
తెలంగాణ రాష్ట్రానికి మిడతల దండుతో ప్రమాదం పొంచి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే మిడుతల దండు రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదే ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వేలాది ఎకరాల్లో పంటలను నాశనం చేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో మిడతల ప్రభావంపై సమీక్ష సమావేశంలో నిర్వహించిన తగు చర్యలను చేపట్టారు. మిడతల దండును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, ఫారెస్ట్, ఇతర ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. సరిహద్దుల్లో రసాయనాలు, అగ్నిమాపక యంత్రాలను ఇప్పటికే సిద్ధం చేశారు. అయితే మిడతల దండు రూట్ మార్చుకోవడంతో అధికారులు, రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
గతకొద్దిరోజులుగా మిడతల దండు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో తిష్ట వేశాయి. గంటలకు 16కిలోమీటర్ల వేగంతో తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం నాటికి గాలివాటం ఆధారంగా మిడతల దండు మధ్యప్రదేశ్ వైపు మరలి వెళ్లిపోతున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ, విపత్తు నిర్వహాణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈమేరకు తెలంగాణలో ఇప్పటివరకు మిడత దండు ప్రవేశించలేదని ప్రకటించారు. ఈ మిడతల దండు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం తక్కువని అధికారులు ప్రకటించారు. ఒకవేళ గాలి దిశ మార్చుకుంటే తెలంగాణవైపు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే ఇందుకోసం తెలంగాణ సరిహద్దుల్లో రసాయనాలతో అగ్నిమాపక సిబ్బంది అప్రతమత్తంగా ఉన్నారని చెబుతున్నారు. మిడతల దండును ఎదుర్కొనేందుకు అన్నివేళలా సన్నద్దంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి మిడతల దండు ముప్పు తప్పిపోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.