై దృష్టి సారించాడు. రికార్డు సమయం లో కాళేశ్వరం ప్రాజెక్టు ని పూర్తిచేయగలగటం అన్నింటికన్నా పెద్ద ఘనత . ఇది తెలంగాణా ప్రజలు ఎప్పుడూ గుర్తించుకుంటారు. మొదట్లో ప్రాజెక్టు డిజైన్ పై వివాదం చెలరేగినా రాను రాను ఈ ప్రాజెక్టు పై ప్రజల్లో సానుకూలత ఏర్పడటమే కాకుండా అది జీవితాంతం గుర్తుంచుకునే సంఘటన గా మారటం కెసిఆర్ సాధించిన పెద్ద ఘనకార్యం. మిగతా కొన్ని బలహీనతలు, లోపాలున్నా ఈ ప్రాజెక్టు అన్నింటినీ మింగేసి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించి పెట్టింది. వ్యవసాయ రంగం లో రైతు బంధు కార్యక్రమం దేశానికే నమూనా గా మారింది. అలాగే రైతు భీమా కూడా. అదేసమయం లో తెలంగాణకు ఆయువుపట్టైన హైదరాబాద్ అభివృద్ధి ని కుమారుడు కేటిఅర్ కి అప్పగించి తనుమాత్రం మిగతా విషయాలపై కేంద్రీకరించాడు. తనూ సమర్ధుడు కావటం తో అదీ సానుకూలతనే తెచ్చిపెట్టింది. ఇక సాంఘిక రంగం లో చూస్తే పల్లె ప్రగతి, పట్టణ  ప్రగతి కార్యక్రమాలు తన మార్కు స్వచ్చ భారత్ కార్యక్రమాలు.

జగన్ పాలన : మొట్టమొదటిసారి అధికారం చేపట్టిన అనతికాలం లోనే అధికార యంత్రాంగం పై పట్టు సాధించాడు. గ్రామీణ సచివాలయ వ్యవస్థ , గ్రామీణ వాలంటీర్ల వ్యవస్థ తో తన మార్కు ముద్ర వేయటం తో పాటు పరిపాలన ను గ్రామ స్థాయికి వికేంద్రీకరించాడు. ఇది తన పరిపాలన లో ఆణిముత్యం. ప్రజలు ఆఫీసులు చుట్టూ తిరగకుండా ఇంటికే అన్నీ రావటం ఓ విప్లవాత్మక సంస్కరణ. విద్యారంగం లో మౌలిక వసతులకు ప్రాధాన్యం, ఆంగ్ల విద్య ప్రవేశపెట్టటం , ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల మెరుగుదల పై దృష్టి మంచి నిర్ణయాలు. సాంఘిక పరంగా చూస్తే మద్యపాన నియంత్రణ పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతుంది.

ముగ్గురి పాలనలో వుమ్మడి అంశం 

వీటిల్లో ఎవరి ప్రాధాన్యాలు వారివైనా ముగ్గురికీ ఒక్క విషయం లో సామీప్యత వుంది. ముగ్గురు సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతను ఇచ్చారు. పేద మధ్యతరగతి వర్గాలకి లబ్దిచేకూర్చే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. రైతులకు ప్రత్యక్షంగా నగదు ఇచ్చే సంక్షేమ కార్యక్రమం ముగ్గురూ చేపట్టారు. వయో వృద్ధులకు, వితంతువులకు పించను కూడా ముగ్గురూ చేపట్టారు. పేద ప్రజలకు ఆరోగ్య ఖర్చులు భరించే కార్యక్రమాల్ని ముగ్గురూ చేపట్టారు. ఇక ఆహార రాయితీలు మొదట్నుంచీ అందరూ ఖర్చుపెడుతున్నవే. వీటితో పాటు మోడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం కింద లక్షలాది ఇల్లు నిర్మించే కార్యక్రమం లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల వాటా కూడా వుంది. మోడీ 8 కోట్ల మంది మహిళలకు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మహిళలను ఆదుకున్నాడు. ఇందులో ఎక్కువమంది దళితులూ, ఆదివాసులు, మైనారిటీలు వున్నారు. ఇక సంక్షేమ కార్యక్రమాల్లో జగన్ అందరికన్నా ముందున్నాడు. అమ్మ ఒడి, జగనన్న కానుకలు లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాడు. సంక్షేమ కార్యక్రమాల్లో చూస్తే జగన్, కెసిఆర్, మోడీ లు ఆ వరసల్లో వున్నారు. మొత్తం మీద చూస్తే సంక్షేమ కార్యక్రమాల్లో ముగ్గురూ ఉమ్మడిగా ముందున్నారు. ఇదే భారతీయ నమూనా. పూర్తి పెట్టుబడి దారీ విధానం , కమ్యూనిస్టు, సోషలిస్టు విధానాల కంటే సంక్షేమ విధానానికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నాయనేది అర్ధమవుతుంది. ఇందులో మన తెలుగు రాష్ట్రాలు ముందంజలో వున్నాయి. మోడీ కూడా అందరూ అనుకుంటున్నట్లు పూర్తి పెట్టుబడిదారీ విధానం కన్నా సంక్షేమ విధానానికే మొగ్గు చూపించినట్లు స్పష్టంగా అర్ధమవుతుంది. ఇదే విధానం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. భారత్ లాంటి అధిక జనాభా దేశానికి ప్రజాస్వామ్యం తో పాటు సంక్షేమ విధానమే శరణ్యం. గత మూడు దశాబ్దాల విధానం తో అదివరకటి కన్నాపేదల జీవితాలు మెరుగ్గా వున్నా ధనవంతుల స్థితిగతులు మరింత వేగంగా పుంజుకొని ఆర్ధిక అసమానతలు మరింత పెరిగాయి. ప్రభుత్వ విధానాలు దీనిపై దృష్టి పెట్టకపోతే సంక్షేమ విధానం కాస్తా పూర్తి పెట్టుబడిదారి విధానం గా మరే అవకాశముంది.

సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డేకు మహేష్ గిప్ట్..


సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు సర్ ప్రైజ్ గిప్ట్ ఇచ్చారు. ప్రతీయేటా మహేష్ బాబు తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. ఫస్టు లుక్, టీజర్, సాంగ్స్, సినిమా రిలీజ్ ఇలా ఏదో ఒక సర్ ప్రైజ్ చేస్తుంటాడు. అయితే లాక్డౌన్ కారణంగా ఈసారి కృష్ణ బర్త్ డేకు మహేష్ బాబు నుంచి అప్డేట్ ఉంటుందా? లేదా అనే సందేహాలు అభిమానుల్లో నెలకొని ఉన్నాయి. అయితే వాటన్నింటిని పటాపంచలు చేస్తూ నేడు మహేష్ బాబు తన కొత్త మూవీ అప్డేట్స్ ఇచ్చి సూపర్ స్టార్ అభిమానులను ఖుషీ చేశాడు.

‘గీత గోవిందం ఫేం’ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు తన 27వ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్, టైటిల్ ను మహేష్ తన ట్వీటర్లో విడుదల చేశాడు. ఈ మూవీకి ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ ఫస్టు లుక్‌లో మహేష్ బాబు ఒక చెవికి రింగు, మెడపైన రూపాయి బిళ్ల టాటూతో అదరగొట్టాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మహేష్ బాబు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో SSMB27, సర్కారు వారి పాట (SarkaruVaari Paata) హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

 

ఖేల్ రత్నకు నామినేట్ అయిన ‘హిట్ మ్యాన్’


క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబర్చినవారిని కేంద్రం ప్రభుత్వం ప్రతీయేటా ఖేల్ రత్న పురస్కారం అందజేస్తూ సత్కరిస్తుంది. 2020 సంవత్సరానికి గాను ఇండియన్ వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ, స్టార్ జెవెలిన్ త్రోయర్ నీరజ్ చొప్రా ఖేల్ రత్నకు నామినేట్ అయ్యారు. అర్జున అవార్డుకు ఇండియన్ ఓపెనర్ శిఖర్ ధావన్, పేసర్ ఇషాంత్ శర్మ, మహిళా క్రికెటర్ల నుంచి దీప్తి శర్మ, స్ప్రింటర్‌ ద్యుతీ చంద్ లు నామినేట్ అయ్యారు. రోహిత్ శర్మను ఖేల్ రత్నకు, శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మ, దీప్తి శర్మ పేర్లను అర్జున అవార్డులకు బీసీసీఐ సిఫార్సు చేస్తూ క్రీడామంత్రిత్వ శాఖకు పంపించింది.

రోహిత్ శర్మ ఓపెనర్ గా, వైస్ కెప్టెన్‌గా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు. రోహిత్ ‌శర్మ 2019లో ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. ఒక ప్రపంచకప్‌ టోర్నీలో ఐదు శతకాలు బాదేసిన ఏకైక క్రికెటర్‌గా, టీ20ల్లో నాలుగు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా, ఇక టెస్టు ఓపెనర్‌గా అరంగేట్రంలోనే రెండు శతకాలు బాదిన తొలి క్రికెటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇతడి సేవలను గుర్తించిన బీసీసీఐ రోహిత్ పేరును ఖేల్ రత్న పురస్కారానికి నామినేట్ చేసింది. రోహిత్ తో కలిసి శిఖర్ ధావన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎన్నో చారిత్రక విజయాలు అందించాడు. వన్డేల్లో, టి20లో రోహిత్‌, ధావన్‌లు కలిసి ఎన్నో సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. పేసర్ ఇషాంత్ శర్మ టెస్టుల్లో అద్భుత బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. పలు టెస్టుల్లో జట్టుకు ఒంటిచేత్తో విజయాలందించాడు. మహిళా క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న దీప్తి శర్మను బీసీసీఐ అర్జున అవార్డు కోసం నామినేట్ చేసింది.

అదేవిధంగా స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా కూడా ఖేల్ రత్నకు నామినేట్ అయ్యాడు. భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య నుంచి నీరజ్‌ పేరును మాత్రమే సిఫారసు చేసినట్లు సమాచారం. వరుసగా మూడో ఏడాది నీరజ్ చొప్రా ఖేల్ రత్న పురస్కారానికి నామినేట్‌ అయ్యాడు. స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌ పేరును ఒడిశా ప్రభుత్వం అర్జున అవార్డుకు ప్రతిపాదించింది.

ఏపీ ఎన్నికల కమిషన్ లో ఊహించని ట్విస్ట్ లు!


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషనర్‌ వ్యవహారం ఊహించని మలుపుతో సాగుతోంది. హైకోర్టు తీర్పుతో ఎస్‌ఇసిగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తిరిగి బాధ్యతలు చేపట్టగా, ఆయన నియామకం చెల్లదంటూ అడ్వకేట్ జనరల్ మీడియా సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇది జరిగిన కాసేపటికే ఎస్‌ఇసిగా రమేష్ కుమార్ బాధ్యతల స్వీకరణకు సంబంధించి ఇచ్చిన ఉత్వర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఎస్‌ఇసి కార్యదర్శి శనివారం అర్ధరాత్రి ప్రకటించారు.

ఇదిలా ఉండగా, ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఏప్రిల్‌ 11న ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ కార్యదర్శిగా ఎస్‌.రాంసుందర్‌ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (తుడా) కార్యదర్శిగా ఉన్న ఎస్‌.రాంసుందర్‌ రెడ్డిని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది.

అయితే, ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ పునర్నియామక ఉత్తర్వులను వెనక్కు తీసుకుంటున్నట్టు జారీచేసిన సర్క్యులర్‌పై జివిఎస్‌ ప్రభాకర్‌ (ఎఫ్‌ఎసి) సంతకం చేశారు.

మరోవంక, గత నెల 10న కొత్త ఎస్‌ఇసిగా తగిన వ్యక్తిని నియమించాలని ఫైల్లో పేరు లేకుండా గవర్నర్‌ ఆమోదం కోసం మధ్యాహ్నం 3.29కి సిఎస్‌ ఫైల్‌ సమర్పించారు. అదే రోజు సాయంత్రం 4.02కు ముఖ్యమంత్రి.. జస్టిస్‌ కనగరాజ్‌ను ఎస్‌ఇసిగా నియమించేందుకు బయోడేటాను గవర్నర్‌కు సమర్పించారు.

అంటే పేరు లేకుండానే తొలుత ఫైల్‌ నడిచినట్లు అర్థమవుతోంది. ఆర్డినెన్స్‌ జారీచేశాక రమేశ్‌కుమార్‌ను ఏప్రిల్‌ 10 నుంచి ఎస్‌ఇసిగా నిలుపుదల చేశారు. రాత్రి 9.45కి ఫైల్‌-3ని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి ప్రారంభించి రాత్రి 10.07 గంటలకు డిజిటల్‌ సంతకం చేశారు.

ఇదిట్లా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా 1996 బ్యాచ్‌కు చెందిన జి.వాణీమోహన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సహకారశాఖ కమిషనర్‌గా ఉన్న ఆమెను ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ ఉత్తర్వులు వెలువరించారు.

ఎన్నికల కమిషనర్‌ కార్యదర్శితో పాటు సహకార శాఖ కమిషనర్‌, ఎపి డైరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఎండీగా, పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కరోనావైరస్‌కు వ్యాక్సిన్‌ ఎప్పటికి వస్తుందో తెలుసా..?


కరోనాకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు కనీసం నాలుగేళ్ల సమయం పడుతుందని బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా స్పష్టం చేశారు. ఈ సంవత్సరం చివరిలోగా వస్తున్నదన్న కథనాలను ఆమె కొట్టిపారవేసారు.

కాబట్టి ఈ మహమ్మారిపట్ల రాబోయే కొన్నేళ్ల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. అందుకు ఆరోగ్యసంరక్షణపై మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సి రావొచ్చని ఓ వెబినార్‌లో ఆమె పేర్కొన్నారు.

మొత్తం దేశానికి అందుబాటులోకి వచ్చేలా ఒక వ్యాక్సిన్‌ తయారు చేయాలంటే చాలా సమయం పడుతుందని ఆమె తెలిపారు. వ్యాక్సిన్‌ను తయారుచేయడమనేది సంక్లిష్టమైన ప్రక్రియ అని, ఎంత లేదన్న పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ రూపొందించడానికి నాలుగేళ్ల సమయం పడుతుందని చెప్పారు.

‘ఒక ఏడాదిలో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం అసాధ్యమైన పనే. వ్యాక్సిన్‌ అభివృద్దిలో భద్రత, సామర్ధ్యం ఉండాలంటే పెద్ద స్థాయిలో పలు ప్రక్రియలు ముడిపడి ఉంటాయి. కాబట్టి నమ్మకమైన వ్యాక్సిన్‌ వచ్చేంతవరకు కొన్నేళ్లపాటు జాగ్రత్తగా ఉండాల్సిందే’ అని ఆమె స్పష్టం చేశారు.

వ్యాక్సిన్ కోసం ఎదురు చూడడంతో పాటు ఆరోగ్యసంరక్షణపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని ఈ కరోనా మనకి నొక్కి చెబుతోందని కిరణ్‌ మజుందార్‌ షా వివరించారు.

పదవిలో నిమ్మగడ్డ ఉండే ప్రసక్తి లేదంటున్న వైసిపి


రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అర్ధాంతరంగా తొలగించడం చెల్లుబాటు కాదని అంటూ రాష్ట్ర హైకోర్ట్ స్పష్టమైన తీర్పు ఇచ్చినా ఆయనను ఎట్టి పరిస్థితులలో ఆ పదవిలో కొనసాగించే ప్రసక్తి లేదని వైసిపి నేతలు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. అయితే హైకోర్ట్ తీర్పుపై నేరుగా ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని ఎవ్వరు బైటకు మాట్లాడటం లేదు.

కేవలం పార్టీ ప్రతినిధిగా అంబటి రాంబాబు తాము సుప్రీం కోర్ట్ లో సవాల్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే విచిత్రంగా రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తో మీడియా సమావేశం ఏర్పాటు చేయించి నిమ్మగడ్డను ఆ పదవి తిరిగి చేపట్టమని హై కోర్ట్ ఎక్కడ చెప్పలేదు గదా అంటూ మరో వివాదాన్ని లేవదీశారు.

కేవలం ఆయన్ను తిరిగి నియమించమని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్ట్ సూచించిందని, ఈ విషయంలో ప్రభుత్వానికి పలు అనుమానాలు ఉండడంతో సుప్రీం కోర్ట్ కు వెడుతున్నామని చెప్పుకొచ్చారు. పైగా, తీర్పుపై స్టే కోరుతూ తాము వేసిన పిటీషన్ ఇంకా హైకోర్ట్ ముందుండగా రమేష్ కుమార్ ఏ విధంగా బాధ్యతలు చేబడతారని అంటూ అభ్యంతరం వ్యక్తం చేసారు.

తనకు తానే నిమ్మగడ్డ ఎట్లా తిరిగి బాధ్యతలు చేబడతారు అంటూ లీగల్ పాయింట్ లేవదీశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం రమేష్ కుమార్ ను ఇంకా ఎన్నికల కమీషనర్ గా గుర్తించడం లేదని సంకేతం స్పష్టంగా ఇచ్చారు. నిమ్మగడ్డను నాటి చంద్రబాబు ప్రభుత్వం నియమించినట్లే, జస్టిస్ కనగ రాజ్ ను ఇప్పటి ప్రభుత్వం నియమించినదని చెప్పుకొచ్చారు. ఒకరి నియామకం చెల్లదంటే మరొకరి నియామకం కూడా చెల్లదని అంటూ శ్రీరామ్ స్పష్టం చేశారు.

అడ్వకేట్ జనరల్ న్యాయపరమైన అంశాలను కోర్ట్ ముందుంచాలి. లేదా ప్రభుత్వానికి సూచించాలి. కానీ మీడియా ముందుకు వచ్చి ప్రశ్నలు లేవనెత్తడం ఒక విచిత్ర సంప్రదాయానికి దారితీస్తుంది. ఏది ఏమైనా రమేష్ కుమార్ ను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం పలు రకాల అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు శ్రీరామ్ సంకేతాలు ఇచ్చిన్నట్లు అయింది.

భారత్ ను బలోపేతం చేసిన నరేంద్ర మోదీ


భారత్ ను బలోపేతం కావించి, ప్రపంచ దేశాలలో భారత్ ప్రతిష్టతను గణనీయంగా ఇనుమడింప చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అనేక సంస్కరణలను చేపట్టినదని కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కొనియాడారు.

ప్రధాని మోదీ రెండోసారి ప్రధానిగా ఒక ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ
భారత్ ను బలోపేతం కావించడానికి ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలకు ప్రతి బిజెపి కార్యకర్త అండగా నిలవాలని ఆయన పిలుపిచ్చారు.

దశాబ్దాలుగా పరిష్కారం కానీ ఎన్నో సమస్యలను ఏడాది కాలంలోనే పరిష్కరించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిది  అని తెలిపారు. ఆర్టికల్‌‌370, 35ఏను రద్దు చేయడం చరిత్రాత్మక నిర్ణయమని గుర్తు చేశారు.

అయోధ్య రామమందిరం విషయంలో సుప్రీంకోర్టు తీర్పును శిరసావహించి దేశ ప్రజలందరిలో సమైక్యతను మోడీ పెంచారని పేర్కొన్నారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడేలా ట్రిపుల్ తలాక్ బిల్లును తెచ్చారని చెప్పారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ లో మతపరమైన హింసకు గురైన మైనార్టీలకు పౌరసత్వం కల్పించేలా కేంద్రం సీఏఏను తీసుకురావడం గొప్ప నిర్ణయమని ప్రశంసించారు.

ఏడాది కాలంలోనే 36 బిల్లులను బీజేపీ సర్కారు పాస్ చేయించిందని సంజయ్ చెప్పారు. అనేక సమస్యలను పరిష్కరించిన 17వ లోక్ సభలో తానూ ఒక సభ్యుడు అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి మోడీ సకాలంలోనే లాక్ డౌన్ ప్రకటించారని, అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా భారీ ప్యాకేజీతో న్యాయం చేశారని చెప్పారు.

67 కోట్లమందికి కరోనా..! ఎప్పటివరుకంటే..

lock down 5.0

lock down 5.0

దేశం మొత్తం కరోనా భయంతో వాణికిపోతున్న సమయంలో మరో సంచలన వార్త బయటికి వచ్చింది. 2020 డిసెంబర్ నాటికి భారతదేశంలో ఉన్న సగం మందికి (సుమారు 67 కోట్ల మంది) కరోనావైరస్ వ్యాప్తిచెందుతుందంటూ ఓ సంచలన రిపోర్టు బయటకు వచ్చింది. మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎట్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్‌ తన రిపోర్ట్ లో వెల్లడించింది.

మార్చి 24 నుంచి ఇప్పటివరకు దేశంలో లక్షా 65వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 67 కోట్ల మందికి కరోనా సోకినా, తమకు వైరస్ వ్యాపించినట్టు వారిలో కనీసం 90 శాతం మందికి అసలు తెలియనే తెలియదంటూ ఓ ఉపశమనం కల్పించే వార్తను కూడా తెలిపింది.

వైరస్ సోకిన వారిలో సుమారు 5 శాతం మందికి మాత్రం పరిస్థితి విషమంగా ఉంటుందని పేర్కొంది. ఆ లెక్కన 67 కోట్లలో 5 శాతం అంటే సుమారు 3 కోట్ల మంది పరిస్థితి విషమంగా ఉంటుందన్నమాట.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, దేశంలో మరణాల సంఖ్య 5 శాతం కంటే తక్కువే ఉండొచ్చని ఆ సంస్థ తెలిపింది.

లాక్‌డౌన్‌ 5.0లో భారీగా సడలింపు ఇచ్చిన కేంద్రం


కేంద్రం ప్రభుత్వం జూన్ 30వరకు లాక్డౌన్ పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మే31తో లాక్డౌన్ 4.0 ముగిస్తుండటంతో తాజాగా కేంద్రం మరోసారి లాక్డౌన్ పొడిస్తున్నట్లు ప్రకటించింది. లాక్డౌన్ 5.0లో కేంద్రం కొన్ని కీలక రంగాలకు సడలింపులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలోని కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో కార్యకలాపాలకు కేంద్రం అనుమతులను ఇచ్చింది. రాత్రిపూట కర్ఫ్యూను ఇక నుంచి రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5గంటలకు పరిమితం చేసింది. జూన్ 1నుంచి 30వతేది వరకు కేంద్ర మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని శనివారం కేంద్రం ఉత్తర్వులను జారీ చేసింది.

లాక్‌డౌన్‌ 5.0 సడలింపు మార్గదర్శకాలు:
జూన్‌ 8నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్‌ మాల్స్‌కు కేంద్రం అనుమతినిచ్చింది. అలాగే పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరుచుకునే అధికారం రాష్ట్రాలకే వదిలేసింది. ఇక విద్యాసంస్థలు పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం తీసుకోనుంది. అలాగే హోంశాఖ అనుమతి మేరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, మెట్రో రైలు వ్యవస్థ, అంతర్జాతీయ సర్వీసులకు అనుమతులను ఇచ్చింది.

లాక్‌డౌన్‌ 5.0లో అనుమతి లేనివి..
– మెట్రో రైలు, అంతర్జాతీయ విమాన సేవలు, సినిమాహాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, పార్కులు, బార్లకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదు. లాక్డౌన్ 5.0ద్వారా కేంద్రం దాదాపు అన్నిరంగాలకు మినహాయింపు ఇచ్చినట్లు కన్పిస్తుంది. దీనిని పరిశీలిస్తే కేంద్రం లాక్డౌన్ నుంచి అన్ లాక్ దిశగా వెళుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

దిశ మార్చుకున్న మిడతల దండు


తెలంగాణ రాష్ట్రానికి మిడతల దండుతో ప్రమాదం పొంచి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే మిడుతల దండు రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదే ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వేలాది ఎకరాల్లో పంటలను నాశనం చేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో మిడతల ప్రభావంపై సమీక్ష సమావేశంలో నిర్వహించిన తగు చర్యలను చేపట్టారు. మిడతల దండును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, ఫారెస్ట్, ఇతర ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. సరిహద్దుల్లో రసాయనాలు, అగ్నిమాపక యంత్రాలను ఇప్పటికే సిద్ధం చేశారు. అయితే మిడతల దండు రూట్ మార్చుకోవడంతో అధికారులు, రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

గతకొద్దిరోజులుగా మిడతల దండు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో తిష్ట వేశాయి. గంటలకు 16కిలోమీటర్ల వేగంతో తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం నాటికి గాలివాటం ఆధారంగా మిడతల దండు మధ్యప్రదేశ్ వైపు మరలి వెళ్లిపోతున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ, విపత్తు నిర్వహాణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈమేరకు తెలంగాణలో ఇప్పటివరకు మిడత దండు ప్రవేశించలేదని ప్రకటించారు. ఈ మిడతల దండు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం తక్కువని అధికారులు ప్రకటించారు. ఒకవేళ గాలి దిశ మార్చుకుంటే తెలంగాణవైపు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే ఇందుకోసం తెలంగాణ సరిహద్దుల్లో రసాయనాలతో అగ్నిమాపక సిబ్బంది అప్రతమత్తంగా ఉన్నారని చెబుతున్నారు. మిడతల దండును ఎదుర్కొనేందుకు అన్నివేళలా సన్నద్దంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి మిడతల దండు ముప్పు తప్పిపోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.