
మూడు రాజధానులకు మొగ్గుచూపుతున్న వైసీపీ ప్రభుత్వం అందుకే చట్టపరంగా ఎదురయ్యే ఇబ్బందులను తొలగించు కునేందుకు మరోమారు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వం గతంలో తెచ్చిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసన సభలో మరోమారు ప్రవేశపెట్టింది. సీఆర్డీఏ రద్దు బిల్లును పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, పరిపాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి బిల్లును ఆర్ధిక శాఖా మంత్రి మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిలు పునః ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులతోపాటు మరికొన్ని బిల్లులను శాసన సభ ఆమోదించింది. మండలిలో బిల్లుల ఆమోదింప చేసుకునే విషయంలో ప్రభుత్వ వైఖరి అంతు చిక్కకుండా ఉంది.
మరోవైపు గత శాసన సభ సమావేశాల్లో ఈ బిల్లులను శాసన సభ ఆమోదించింది. ఆయితే శాసన మండలిలో మాత్రం బిల్లులు ఆమోదానికి నోచుకోలేదు. ఇందుకు మండలిలో వైసీపీకి తగిన బలం లేకపోవడమే కారణం. గతంలో మండలిలో బిల్లులపై జరిగిన చర్చ అనంతరం మండలి ఛైర్మన్ షరీఫ్ మహ్మద్ బిల్లులు లోపాలు ఉన్నాయని వాటిని సరి చేసేందుకు సెలెక్ట్ కమిటీకి పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఛైర్మెన్ ఆదేశాల ప్రకారం మండలి సభ్యులతో సెలెక్ట్ కమిటీని నియమించి బిల్లుపై అధ్యయనం చేయాల్సి ఉంది. ఇందుకు అవసరమైన చర్యలు మండలి కార్యదర్శి బాల కృష్ణమాచార్యులు చేపట్టలేదు.
ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్సీ హైకోర్టును ఆశ్రయించారు. మండలి కార్యదర్శి తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం లేదని, అధికార పక్షంతో కుమ్మకై తన పదవి కాలాన్ని పొడిగించుకున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు. మరోవైపు శాసన మండలిలో బిల్లులు పెండింగ్ లో ఉండగా శాసన సభలో పునః ప్రవేశపెట్టడం చట్ట విరుద్ధమని శాసన మండలి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. మళ్ళీ మండలిలో ఈ బిల్లులు ప్రవేశపెడితే అడ్డుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని విషయంలో టీడీపీకి రెండో ఆలోచనే లేదన్నారు. దీంతో ఈ రెండు బిల్లులపై మండలిలో మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.