Home Blog Page 8446

అలాగైతే రోజూ వంద మంది చనిపోవాలంటున్న ఆర్జీవీ


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు బంధుప్రీతే కారణమని వస్తున్న ఆరోపణలను సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఖండించాడు. ఇండస్ట్రీలో వారసత్వ నటులని పరిచయం చేస్తున్న కరణ్ జొహార్ను టార్గెట్‌ చేసి వివర్శలు చేయడానని తప్పుపట్టాడు. తమ బంధువులకు అవకాశం ఇస్తే తప్పేంటన్నారు. బంధుప్రీతి లేని రంగం ఏమిటని ఆయన ఎదురు ప్రశ్నించాడు. బంధుప్రీతి లేకపోతే ఈ సమాజం కుప్పకూలుతుందన్నాడు. కరణ్ కు మద్దతు పలుకుతూ వరుస ట్వీట్స్‌ చేయడం చర్చనీయాంశమైంది. ‘నెపోటిజం అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కరణ్ జొహర్‌ను విమర్శించే వాళ్లు ఒక్కరి కూడా పని ఇవ్వలేరు. కానీ, కరణ్, ఏక్తా కపూర్, ఆదిత్య చోప్రా లాంటి వాళ్లు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ రాద్ధాంతం ముగిసిన తర్వాత ఎంతో మంది న్యూకమర్స్‌ వారి ఆఫీసుల ముందు క్యూ కడుతారు. అయినా సినీ పరిశ్రమ ఎలా నడుస్తుందో తెలియకే ఇలాంటి విమర్శిస్తున్నారు. సుశాంత్ తో ఇబ్బంది ఉన్నప్పుడు అతనితో పని చేయాలా, వద్దా అనేది కరణ్ సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఎవరితో కలిసి పని చేయాలనేది ప్రతి నిర్మాత సొంత నిర్ణయం. అయినా డబ్బు, పేరు వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా ఇండస్ట్రీ నుంచి వెలివేయ బడ్డ వ్యక్తిగా భావించి సుశాంత్ ఆత్మహత్య చేసున్నట్టయితే.. అతని దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన వ్యక్తులు రోజుకు కనీసం 100 మంది తనువు చాలించాలి’ అని పేర్కొన్నాడు.

కేవలం తనను బయటి వ్యక్తిగా చూస్తూ పార్టీలకు ఆహ్వానించకపోవటం వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని చెపుతున్నారని, అలాంటప్పుడు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా, ఖాళీ కడుపులతో నడుస్తున్న కోట్లాది మంది వలస కార్మికులు ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకునేవాళ్లు అని అభిప్రాయపడ్డాడు. అయినా బంధుప్రీతి లేనిదెక్కడ అని ప్రశ్నించాడు. ‘ ములాయం, ఉద్ధవ్ థాక్రే వంటి రాజకీయవేత్తలు తమ కుమారులు, బంధువులకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా.. ముఖేశ్, అనిల్ కు ధీరూబాయ్ అంబానీ డబ్బు ఇచ్చినట్టుగా… అన్ని కుటుంబాలు తమ సొంత వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చినట్టు… బాలీవుడ్ కుటుంబాలు కూడా వారి సొంత వ్యక్తులకు అదే ప్రాధాన్యతను ఇచ్చాయి. బంధు ప్రీతి లేకుంటే ఈ సమాజం మొత్తం కుప్పకూలిపోతుంది. ఇది సమాజంలో అంతర్భాగం’ అని ఆర్జీవీ వరుస ట్వీట్స్‌లో రాసుకొచ్చాడు.

సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు


దేశంలో కరోనా పంజా విసురుతుండటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా ఎంట్రీతో దేశంలో లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలకు గండిపడింది. లాక్డౌన్ ఇలానే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని భావించిన కేంద్రం కొన్ని సడలింపులను ఇచ్చింది. దీంతో కేంద్ర, రాష్ట్రాలకు తిరిగి ఆదాయం వస్తోంది. అయితే కరోనా కాలంలో కోల్పోయిన ఆదాయాన్ని తిరిగి రాబట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా స్పెషల్ ట్యాక్స్ లు విధిస్తుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.

దేశంలో లాక్డౌన్ కారణంగా చాలామంది ఉద్యోగులు కోల్పోవాల్సిన పరిస్థితి. అనేకమంది ఉపాధిలేక అవస్థలు పడుతున్నారు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏకంగా ఉద్యోగుల జీతాల్లో సగానికి కోతపెట్టింది. మూడునెలలుగా సగం జీతంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మూడునెలల కరెంటు బిల్లు ఒకేసారి స్లాబులు మార్చి ఇవ్వడంతో వేలల్లో బిల్లు రావడంతో పేదప్రజలు లబోదిబోమంటున్నారు. మద్యం రేట్లను 15శాతంవరకు పెంచి మద్యంప్రియులను జేబులను కొల్లగొడుతోంది. తెలంగాణలో కరోనా టెస్టులపై పకడ్బంధీ చర్యలు చేపట్టని ప్రభుత్వం ఆదాయంపై మాత్రం దృష్టిసారిస్తుండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతోన్నాయి.

మరోవైపు కేంద్రం కరోనా సమయంలో వలస కార్మికులను ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలున్నాయి. లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు పెద్దఎత్తున నష్టపోవాల్సి వచ్చింది. ఈ తరుణంలో కేంద్రం 20లక్షల స్పెషల్ ప్యాకెజీనీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ వల్ల సామాన్యుడికి ఒరిగేందేమీలేదని అంటున్నారు. 20లక్షల స్పెషల్ ప్యాకేజీ మేడిపండు చందంగా ఉందని విమర్శులు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో కేంద్రం గత 11రోజులుగా పెట్రోలు ధరలను పెంచుతుండటంపై సామాన్యులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బుధవారం కూడా లీటరు పెట్రోల్ మీద 55 పైసలు పెంచితే.. డీజిల్ మీద 60 పైసలు పెంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గడిచిన 11 రోజుల్లో లీటరు పెట్రోల్ మీద రూ.6.02 పెరిగితే డీజిల్ పై రూ.6.40 పెరిగింది. తాజాగా పెంచిన ధరలతో తెలంగాణలో లీటరు పెట్రోల్ ధర రూ.80.22లకు చేరగా డీజిల్ రూ.74.07గా చేరింది. ఇక ఏపీలో పెట్రోల్ ధర రూ.80.66కు చేరితే.. డీజిల్ రూ.74.54గా మారింది. కేంద్ర సర్కార్ ఆదాయం పెంచుకోవడంపై దృష్టిపెట్టడంతో రానున్న రోజుల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పెట్రోల్-డీజిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం ప్రజారవాణా వ్యవస్థ పడుతుంది. దీంతో అన్ని వస్తువుల ధరలు పెరగడం ఖాయం. కరోనా కాలంలోనూ మోడీ సర్కార్ ప్రజలపై పగబట్టినట్లు పన్నులు విధిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో ప్రధాని మోదీ మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

నటనలోనే కాదు మంచితనంలోనూ ‘మహానటి’!


లాక్‌డౌన్‌ కారణంగా యావత్‌ చిత్ర పరిశ్రమ స్తంభించిపోయిన విషయం తెలిసిందే. షూటింగ్‌, సినిమా విడుదల నిలిచిపోవడంతో ఇండస్ట్రీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. నటీనటులు, సాంకేతిక సిబ్బంది, కార్మికులు ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. ఇంకా పూర్తి స్థాయిలో షూటింగ్‌లు మొదలవలేదు. అలాగే, థియేటర్లు ఎప్పుడు ఓపెన్‌ అవుతాయో తెలియదు కాబట్టి.. పూర్తయిన చిత్రాలు కూడా ఎప్పుడు విడుదల అవుతాయో చెప్పే పరిస్థితి లేదు. దాంతో, భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీ మొత్తం సంక్షోభం పడింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా మళ్లీ బతికి బట్టకట్టాలంటే పెనుమార్పులు అవసరమని సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా నటీనటులు తమ పారితోషికాలను తగ్గించుకోవాలనే డిమాండ్‌ పెరుగుతోంది. ఈ విషయంలో ఇప్పటికే పలువురు నటీనటులు పారితోషికాన్ని తగ్గించుకోవడానికి ముందుకొచ్చారు.

అయితే కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా అందుకుంటున్న స్టార్‌ హీరో హీరోయిన్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కానీ, ఈ విషయంలో యువ నటి కీర్తి సురేశ్ మాత్రం అందరికీ ఆదర్శంగా నిలిచింది. తన పారితోషకాన్ని 30 శాతం వరకూ తగ్గించుకేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. ఆమె నిర్ణయాన్ని సినీ పరిశ్రమ వర్గాలు స్వాగతిస్తున్నారు. పలువురు నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘మహానటి’తో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న తర్వాత కీర్తి స్టార్డమ్‌ అమాంతం పెరిగింది. ఆమె చేతిలో దాదాపు అర డజను చిత్రాలున్నాయి. ఇంత డిమాండ్‌ ఉన్నప్పటికీ రెమ్యునరేషన్‌ విషయంలో వెనక్కుతగ్గడం నిజంగా గొప్పవిషమయే. నటనలోనే కాదు మంచితనంలో కూడా కీర్తి ‘మహానటి’ అని నిరూపించుకుంది.

కాగా, కీర్తి నటించిన ‘పెంగ్విన్’ చిత్రం ఈ నెల 19 నుంచి తెలుగు, తమిళ్‌లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘అన్నాత్తా’ చిత్రంలో కీర్తి ఆయనకు కూతురుగా నటిస్తోంది. షూటింగ్‌ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. అలాగే, కీర్తి చేతిలో ప్రస్తుతం ‘రంగ్ దే’ , ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లక్ సఖి’, ‘మరక్కార్’ చిత్రాలు ఉన్నాయి.

బాయ్‌కాట్‌ బాలీవుడ్, బాయ్‌కాట్‌ సల్మాన్‌ ట్రెండ్‌..


యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్ రగిలిపోతోంది. కొంత మంది బాలీవుడ్‌ పెద్దల నెపోటిజం (బంధుప్రీతి) కారణంగానే సుశాంత్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు సుశాంత్‌కు అవకాశాలు రాకుండా అడ్డు పడ్డారని పరిశ్రమకు చెందిన వ్యక్తులతో పాటు అభిమానులు ఆరోపిస్తున్నారు. కొందరు డైరెక్టర్లు, నిర్మాణ సంస్థల వైఖరి వల్ల సుశాంత్ పలు సందర్భాల్లో తీవ్ర మనస్తాపానికి గురైనట్టు వార్తలు వచ్చాయి. అతని ఆత్మహత్యకు ఇదే ప్రధాన కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ ‘దబాంగ్‌’ దర్శకుడు అభినవ్‌ కశ్యప్‌.. ఆ చిత్ర హీరో సల్మాన్‌ ఖాన్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. సల్మాన్, అతని కుటుంబ సభ్యులు తన జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించడం సంచలనం సృష్టించింది.

‘నా శత్రువులు తెలివైనవాళ్లు. నా వెనక నుంచి నాపై దాడి చేస్తారు. కానీ పదేళ్ల తర్వాత నా శత్రువులు ఎవరో నేను తెలుసుకోగలిగాను. వాళ్లెవరంటే సలీం ఖాన్‌ ( సల్మాన్‌ ఖాన్‌ తండ్రి), సల్మాన్‌ ఖాన్, సల్మాన్‌ సోదరులు అర్భాజ్‌ ఖాన్, సొహైల్‌ ఖాన్‌. డబ్బు, రాజకీయ పలుకుబడి, అండర్‌ వరల్డ్‌ కనెక్షన్లతో వాళ్లు ఎవరినైనా ఏమైనా చేయగలుగుతారు. కానీ, నేను సుశాంత్‌ మాదిరిగా తనువు చాలించను. తలవంచను. ఎదురొడ్డి పోరాడతా. అయితే..వాళ్ల అంతం చూస్తా.. లేకపోతే నా అంతం అయినా చూస్తా. పోరాడే సమయం వచ్చింది’ అని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. దాంతో, బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీరంగంలో అడుగుపెట్టిన సుశాంత్‌ తదితరులకు బాలీవుడ్ పెద్దల నుంచి సరైన ప్రోత్సాహం లేకపోగా… ప్రతిభ ఉన్నా వాళ్లు ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ‘బాయ్‌కాట్ బాలీవుడ్’, ‘బాయ్‌కాట్‌ సల్మాన్‌’ హాష్ట్యాగ్స్‌తో సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

బాలీవుడ్‌లోని అగ్ర నిర్మాతలు, దర్శకులు అందరూ వారసత్వ నటులకే ఆఫర్లు ఇస్తున్నారని, అవార్డు వేడుకల్లో సైతం వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి వారిని అన్‌ఫాలో చేయాలని, వారి సినిమాలను నిషేధించాలంటూ పెడుతున్న పోస్టులకు స్పందన లభిస్తోంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియాల్లో సదరు నటీనటులు, దర్శక నిర్మాతలను అన్‌ఫాలో చేస్తున్నారు. వారిలో ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జొహార్, ఆలియా భట్‌, కపూర్ ఫ్యామిలీ మెంబర్స్‌ ఉన్నారు. అలాగే, సుశాంత్‌కు అవకాశాలు ఇవ్వని యశ్ రాజ్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ వంటి ఏడు నిర్మాణ సంస్థలపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ‘మీటూ’ ఉద్యమం మాదిరిగా.. బాలీవుడ్‌లో బాయ్‌కాట్‌ ట్రెండ్‌ కూడా ఉద్యమంగా మారేలా ఉంది.

https://www.facebook.com/askashyap/posts/10158865186991844

చైనా వస్తువులు బహిష్కరించాలని యువ హీరో పిలుపు


భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన భారత జవానులకు యావత్‌ దేశం కన్నీటి నివాళి అర్పించింది. డ్రాగన్‌ దేశ సైనికుల చేతిలో తెలుగు కల్నల్‌ సంతోష్‌ బాబుతో పాటు మరో 19 మంది భారత జవాన్లు మృతి చెందినట్లు ఆర్మీ ప్రకటించింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు చెలరేగుతుండగా.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అమర సైనికులకు సోషల్ మీడియా ద్వారా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ విషయంపై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ‘గాల్వన్‌ లోయ వద్ద మన జవాన్లు అమరులయ్యారని తెలుసుకుని కలత చెందాను. వారి త్యాగాల మన గుండెల్లో ఎప్పటికీ ఉండి పోతాయి. మన యోధులకు, వారిలోని దేశ భక్తికి సెల్యూట్ చేస్తున్నాం. అమరులైన జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను’ అని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు.

‘ మన వీర జవాన్ల బలిదానం పట్ల మాటలు రావట్లేదు. దేశాన్ని కాపాడడం కోసం విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల కుటుంబాలకు నా సానుభూతి’ అని సాయితేజ్ ట్వీట్ చేశాడు. సుధీర్ బాబు.. ‘బరువెక్కిన గుండెతో ఈ వార్త చదివాను. అమరవీరులకు సెల్యూట్’ అని అని పేర్కన్నాడు. ‘అమరులైన భారత జవాన్లకు సెల్యూట్‌ చేస్తున్నాను. ఓం శాంతి.. ఆ జావాన్ల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను’ అని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ట్వీట్ చేసింది.

చైనా అహంకార చర్య చూసి తన రక్తం మరిగిపోతోందని, టిక్‌టాక్‌ నుంచి మొదలు చైనా వస్తువులన్నింటిని బహిష్కరించాలని యువ హీరో నిఖిల్‌ సిద్దార్థ్ పిలుపునిచ్చాడు. అంతేకాకుండా వీర జవాను సంతోష్‌ బాబు తల్లిని ఉద్దేశిస్తూ ‘అమ్మ నీ త్యాగాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము. మేమందరం మీతోనే ఉన్నాం. ధైర్యంగా ఉండండి’ అంటూ ట్వీట్‌ చేశాడు. దేవిశ్రీప్రసాద్‌, అనిల్‌ సుంకర, ప్రణీత, మంచు విష్ణు, లక్ష్మీ మంచు, వరుణ్‌ తేజ్‌, అనిల్‌ రావిపూడి, తదితరులు కూడా అమర సైనికులకు ఘన నివాళులు అర్పించారు.

కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి ఆదాయం లభిస్తుందా?


రాష్ట్ర రెవెన్యూ లోటు ఎన్నడూ లేని విధంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత అరేళ్లలో ఇంత పెద్ద మొత్తంలో రెవిన్యూ లోటు సంభవించలేదు. గత ఏడాది సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ. 26,646.82 కోట్లు ఉండగా, ఈ ఆర్ధిక సంవత్సరం రూ. 18,434.14 కోట్లు రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు. కరోనా నేపథ్యంలో రెవెన్యూ ఆదాయం తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తుండటంతో రెవెన్యూ లోటు భారీగా పెరిగుతుందని ఆర్ధిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం పెరుగుదల ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. అదే సమయంలో మూలధన వ్యయం తగ్గుముఖం పట్టడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందనేది స్పష్టం అవుతోంది. ములధన వ్యయంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఈ ఏడాది రెవెన్యూ వ్యయం రూ. 1,80,392.64 కోట్లుగా అంచనా వేశారు. గత ఏడాది రూ. 1,80,475.94 కోట్లుగా సవరించారు. ఈ వ్యయంలో రూ.70 వేల కోట్లు ఉద్యోగుల జీతభత్యాలకు చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సామాజిక భద్రతా ఫించన్లు తదితర వ్యయాలు ఉంటాయి. మరోవైపు ములధన వ్యయం ఈ ఏడాది రూ.44,396.54 అంచనా వేశారు. అయితే గత ఏడాది ములధన వ్యయం రూ. 29,907.62 కోట్లు అంచనా వేయగా కేవలం రూ. 12,845.49 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

రాష్ట్ర రెవెన్యూ ఆదాయం అంచనాల కంటే చాలా తక్కువగా ఉంది. గత ఏడాది రెవెన్యూ ఆదాయం రూ. 1,78,697.41 కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తే సవరించిన అంచనాల ప్రకారం రూ. 1,10,800.72 కోట్లు మాత్రమే ఆదాయం లభించింది. గత ఏడాది పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్నా ప్రభుత్వం ఆశించిన ఆదాయం లభించలేదు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఆ మొత్తం ఇంకా తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది రూ. 1,61,958.50 కోట్లు ఆదాయం వివిధ రూపాల్లో లభిస్తుందని అంచనా వేసింది.

ఆదాయానికి, వ్యయానికి ఉన్న వ్యత్యాసం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు వెళ్లడంతో ప్రజలపై అప్పుల భారం పెరిగిపోతుంది. రాష్ట్ర అప్పులు 2.55 లక్షల కోట్లకు చేరాయి. ఏడాదిలో ప్రభుత్వం రూ. 47 వేల కోట్ల వరకూ అప్పులు చేయడంతో ఆ మొత్తం రూ. 3.02 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి రూ. 3.55 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం, లాక్ డౌన్ కొనసాగుతున్నందున ఈ ఏడాది ఆదాయ అవకాశాలు తగ్గిపోవడంతో జగన్ ప్రభుత్వానికి ఆర్ధికంగా ఇబ్బందులు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి.

భారత్-చైనా సరిహద్దులో ఘర్షణ.. అసలు కారణలేంటీ?


భారత్-చైనా సరిహద్దులో సోమవారం రాత్రి 3 గంటల సమయంలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ నెలకొంది. గాల్వాన్లో ఒకరిపై రాళ్లు రువ్వుకోవడం.. రాడ్లతో దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఒక కర్నల్ స్థాయి అధికారి సంతోష్ బాబుతో పాటు 19 మంది జవాన్లు వీరమరణం పొందారు. చైనాకు చెందిన 43మంది సైనికులు మృతిచెందినట్లు ఆర్మీ అధికారులు పేర్కొంటున్నారు. సరిహద్దు వివాదంపై ఇరుదేశాల మధ్య ఆర్మీ స్థాయిలో ఉన్నతస్థాయి చర్చలు జరుగుతున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గతనెల రోజులుగా చైనా-భారత్ లాఢక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గడిచిన రెండు దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య చెదురుముదురు సంఘటనలు మినహా ఘర్షణలు చోటుచేసుకోలేదు. కొన్నేళ్లుగా ఇరుదేశాల మధ్య రక్తమోడిన సంఘటనలుగానీ ఒక్క తూటా పేలిన ఘటనలు చోటుచేసుకోలేదు. అయితే ఉన్నట్టుంది చైనా భారత్ ను దొంగతీసి 20మంది సైనికులను పొట్టన పెట్టుకోవడంపై యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చైనా ఎందుకు ఈ దుస్సాహానికి పూనుకుందనే ప్రశ్న తలెత్తుతోంది.

భారతదేశానికి చైనాతో అతిపెద్ద సరిహద్దు ఉంది. దాదాపు 3,500కిలోమీటర్ల సరిహద్దు ఇరుదేశాల మధ్య ఉంది. ఇప్పడు ఘర్షణ జరిగిన గాల్వాన్ వివాదం కారణంగా 1962లో ఇరుదేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. నాటి నుంచి ఇరుదేశాల సమస్య పరిష్కారం కోసం యత్నిస్తున్నట్లు చెబుతున్నాయి. అయితే ఇటీవల చైనా సరిహద్దులో భారీగా మౌలిక వసతులు, సైనిక శిబిరాలు, రైలు మార్గాలను నిర్మించుకుంటోంది. ఈక్రమంలోనే భారత్ కూడా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను నిర్మిస్తుంది. ఇదే చైనా కడుపుమంటకు కారణమైనట్లు తెలుస్తోంది.

భారత్ పాంగాంగ్ సరస్సులోని ఫింగర్ ప్రాంతాల వద్ద ఇటీవల కీలక రోడ్డును నిర్మిస్తోంది. గాల్వాన్ లోయలో దార్బుక్-ష్యోక్ దౌలత్ బేగ్ ఓల్డీలను అనుసంధానిస్తూ మరో రోడ్డును నిర్మిస్తుంది. దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్ ఆ విషయాన్ని లైట్ తీసుకుంది. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకే భారత్ మొగ్గుచూపింది. ఈక్రమంలోనే ఈనెల మొదటి వారంలో పాంగాంగ్ సరస్సు వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటన నేపథ్యంలో ఇరుదేశాలకు చెందిన సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భావించారు. ఇందులో భాగంగా కొన్నిప్రాంతాల్లో ఇరుదేశాలు బలగాల ఉపసంహరణ చేస్తున్న క్రమంలోనే చైనా దుర్మార్గానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చైనా దుస్సాహసంపై ప్రధాని మోడీ స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని మోదీ చైనా విషయంలో ఎలాంటి వైఖరి అవలంభిస్తారనేది ఆసక్తిని రేపుతోంది.

కాంగ్రెస్ నేతల ‘కొంప’ ముంచిన రేవంత్ రెడ్డి..!


కేటీఆర్ ఫాంహౌజ్ ఇష్యూపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా పోరాడుతున్నారు. 111జీవో నిబంధనలకు విరుద్ధంగా మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫాంహౌజ్ నిర్మించారని ఆరోపిస్తూ రేవంత్ గ్రీన్ ట్రీబ్యూనల్ ను ఆశ్రయించిన సంగతి తెల్సిందే. రేవంత్ ఫిర్యాదు మేరకు గ్రీన్ ట్రీబ్యూనల్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. తనకు గ్రీన్ ట్రీట్యూనల్ నోటీసులు జారీ చేయడంపై మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ వాదనలు విన్న కోర్టు స్టే విధించింది. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు అప్పట్లో ఎదురుదాడికి దిగారు. అయితే కొద్దిరోజులుగా టీఆర్ఎస్ నేతలు సైలంట్ కావడం రాజకీయ వర్గాల్లో టాపిక్ గా మారింది.

కేటీఆర్ ఫాంహౌజ్ ఇష్యూలో రేవంత్ రెడ్డి తాజాగా ఆరోపణలు చేస్తున్నా టీఆర్ఎస్ నేతలు స్పందించడం లేదు. ఈ పరిణామంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతింటున్నారు. హైదరాబాద్లో 111జీవోపై కాంగ్రెస్ నేతలే ఎక్కువగా ఇళ్లు నిర్మించుకున్నారని టీఆర్ఎస్ నేతలు గుర్తించారట. టీఆర్ఎస్ సర్కార్ కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీచేసి కూల్చివేయాలని ప్రయత్నిస్తుందనే టాక్ విన్పిస్తోంది. దీంతో 111 జీవో పరిధిలో ఇళ్లు నిర్మించుకున్న కాంగ్రెస్ నేతలు హడలిపోతున్నారు. 111జీవోలో అక్రమంగా నిర్మించుకున్న కేటీఆర్ ను ఇరుకున పెట్టాలని భావిస్తే అదికాస్తా తమ కొంపలను కూల్చేలా ఉందని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారట.

రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేనట్టు రేవంత్ రెడ్డి 111జీవోలో కేటీఆర్ ఫాంహౌజ్ పై పోరాటం చేయడం వల్లే ఇదంతా జరిగిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. కేటీఆర్ ఫౌంహౌజ్ ఇష్యూతో టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నేతల ఇళ్లను కూల్చేందుకు ప్లాన్ చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేతలు అనుమానిస్తున్నారట. రేవంత్ చేసిన పనికి తమ ఇళ్లు ధ్వంసమయ్యేలా ఉన్నాయని ఆయనపై కాంగ్రెస్ నేతలు కారాలుమిరియాలు నూరుతోన్నారు. కేటీఆర్ ఫౌంహౌజ్ ఇష్యూలో కాంగ్రెస్ నేతల ఇళ్లు ఉండటంతో ఇది చివరకు కాంగ్రెస్ కే బూమరాంగ్ అయ్యేలా కన్పిస్తోంది. దీంతో ఈ ఇష్యూలో రేవంత్ రెడ్డిని గమ్మున ఉండమని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారట. అయితే దీనిపై రేవంత్ రెడ్డి తగ్గేది లేదనే సంకేతాలను ఆ పార్టీ నేతలకు ఇస్తుండటంతో 111జీవోలో భవనాలు నిర్మించుకున్న కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. కేటీఆర్ ఫౌంహౌజ్ ఇష్యూ చివరికీ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!

చైనా దారుణం.. మోడీ మౌనం దేనికి సంకేతం?


భారతదేశం మీద పడి ఆ చైనా వాడు బతికేస్తున్నాడు. చైనీస్ యాప్ లతో మన డేటా కొల్లగొట్టేస్తున్నాడన్న ప్రచారమూ ఉంది. ఇక పెద్ద ఎత్తున వస్తుసామాగ్రిని దించి దేశంలో కుటీర పరిశ్రమను దెబ్బతీసి సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా ఉన్న మనపై ఆధారపడి బతుకుతున్న చైనావాడు పాకిస్తాన్ తో కలిసి కుట్రలు చేస్తున్నాడు. తాజాగా మన 20మంది సైనికులను చంపాడు. అయినా భారత ప్రధాని నరేంద్రమోడీ నుంచి స్పందన లేదని తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలతో కడిగేశారు..

నిజమే ప్రధాని మోడీ చైనా విషయంలో మౌనం దాల్చారు. ఏ విషయం చెప్పడం లేదు. అధికారం చేతిలో ఉంది. చైనా వస్తువులు,దిగుమతులపై నిషేధం విధించవచ్చు. అమెరికాతో కలిసి చైనా దేశంపై ఒత్తిడి తేవచ్చు. సైన్యాన్ని సరిహద్దుల్లో దించి చైనా ముందరికాళ్లకు బంధం వేయొచ్చు. కానీ నిస్సహాయుడిగా చూస్తున్న మోడీ తీరుపై దేశ ప్రజల్లో సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా ట్విట్టర్ లో హాట్ ప్రశ్న సంధించారు. ‘ఎందుకు మోడీ సైలెంట్ గా ఉంటున్నారు?.. ఎందుకు దాస్తున్నారు? అయిపోయేందేదో అయిపోయింది.. ఇప్పుడు ఏం చేయాలో చేయండి.. చెప్పండి.. మన సైనికులను చంపే ధైర్యానికి చైనా దిగింది. మన భూమిని లాక్కోంటోంది?’ మౌనం వీడండి అంటూ రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించారు. మోడీ మౌనం దేశానికి మంచిది కాదని..చైనాకు బుద్ది చెప్పాల్సిందేనని రాహుల్ ప్రశ్నించాడు.

అది రాహుల్ గాంధీ ఒక్కడి ప్రశ్నే కాదు.. దేశ ప్రజలందరి ప్రశ్న. సరిహద్దుల్లో 20 మందిని చంపిన చైనా వాడిపై బదులు తీర్చుకోవాలని ఇప్పటికే సోషల్ మీడియా నెటిజన్లు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. చైనా వస్తువులను నిషేధించాలని.. ఎవరూ వాడవద్దని.. చైనా యాప్ లను అందరూ డిలేట్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఇలా దేశప్రజల్లో భారత సైనికుల మృతితో సెంటిమెంట్ ఎక్కువైపోయింది. ఇంతటి క్లిష్ట సమయంలో మోడీ లాంటి కరుడుగట్టిన జాతీయ వాది మౌనంగా ఉండడమే దేశ ప్రజలను బాధిస్తోంది. చైనాపై ధీటుగా స్పందించాలన్న కసి దేశంలో పెరిగిపోతోంది. పాకిస్తాన్ కు బుద్దిచెప్పినట్టే చైనా పని కూడా పట్టాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. చూడాలి మరీ మన మోడీ సార్ ఏం చేస్తారో..

-నరేశ్ ఎన్నం

మాజీ మంత్రి అయ్యన్నపై నిర్భయ కేసు..!


టీడీపీ నేతలపై కేసుల నమోదు పర్వం కొనసాగుతుంది. కొద్దీ రోజుల కిందట మాజీ మంత్రులు నిమ్మకాయల చిన రాజప్ప, యనమల రామకృష్ణుడులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. ఇది ఇలా ఉండగా విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై నిర్భయ కేసు నమోదయ్యింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే అసభ్యకరంగా దుర్భాష లాడారని అయ్యన్నపాత్రుడుపై నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నర్సీపట్నం పురపాలక సంఘం కార్యాలయంలో మాజీ సర్పంచి రుత్తుల లాచ్చాపాత్రుడు చిత్రపటాన్ని తొలగించింనందుకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ వ్యాఖ్యలు చేశారని మున్సిపల్ కమిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు అయ్యన్న పాత్రుడుపై 354(ఏ),500, 504, 506, 509, 505(బి) సెక్షన్లు కింద కేసు నమోదు చేసినట్లు నర్సీపట్నం సిఐ స్వామి నాయుడు తెలిపారు.

‘పది’ పరీక్షలపై జగన్ వెనకడుగు వేయాల్సిందేనా!

పదవ తరగతి విద్యార్థులకు కామన్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే నెల 10వ తేదీ నుంచి ఈ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ను ఖరారు చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో రోజుకు 300లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకూ 5,280 మందికి వైరస్ సోకింది. మొత్తం 88 మంది మ
రణించారు.

కొన్ని రాష్ట్రాల్లో పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణా, తమిళనాడు, ఒడిషా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు ఇందుకు ఉదాహరణ. తెలంగాణా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవగా, కొందరు హైకోర్టు ఆశ్రయించారు. దీంతో ఆ రాష్ట్ర హైకోర్టు పరీక్షల నిర్వహించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో విద్యార్థులు రాసిన పరీక్షల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్వహించి తీరతామని విద్యాశాఖ మంత్రి అదుములపు సురేష్ ఇటీవల స్పష్టం చేశారు.

గతంలో ఒక్కో సబ్జెక్ట్ కు రెండు పేపర్లు ఉండేవి, ప్రస్తుతం వాటిని ఒక పేపర్ కు తగ్గించారు. పరీక్షా పేపర్ లోని ప్రశ్నల సంఖ్య తగ్గించి పరీక్షా సమయం కుదించారు. పరీక్ష కేంద్రాల్లో సామాజిక దూరం పాటించడం, మాస్క్ లు ధరించడం, శానిటైజర్ లను అందుబాటులో ఉంచడం వంటి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు రద్దు చేయడమే మేలనే వాదనలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యేందుకు తగిన రవాణా సదుపాయాలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.

శాసన సభ బడ్జెట్ సమావేశాలను కరోనా నేపథ్యంలో రెండు రోజులకు కుదించిన ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలు ఎలా నిర్వహించాలని భావిస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేన, టీడీపీ, బిజెపి, వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ ను విద్యార్థుల తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షల విషయంలో తన నిర్ణయం మార్చుకోక తప్పేలా కనిపించడం లేదు.

తెలుగు యంగ్ డైరెక్టర్.. మళ్ళీ బాలీవుడ్ లోనే.. !


‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘సందీప్ వంగ’. ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ బ్లాక్ బస్టర్ అందుకుని ఏకంగా బాలీవుడ్ లోనే స్టార్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ సంపాదించాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మరో వైవిద్యమైన చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

అయితే హిందీ నిర్మాతలు సందీప్ సినిమాకు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ముందుకొస్తున్నారట. ‘కబీర్ సింగ్’ సినిమా నిర్మాత టీ-సిరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతాని కలిసి సందీప్ తర్వాతి సినిమాను కూడా భారీ స్థాయిలో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారట. వీరితోపాటే సందీప్ సోదరుడు, ‘అర్జున్ రెడ్డి’ నిర్మాత ప్రణయ్ వంగ కూడా చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు.

ఇక సందీప్ తరువాత సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే అని, క్రైమ్ డ్రామాగా ఉండనుందని తెలుస్తోంది. మొత్తానికి సందీప్ వంగ సినిమాలు భిన్నంగా ఉంటాయని బాలీవుడ్ మీడియా కూడా సందీప్ ను బాగానే ప్రమోట్ చేస్తోంది. సక్సెస్ వస్తే పొగుడుతారు. అదే ప్లాప్ వస్తే తిడతారు. ప్రస్తుతం ఫుల్ సక్సెస్ లో సందీప్ వంగని బాలీవుడ్ అక్కున చేర్చుకుంటుంది. మరి ఈ డైరెక్టర్ ఈ సక్సెస్ ను ఎంతకాలం కొనసాగిస్తాడో చూడాలి.

రాజశేఖర్ సీరియస్ గా దృష్టి పెట్టాడట !


సినిమా ఇండస్ట్రీలో హీరోకు ఉండే క్రేజ్ మరో ఏ వ్యక్తికీ ఉండదనేది నిజం. అందుకే సీనియర్ హీరో డా. రాజశేఖర్ కూడా హీరోగానే కొనసాగడానికి ఇంకా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన ‘గరుడవేగ’ హిట్ తో తెలుగు ప్రేక్షుకులకు తన హీరోయిజాన్ని ఇంకా చూపించే ప్రయత్నం బలంగానే చేస్తున్నాడు. షూటింగ్స్ పర్మిషన్ ఇవ్వడంతో ప్రస్తుతం తన తరువాత సినిమా పై చాల సీరియస్ గా దృష్టి పెట్టాడట ఈ సీనియర్ హీరో. ‘పూలరంగడు, అహన పెళ్ళంట’ చిత్రాల డైరెక్టర్ వీరభద్రం చౌదరి దర్శకత్వంలో సరికొత్త తరహా కథాంశంతో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో రాజశేఖర్ నటిస్తున్నారు.

కాగా ఈ సినిమా షూటింగ్ జూలై ఫస్ట్ వీక్ నుండి మొదలుకానుందని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లో ఈ సినిమాలోని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఎమోషనల్గా సాగే ఆ సన్నివేశాల్లో రాజశేఖర్ తో పాటు మిగిలిన నటీనటులందరూ కూడా పాల్గొనబోతున్నారట. ముఖ్యంగా రాజశేఖర్ పాత్రకు మరియు రాజశేఖర్ కూతురు పాత్రకు మధ్య మంచి సెంటిమెంట్ ఉంటుందని.. సినిమాలో ఆ సెంటిమెంట్ నే హైలైట్ అవ్వబోతుందని.. అయితే ఈ సినిమాకు ఇంగ్లీష్ సినిమా ‘టోకెన్’ ప్రేరణ అని, ఆ సినిమాలోని మెయిన్ పాయింట్ ఆధారంగానే ఈ చిత్రం స్క్రిప్ట్ రాసుకున్నారని తెలుస్తోంది.

ఇక రాజశేఖర్ గరుడవేగ, కల్కి లాంటి సినిమాలు తర్వాత నటిస్తుండటంతో ఈ చిత్రం పై సహజంగానే కొంతవరకు అంచనాలు ఉండొచ్చు. అయితే దర్శకుడు వీరభద్రం చౌదరి ట్రాక్ రికార్డ్, ఆయన గత సినిమా ఫలితం దృష్టిలో పెట్టకుంటే ఈ చిత్రానికి అది మైనస్ గా నిలిచే అవకాశం ఉంది. మరి రాజశేఖర్ కి ఈ చిత్రం ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

బాలయ్య అంతే.. ఆయనొక్కడే ఎందుకు ?


బాలయ్య సినిమాలంటే, ఒకప్పుడు ఆయన ఫ్యాన్స్ హడావుడి ఓ రేంజ్ లో ఉండేది. అయితే ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద బాలయ్య చిత్రాల దయనీయ పరిస్థితి తెలిసిందే. ఇలాంటి టైంలో కూడా బాలయ్య తన పోకడను మార్చుకోవట్లేదని బాలకృష్ణ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారట. ఈ డిజిటల్ జనరేష్ లో తోటి హీరోలంతా మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, నాగ్, వెంకీ.. చివరికీ హీరో రాజశేఖర్ కూడా ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎప్పటికపుడు తమ లేటెస్ట్ అప్ డేట్స్ తో అభిమానులను ఉత్తేజపరుస్తుంటే.. బాలకృష్ణ ఒక్కడే సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నాడు. అదేదో తాను ఒక్కడినే డిఫరెంట్ అన్నట్లు.

దీంతో ‘బాలయ్య ఫ్యాన్స్’ ఫ్యాన్స్ గ్రూప్ పేజిస్ లో బాలయ్య ఒక్కడికే ఏమైంది.. ట్విట్టర్ లోకి రావొచ్చు కదా.. అని కామెంట్స్ చేస్తూ తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. ఇక నుండైనా బాలయ్య మారాలని, సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే తన సినిమాల విషయంలో కూడా.. క్రేజ్ తెచ్చే కాంబినేషన్స్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని.. ముఖ్యంగా ఓన్లీ ఫామ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ తోనే ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మరి రొటీన్ యాక్షన్ స్టోరీలతో కాకుండా వైవిధ్యమైన కథలతో పాటు సెన్స్ బుల్ డైరెక్టర్స్ డైరెక్షన్ లో మూవీ చేస్తే.. బాలయ్య సినిమా వంద కోట్లు క్లబ్ లో చేరుతుందని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. అయితే ఆ ఆశ నెరవేరడం కష్టమే. ఇక ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

వీరసైనికుడికి ఘన నివాళి..

Santhosh Babu

Santhosh Babu

లద్దాఖ్ సమీపంలోని గల్వాన్ వ్యాలీలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్ స్థాయి అధికారితో పాటు మరో ఇద్దరు జవాన్లు మరణించిన విషయం తెలిసిదే. ఆ కల్నల్ మన తెలుగువారే. సోమవారం రాత్రి జరిగిన ఇరుదేశాల సైనికుల ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు అమరుడయ్యారు. ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం అందించారు. సంతోష్‌ ఏడాదిన్నరగా దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు. ఆయన మృతితో సూర్యాపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ వీరసైనికుడికి అందరూ నివాళ్లు అర్పిస్తున్నారు.

కల్నల్ సంతోష్ బాబు 6వ తరగతి నుంచి కోరుకొండ సైనిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ, అనంతరం ఇండియన్ మిలటరీ అకాడమీలో చదువుకున్నారు. చదువు పూర్తైన తర్వాత ఆర్మీలో చేరి దేశానికి సేవ చేస్తున్నారు. మొత్తం 15 ఏళ్లుగా ఆయన విధుల్లో ఉన్నారు. తన సర్వీస్‌లో ఎక్కువ కాలం కాశ్మీర్, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్, పాకిస్థాన్ సరిహద్దులోనే విధులు నిర్వహించారు. కొంతకాలం భారత ఆర్మీ తరపున కాంగో దేశంలోనూ పనిచేశారు. 37 సంవత్సరల చిన్న వయసులో కల్నల్‌ గా పదోన్నతి పొందాదారు. 2007లో పాకిస్తాన్ బోర్డర్‌ లో ముగ్గురు చొరబాటు దారులను అంతమొందించారు.

వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో మళ్లీ యుద్ధమేనా?


మూడు రాజధానులకు మొగ్గుచూపుతున్న వైసీపీ ప్రభుత్వం అందుకే చట్టపరంగా ఎదురయ్యే ఇబ్బందులను తొలగించు కునేందుకు మరోమారు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వం గతంలో తెచ్చిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసన సభలో మరోమారు ప్రవేశపెట్టింది. సీఆర్డీఏ రద్దు బిల్లును పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, పరిపాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి బిల్లును ఆర్ధిక శాఖా మంత్రి మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిలు పునః ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులతోపాటు మరికొన్ని బిల్లులను శాసన సభ ఆమోదించింది. మండలిలో బిల్లుల ఆమోదింప చేసుకునే విషయంలో ప్రభుత్వ వైఖరి అంతు చిక్కకుండా ఉంది.

మరోవైపు గత శాసన సభ సమావేశాల్లో ఈ బిల్లులను శాసన సభ ఆమోదించింది. ఆయితే శాసన మండలిలో మాత్రం బిల్లులు ఆమోదానికి నోచుకోలేదు. ఇందుకు మండలిలో వైసీపీకి తగిన బలం లేకపోవడమే కారణం. గతంలో మండలిలో బిల్లులపై జరిగిన చర్చ అనంతరం మండలి ఛైర్మన్ షరీఫ్ మహ్మద్ బిల్లులు లోపాలు ఉన్నాయని వాటిని సరి చేసేందుకు సెలెక్ట్ కమిటీకి పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఛైర్మెన్ ఆదేశాల ప్రకారం మండలి సభ్యులతో సెలెక్ట్ కమిటీని నియమించి బిల్లుపై అధ్యయనం చేయాల్సి ఉంది. ఇందుకు అవసరమైన చర్యలు మండలి కార్యదర్శి బాల కృష్ణమాచార్యులు చేపట్టలేదు.

ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్సీ హైకోర్టును ఆశ్రయించారు. మండలి కార్యదర్శి తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం లేదని, అధికార పక్షంతో కుమ్మకై తన పదవి కాలాన్ని పొడిగించుకున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు. మరోవైపు శాసన మండలిలో బిల్లులు పెండింగ్ లో ఉండగా శాసన సభలో పునః ప్రవేశపెట్టడం చట్ట విరుద్ధమని శాసన మండలి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. మళ్ళీ మండలిలో ఈ బిల్లులు ప్రవేశపెడితే అడ్డుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని విషయంలో టీడీపీకి రెండో ఆలోచనే లేదన్నారు. దీంతో ఈ రెండు బిల్లులపై మండలిలో మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

బడ్జెట్ లో ఆకర్షణే తప్ప అభివృద్ధి లేదు: పవన్


వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ బడ్జెట్ లో ప్రజాకర్షణే తప్ప అభివృద్ధి లేదన్నారు. ఆర్ధిక మంత్రి బుగ్గన అంకెలతో కనికట్టు చేశారే తప్ప రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల ఆదాయాన్ని పెంచడానికి చిన్న ప్రయత్నం కూడా జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ లో ఆర్ధిక వాస్తవికత, స్పష్టత లోపించాయన్నారు. అభివృద్ధి లేని సంక్షేమం నీటి బుడగలాంటిదని, అది ప్రజలకు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తోందని స్పష్టం చేశారు.

రాష్ట్రానికి ఆదాయ మార్గాలను పెంచకుండా ఎంతో కాలం సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించలేమనే విషయాన్ని వైసీపీ నాయకులు గ్రహించాలని సూచించారు. గత ఆర్థిక సంవత్సరం (2019 – 20 ) బడ్జెట్ ను రూ. 2.27 లక్షల కోట్ల అంచనాలతో రూపొందించారు. కానీ సవరించిన అంచనాలతో ఆ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసినది రూ.1.74 లక్షల కోట్ల రూపాయలు మాత్రమేనన్నారు. వాస్తవ బడ్జెట్ అంచనాలకు సవరణలకు తేడా రూ. 53,217.54 కోట్లు వ్యత్యాసం ఉందన్నారు. కీలకమైన వ్యవసాయం, ఇరిగేషన్, గృహనిర్మాణాల, వైద్య ఆరోగ్యం లాంటి శాఖల బడ్జెట్ కు కోతలు విధించారని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలోను అంచనాలు భారీగా చూపారు తప్ప ఆచరణ ప్రణాళికలు కనిపించలేదన్నారు. కొత్త బడ్జెట్ చూసిన తరువాత జనసేన నేతలు, పార్టీకి సేవలు అందిస్తున్న మేధావులు కొన్ని సందేహాలను వ్యక్తం చేశారన్నారు.

అవి:
● రాష్ట్రానికి కొత్తగా ఎంత మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి?
● ఆంధ్రప్రదేశ్ లోని యువకుల కోసం ఎన్ని ఉద్యోగాలు సృష్టించారు?
● స్పష్టమైన నూతన పారిశ్రామిక విధానాన్ని ఎందుకు ప్రకటించడం లేదు.
● గడచిన ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి రూ.18,327 కోట్లు మేర ప్రతిపాదనలు చేసి ఎందుకు రూ.5,986 కోట్లకు తగ్గించారు? ఈ బడ్జెట్లో 35శాతం మేరకు ఎందుకు నిధుల ప్రతిపాదనలు తగ్గించారు?
● రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కారణంగా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాము అని చెప్పిన మీరు బడ్జెట్లో మాత్రం రాష్ట్రం ఆర్ధికంగా పురోగమిస్తోందని గారడీ మాటలు ఎందుకు చెబుతున్నారు?
● నవరత్నాలను వల్లే వేస్తూ అభివృద్ధిని మరిచిపోయిన మీరు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు?
● గ్రామ వలంటీర్ల నియామకం ద్వారా రెండు లక్షల ఉద్యోగాలను సృష్టించామని చెబుతున్న ఆర్ధిక మంత్రి గ్రామ వాలంటీర్లందరూ ప్రభుత్వ ఉద్యోగులే అని ప్రకటించగలరా?
● కోవిడ్-19 ఉందని చెప్పి పట్టుమని పది రోజులు కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేని ప్రభుత్వం, లక్షలమంది విద్యార్థులతో పదో తరగతి పరీక్షలు సురక్షితంగా నిర్వహించగలదా? పిల్లల రక్షణపై ప్రభుత్వం చట్టపరమైన హామీని తల్లిదండ్రులకు ఇవ్వగలదా?