
కీలక సమయంలో భారతదేశం ఐరాసలో ఏకపక్ష విజయం సాధించింది. ఓవైపు భారత్ లో కరోనా మహమ్మరి విజృంభిస్తుండగా మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తల నేపథ్యంలో భారత్ ఐక్యరాజ్య భద్రతా మండలికి ఎన్నికవడం విశేషం. బుధవారం ఐరాస భద్రతా మండలి తాత్కాలిక ఐదు సభ్య దేశాల కోసం ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో భారత్ ఏకపక్షంగా విజయం సాధించి సత్తాచాటింది. ఐరాసలో మొత్తం 193 సభ్యదేశాలుండగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్‌కు అనుకూలంగా 184 దేశాలు ఓట్లు వేశాయి. దీంతో ఐరాస భద్రతా మండలి భారత్ తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైంది.
ఐరాస 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో జరిగిన ఎన్నికలో భారత్ మరోసారి సత్తా చాటింది. ఆసియా-పసిఫిక్ రీజన్ నుంచి భారత్ నాన్ పర్మినెంట్ మెంబర్‌గా అద్భుత విజయాన్ని దక్కించుకుంది. 193ఓట్లలో భారత్‌కు 184ఓట్లు పోలైయ్యాయి. భారత్ తోపాటు ఐర్లాండ్, మెక్సికో, నార్వే దేశాలు కూడా భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికయ్యాయి. దీంతో భారత్ రెండేళ్లపాటు ఐరాసలో తాత్కాలిక సభ్య దేశంగా ఉండనుంది. వచ్చే ఏడాది జనవరి 1నుంచి భారత్‌కు ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశం హోదా లభించనుంది.
ఐరాస భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్య దేశాలతోపాటు పది తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. వీటికి మాత్రమే వీటో అధికారం ఉంటుంది. ఇక పది తాత్కాలిక సభ్యదేశాలు ప్రతీ రెండేళ్లకోసారి మారుతుంటాయి. భారత్ గతంలో 1950-1951, 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92, 2011-12 సంవత్సరాల్లో ఐరాస భద్రతా మండలిలో సభ్యదేశంగా ఎన్నికైంది. తాజాగా మరోసారి 2021-2022 సంవత్సరానికి ఎన్నికైంది.
ఐరాస భద్రతా మండలిలో 15 శక్తివంతమైన దేశాలు ఉన్నాయి. ఆసియా-పసిఫిక్ రీజన్‌లో చైనా, పాకిస్తాన్‌తోపాటు 55 సభ్య దేశాలు ఉన్నాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తుంది. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అమెరికా, జపాన్ సహా పలు దేశాలు భారత శాశ్వత సభ్యాత్వానికి మద్దతు ఇస్తున్నాయి. ఐరాసలో భారతదేశానికి 184దేశాలు మద్దతు పలుకడం చూస్తుంటే ఆయా దేశాలకు భారత్ పై ఎంత నమ్మకముందే ఇట్టే అర్థమవుతోంది. ఏదిఏమైనా భారత్ మరోసారి ఐరాస భద్రతా మండలిలో ఏకపక్ష విజయంతో చోటు దక్కించుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.