
ఏడాది పూర్తి చేసుకున్న వైసీపీ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా తయారయ్యారు సొంత పార్టీ ప్రజా ప్రతినిధులు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సొంత పార్టీలోనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. కొంత కాలంగా వీరు ముఖ్యమంత్రి జగన్ కు, ఆ పార్టీకి తలనొప్పిగా మారారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. వీరిపై ఇంత వరకూ పార్టీ ఇటువంటి ప్రకటన చేయనప్పటికీ అంతర్గతంగా చర్చలు మాత్రం జరుగుతున్నాయని సమాచారం.
అది నుంచి ప్రభుత్వ విధానాలను కొన్నింటిని తప్పుబడుతూ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణమరాజు. బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయని బహిరంగంగానే చెబుతున్న ఈ ఎంపీ ఇంగ్లీష్ మీడియం, టిటిడి భూముల అమ్మకం, తదితర విషయాలలో ప్రభుత్వ నిర్ణయాలను తప్పు అని వ్యతిరేకించారు. దీంతో ఆయనను వైసీపీ వదిలి బీజేపీలో చేరాలని వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
నిన్న గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇసుక పంపిణీ విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అందుతుందని ప్రభుత్వం చెబుతున్నా గ్రామాల్లో గుప్పెడు ఇసుక ఇవ్వలేక పోతున్నామని జిల్లా పరిషత్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా నది నుంచి బయలుదేరిన వాహనాల్లో ఇసుక వినుకొండ రాకుండానే మాయం
అవుతుందని ప్రభుత్వ విధానంలో లోపాలను ఎండగట్టారు.
తాజాగా ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప తన నియోజకవర్గం వెంకటగిరిలో అభివృద్ధి శూన్యం అని ఎమ్మెల్యే ఆనం రామ నారాయణ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మంత్రులు, అధికారులు సీఎం లేఖనే పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. మరో ఏడాది వేచి చూస్తాను, పనులు జరగకపోతే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వెనుకాడేదిలేదని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో జలదోపిడీ లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గం ఒకటుందని గుర్తించాల ప్రభుత్వంపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
వైసీపీ ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, ఇతర పార్టీలు జనసేన, బిజెపి, కమ్యూనిస్టు పార్టీల నుంచి వచ్చే విమర్శలు తక్కువేమీ కాదు, టీడీపీ నుంచి రోజూ ఒకే అంశంపై పది మంది విమర్శిస్తారు. ఈ విమర్శలతో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల విమర్శలు మరింత ఇబ్బందికరంగా మారాయి. వీరిపై ఎటువంటి చర్యలు లేకుండా ఇలాగే వదిలేస్తే భవిష్యత్ లో మరింతమంది ఇదే ధోరణిలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న పార్టీ పెద్దలు ఈ విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు.