
లద్దాఖ్ సమీపంలోని గల్వాన్ వ్యాలీలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్ స్థాయి అధికారితో పాటు మరో ఇద్దరు జవాన్లు మరణించిన విషయం తెలిసిదే. ఆ కల్నల్ మన తెలుగువారే. సోమవారం రాత్రి జరిగిన ఇరుదేశాల సైనికుల ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు అమరుడయ్యారు. ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం అందించారు. సంతోష్ ఏడాదిన్నరగా దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్(4) ఉన్నారు. ఆయన మృతితో సూర్యాపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ వీరసైనికుడికి అందరూ నివాళ్లు అర్పిస్తున్నారు.
కల్నల్ సంతోష్ బాబు 6వ తరగతి నుంచి కోరుకొండ సైనిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ, అనంతరం ఇండియన్ మిలటరీ అకాడమీలో చదువుకున్నారు. చదువు పూర్తైన తర్వాత ఆర్మీలో చేరి దేశానికి సేవ చేస్తున్నారు. మొత్తం 15 ఏళ్లుగా ఆయన విధుల్లో ఉన్నారు. తన సర్వీస్‌లో ఎక్కువ కాలం కాశ్మీర్, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్, పాకిస్థాన్ సరిహద్దులోనే విధులు నిర్వహించారు. కొంతకాలం భారత ఆర్మీ తరపున కాంగో దేశంలోనూ పనిచేశారు. 37 సంవత్సరల చిన్న వయసులో కల్నల్ గా పదోన్నతి పొందాదారు. 2007లో పాకిస్తాన్ బోర్డర్ లో ముగ్గురు చొరబాటు దారులను అంతమొందించారు.