
కరోనాకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తయారు చేసేందుకు కనీసం నాలుగేళ్ల సమయం పడుతుందని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా స్పష్టం చేశారు. ఈ సంవత్సరం చివరిలోగా వస్తున్నదన్న కథనాలను ఆమె కొట్టిపారవేసారు.
కాబట్టి ఈ మహమ్మారిపట్ల రాబోయే కొన్నేళ్ల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. అందుకు ఆరోగ్యసంరక్షణపై మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సి రావొచ్చని ఓ వెబినార్‌లో ఆమె పేర్కొన్నారు.
మొత్తం దేశానికి అందుబాటులోకి వచ్చేలా ఒక వ్యాక్సిన్ తయారు చేయాలంటే చాలా సమయం పడుతుందని ఆమె తెలిపారు. వ్యాక్సిన్‌ను తయారుచేయడమనేది సంక్లిష్టమైన ప్రక్రియ అని, ఎంత లేదన్న పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ రూపొందించడానికి నాలుగేళ్ల సమయం పడుతుందని చెప్పారు.
‘ఒక ఏడాదిలో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం అసాధ్యమైన పనే. వ్యాక్సిన్ అభివృద్దిలో భద్రత, సామర్ధ్యం ఉండాలంటే పెద్ద స్థాయిలో పలు ప్రక్రియలు ముడిపడి ఉంటాయి. కాబట్టి నమ్మకమైన వ్యాక్సిన్ వచ్చేంతవరకు కొన్నేళ్లపాటు జాగ్రత్తగా ఉండాల్సిందే’ అని ఆమె స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ కోసం ఎదురు చూడడంతో పాటు ఆరోగ్యసంరక్షణపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని ఈ కరోనా మనకి నొక్కి చెబుతోందని కిరణ్ మజుందార్ షా వివరించారు.