ఆ ఘటనపై విచారణ చేపట్టాలని సంజయ్ డిమాండ్!

సింగరేణిలోని ఓపెన్ కాస్ట్ లో పేలుడు సంభవించి నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపైవిచారణ చేపట్టాలని బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ కోల్ మైన్స్ సేఫ్టీ అధికారులు తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. మృతి చెందిన కార్మికులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ఆయన కోరారు.
సింగరేణిలో కమీషన్లకు కక్కుర్తి పడి నిబంధనలను గాలికి వదిలేయడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. సింగరేణిలో అధికారులకు ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టర్లు అక్షయ పాత్రగా మారారని ఆరోపించారు. సింగరేణి అధికారులు కాంట్రాక్టులు కేటాయించి పనులపై పర్యవేక్షణ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో ఓబీ పనుల్లో అధికార పార్టీ నేతలు బినామీలతో కాంట్రాక్టు పనులు చేయిస్తున్నారని ఆరోపించారు.
అలా చేస్తేనే రైతులకు లాభం:కేసీఆర్

మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రైతులు తమ పంటకు ధర రాని దుస్థితి ఉండదని ఆయన అన్నారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో రావాలని కేసీఆర్ అన్నారు. దీని కోసం వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆయన ఆదేశించారు. ఈ సారి వర్షాకాలం పంటతో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తున్నదని తెలిపిన సీఎం కేసీఆర్… ఇది ప్రతీ ఏటా ప్రతీ సీజన్ లో కొనసాగాలని ఆకాంక్షించారు.
అంతిమంగా రైతు లాభం కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం రైతుల సహకారంతో విజయవంతం చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగు పద్ధతిగా జరగడం కోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులతో మూడు రోజుల పాటు విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సిఎం వారికి పలు సూచనలు చేశారు.
జగన్ కు పక్కలో బల్లెంలా ఆ నేతలు..!

ఏడాది పూర్తి చేసుకున్న వైసీపీ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా తయారయ్యారు సొంత పార్టీ ప్రజా ప్రతినిధులు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సొంత పార్టీలోనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. కొంత కాలంగా వీరు ముఖ్యమంత్రి జగన్ కు, ఆ పార్టీకి తలనొప్పిగా మారారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. వీరిపై ఇంత వరకూ పార్టీ ఇటువంటి ప్రకటన చేయనప్పటికీ అంతర్గతంగా చర్చలు మాత్రం జరుగుతున్నాయని సమాచారం.
అది నుంచి ప్రభుత్వ విధానాలను కొన్నింటిని తప్పుబడుతూ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణమరాజు. బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయని బహిరంగంగానే చెబుతున్న ఈ ఎంపీ ఇంగ్లీష్ మీడియం, టిటిడి భూముల అమ్మకం, తదితర విషయాలలో ప్రభుత్వ నిర్ణయాలను తప్పు అని వ్యతిరేకించారు. దీంతో ఆయనను వైసీపీ వదిలి బీజేపీలో చేరాలని వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
నిన్న గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇసుక పంపిణీ విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అందుతుందని ప్రభుత్వం చెబుతున్నా గ్రామాల్లో గుప్పెడు ఇసుక ఇవ్వలేక పోతున్నామని జిల్లా పరిషత్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా నది నుంచి బయలుదేరిన వాహనాల్లో ఇసుక వినుకొండ రాకుండానే మాయం
అవుతుందని ప్రభుత్వ విధానంలో లోపాలను ఎండగట్టారు.
తాజాగా ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప తన నియోజకవర్గం వెంకటగిరిలో అభివృద్ధి శూన్యం అని ఎమ్మెల్యే ఆనం రామ నారాయణ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మంత్రులు, అధికారులు సీఎం లేఖనే పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. మరో ఏడాది వేచి చూస్తాను, పనులు జరగకపోతే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వెనుకాడేదిలేదని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో జలదోపిడీ లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గం ఒకటుందని గుర్తించాల ప్రభుత్వంపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
వైసీపీ ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, ఇతర పార్టీలు జనసేన, బిజెపి, కమ్యూనిస్టు పార్టీల నుంచి వచ్చే విమర్శలు తక్కువేమీ కాదు, టీడీపీ నుంచి రోజూ ఒకే అంశంపై పది మంది విమర్శిస్తారు. ఈ విమర్శలతో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల విమర్శలు మరింత ఇబ్బందికరంగా మారాయి. వీరిపై ఎటువంటి చర్యలు లేకుండా ఇలాగే వదిలేస్తే భవిష్యత్ లో మరింతమంది ఇదే ధోరణిలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న పార్టీ పెద్దలు ఈ విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు.
ఈ సీజన్ నుంచి నియంత్రిత సాగు: కేసీఆర్

రైతులు డిమాండ్ ఉన్న పంటలనే వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. గత మూడురోజులుగా కేసీఆర్ వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం మరోసారి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నియంత్రిత సాగుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వర్షాకాల సీజన్ నుంచి రాష్ట్రంలో నియంత్రిత సాగు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అధికారులు ఈమేరకు రైతులను సన్నద్ధం చేయాలని సూచించారు. ఈ సీజన్ నుంచి ప్రతీయేటా దీనిని కొనసాగించాలని అధికారులకు సూచించారు.
వ్యవసాయ లాభసాటిగా మార్చాలంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేయాలన్నారు. దీనికోసం వ్యవసాయాధికారులు నిరంతరం రైతులకు సాగుపై తగు సూచనలు చేయాలన్నారు. అవసరమైన ప్రణాళికలను రూపొందించాలన్నారు. పంటలకు డిమాండ్ ఉంటేనే మార్కెట్లో గిట్టుబాటు ధర వస్తుందన్నారు. రైతులు అల్లం, ఆలు, వెల్లుల్లి వంటి డిమాండ్ ఉన్న పంటలను పండించాలని సూచించారు. త్వరలోనే కాటన్ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సీజన్ తగ్గట్లు ఏయే పంటలు వేయాలో అధికారులు సూచనలు చేస్తారని రైతులు ఆ పంటలను వేయాలన్నారు.
వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులను సరిపడా సిద్దం చేసినట్లు తెలిపారు. తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలువాలన్నారు. వ్యవసాయంలో అవలంభించనున్న పద్ధతుల ద్వారా త్వరలోనే వ్యవసాయ లాభసాటిగా మారనుందని ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్థన్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్ రావు, అగ్రో బిజినెస్ కన్సల్టెంట్ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
‘సాగునీటి విషయంలో కేసీఆర్ నిర్లక్ష్యం’

సాగునీటి విషయంలో కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల తెలంగాణకు ద్రోహం జరుగుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కలుగుతున్న నష్టాన్ని బట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. సాగు నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని పోరాడి ప్రత్యేక తెలంగాణ సాధించామని పదే పదే చెప్పే కేసీఆర్.. ఎగువ, దిగువ ప్రాంతాల వారు నిబంధనలకు విరుద్ధంగా నీటిని తోడుకుని వెళ్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ కు నీళ్లు రాకపోతే ఖమ్మం, నల్లగొండ జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. దీనిపై రాజకీయాలకతీతంగా అందరూ సమైక్య పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఈ పోరాటంలో కలసి రాని వారిని ప్రజలు తెలంగాణ ద్రోహులుగానే పరిగణిస్తారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం ఆరేళ్ల క్రితం సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని, అయితే ఇన్నేళ్లు గడిచినా ఆ లక్ష్యం నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదని, గ్రూప్–1 నోటిఫికేషన్ వస్తుందని అభ్యర్థులు ఎదురుచూడటంతోనే సరిపోతోందని చెప్పారు.
ప్రశ్నించే వారి గొంతును నొక్కుతున్నారు.
ప్రజల పక్షాన ప్రశ్నించే వారి గొంతు నొక్కుతూ తాము చెప్పిందే వేదమన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని భట్టి విమర్శించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి, కనీసం ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలే కారణమని మండిపడ్డారు.
సెప్టెంబర్ వరకూ సీఎస్ గా సాహ్ని..!

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపునకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ అంశంపై కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. వాస్తవానికి ఈ ఏడాది జూన్ 30వ తేదీన సీఎస్ పదవి విరమణ చేయాల్సి ఉంది. జులై 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ మూడు నెలల పాటు ఆమె పదవి కాలాన్ని కేంద్రం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖను పరిగణలోనికి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సీఎస్ పదవీ కాలాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులలో పేర్కొంది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలను పాటిస్తూ వివాద రహితంగా పనిచేస్తుండటంతో సీఎస్ పదవీ కాలాన్ని పొడిగింపునకు సీఎం కేంద్రానికి లేఖ రాశారు. గతంలోనూ సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా టక్కర్ పదవి కాలాన్ని పెంచారు. రమాకాంత్ రెడ్డి తదితరులు పదవీ కాలం పొడిగింపు పొందిన వారిలో ఉన్నారు.
కేసీఆర్ కు జగ్గారెడ్డి లేఖాస్త్రం..

కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై లేఖాస్త్రాన్ని సంధించారు. ప్రజలకు సంబంధించిన పలు డిమాండ్లను ఆ లేఖలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ సర్కార్ తన డిమాండ్లను నెరవేర్చకుంటే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. లాక్డౌన్ కారణంగా కొన్ని పరిశ్రమలు మూసేయడం వల్ల కార్మికులు, యాజమాన్యాలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
ప్రభుత్వం వీరందరికీ అండగా ఉండాలని కోరారు. తన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 9న తన ఇంట్లో ఒక రోజు నిరాహార దీక్ష చేస్తానని లేఖలో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. అందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయిందని విమర్శించారు. టీఆర్ఎస్ సర్కార్ బీజేపీతో అంటకాగుతుందంటూ విమర్శించారు. ఇదిలా ఉంటే లేఖలో ప్రజలకు సంబంధించిన పలు డిమాండ్ల చిట్టాను ఆయన విన్పించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటి పన్నును ఏడాదిపాటు రద్దు చేయాలని కోరారు. అలాగే ప్రజలు కరెంటు బిల్లులు కట్టకుండా ఆరునెలలపాటు నిలిపి వేయాలన్నారు. నీటి బిల్లులను కూడా ఏడాదిపాటు రద్దు చేయాలని కోరారు. పట్టణాల్లో అద్దె ఇళ్లలో ఉంటున్నవారికి ఆరు నెలల వరకు కిరాయి ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. బ్యాంకు ఈఎంఐలను ఆరునెలలపాటు ప్రభుత్వమే చెల్లించాలన్నారు. పరిశ్రమలకు ఆరు నెలల వరకు కరెంట్ బిల్లులను రద్దు చేయాలనే డిమాండ్లను జగ్గారెడ్డి కేసీఆర్ కు సంధించిన లేఖలో పేర్కొన్నారు.
చంద్రబాబుకు జగన్ జలక్.. సీబీఐకి కేసులు

2018-19 సమయంలో దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి వైదొలిగారు నాటి ఏపీ సీఎం చంద్రబాబు. ప్రత్యేక హోదా ఇవ్వని మోడీ వైఖరిని నిరసనగా కాంగ్రెస్ తో జట్టుకట్టారు. ఆ ఏడాది కాలంలో నరేంద్రమోడీతో తీవ్రంగా బహిరంగంగా ఘర్షణకు దిగారు.
కేంద్రంలోని మోడీ సర్కార్ ఆదేశాలను చంద్రబాబు ధిక్కరించారు. కాలదన్నారు. మోడీతో ఢీ అంటే ఢీ అన్నారు. ఏపీలో రాజకీయ నాయకులపైనే కాదు.. అఖిల భారత ఐఏఎష్ అధికారులపై కూడా కేసులను దర్యాప్తు చేయడానికి నాటి సీఎం చంద్రబాబు కేంద్రంలోని సీబీఐకి అనుమతి ఇవ్వలేదు. సీబీఐని ఏపీలో అడుగు పెట్టనీయకుండా నిషేధించారు. ఘర్షణకు దిగారు.
నాడు మోడీపై ఇదే సీఎంగా ఉన్న చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికే సీబీఐ వంటి ఏజెన్సీలను కేంద్రం దుర్వినియోగం చేసిందని.. ఫలితంగా సీబీఐకి ఏపీలో ఏ కేసును అప్పగించమని.. సీబీఐని ఏపీలో అడుగపెట్టనీయమని నిషేధించారు చంద్రబాబు.
కానీ 2019లో చంద్రబాబు అధికారం కోల్పోయిన తర్వాత ట్రైయిన్ రివర్స్ అయ్యింది. చంద్రబాబు బీజేపీని ఎదురించి ఓడిపోయారు. అదే సమయంలో బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు.
ఇప్పుడు ఏపీలోని జగన్ ప్రభుత్వంపై ఒంటికాలిపై లేస్తున్నారు. ప్రతీ సమస్యపై సీబీఐ విచారణను కోరుతున్నారు. తన పాలనను సీబీఐని నిషేధించి.. అడుగు పెట్టనీయకుండా చేసిన ఇదే చంద్రబాబు ఇప్పుడు సీబీఐ విచారణకు ప్రతీసారి డిమాండ్ చేస్తుండడం విశేషం.
వైఎస్ జగన్ సీఎం అవ్వగానే కేంద్ర జాతీయ దర్యాప్తు సంస్థ సీబీఐని ఏపీలోకి అనుమతించారు. చంద్రబాబు ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తి వేశారు. చంద్రబాబు పాలనలో సీబీఐ దర్యాప్తు చేయాల్సిన ఆరు కేసులను తాజాగా రాష్ట్ర ఏసీబీ నుంచి సీబీఐకి జగన్ బదలాయించారు. సీబీఐ తాజాగా ఏపీకి తిరిగి చేరుకుంది. ఏసీబీ నమోదు చేసిన కేసులను స్వాధీనం చేసుకుంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు లంచం డిమాండ్ చేసిన రెండు కేసులు, సిండికేట్ బ్యాంక్ అధికారులు నిధుల దుర్వినియోగానికి సంబంధించిన మరో రెండు కేసులు, సిజిఎస్టి విభాగం మరియు నావల్ డాక్ యార్డ్ అధికారులు లంచం డిమాండ్ కేసులను సీబీఐ చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి ప్రకారం సీబీఐ ఈ కేసులను తీసుకుంది. చంద్రబాబు ప్రభుత్వం నాడు నిషేధిస్తే ఇప్పుడు ఆ కేసులన్నింటిని జగన్ సర్కార్ సీబీఐకి అప్పగించి చంద్రబాబుకు షాకిచ్చారు. ఇందులో ఏం తేలుతుందనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
-నరేశ్ ఎన్నం
తుఫానుగా మారిన ‘నిసర్గ’.. మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్..

దేశంలో కరోనా ఓవైపు కరోనా వైరస్ విభృంభిస్తుండగా మరోవైపు మిడతల దండు దాడి చేస్తోంది. వీటికి తోడు తాజాగా ‘నిసర్గ’ తుఫాను ముంచుకోస్తుంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తుఫాను తీరం దాటింది. గంటకు 120కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తున్నాయి. మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లా అలీబాగ్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం 1.30 తర్వాత నిసర్గ తుఫాన్ తీరం దాటింది.దీంతో మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో నిసర్గ తుఫాను ముప్పు ఉండటంతో ఆయా ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. రెండ్రోజులపాటు ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలతో పుణేలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మహారాష్ట్రలోని రాయ్‌గడ్, రత్నగిరి, పాల్‌గర్, సింధు, దుర్గ్, థానే జిల్లాలపై తుఫాన్ ప్రభావం అధికంగా ఉండనుంది. ఇప్పటికే ముంబైలో పదివేల మందిని తాత్కాలిక శిబిరాలకు ప్రభుత్వ యంత్రాంగం తరలించినట్లు సమాచారం.
అరేబియా సముద్రంలో నిసర్గ తుఫాన్ తీరం దాటే సమయంలో సముద్ర అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరప్రాంతం కోతకు గురవుతోంది. ఈ ప్రాంతంలోని పలు ఇళ్లు, నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. నిసర్గ తుఫాన్ కారణంగా ముంబై, గోవా తీర ప్రాంతాల్లో రహదారులన్నీ మూసుకుపోయాయి. పలు జిల్లాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు సహాయ చర్యలు చేపడుతున్నాయి. వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
150 మిలియన్ వ్యూస్ దాటిన ‘నీలి నీలి ఆకాశం’

పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవుతున్న ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ పాట యూట్యూబ్‌లో సెన్సేషనల్ రికార్డులు సృష్టిస్తోంది. సంగీత ప్రియుల ఆదరణతో 150 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి, చిన్న సినిమాల పాటల్లో ఈ ఫీట్ సాధించిన సాంగ్‌గా సరికొత్త చరిత్రను సాధించింది. సుకుమార్ దగ్గర ‘ఆర్య 2’, ‘1.. నేనొక్కడినే’ చిత్రాలకు పనిచేసిన మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కన్నడ చిత్రసీమలో విజయవంతమైన చిత్రాల నిర్మాతగా పేరుపొందిన ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు.
అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా, ‘నీలి నీలి ఆకాశం’ పాటతో సహా చిత్రంలోని అన్ని పాటలనూ చంద్రబోస్ రాశారు. ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్‌పై చిత్రీకరించిన ‘నీలి నీలి ఆకాశం’ పాట 150 మిలియన్ వ్యూస్ దాటడంతో చిత్ర బృందమంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే ఇదొక అరుదైన ఫీట్‌గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. స్టార్లు లేని ఒక చిన్న సినిమాలోని పాటకు ఈ స్థాయి ఆదరణ లభించడం అపురూపమైన విషయంగా వారు చెబుతున్నారు. అనూప్ రూబెన్స్ ఇచ్చిన వినసొంపైన బాణీలకు చంద్రబోస్ రాసిన కమనీయ సాహిత్యం, సింగర్స్ సిద్ శ్రీరామ్, సునీత సుమధర గానం తోడై ఈ పాటను ఇంత బ్లాక్‌బస్టర్ చేశాయని నిర్మాత ఎస్వీ బాబు అన్నారు. ఈ సందర్భంగా సంగీత ప్రియులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఒక సింగర్‌ను ఐదేళ్లు బ్రతికించడానికి ఒక పాట చాలనీ, నీలి నీలి ఆకాశం అలాంటి పాటనీ గాయని సునీత అన్నారు . తన కెరీర్‌లో ఈ పాట ఓ మధురమైన మలుపుగా నిలించిందని ఆమె అమితానందం వ్యక్తం చేశారు. ఈ పాట విజయోత్సవంలో తాను భాగస్వామినే కాకుండా భావస్వామిని కూడా అయినందుకు గర్వపడుతున్నానని లిరిసిస్ట్ చంద్రబోస్ చెప్పారు. ఈ పాటను అమలాపురం నుంచి అమెరికా దాకా అందరూ పాడుకుంటున్నారని డైరెక్టర్ మున్నా సంతోషం వ్యక్తం చేశారు. తాను ఇప్పటివరకూ కంపోజ్ చేసిన సాంగ్స్‌లో ఏ పాటనీ విననన్ని సార్లు ఈ పాటను విన్నానని మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రెబెన్స్ అన్నారు.
’30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ సినిమా ఔట్‌పుట్ చూసి నచ్చడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయడానికి నిర్మాతలతో జీఏ2, యువి క్రియేషన్స్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ఇలా రెండు అగ్ర డిస్ట్రిబ్యూషన్ సంస్థల సపోర్ట్ లభించడం సినిమాకి ప్లస్ అవుతోంది.
సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయనీ, ప్రస్తుతం దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు సమసిపోయి, సాధారణ పరిస్థతి నెలకొన్న తర్వాత చిత్రాన్ని విడుదల చేస్తామనీ నిర్మాత ఎస్వీ బాబు చెప్పారు.
తారాగణం:
ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్, శివన్నారాయణ, హేమ, పోసాని కృష్ణమురళి, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, హైపర్ ఆది, ఆటో రామ్‌ప్రసాద్, భద్రం, జబర్దస్త్ మహేష్.
సాంకేతిక బృందం:
పాటలు: చంద్రబోస్
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్
ఆర్ట్: నరేష్ తిమ్మిరి
పీఆర్వో: వంశీ-శేఖర్
నిర్మాత: ఎస్వీ బాబు
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మున్నా.
తొమ్మిది హత్యల కేసులో..ఒక సీక్రెట్!

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని బావిలో తొమ్మిది మందిని వేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ ఘటనలో భాగంగా మృతులందరి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు వారు మత్తులోకి జారుకున్నాక హత్య చేశాడని పోలీసులు వెల్లడించా రు. ఇంత వరకు బాగానే ఉన్నా పెద్దమొత్తంలో నిద్ర మాత్రలు ఏ షాపులో కొనుగోలు చేశాడనే వివరాలు చెప్పకపోవడం గమనార్హం. విచారణలో భాగంగా నిందితుడు వరంగల్ చౌరస్తాలోని ఓ షాపులో మాత్రలు కొనుగోలు చేసినట్లు వెల్లడించాడని చెబుతున్నా ఆ షాపు పేరు బహిర్గతం చేయడం లేదు. దీని వెనుక ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత చేసిన మహిళ హత్యను కప్పి పుచ్చుకునేందుకు నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ మరో తొమ్మిది మందిని హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటన జరిగాక పోలీసులు పడక్బందీ వ్యూహంతో ఏడు బృందాలు విడిపోయి మూడు రోజుల్లోగా నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో తొమ్మిది మందిని ఒక్కడే హతమార్చాడని వెల్లడిందని చెప్పిన పోలీసులు.. ఇంత మందిని హతమార్చేందుకు గాను బాధితులకు మత్తు కోసం 60 వరకు నిద్రమాత్రలను ఉపయోగించాడని ప్రకటించారు. కానీ నిద్రమాత్రలు కొనుగోలు చేసిన మెడికల్ షాపు పేరు కనుక్కోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, పోలీసులకు షాపు పేరు తెలిసినా వెల్లడించడం లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి హంతుకుడిగా కఠిన శిక్షపడేలా చేస్తామని చెబుతున్న పోలీసులు.. మందుల షాపు విషయంలో ఈ రహస్యం ఎందుకు చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది
బీజేపీలో టీడీపీ కోవర్టులు..?

టీడీపీ అధినేత చంద్రబాబు గెలిచినా.. ఓడినా.. ఆయన కోటరీ మాత్రం చెక్కు చెదరకుండా కొనసాగుతోందని.. అందుకే అధికార వైసీపీని అన్ని వైపుల నుంచి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. బీజేపీతో ఎన్నికలకు ముందు తొడగొట్టినా.. బాబు ఇప్పుడు అదే బీజేపీని శరణు వేడుతున్నారు. బీజేపీని శాంతపరచడానికి తన అనుంగ అనుచరులు అయిన టీడీపీకి బ్యాక్ బోన్ గా ఉన్న నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలను పల్లెంలో పెట్టి మరీ బీజేపీలోకి సాగనంపారు. వారు బీజేపీలోనే ఉన్న చంద్రబాబు, టీడీపీ కోసమే పనిచేస్తున్నారన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి.
టీడీపీ అధికారంలో లేనప్పటికీ.. త్వరలో తిరిగి అధికారంలోకి రాలేకపోయినప్పటికీ బీజేపీలోని ఒక విభాగం టీడీపీ కోసం పనిచేస్తూనే ఉందనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంటాయి. బీజేపీలో చేరిన టీడీపీ విధేయులు ఇప్పటికీ టీడీపీ ప్రయోజనాలను పరిరక్షించడానికి కృషి చేస్తూనే ఉన్నారన్న ప్రచారం ఉంది. తాజాగా రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై కేసులోనూ చంద్రబాబుపై ప్రేమ బీజేపీ లో ఉన్న ఆయన కోవర్టుల ద్వారా బయటపడింది.
రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై హైకోర్టుకు ఎక్కింది ఎవరో కాదు.. మాజీ మంత్రి, బీజేపీ వివాదాస్పద నాయకుడు కామినేని శ్రీనివాస్. రాజ్యాంగ పదవుల గౌరవాన్ని పరిరక్షించాలనే నెపంతో ఆయన కోర్టును ఆశ్రయించాడు. తనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అనుమతి ఉందని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈ విషయం తెలుసనని పేర్కొన్నాడు.
అయితే అదే కేంద్రంలోని బీజేపీ ఏపీలో ఉన్న వైసీపీ ప్రభుత్వంతో అనుకూలంగా వ్యవహరిస్తోంది. బీజేపీ నేతగా ఉన్న కామినేని వైసీపీని బీజేపీ హైకమాండ్ వ్యతిరేకిస్తుందనే అభిప్రాయాన్ని హైకోర్టుకు ఎక్కడం ద్వారా వ్యాపింపచేశాడు. టీడీపీ చేయాల్సిన పనిని ఈ బీజేపీ నేత చేయడం.. హైకోర్టుకు ఎక్కడంతో ఈయన చంద్రబాబు కోవర్టా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వైసీపీతో బీజేపీ జాతీయ నాయకత్వం సన్నిహితంగా మెలుగుతోంది. మంచి సంబంధాలను కలిగి ఉంది. ఇప్పటికే ఒక సీనియర్ వైసీపీ ఎంపీ బీజేపీ అగ్రనాయకత్వంతో సన్నిహితంగా ఉంటారు. అయినప్పటికీ కొంతమంది బీజేపీ నాయకులు ఇప్పటికీ టీడీపీ నాయకులతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటికీ బీజేపీలో చంద్రబాబు కోవర్టులున్నారని.. ఆయన కోసమే పనిచేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు రమేశ్ కుమార్ పై బీజేపీ నేత హైకోర్టుకు ఎక్కడంతో ఆ విషయం నిరూపితమైంది.
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన సీఎం కాన్వాయ్

మంత్రులు, ముఖ్యమంత్రులు, వీఐపీల కాన్వాయ్ లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకుపోతుంటాయి. మరీ వీటికి ట్రాఫిక్ చలాన్లు వీటికి వర్తించవా? అనే ప్రశ్న సామాన్యుల్లో మెదలుతూ ఉంటుంది. అయితే ట్రాఫిక్ రూల్స్ ఎవరీకైనా ఒకటేనని తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తాజాగా నిరూపించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన సీఎం కేసీఆర్ కాన్వాయ్ కు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించారు. ఒకటే కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు చలాన్లు విధించడం చర్చనీయాంశంగా మారింది. ఓవర్ స్పీడు కారణంగా నాలుగు చలాన్లు విధించినట్లు సమాచారం. ట్రాఫిక్స్ రూల్స్ ప్రజలందరికీ సమామేనని.. ఎవరూ కూడా అతీతులుకారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ అయిన ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే చలాన్లు చెల్లించాల్సిందే అంటున్నారు.
సీఎం కాన్వాయ్ ఓవర్ స్పీడ్ కారణంగా నాలుగు సార్లు చల్లాన్లు విధించారు. హైదరాబాద్‌లో రెండు సార్లు, సైబరాబాద్‌లో ఒకటి, సూర్యాపేట జిల్లాలో మరోసారి చలాన్లు విధించారు. కిందటేడాది అక్టోబర్ 16న కోదాడ సమీపంలోని శ్రీరంగాపురంలో సీఎం కాన్వాయ్ కి తొలిసారి జరిమానా విధించారు. కాగా ఈ మొత్తం మూడుసార్లు చలాన్లు విధించారు. 2020 ఏప్రిల్ 15న మాదాపూర్ పరిధిలో రెండోసారి.. ఏప్రిల్ 29న టోలిచౌకి పరిధిలో మూడోసారి, జూన్ 1న ట్యాంక్‌బండ్ పరిధిలో నాలుగోసారి చలాన్లు విధించారు.
సీఎం కాన్వాయ్ కు ట్రాఫిక్ చలాన్లు విధించారని మీడియాలో రావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం నాలుగు చలాన్లు క్లియర్ చేసినట్లు సమాచారం. జూన్ 1న విధించిన ఫెనాల్టీ కలిపి మొత్తం రూ. 4,140లను సీఎంవో చెల్లించినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం కాన్వాయ్ కు సంబంధించిన చలాన్లు ఏవీ పెండింగ్లో లేవని అధికారులు చెబుతోన్నారు.
















