
ప్రస్తుతం జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకొని ఆ పార్టీతో సాగుతున్నారు. మొన్నటి 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి ఓడిపోయాక టీడీపీకి పూర్తిగా దూరం జరిగారు. జాతీయ పార్టీ బీజేపీతో అంటకాగుతున్నారు. అయితే 2014 ఎన్నికల్లో కలిసి పోటీచేసి విజయం సాధించడంతో చంద్రబాబు మళ్లీ జనసేనతో దోస్తీకి వెంపర్లాడుతున్నాడు. ఆ విషయం తెలిసి తాజాగా పవన్ వెనక్కి తగ్గడం చర్చనీయాంశమైంది. ఏపీ సీఎం జగన్ ఏడాది పాలన సందర్భంగా ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కేంద్రంలోని బీజేపీ స్వయంగా ఏపీ సీఎం జగన్ పాలనను మెచ్చుకుంది. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలకు షాకిస్తూ సీఎం జగన్ ఏడాది పాలనను ప్రశంసించడం విశేషం. దీంతో రాష్ట్ర బీజేపీ నేతల గొంతులో పచ్చివెలక్కాయపడ్డ చందంగా మారింది. రాష్ట్రంలో జగన్, కేంద్రంలో మోడీ పాలన పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాంమాధవ్.. మోడీకి, జగన్ కు మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని సంచలన విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇద్దరూ ప్రజల కోసం పనిచేస్తున్నారని.. ఏపీ అభివృద్ధి పథంలో జగన్ ధృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని రాంమాధవ్ ప్రశంసించడం విశేషం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిర్ణయాలకు పార్లమెంట్ లో వైసీపీ ప్రధాన మద్దతు లభిస్తోందని.. దీన్ని మోడీ సర్కార్ స్వాగతిస్తోందని రాంమాధవ్ పేర్కొన్నారు.
అయితే ఏపీలోకి వచ్చేసరికి మాత్రం రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ.. ప్రతీసారి టీడీపీ అధినేత చంద్రబాబు ట్రాప్ లో పడిపోయి ఆయన వైసీపీ ప్రభుత్వంపై లేవనెత్తి అంశాలపై ఆందోళనలు చేస్తూ టీడీపీ వాయిస్ గా కనిపిస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఏ ఆందోళన మొదలు పెట్టినా దాన్ని టీడీపీ హైజాక్ చేసి టీడీపీ, జనసేన ఒకటే అని ప్రజల్లోకి తీసుకెళుతోంది. జగన్ కు టీడీపీ, జనసేన బీజేపీలు వ్యతిరేకం ఒక కూటమి అన్నట్టుగా ప్రచారం చేస్తోంది.
కరెంట్ బిల్లుల పెంపుపై మొదట లేవనెత్తింది జనసేననాని పవన్ కళ్యాణే. ఇక రాజధాని రైతుల ఆందోళనకు పవన్ ముందుగా వెళ్లారు. ఈ రెండింటిపై చంద్రబాబు అందిపుచ్చుకొని పెద్ద రాద్ధాంతం చేశారు. పవన్ ఏదైనా కార్యక్రమం మొదలుపెడితే చాలు దాన్ని టీడీపీ తమకు అనుకూలంగా మలుచుకుంటోందని పవన్ కు అర్థమైంది. విశాఖలో పవన్ ఆందోళనను కూడా టీడీపీ హైజాక్ చేసింది.
అందుకే బీజేపీతో సఖ్యతతో మెలుగుతున్న పవన్ ఈసారి చంద్రబాబు ట్రాపులో పడలేదు. బీజేపీ పెద్దలంతా ఏపీ సీఎం జగన్ పాలనను కొనియాడుతుండడంతో పవన్ కళ్యాణ్ ఈసారి సైలెంట్ అయ్యారు. ఈసారి పవన్ ఆశ్చర్యకరంగా కేంద్రంలోని మోడీ ఏడాది పాలనను మెచ్చుకుంటూ వైఎస్ జగన్ ఏడాది పాలనపై ఎలాంటి విమర్శలు చేయలేదు.
పవన్ కళ్యాణ్.. ఏపీ సీఎం జగన్ పాలనపై విమర్శలు చేస్తే దాన్ని అందిపుచ్చుకొని తామంతా ఒకటే అని రచ్చ చేద్దామని చూసిన టీడీపీకి పవన్ కళ్యాణ్ షాకిచ్చారు. ఈసారి టీడీపీకి ఆ అవకాశం ఇవ్వకుండా బీజేపీ ఆలోచనల ప్రకారం వైసీపీ అధినేత జగన్ పై ఎలాంటి విమర్శలు ట్వీట్లు చేయలేదు. ఇలా బురద రాజకీయాలకు దూరంగా.. చంద్రబాబు ట్రాపులో పడకుండా పవన్ తెలివిగా వ్యవహరించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
-నరేశ్ ఎన్నం