
దేశంలో కరోనా ఓవైపు కరోనా వైరస్ విభృంభిస్తుండగా మరోవైపు మిడతల దండు దాడి చేస్తోంది. వీటికి తోడు తాజాగా ‘నిసర్గ’ తుఫాను ముంచుకోస్తుంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తుఫాను తీరం దాటింది. గంటకు 120కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తున్నాయి. మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లా అలీబాగ్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం 1.30 తర్వాత నిసర్గ తుఫాన్ తీరం దాటింది.దీంతో మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో నిసర్గ తుఫాను ముప్పు ఉండటంతో ఆయా ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. రెండ్రోజులపాటు ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలతో పుణేలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మహారాష్ట్రలోని రాయ్‌గడ్, రత్నగిరి, పాల్‌గర్, సింధు, దుర్గ్, థానే జిల్లాలపై తుఫాన్ ప్రభావం అధికంగా ఉండనుంది. ఇప్పటికే ముంబైలో పదివేల మందిని తాత్కాలిక శిబిరాలకు ప్రభుత్వ యంత్రాంగం తరలించినట్లు సమాచారం.
అరేబియా సముద్రంలో నిసర్గ తుఫాన్ తీరం దాటే సమయంలో సముద్ర అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరప్రాంతం కోతకు గురవుతోంది. ఈ ప్రాంతంలోని పలు ఇళ్లు, నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. నిసర్గ తుఫాన్ కారణంగా ముంబై, గోవా తీర ప్రాంతాల్లో రహదారులన్నీ మూసుకుపోయాయి. పలు జిల్లాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు సహాయ చర్యలు చేపడుతున్నాయి. వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.