
క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబర్చినవారిని కేంద్రం ప్రభుత్వం ప్రతీయేటా ఖేల్ రత్న పురస్కారం అందజేస్తూ సత్కరిస్తుంది. 2020 సంవత్సరానికి గాను ఇండియన్ వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ, స్టార్ జెవెలిన్ త్రోయర్ నీరజ్ చొప్రా ఖేల్ రత్నకు నామినేట్ అయ్యారు. అర్జున అవార్డుకు ఇండియన్ ఓపెనర్ శిఖర్ ధావన్, పేసర్ ఇషాంత్ శర్మ, మహిళా క్రికెటర్ల నుంచి దీప్తి శర్మ, స్ప్రింటర్ ద్యుతీ చంద్ లు నామినేట్ అయ్యారు. రోహిత్ శర్మను ఖేల్ రత్నకు, శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మ, దీప్తి శర్మ పేర్లను అర్జున అవార్డులకు బీసీసీఐ సిఫార్సు చేస్తూ క్రీడామంత్రిత్వ శాఖకు పంపించింది.
రోహిత్ శర్మ ఓపెనర్ గా, వైస్ కెప్టెన్‌గా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు. రోహిత్ శర్మ 2019లో ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. ఒక ప్రపంచకప్ టోర్నీలో ఐదు శతకాలు బాదేసిన ఏకైక క్రికెటర్‌గా, టీ20ల్లో నాలుగు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా, ఇక టెస్టు ఓపెనర్‌గా అరంగేట్రంలోనే రెండు శతకాలు బాదిన తొలి క్రికెటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇతడి సేవలను గుర్తించిన బీసీసీఐ రోహిత్ పేరును ఖేల్ రత్న పురస్కారానికి నామినేట్ చేసింది. రోహిత్ తో కలిసి శిఖర్ ధావన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎన్నో చారిత్రక విజయాలు అందించాడు. వన్డేల్లో, టి20లో రోహిత్, ధావన్‌లు కలిసి ఎన్నో సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. పేసర్ ఇషాంత్ శర్మ టెస్టుల్లో అద్భుత బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. పలు టెస్టుల్లో జట్టుకు ఒంటిచేత్తో విజయాలందించాడు. మహిళా క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న దీప్తి శర్మను బీసీసీఐ అర్జున అవార్డు కోసం నామినేట్ చేసింది.
అదేవిధంగా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కూడా ఖేల్ రత్నకు నామినేట్ అయ్యాడు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య నుంచి నీరజ్ పేరును మాత్రమే సిఫారసు చేసినట్లు సమాచారం. వరుసగా మూడో ఏడాది నీరజ్ చొప్రా ఖేల్ రత్న పురస్కారానికి నామినేట్ అయ్యాడు. స్ప్రింటర్ ద్యుతీ చంద్ పేరును ఒడిశా ప్రభుత్వం అర్జున అవార్డుకు ప్రతిపాదించింది.