Home Blog Page 8444

చైనాతో ట్రేడ్ వార్ కు సిద్ధమైన భారత్


ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు దొంగదెబ్బ కొడుతున్న చైనాతో అమీతుమీ తేల్చుకునేందుకే భారత్ సిద్ధమవుతోంది. సోమవారం రాత్రి భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో 20మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెల్సిందే. జవాన్ల మృతిని భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈమేరకు భారత్ బహుముఖ వ్యూహాన్ని అవలంభిస్తోంది. సరిహద్దుల్లో మన సైన్యాన్ని మోహరించే భారత్ ను రెచ్చగొడితే చైనాకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తుంది. మరోవైపు చైనాతో ట్రేడ్ వార్ కు సిద్ధమవుతోంది. ఈనేపథ్యంలో చైనాకు చెందిన ఓ భారీ డీల్ ను కేంద్రం రద్దుచేస్తున్నట్లు ప్రకటించి ఆ దేశానికి తొలిషాకిచ్చింది.

సరిహద్దుల్లో దుస్సాసహసానికి దిగిన చైనాకు బుద్ది చెప్పాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఈమేరకు కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. భారత జవాన్ల త్యాగం వృథాకాదని భారత ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన వెంటనే కేంద్రం పరోక్షంగా ట్రెడ్ వార్ కు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్లో 5జీ అప్ గ్రేడ్ కాంట్రాక్ట్ పనుల్లో చైనా కంపెనీలకు కేంద్రం చెక్ పెట్టిన సంగతి తెల్సిందే. తాజాగా రైల్వే కాంట్రాక్టుల్లోనూ చైనా కంపెనీలకు కేంద్రం కోతపెడుతోంది.

ఈమేరకు చైనా కంపెనీకి ఇప్పటికే అప్పగించిన రైళ్ల సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ల కాంట్రాక్ట్ పనులను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గూడ్స్ రాళ్ల రాకపోకల కోసం కేంద్రం ప్రత్యేక కారిడార్ పనులు చేపడుతోంది. ఇందులో సిగ్నల్, టెలికమ్యూనికేషన్ కాంట్రాక్ట్ పనులను చైనాకు చెందిన బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్ డిజైన్ ఇన్ స్టిట్యూట్ సంస్థకు అప్పగించింది. ఈ కాంట్రాక్ట్ పనుల విలువ రూ.471 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. తాజాగా ఈ పనులను రద్దు చేస్తున్నట్టు రైల్వేశాఖ ప్రకటించి చైనాకు గట్టి షాక్ ఇచ్చింది.

వీటితోపాటు మరిన్ని చైనా కంపెనీ కాంట్రాక్టులన్నీ రద్దుచేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దేశవ్యాప్తంగా చైనా వస్తువుల బహిష్కరణకు ప్రజలు పిలుపునిస్తుండగా మరోవైపు కేంద్రం కూడా చైనాతో ట్రేడ్ వార్ కు దిగడం ఆసక్తికరంగా మారింది.

రాహుల్ గాంధీ వల్ల కాంగ్రెస్ పని గోవిందా!

రాహుల్ గాంధీకి లాక్ డౌన్ పీరియడ్ తన నాయకత్వానికి లాక్ డౌన్ గా మారింది. రాహుల్ గాంధీ ఇంత అపరిపక్వుడా అని జనం ముక్కు మీద వేలేసుకుంటున్నారు. దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ జోకర్ గా మారాడు. ఎంతోఘన చరిత్రగల కాంగ్రెస్ పార్టీ ని భూస్థాపితం చేయటానికే పనిచేస్తున్నట్లుంది. ఒక ప్రకటన ఇచ్చేముందు దానిపై పూర్తి అవగాహన తో మాట్లాడాలనే ఇంగితజ్ఞానం కూడా లేకుండా పోయింది.

ఈరోజు ప్రకటనే చూద్దాం. మన సైన్యం ఆయుధాలు లేకుండా ఎందుకు అక్కడ పహారా కాస్తుంది, అలా ఉండమని ఆదేశాలు ఇచ్చింది ఎవరూ అని టీవీ లో మాట్లాడాడు. అదిచూసి నవ్వాలో , ఏడవాలో అర్ధకవటం లేదు వాళ్ళ అధికార ప్రతినిధులకు. కనీస జ్ఞానం లేకుండా ఓ పెద్ద పార్టీకి నాయకుడు ఎలా అయ్యాడో నని విశ్లేషకులకు సందేహం. నెహ్రూ కుటుంబం లో సభ్యులయితే చాలు సమర్ధత లేకున్నా    నాయకులు  కావచ్చనేదానికి రాహుల్ గాంధీ ఉదంతం అతుకుతుంది. నాయకుడయిన తర్వాతయినా జ్ఞానాన్ని పెంచుకోవచ్చుకదా అంటే అదీ లేదు. ఈరోజు ఇచ్చిన ప్రకటన అందరికీ కోపం తెప్పిచ్చింది. రాహుల్ గాంధీ పైనే కాదు కాంగ్రెస్ పార్టీ పైన కూడా. ఎందుకంటే రాహుల్ ప్రకటన ఇచ్చిన తర్వాత దాన్ని ఏదో విధంగా భుజానవేసుకొని మోయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ అధికార ప్రతినిదులది.

మూడు రోజులనుంచీ వార్తల్లో, మాధ్యమాల్లో పుంఖానుపుంఖల వార్తలు వస్తుంటే ఎందుకు ఆయుధాలు వాడలేదో రాహుల్ గాంధీ కి తెలియదా? 1996 లో, 2005 లో జరిగిన ఒప్పందాల్లో సరిహద్దుల్లో 2 కిలోమీటర్లు అటూ ఇటూ ఎవరూ ఆయుధాలు ప్రయోగించకూడదని ఒప్పందం లో వుంది. అందుకనే గత 45 సంవత్సరాల్లో ఒక్క తుపాకీ వాడలేదు . అటువంటప్పుడు ఈరోజు తుపాకీలు ఎందుకు వాడాలో రాహుల్ గాంధీ సెలవిస్తే బాగుంటుంది. అంతమాత్రాన ఆయుధాలు వాళ దగ్గర ఉండవని కాదు. వున్నా అవి లోడ్ చేయకూడదు. ఈ ప్రోటోకాల్ ని అటు చైనా, ఇటు భారత్ 45 సంవత్సరాల నుంచి పాటిస్తూ వస్తున్నాయి. 2017 డోక్లాంలో కూడా తుపాకులు వాడలేదు. నిన్నటి ఘటన లో కూడా ఒక్క తుపాకీ ఇరువైపులా పేలలేదు. అటువంటప్పుడు ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు. యుద్ధంలో మిలిటరీ చెప్పిన దాన్ని మనం విశ్వసించాలి. మొన్నటి ఘటనలో మన టీం కి నాయకత్వం వహించింది మన తెలుగు బిడ్డ కల్నల్ సంతోష్ బాబు . తను పై అధికారులు ఏం చెబితే ఆప్రకారమే నడుచుకోవాలి. చైనా దొంగదెబ్బ తీసి మన జవాన్ల ప్రాణాలు తీస్తే ఇదేదో ఆర్మీ తప్పో, ప్రభుత్వం తప్పో నని మాట్లాడటం ఎంత బాధ్యతా రాహిత్యం రాహుల్ గాంధీ గారు? రాహుల్ గాంధీ అపరిపక్వత వలన కాంగ్రెస్ పార్టీ సమీప భవిష్యత్తు లో కోలుకోని విధంగా దెబ్బతింటుందని కాంగ్రెస్ శేయోభిలాషులే వాపోతున్నారు. పాపం కాంగ్రెస్ పార్టీ , రాహుల్ గాంధీ వలన ఎంత గతి పట్టింది .

‘జగన్నాథుడి’పై కరోనా ఎపెక్ట్..!


దేశంలోనే పూరి జగన్నాథుడి రథయాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నో ఏళ్లుగా ఒడిశాలోని లక్షలాది భక్తుల సమక్షంలో పూరి రథయాత్ర ఘనంగా జరుగుతోంది. ప్రతీయేటా 10నుంచి 12రోజులపాటు జరిగే పూరి జగన్నాథుడు రథయాత్రకు దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ఈ ఏడాది కూడా జగన్నాథుడి రథయాత్ర ఘనంగా నిర్వహించేందుకు ఒడిశా ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది. జూన్ 23నుంచి నిర్వహించనున్న ఈ రథయాత్రకు కరోనా కారణంగా సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. ఈమేరకు గురువారం పూరి జగన్నాథుడి రథయాత్రను ప్రభుత్వం నిర్వహించొద్దని ఆదేశాలను జారీ చేసింది.

కేంద్రం లాక్డౌన్లో పలు సడలింపులను ఇచ్చింది. జూన్ 8నుంచి దేవాలయాలను తెరిచేందుకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు తిరిగి తెరుచుకున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ దేవాలయాల్లోకి భక్తులను అనుమతిస్తున్నారు. అయితే సామూహిక ఉత్సవాలపై నిషేధాలు కొనసాగుతున్నాయి. ఒడిశా ప్రభుత్వం జగన్నాథుడి రథయాత్రను ఈనెల 23నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రతియేటా ఈ ఉత్సవాల్లో 10నుంచి 12లక్షల మంది భక్తులు పాల్గొంటారని తెలుస్తోంది. ఈసారి కరోనా కారణంగా 10వేల మందితో పూరి జగన్నాథ్ రథయాత్ర నిర్వహించాలని ప్రభుత్వం భావించింది.

ఈనేపథ్యంలోనే ఓ స్వచ్ఛంధ సంస్థ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసింది. కరోనా కారణంగా రథయాత్రను నిలిపివేయాలని ఆ సంస్థ పిటిషన్లో కోరింది. దీనిపై సుప్రీం ధర్మాసం గురువారం విచారణ చేపట్టి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ‘జగన్నాథ్’ అంటే ఆపలేనిది అని అర్థంమని.. కానీ ఎన్నడూ ఆగని జగన్నాథుడి రథచక్రాలను కరోనా మహమ్మారి వల్ల ఆపాల్సి వస్తోందని.. కరోనా సమయంలో అంత పెద్ద రథయాత్రకు అంగీకరిస్తే జగన్నాథ స్వామి మమ్మల్ని క్షమించడు..’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చారిత్రక జగన్నాథుడి రథ యాత్రను ఈ ఏడాది నిర్వహించవద్దని ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది. రథయాత్రతో సంబంధించి ఎటువంటి వేడుకలు నిర్వహించొద్దని.. భక్తులను అనుమతించవద్దని పేర్కొంది.

ఇప్పటికే తెలంగాణలోనూ ప్రతియేటా భాగ్యనగరంలో ఘనంగా నిర్వహించే బోనాల వేడుకలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. బోనాలను ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. అమ్మవారికి పూజారుల బృందం బోనాల సమర్పిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా కారణంగా బోనాల వేడుకల కళతప్పడంతో భాగ్యనగరం కళతప్పనుంది. ఇప్పటికే ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ తదితర పండుగలపై కరోనా ఎఫెక్ట్ పడింది. తాజాగా జగన్నాథుడి రథయాత్ర సైతం కరోనా కారణంగా నిలిచిపోవడం శోచనీయంగా మారింది.

చైనాపై కేఏ పాల్ హెచ్చరిక.. మోడీ వినలేదా?

KA Paul Meets Amit Shah
KA Paul


రాజకీయ నాయకుడు, ప్రముఖ సువార్తకుడు.. తన చేష్టలతో కామెడీ పండించిన కేఏపాల్ చైనాతో ఘర్షణ వేళ మళ్లీ లైన్లోకి వచ్చాడు. మరోసారి సీరియస్ కామెడీని పంచేశాడు..

ఏపీ ఎన్నికల వేళ పోటీచేసి హల్ చల్ చేసిన దొరవారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మరోసారి దర్శనమిచ్చారు. తన మాట వినకపోవడం వల్లే చైనా చేతిలో భారత్ దెబ్బతిందని హితబోద చేశాడు. ఫిబ్రవరిలో చైనా చెడ్డదారిలో వెళుతోందని తాను భారత్ ను హెచ్చరించానని.. కరోనా సృష్టించి ఇప్పుడు భారత్ సైనికులను చంపాక కానీ తన మాటలు నమ్మరా అని భారత్ పై తన సానుభూతి తెలుపుతూ ఒక వీడియోను విడుదల చేశారు.

చైనా కదలికలను గ్రహించిన మొదటి వ్యక్తిని తానేనని.. మార్చిలో నేను దీనిపై ప్రపంచంలోని అన్ని దేశాల ప్రధానులు, అధ్యక్షులకు లేఖ రాశానని వీడియోలో తనను తాను గొప్పలు చెప్పుకున్నారు కేఏపాల్. ఇప్పటికీ లక్షలాది సంతకాలు చేస్తూ చైనాకు వ్యతిరేకంగా తాను ప్రపంచ దేశాలను ఏకం చేస్తున్నానని.. భారతీయులు, తెలుగు వారంతా తనతో కలిసి రావాలని కేఏ పాల్ పిలుపునిచ్చాడు.

చైనా కారణంగా మూడవ ప్రపంచ యుద్ధం చెలరేగే అవకాశం ఉందని తాను అనేక దేశాలను హెచ్చరించానని కేఏపాల్ పేర్కొన్నారు. వూహాన్ లో కరోనా వైరస్ ను సృష్టించింది చైనా అని.. వివిధ దేశాలకు విస్తరింపచేస్తుందని తాను ఫిబ్రవరిలోనే హెచ్చరించానని కేఏపాల్ తన వీడియోలో పేర్కొన్నారు.

చైనా నుంచి కరోనా వైరస్ నుంచి తాను భారత్ ను రక్షిస్తానని కేఏపాల్ చెప్పుకొచ్చాడు. తనతో భారత ప్రభుత్వం, మోడీ చేతులు కలపాలని పిలుపునిచ్చాడు.

ఇలా కేఏపాల్ మాటలు కోటలు దాటేశాయి. ట్రంప్ నుంచి మొదలుపెడితే మోడీ, తెలుగు రాష్ట్రాలు, టీవీ9, ఏబీఎన్ చానెళ్లను కూడా కేఏపాల్ టార్గెట్ చేసిన తీరు చూశాక.. నిజంగానే కేఏపాల్ ను భారత సాయుధ దళంలో చేర్చుకొని చైనా సరిహద్దుల్లో నిలబెట్టి యుద్ధం జరుగకుండా శాంతి వచనాలు వినిపించాలని పలువురు సెటైర్లు వేస్తున్నారు.

చైనా వస్తువుల బహిష్కరణ సాధ్యమయ్యేనా?


భారత్-చైనా సరిహద్దుల్లో గడిచిన నెలరోజులుగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గత సోమవారం రాత్రి ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణలో భారత జవాన్లు 20మంది వీరమరణం పొందారు. శాంతి చర్చల పేరుతో చైనా భారత్ ను దొంగదెబ్బతీయడంపై యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరజవాన్లను ఘననివాళి పాటిస్తూనే చైనాకు తగిన గుణపాఠం చెప్పాలని భారతీయులంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ సైతం జవాన్ల వీరమరణం వృథాగా పోనివ్వమని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో కమాండర్ స్థాయి అధికారులకు పరిస్థితిని బట్టి స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని కల్పించారు. అదేవిధంగా త్రివిధ దళాలు సైతం సిద్ధంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో సరిహద్దుల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది.

ఇదిలా ఉంటే భారత జవాన్ల మృతిని నిరసిస్తూ భారతీయులంతా చైనా వస్తువుల బహిష్కరణకు శ్రీకారం చుట్టారు. చైనా తయారుచేసే వస్తువులకు భారత్ అతిపెద్ద మార్కెట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చైనా తయారుచేసే వస్తువులన్నీ భారత్ లోనూ తయారవుతున్నప్పటికీ చైనా వస్తువులు తక్కువ మొత్తానికి లభిస్తుండటంతో ప్రజలు వాటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. చైనా సోమవారం రాత్రి దొంగదెబ్బతీసి భారత సైనికులను పొట్టనపెట్టుకోవడంతో చైనా వస్తువుల బహిష్కరణ నినాదం ఊపందుకుంది. చైనాను ఆర్థికంగా దెబ్బకొడిస్తే అదే కాళ్లబేరానికి వస్తుందనే అభిప్రాయం మెజార్టీ ప్రజల్లో వ్యక్తం అవుతోంది.

ఇప్పటికే పలువురు చైనా వస్తువులను, చైనా యాప్స్ ను బహిష్కరిస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు చైనా వస్తువులను బహిష్కరించాలని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీనికి భారతీయుల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తుంది. ఇప్పటికే చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులు చాలా వరకు ఇండియాలో తయారవుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ ఉత్పత్తులను మనమే తయారు చేసుకుంటున్న సంగతి తెల్సిందే. స్థానికంగా తయారుచేసుకుంటూ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై తొలుత బ్యాన్ విధించాలని కేంద్రం భావిస్తుంది. ఆ తర్వాత క్రమంగా మిగతా చైనా వస్తువుల వాడకం తగ్గించి క్రమంగా అన్ని వస్తువులు భారత్లోనే తయారు చేసుకునేలా కేంద్రం ప్లాన్ చేస్తోంది. మన వస్తువులను మనమే వినియోగించున్నట్లయితే చాలావరకు విదేశీ వస్తువులను కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పటికి సాధ్యం అవుతుందనేది వేచి చూడాల్సిందే..!

2020 పత్రికలకు ముగింపు సంవత్సరమేనా?


వెనుకటికి గ్రామాల్లో ఏదైనా ప్రజలకు సమాచారం చేరవేయాలంటే డప్పు చాటింపు వేసేవారు.. టూరింగ్ టాకీస్ లో రాబోయే చిత్రం గురించి సైకిల్ రిక్షాపై వాడవాడలో తిరుగుతూ లౌడ్ స్పీకర్ తో చెప్పేవారు. రేడియోలో వార్తలు వినడానికి గ్రామమంతా సిగ్నల్ ఉండే చోటుకు వచ్చి ఆసక్తిగా వినేది.

బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ ఫోన్లు ఉండేవి. తర్వాత ఎస్టీడీ, ఐఎస్టీడీ బూత్ లు వచ్చాక అబ్బో అని సంబరపడ్డం. స్మార్ట్ ఫోన్ రాకతో విప్లవమే వచ్చిపడింది. ఇప్పుడు పాత ల్యాండ్ ఫోన్లు, ఎస్టీడీ, ఐఎస్డీ బూతులన్నీ బంద్ అయిపోయాయి.

చిన్నప్పుడు దూరదర్శన్ లో సినిమాలు, క్రికెట్ వస్తుందంటే అబ్బురపడి చూసేవాళ్లం. కరెంట్ పోతే అరె మళ్లీ చూడలేమని బాధపడేవాళ్లం. కానీ నేడు ఇంటర్నెట్ లో స్మార్ట్ ఫోన్ లో ఎక్కడున్నా లైవ్ లో ప్రోగ్రాంలు చూస్తున్నాం..

ఆధునిక సాంకేతికతలో పాతవన్నీ కొట్టుకుపోతున్నాయి. ఇప్పుడు ఇదే పరిస్థితి పత్రికలకు వచ్చిందన్న అభిప్రాయం జర్నలిస్టు సర్కిల్స్ లో వ్యక్తమవుతోంది. 2020నే పత్రికలకు ముగింపు పలుకుతుందా అన్న అనుమానాలు కులుగుతున్నాయి. ఒక శతాబ్ధానికి పైగా పత్రికలు ఈ వ్యవస్థలో కొనసాగాయి. రాజకీయాలను శాసించాయి.. కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి దెబ్బకు అంపశయ్యపై నిలబడ్డాయి.

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ న్యూస్ పేపర్ కుదేలైంది. ఆర్థికంగా చితికిపోయింది. నిర్వహణ చాలా కష్టమవుతోంది. ఉద్యోగులను తీసేసి.. టాబ్లాయిడ్స్ ఎత్తివేసినా ప్రయోజనం ఉండడం లేదు.

తెలుగులోనే అగ్ర మీడియా అధిపతి తన నంబర్ 1 పత్రికతోపాటు చిట్ ఫండ్ , ఫిల్మ్ సిటీ సహా ఆయన సామ్రాజ్యం అంతా నెలకు రూ.200 కోట్ల రూపాయలు సంపాదించేదట.. ఇప్పుడు కేవలం 20 కోట్లు మాత్రమే వస్తుందట.. అదీ చిట్ ఫండ్స్ ద్వారానే ఫిలింసిటీ, పత్రిక, న్యూస్ చానెల్స్ ద్వారా రూపాయి ఆదాయం లేదట.. ఇక పత్రికను నిర్వహించడం ఏంతమాత్రం తేలికైన విషయం కాదని ఆయన దాదాపు నిర్ణయానికి వచ్చేశాడట..

తెలుగులోనే మరో పత్రిక ఇప్పటికే ఉద్యోగులను తొలగించి జీతాలు సగం కట్ చేసి దాదాపు చాలించుకుంది. టీడీపీ పాలనలో ఏపీ ప్రభుత్వం నుంచి 750కోట్ల దాకా సాపందించిన ఆ సంస్థ ఇప్పుడు డబ్బులున్నా ఉద్యోగులను తొలగించిందని.. ఆ సంస్థకు పత్రికను పునరుద్దరించే ఉద్దేశం లేదని జర్నలిస్టులు చెబుతున్నారు. పత్రికలో ఎన్నో దశలుంటాయి. అవి ఖరీదైనవి.. వార్తల సేకరణ, ఆకట్టుకునేలా ప్రచురణ, పేజీ లేఅవుట్, రూపకల్పన, కొత్త చందాదారులను జోడించడం.. ముద్రణ, పంపిణీ , మార్కెటింగ్.. ఇలా పత్రిక వ్యవస్థ ఎంతో జఠిలమైనది. అందుకే ఇప్పుడు ఏ వార్త పత్రిక కూడా మనుగడ సాగించే పరిస్థితుల్లో కనిపించడం లేదు. కరోనా కాటుకు దాదాపు మూతపడే దశకు చేరుకున్నాయి.

స్మార్ట్ ఫోన్ విప్లవం వచ్చాక ఎవ్వరూ దినపత్రికలను చూసే పరిస్థితి కనిపించడం లేదు. న్యూస్ యాప్ ల ద్వారా అంతా వితిన్ స్పాట్ లో జరిగిన సంఘటనను మరుక్షణమే తెలుసుకుంటున్నారు. తెల్లవారి వచ్చే పత్రికల కోసం ఎదురుచూడడం లేదు.

ఇప్పటికే విదేశాల్లో పత్రికల సర్య్కూలేషన్, వినియోగం తగ్గిపోయి దిగ్గజ పత్రికలు కూడా మూతపడుతున్నాయి. పత్రికల స్థానంలో డిజిటల్ మీడియా ప్రవేశిస్తోంది. తమ డిజిటల్ న్యూస్ వెబ్ సైట్లను మరింత ఆకర్షణీయంగా మలిచి వీక్షకులకు అందించడానికి రెడీ అవుతున్నాయి. రాను రాను పత్రికలు మూతపడి ఈ ఆన్ లైన్ పత్రికలు, న్యూస్ యాప్ లే మనుగడ సాగించే అవకాశాలు లేకపోలేదు.

ఆ విషయంలో ట్రంప్ ను మోదీ ఫాలోవుతున్నారా?


చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. అగ్ర రాజ్యలను సైతం కరోనా మహమ్మరి గడగడలాడిస్తోంది. ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికాలోనే కరోనా కట్టడి కావడం లేదు. కరోనా కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండటం చూస్తుంటే మిగతా దేశాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో కరోనా కేసులు పెరిగిపోవడానికి అమెరికా స్వయంకృతాపరాధమనే విమర్శలున్నాయి. ఈ మహమ్మరిపై డబ్యూహెచ్ఓ చేసిన హెచ్చరికలను అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తొలినాళ్లలో పెడచెవినపెట్టడమే కేసుల సంఖ్య పెరగగానికి కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ట్రంప్ మెల్కోన్నప్పటికీ అప్పటికే అమెరికాకు జరగరాని నష్టం జరిగిపోయిందనే వాదనలున్నాయి.

కరోనా విషయంలో భారత ప్రధాని మోదీ ముందుగానే మెల్కోని దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితయ్యారు. లాక్డౌన్ పది నుంచి పదేహను రోజుల్లో ముగిస్తుందని అందరూ భావించారు. లాక్డౌన్ వల్ల వైరస్ ను భారత్ కొంతమేర మాత్రమే కట్టడి చేయగలిగింది తప్ప పూర్తిస్థాయిలో నివారించలేకపోయింది. దీంతో కేంద్రం లాక్డౌన్ పొడగిస్తూ పోయింది. ప్రస్తుతం లాక్డౌన్ 5.0 కొనసాగుతోంది. జూన్ 30వరకు లాక్డౌన్ 5.0కొనసాగనుంది.

ఇదిలా ఉంటే లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు, అన్నివర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ప్రజారవాణా పూర్తిగా స్తంభించిపోవడంతో ఎక్కడివారే అక్కడే ఉండాల్సి వచ్చింది. అయితే లాక్డౌన్ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాబడి తగ్గింది. దీంతో ఆదాయం పెంచుకునేందుకు లాక్డౌన్ 3.0, 4.0లో కేంద్రం ఆయా రాష్ట్రాలకు కొన్ని షరతులతో భారీ సడలింపులను ఇచ్చింది. ఈనేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు, కేంద్రానికి తిరిగి ఆదాయం సమకూరుతోంది.

లాక్డౌన్లో భారీ సడలింపులు ఇవ్వడంతో గడిచిన నెలరోజులుగా దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో మళ్లీ లాక్డౌన్ ఉంటుందనే ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలో ప్రధాని మోదీ తాజాగా సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్డౌన్ పై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ మరోసారి లాక్డౌన్ విధించే అవకాశం లేదని స్పష్టం చేశారు. అన్ లాక్-2.0పైనే కేంద్రం దృష్టిసారించిందని పేర్కొనడం గమనార్హం.

ఓవైపు దేశంలో కేసులు సంఖ్యతోపాటు మరణాల సంఖ్య పెరిగిపోతుంది. అయితే దీనిని ప్రధాని మోదీ అంతగా పట్టించుకున్నట్లు కన్పించడం లేదు. మరోవైపు కరోనాతో కలిసి జీవించడం అలవర్చుకోవాలని కేంద్రం, ఆయా రాష్ట్రాలు సూచిస్తుండటం పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్యల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్న కేసులతో భారత్ మరింత ప్రమాద స్థితికి చేరేలా కన్పిస్తుంది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ ఆన్ లాక్-2.0పైనే ఫోకస్ పెట్టడం చూస్తుంటే మోదీ కూడా ట్రంప్ బాటలోనే నడుస్తున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ట్రంప్ నిర్లక్ష్యం కారణంగా అమెరికా ప్రజలు కరోనా బారినపడి పెద్దసంఖ్యలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందనే విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే కరోనాపై ప్రధాని మోదీ ముందుగానే మెల్కోన్నప్పటికీ వైరస్ కట్టడిలో విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనే వాదనలు విన్పిస్తున్నాయి. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు చూస్తుంటే ప్రధాని మోదీ కరోనాపై పూర్తిగా చేతులేత్తిసినట్లే కన్పిస్తుంది. ఈనేపథ్యంలో ప్రజలు ప్రభుత్వాలను నమ్ముకోకుండా తమకుతాము జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఎక్స్ క్లూజివ్: నీహారిక’కు కాబోయే భర్త ఎవరంటే..!


మెగా వారసురాలు నీహారిక కొణిదెల తన పెళ్లి పై క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్టు చేయడంతో త్వరలోనే ఆమె ఒకింటామె కాబోతుందని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుండి మాకు తెలిసిన లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. ఓ పోలీస్ అధికారి కుమారుడితో నిహారిక పెళ్లి జరగబోతుంది. నాలుగు రోజుల క్రితమే కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక తన కుమార్తె పెళ్లి పై నాగబాబు కూడా ఇటీవలే క్లారిటీ ఇస్తూ.. నిహారికకు త్వరలో పెళ్లి చేసేస్తానని అన్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో నిహారిక పెళ్లి ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి కొణిదెల వారి ఇంటి నుంచి శుభవార్త రావడంతో మెగా అభిమానులంతా తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక నిహారిక హీరోయిన్ గా నిలదొక్కుకోవడం కోసం కూడా గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఆమె తమిళ్ లో కూడా అవకాశాలు అందుకుంటూ ముందుకు వెళుతుంది. ఓ మై కడువలె సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు వరుస అవకాశాలతో దూసుకెళుతున్న తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్ తో ఆమె ఓ సినిమాలో నటించనుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ఆచార్య సినిమాలో ఓ ప్రత్యేక అతిధి పాత్రలో నిహారిక కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిహారిక, రామ్ చరణ్ కు చెల్లెలు పాత్రలో నటించబోతుందట, నిహారిక కనిపించే సీన్స్ లో సిస్టర్ సెంటిమెంట్ ను బాగా ఎలివేట్ చేయబోతున్నారు.

కీలక సమయంలో ఐరాసలో భారత్ ఘన విజయం


కీలక సమయంలో భారతదేశం ఐరాసలో ఏకపక్ష విజయం సాధించింది. ఓవైపు భారత్ లో కరోనా మహమ్మరి విజృంభిస్తుండగా మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తల నేపథ్యంలో భారత్ ఐక్యరాజ్య భద్రతా మండలికి ఎన్నికవడం విశేషం. బుధవారం ఐరాస భద్రతా మండలి తాత్కాలిక ఐదు సభ్య దేశాల కోసం ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో భారత్ ఏకపక్షంగా విజయం సాధించి సత్తాచాటింది. ఐరాసలో మొత్తం 193 సభ్యదేశాలుండగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్‌కు అనుకూలంగా 184 దేశాలు ఓట్లు వేశాయి. దీంతో ఐరాస భద్రతా మండలి భారత్ తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైంది.

ఐరాస 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో జరిగిన ఎన్నికలో భారత్ మరోసారి సత్తా చాటింది. ఆసియా-పసిఫిక్ రీజన్‌ నుంచి భారత్ నాన్ పర్మినెంట్ మెంబర్‌గా అద్భుత విజయాన్ని దక్కించుకుంది. 193ఓట్లలో భారత్‌కు 184ఓట్లు పోలైయ్యాయి. భారత్ తోపాటు ఐర్లాండ్, మెక్సికో, నార్వే దేశాలు కూడా భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికయ్యాయి. దీంతో భారత్ రెండేళ్లపాటు ఐరాసలో తాత్కాలిక సభ్య దేశంగా ఉండనుంది. వచ్చే ఏడాది జనవరి 1నుంచి భారత్‌కు ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశం హోదా లభించనుంది.

ఐరాస భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్య దేశాలతోపాటు పది తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. వీటికి మాత్రమే వీటో అధికారం ఉంటుంది. ఇక పది తాత్కాలిక సభ్యదేశాలు ప్రతీ రెండేళ్లకోసారి మారుతుంటాయి. భారత్ గతంలో 1950-1951, 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92, 2011-12 సంవత్సరాల్లో ఐరాస భద్రతా మండలిలో సభ్యదేశంగా ఎన్నికైంది. తాజాగా మరోసారి 2021-2022 సంవత్సరానికి ఎన్నికైంది.

ఐరాస భద్రతా మండలిలో 15 శక్తివంతమైన దేశాలు ఉన్నాయి. ఆసియా-పసిఫిక్ రీజన్‌లో చైనా, పాకిస్తాన్‌తోపాటు 55 సభ్య దేశాలు ఉన్నాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తుంది. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అమెరికా, జపాన్ సహా పలు దేశాలు భారత శాశ్వత సభ్యాత్వానికి మద్దతు ఇస్తున్నాయి. ఐరాసలో భారతదేశానికి 184దేశాలు మద్దతు పలుకడం చూస్తుంటే ఆయా దేశాలకు భారత్ పై ఎంత నమ్మకముందే ఇట్టే అర్థమవుతోంది. ఏదిఏమైనా భారత్ మరోసారి ఐరాస భద్రతా మండలిలో ఏకపక్ష విజయంతో చోటు దక్కించుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

పుష్ప అడవిలో సెట్‌ కాదని.. అన్నపూర్ణలో సెట్‌ చేస్తున్న సుకుమార్


చిత్ర పరిశ్రమను కరోనా మహమ్మారి మామూలుగా దెబ్బతీయలేదు. ఈ వైరస్‌ ధాటికి ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలు దెబ్బతిన్నాయి. షూటింగ్స్‌, సినిమా రిలీజ్‌లు ఆగిపోయాయి. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుక కూడా రెండు నెలలు వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్‌ సడలింపులు రావడంతో టాలీవుడ్‌లో ఈ మధ్యే కొన్ని మూవీల చిత్రీకరణలు తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ, అవన్నీ చిన్నాచితక చిత్రాలే. భారీ తారాగణం ఉండే పెద్ద సినిమా విషయంలో దర్శక, నిర్మాతలు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ షూటింగ్స్‌కు వెళ్లి రిస్క్‌ చేసేందుకు వెనకడుగేస్తున్నారు. అందులో స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌తో స్టార్ డైరెక్టర్ రూపొందిస్తున్న ‘పుష్ప’ కూడా ఒకటి.

గంధం చెక్కల స్మగ్లింగ్‌, ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను కేరళలోని అడవుల్లో పూర్తి చేశారు. రెండో షెడ్యూల్‌ను కూడా అక్కడే ప్లాన్‌ చేశారు. కానీ, కరోనా కారణంగా షూటింగ్‌కు అనూహ్యంగా బ్రేక్‌ పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేరళకు వెళ్లి షూటింగ్‌ చేసే అవకాశం లేదని డైరెక్టర్ సుకుమార్ నిర్ణయానికి వచ్చాడట. దాంతో, ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక అడవిలో షూట్‌ చేయాలని భావించారట. కానీ, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని కూడా విరమించుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఏపీలో కూడా కరోనా ప్రభావం అధికంగా ఉంది. తెలంగాణలో ఏదో ఒక అడవిని ఎంచుకుందామన్నా.. ఇక్కడా వైరస్‌ ఏ రేంజ్‌లో విజృంభిస్తుందో తెలిసిందే. దాంతో, షూటింగ్‌ కోసం వేరే ప్రాంతానికి వెళ్లడం సాధ్యమయ్యే పని కాదని సుక్కూ ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. హైదరాబాద్‌ అన్నపూర్ణ సెట్‌లోనే అడవి సెట్‌ వేసి షూటింగ్‌ చేయాలని డిసైడనట్టు టాలీవుడ్‌ టాక్‌. ‘రంగస్థలం’లో కొంతభాగాన్నే గోదావరి జిల్లాల్లో చిత్రీకరించాడు. నది, విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో మిగతా మొత్తాన్ని హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో తీశాడు. గ్రాఫిక్స్‌, వీఎఫ్ఎక్స్‌ సాయం తీసుకున్నాడు. ఇప్పుడు పుష్ప విషయంలో కూడా దాన్నే ఫాలో కావాలని సుకుమార్ నిర్ణయం తీసుకున్నాడట. అయితే, ప్రతీ సీన్‌ను సుక్కూ ఫుల్‌ పర్ఫెక్షన్‌తో తీస్తాడు. మరి స్టూడియోలో అడవి సెట్‌ వేస్తే నేచురాలటీ మిస్‌ అయ్యే ప్రమాదం ఉంది. సహజత్వం కావాలంటే ఎక్కువ గ్రాఫిక్స్‌ అవసరం అవుతాయి. ఆటోమేటిక్‌గా బడ్జెట్‌ పెరుగుతుంది. మరి, కరోనా టైమ్‌లో ఖర్చులు తగ్గించుకుంటున్న నిర్మాతలు దీనికి ఒప్పుకుంటారో లేదో చూడాలి.

సెల్ ఫోన్ వీడియో.. అడ్డంగా బుక్కైన నారా లోకేష్


టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ అయిన నారా లోకేష్ తీరు మార్చుకోవడం లేదు. అనుమతి లేకున్నా నిండు సభలో వీడియోలతో బుక్ అవుతూనే ఉన్నాడు. ఇప్పటికే ఒకసారి హెచ్చరికలు జారీ చేసిన ఆయన తీరు మారడం లేదు.

అప్పట్లో ఏపీకి 3 రాజధానులు, సీఆర్డీఏ బిల్లు సందర్భంగా కూడా నారా లోకేష్ బాబు శాసనమండలిలో అడ్డంగా దొరికాడు. ఇప్పుడు తాజాగా మరోసారి శాసనమండలిలో అదే పనిచేశారు. నాడు మూడు రాజధానుల సందర్భంగా క్రమంలో వైసీపీ మంత్రులంతా మండలి చైర్మన్ పోడియం చుట్టుముట్టడం.. టీడీపీ ఎమ్మెల్సీలంతా నిరసన తెలుపుతున్న సందర్భం అదీ. ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పెద్ద తప్పు చేసేశారు. అసలు అసెంబ్లీలోనే సెల్ ఫోన్ వాడకంపై నిషేధం ఉంది. కానీ దాన్ని ఉల్లంఘించి ఏకంగా ఈ గొడవలకు సంబంధించిన సన్నివేశాలను సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో టీడీపీ ఇరుకునపడింది.

నారా లోకేష్ సెల్ ఫోన్లో చిత్రీకరిస్తుండడంపై వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్రంగా తప్పు పట్టారు. ఈ విషయాన్ని మండలి చైర్మన్ షరీఫ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీరియస్ అయిన షరీఫ్ మందలించడంతో నారా లోకేష్ సెల్ ఫోన్ చిత్రీకరణను విరమించుకున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణించింది. మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరడానికి సిద్ధమైంది.

తాజాగా మరోసారి లోకేష్ బాబు వీడియో గ్రాఫర్ గా మారారు. కౌన్సిల్ లో వైసీపీ మంత్రుల ఆగ్రహావేశాలను ఆందోళన దృశ్యాలను లోకేష్ బాబు చిత్రీకరించాడు. శాసనసభ అన్ని నిబంధనలను లోకేష్ ఉల్లంఘించాడు. అధికార వైసీపీ దీనిని మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదు. మంత్రి కన్నబాబు దీనిపై మండలి చైర్మన్ వద్ద నిరసన తెలిపాడు. ఈ చర్యను ప్రతిపక్షాలు ఖండించలేదు. ఎందుకంటే మండలిలో ప్రతిపక్ష టీడీపీకే మెజారిటీ ఉంది. అలా వీడియో తీయకుండా ఉండాలని ఎవరూ కూడా లోకేష్ బాబు అనే ధైర్యం చేయలేదు.

శాసనసభతోపాటు మండలిలో సెల్ ఫోన్ తో వీడియోలు తీయడం తీవ్ర నేరం. అయినా కూడా లోకేష్ బాబు అవేమీ పట్టించుకోకుండా తీసేశాడు. మండలిలో టీడీపీదే ఆధిపత్యం బలం ఉండడంతో లోకేష్ ను ఎవరూ ఏమీ అనలేకపోయారు.అధికార వైసీపీ మంత్రులు ఎంత గింజుకున్నా ఫలితం లేకుండా పోయింది. లోకేష్ వీడియో తీయడాన్ని రిలీజ్ చేసి ప్రజల ముందే తేల్చుకోవాలని వైసీపీ రెడీ అవుతోంది.

చైనా ఆరాటం నీళ్ళ కోసమా?

చైనా తూర్పు లడఖ్ లో దుస్సాహసానికి ఒడిగట్టటానికి రహస్య కారణాలున్నాయని పరిశీలకుల అభిప్రాయం. ముఖ్యంగా పరిశుద్ధమైన నీటి కోసమే చైనా కయ్యానికి కాలు దువ్విందనటానికి ఆధారులున్నాయి. వరసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమేననిపిస్తుంది. అదేమిటో చూద్దాం.

ఇప్పుడు సరిహద్దు పోరాటం జరుగుతున్న ప్రాంతం కారకోరం-హిమాలయాల పర్వతశ్రేణి ప్రాంతం. దానికి ఆవల వుత్తరం వైపు చైనా కి చెందిన జింజియాంగ్ ప్రావిన్సు పూర్తి ఎడారి ప్రాంతం. అక్కడ నీటికొరత సహజంగానే ఎక్కువ. కానీ ఆ ప్రాంతాన్ని కీలకమైన ప్రాంతంగా మలుచుకుంటుంది చైనా. ఆక్సాయ్ చిన్ ఉత్తరప్రాంతం లో అణ్వాయుధాల ప్రయోగ ప్రాంతంగా వాడుకుంటుంది. అలాగే దగ్గరలోని కష్గర్ పట్టాన సమీపంలో జి సి ఎల్ పాలీ ఎనర్జీ హోల్డింగ్స్ కంపెనీ 130 వేల మెట్రిక్ టన్నుల మైక్రో చిప్ తయారీ కర్మాగారాన్ని నెలకొల్పుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మైక్రో చిప్ తయారీ కేంద్రాల్లో ఒకటి. మరి వీటన్నింటికి సమృద్ధిగా నీళ్ళు కావాలి. మైక్రో చిప్ ఉత్పత్తి కి ఒక్క చిప్ కే పది వేల లీటర్ల నీళ్ళు కావాల్సి వుంటుంది.

1954 లో ఆక్సాయ్ చిన్ ని ఆక్రమించినా , 1963 లో షాక్ షాగం ని పాకిస్తాన్ నుంచి అక్రమంగా సంపాదించినా అసలు కారణం నీళ్ళ కోసమే. షాక్ షాగం లోయని పాకిస్తాన్ నుంచి సంపాదించినా 1984 లో సియాచిన్ గ్లాసియర్ ని భారత్ పూర్తి అదుపులోకి తెచ్చుకోవటంతో చైనా ఆటలకు బ్రేక్ పడింది. దానితోపాటు కిషెన్ గంగ డాం ని భారత్ నిర్మించటం తో కూడా కొంత చైనా కి ఇబ్బందిగా వుంది. గల్వాన్ నదీ ప్రాంతం నుండి దౌలత్ బేగ్ ఒల్దీ కి భారత్ రోడ్ నిర్మాణం చేయటం తో చైనా కు భయం పట్టుకుంది. భారత్ కూడా వ్యూహాత్మకంగా పనులు చేపట్టటంతో ముందు ముందు కావలసినన్ని మంచి నీళ్ళ కు ఇబ్బండులేర్పడతాయని భావిస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని తనకిన్డకు తెచ్చుకుంటే ముందు ముందు కూడా మంచి నీళ్ళకు ఎటువంటి ఇబ్బంది తలెత్తదు అని ఎత్తుగడ వేసింది. భారత్ ఈ ఎత్తుగడలను పసిగట్టి ప్రతి వ్యూహాలు రచించటం తో చైనా ఆటలు సాగటం లేదు. 1962 భారత్ కి , 2020 భారత్ కి పోలిక లేదని చైనా గ్రహిస్తే మంచిది.

చైనాకు ధీటైన సమాధానమిచ్చిన కేంద్రం


భారత్-చైనా సరిహద్దుల్లో సోమవారం రాత్రి 3గంటలకు ఘర్షణ చోటుచేసుకుంది. చైనా దొంగదెబ్బ కొట్టడంతో భారత జవాన్లు 20మంది వీరమరణం పొందారు. గాల్వాన్లో సుమారు వెయ్యిమంది చైనా సైనికులు భారత జవాన్లపై రాళ్లు, రాడ్లతో దాడికి యత్నించగా మన సైనికులు ప్రతిదాడి చేశారు. ఈ సంఘటనలో చైనాకు చెందిన 40మంది సైనికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే చైనా మృతుల వివరాలను దాచిపెడుతోంది. అంతేకాకుండా భారత సైనికులే తమ భూభాగంలోకి వచ్చి దాడికి పాల్పడ్డారని ముందస్తుగా స్పందించి ప్రపంచం ముందు భారత్ ను దోషిగా చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇక చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబర్ టైమ్స్ లో భారత్ అహంకారంతో వ్యవహరిస్తుందని విషపూరిత కథనాలను ప్రచురిస్తూ విషం చిమ్ముతోంది.

ఇదిలా ఉంటే తాజాగా చైనా మరోసారి బరితెగించింది. గాల్వన్ వ్యాలీ తమదేనంటూ చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి భారత్ కూడా ధీటైన జవాబిచ్చింది. గాల్వాన్ లోయ తమదేనని చైనా ప్రకటించడం తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ బుధవారం అర్ధరాత్రి ప్రకటన జారీ చేసింది. ఈమేరకు ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలో సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఒప్పందాన్ని గుర్తు చేసింది. జూన్ 6న ఇరుదేశాల మిలటరీ కమాండర్స్ మధ్య జరిగిన ఒప్పందాన్ని చైనా నిబద్ధతతో అమలు చేయాలని భారత్ స్పష్టం చేసింది.

చైనా ఓవైపు భారత్ ను శాంతి చర్చలు అంటూనే దొంగదెబ్బ కొట్టడంపై భారత్ సీరియస్ గా స్పందిస్తోంది. గాల్వాన్ లోయలోకి చైనా కాలుపెట్టి భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతోంది. భారత్ సైనికులను కావాలని రెచ్చగొట్టి ఘర్షణలకు ఉసిగొల్పిడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దుల్లో ఎప్పుడే ఏం జరుగుతుందా? అనే టెన్షన్ నెలకొంది. భారత్ జవాన్లు 20మంది మృతిచెందాడటంతో చైనా అంశాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ విషయంపై ప్రధాని చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దుల్లోని కమాండర్లకు పరిస్థితిని బట్టి స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని వారికి కల్పించింది. దీంతో భారత సైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్రివిధ దళాలు కూడా సన్నద్ధంగా ఉండాలని కేంద్రం ఆదేశాలిచ్చింది.

చైనా దేశం భారత్ కంటే తామే శక్తిమంతులమని నిరూపించుకునేందుకు బలం ప్రయోగం చేస్తోంది. దీంతో భారత్ కూడా తమను రెచ్చగొడితే చూస్తూ ఊరుకోబోమని సంకేతాన్ని చైనాకు పంపింది. ఓ వైపు చైనా శాంతి చర్చలు అంటూనే గాల్వన్ వ్యాలీ తమదేనని ప్రకటించుకొని చైనా ద్వంద్వ నీతిని బయటపెడుతోంది. డ్రాగన్ కంట్రీ చేస్తున్న నక్కజిత్తులను భారత్ కూడా అంతే సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. దీంతో సరిహద్దుల్లో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో భారత్-చైనా సంబంధాలు మున్ముందు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయనేది ఉత్కంఠను రేపుతోంది.

మిస్‌ కాదు మిసెస్‌ నిహారిక అంటూ ఫొటో..


మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి హీరోయిన్‌, నాగబాబు కుమార్తె నిహారిక గురించి ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌. ఆమె పెళ్లిపై చాలా రోజుల నుంచి పుకార్లు వస్తున్నాయి. రెబల్‌ స్టార్ ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటుందని ఓసారి.. కాదు బావ సాయిధరమ్‌ తేజ్‌తో పెళ్లి అని మరోసారి రూమర్స్‌ వచ్చాయి. తన ఫస్ట్‌ మూవీ హీరో నాగ‌శౌర్యతో ప్రేమలో పడిందని, అతడితోనే మూడు ముళ్లు వేయించుకుంటుందని సోషల్‌ మీడియాలో తెగ చర్చ జరిగింది. కానీ, వీటన్నింటికీ నిహారిక చెక్‌ పుట్టింది. అవన్నీ పుకార్లే అని చాలాసార్లు కొట్టి పారేసింది. కానీ, తన పెళ్లి గురించి నిహారికే ఓ హింట్‌ ఇచ్చేలా ఇన్‌స్టాగ్రామ్‌లో పోట్‌ పెట్టింది. దాంతో, ఆమె పెళ్లిపై మళ్లీ చర్చ మొదలైంది.

ఓ కప్పును పట్టుకున్న ఫొటోను నిహారిక ఇన్‌స్టాలో షేర్ చేసింది. దానిపై మిస్‌. నిహా అని రాసి ఉండగా.. అందులో మిస్‌లో కొట్టేసినట్టు అడ్డగా గీత పెట్టి కింద మిసెస్‌ అని రాసి క్వశ్చన్‌ మార్క్‌ ఉంది. ఓహ్‌… వాట్‌ అని ఆ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చింది. దాంతో, మిస్‌ నిహారిక.. త్వరలోనే మిసెస్‌ కాబోతోందని.. తన పెళ్లి కుదిరింది కాబట్టే మెగా డాటర్ఇలా సింబాలిక్‌గా చెప్పిందని ఫ్యాన్స్‌ అభిప్రాయప డుతున్నారు. నిహా పోస్ట్‌ చూసిన నెటిజన్స్ పెళ్లి కొడుకు ఎవరు? అని అడుగుతున్నారు . కొద్ది రోజుల కిందట నిహారికకి ప్రస్తుతం సంబంధాలు చూస్తున్నామని నాగబాబు చెప్పారు. దాంతో నిహా విహావ వార్తలకు బలం చేకూరింది. ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఈ మధ్యే కెరీర్ ప్రారంభించిన నిహారిక కన్నడ లో అరంగేట్రం చేయబోతోంది. గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమే అని ఇటీవల ప్రకటించింది. తన కెరీర్ను నచ్చినట్టు మలుచుకునే స్వేచ్ఛ కుటుంబ సభ్యులు ఇచ్చారని గతంలోనే చెప్పింది. మరి, ఇంత త్వరగా పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరం అవుతుందా? చూడాలి.

https://www.instagram.com/p/CBidGnVJDBn/

‘నిన్నే పెళ్లాడుతా’ అంటున్న రకుల్‌ తమ్ముడు


దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామేతను నటీనటులు బాగా ఫాలో అవుతారు. ఈ విషయంలో హీరోయిన్లు చాలా స్పీడ్‌గా ఉంటారు. క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవడంలో ముందుంటారు. ఒకే టైమ్‌లో చాలా సినిమాలతో పాటు స్పెషల్‌ సాంగ్స్‌,  ఈవెంట్స్‌, షోస్‌, షోరూం ఓపెనింగ్స్‌ ఇలా ఏ అవకాశాన్ని వదులుకోకుండా సంపాదిస్తుంటారు. ఇంకొందరు పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతారు. హీరోలతో పోల్చితే తెరపై వాళ్ల లైఫ్‌ స్పాన్‌, రెమ్యునరేషన్‌ చాలా తక్కువే కాబట్టి అలా చేయడంలో తప్పేం లేదు. కొందరు హీరోయిన్లు మాత్రం మరింత ముందున్నారు. తమ ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా వెండితెరకు పరిచయం చేస్తున్నారు. తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా ఉన్నప్పుడు కాజల్‌ అగర్వాల్‌ తన చెల్లులు నిషా అగర్వాల్‌ను నాయికగా పరిచయం చేసింది. కొన్ని సినిమాల్లో ఆకట్టుకున్నప్పటికీ నిషా నటిగా ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా కాజల్‌ను ఫాలో అవుతోంది. ఇప్పటికే ఫిట్‌నెస్‌ ఫ్రాంచైజీతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన రకుల్ తాజాగా తన తమ్ముడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేస్తోంది. అమన్‌ హీరోగా పరిచయం అవుతున్న సినిమాకు ‘నిన్నే పెళ్లాడతా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అతని సరసన సిద్దికా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి వైకుంఠ్‌ బోను డైరెక్టర్. బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు నిర్మాతలు. సాయికుమార్‌, అన్నపూర్ణ, సీత తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 1996లో విడుదలైన నాగార్జున సూపర్ హిట్‌ మూవీ ‘నిన్నే పెళ్లాడతా’ టైటిల్‌తో ముందుకొస్తున్న చిత్రంతో అమన్‌ పంచెకట్టుతో ఉన్న పోస్టర్ను నాగార్జునే రిలీజ్‌ చేశారు. తాజాగా మూవీ లిరికల్‌ వీడియో సాంగ్‌ను రకుల్‌ ప్రీత్‌ సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసింది. ‘సఖుడా చెలికాడా తెగువె కలవాడా సరదా వరదై రారా.. సఖుడా చెలికాడా సరసపు మొనగాడా మదిలో మదివై పోరా’ చిన్మయి పాడిన పాట ఆకట్టుకునేలా ఉంది. దీన్ని చైతన్య ప్రసాద్‌ రాశారు. నవనీత్‌ కంపోజ్‌ చేశారు. ఈ పాట తనను ఎంతగానో ఆకట్టుకుందని, లిరిక్స్‌ సూపర్బ్‌ అని నటి మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. పాటకు సంబంధించిన లింక్‌ను షేర్‌ చేసింది.

‘దబాంగ్’ దర్శకుడిపై కేసు పెడతామంటున్న సల్మాన్‌ అన్న


బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ అతని కుంటుంబం తన జీవితాన్ని నాశనం చేశారంటూ ‘దబాంగ్‌’ దర్శకుడు అభినవ్‌ కశ్యప్‌ సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. బాలీవుడ్‌లో కొంత మంది పెద్దలు దివంగత సుశాంత్‌ సింగ్‌కు అవకాశాలు రాకుండా అడ్డుకున్నారని, అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సల్మాన్‌ ఖాన్‌ ఫ్యామిలీ తనను ఇబ్బందులు గురిచేసిందని అభినవ్‌ ఆరోపించడం సంచలనం సృష్టించింది. దబాంగ్’‌ సీక్వెల్‌ను కూడా తానే చేయాల్సి ఉండేదని, అయితే సల్మాన్‌ సోదరులు అర్బాజ్‌, సోహైల్‌లు ‘దబాంగ్‌ 2’ నుంచి తప్పుకోవాలని తనని బెదిరించారని చెప్పాడు. అలాగే, 2013లో తన బేషారం చిత్రం విడుదలను అడ్డుకోవాలని ప్రయత్నించారని కశ్యప్‌ ఆరోపించాడు. దాంతో, సోషల్‌ మీడియాలో ‘బ్యాన్ సల్మాన్‌ ఖాన్’ ట్రెండ్‌ అయింది.

అయితే, తన ఫ్యామిలీపై అభినవ్‌ చేసిన ఆరోపణలపై సల్మాన్‌ అన్న, నటుడు నిర్మాత అర్బాజ్‌ ఖాన్‌ స్పందించాడు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. తనను, తన సోదరులు సల్మాన్‌ ఖాన్‌, సోహైల్‌ ఖాన్‌, తండ్రి సలీం ఖాన్‌లపై సోషల్‌ మీడియాలో కశ్యప్‌ తప్పుడు ప్రచారం చేస్తూ‌ వేధిస్తున్నాడని ఆరోపించాడు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేసు పెట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. ‘అభినవ్‌ డైరెక్ట్‌ చేసిన 2010 చిత్రం ‘దబాంగ్‌’లో నేను, సల్మాన్ నటించాం. ఆ తర్వాత ‘దబాంగ్‌-2’ నుంచి అభినవ్‌ తప్పుకున్నాడు. అప్పటీ నుంచి మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. కనీసం మాట్లాడుకుంది లేదు. ప్రొఫెషనల్‌గా మేం విడిపోయాం. అయినా ఇలాంటి ఆరోపణలు అభినవ్‌ ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. త్వరలోనే మేం కశ్యప్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశాడు.

చనిపోయిన జవాన్ నుంచి భార్యకు ఫోన్ కాల్..!


భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులైన సంగతి తెల్సిందే. చనిపోయిన వీరజవాన్ల వివరాలను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. అంతేకాకుండా వీరజవాన్ల కుటుంబాలకు ఆర్మీ స్వయంగా సమాచారం అందించింది. అయితే అమరుడైన వ్యక్తి నుంచి కుటుంబ సభ్యులకు ‘నేను బ్రతికే ఉన్నా’ అంటూ ఫోన్ కాల్ రావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ అరుదైన సంఘటన బీహర్లో జరిగింది. దీంతో అసలు ఏం జరిగిందనే ఆసక్తి అందరిలో నెలకొంది.

భారత్-చైనా సరిహద్దులో సోమవారం రాత్రి 3గంటల సమయంలో ఇరుదేశాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో భారత జవాన్లు 20మంది వీరమరణం పొందగా చైనాకు చెందిన 40మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. వీరమరణం పొందిన అమరుల కుటుంబానికి ఆర్మీ సమాచారం చేరవేసింది. బీహార్ కు చెందిన సునీల్ కుమార్ వీరమరణం పొందాడు. అయితే అతడికి బదులుగా ఆర్మీలో పనిచేస్తున్న సునిల్ రాయ్ కుటుంబానికి అధికారులు సమాచారం పంపారు. దీంతో సునీల్ రాయ్ కుటుంబం కన్నీటిపర్యాంతంకాగా ఆ గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. కాగా అమరుడైన జవాన్ నుంచి కుటుంబానికి ఫోన్ కాల్ రావడంతో ఆ కుటుంబం సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.

ఈ గందరగోళానికి ప్రధాన కారణం బీహార్ రెజిమెంట్‌కు చెందిన ఇద్దరు జవాన్ల పేర్లు, వారిద్దరి తండ్రి పేర్లు కూడా ఒకటే కావడమే. దీంతో ఒకరికి బదులుగా మరొకరికి ఆర్మీ సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. వీరమరణం పొందిన హవల్దార్‌ సునీల్ కుమార్‌ బీహార్ రాష్ట్రానికి చెందినవాడు. ఆయన తండ్రి పేరు సుఖ్‌దేవ్. అలాగే బీహార్ లోని సరణ్ జిల్లా కు చెందిన జవాన్ సునీల్ రాయ్ లేహ్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడి తండ్రి పేరు కూడా సుఖ్‌దేవ్ రాయ్. ఇద్దరి జవాన్ల పేరు సునీల్ కావడంతో చైనాతో ఘర్షణల్లో అమరుడైన సునీల్ కుమార్‌కు బదులుగా సునీల్ రాయ్‌ కుటుంబానికి ఇండియన్ ఆర్మీ నుంచి సమాచారం వెళ్లింది. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సునీల్ రాయ్ వెంటనే తన భార్య మేనకకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది.

ఇదిలా ఉంటే చైనా సరిహద్దులో వీరమరణం పొందిన అమరుల్లో బీహార్ కు చెందినవారు ముగ్గురు ఉన్నారు. బిహతాకు చెందిన సునీల్ కుమార్, సమస్తిపూర్‌కు చెందిన అమన్ సింగ్, సహస్రకు చెందిన కుందన్ కుమార్ వీరమరణం పొందారు. వీరి భౌతికకాయాలు బుధవారం వారి స్వస్థలాలకు చేరుకున్నాయి. వీరికి సైనిక లాంఛనాలతో ప్రభుత్వం అంత్యక్రియలను నిర్వహించనుంది.