
భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులైన సంగతి తెల్సిందే. చనిపోయిన వీరజవాన్ల వివరాలను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. అంతేకాకుండా వీరజవాన్ల కుటుంబాలకు ఆర్మీ స్వయంగా సమాచారం అందించింది. అయితే అమరుడైన వ్యక్తి నుంచి కుటుంబ సభ్యులకు ‘నేను బ్రతికే ఉన్నా’ అంటూ ఫోన్ కాల్ రావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ అరుదైన సంఘటన బీహర్లో జరిగింది. దీంతో అసలు ఏం జరిగిందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
భారత్-చైనా సరిహద్దులో సోమవారం రాత్రి 3గంటల సమయంలో ఇరుదేశాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో భారత జవాన్లు 20మంది వీరమరణం పొందగా చైనాకు చెందిన 40మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. వీరమరణం పొందిన అమరుల కుటుంబానికి ఆర్మీ సమాచారం చేరవేసింది. బీహార్ కు చెందిన సునీల్ కుమార్ వీరమరణం పొందాడు. అయితే అతడికి బదులుగా ఆర్మీలో పనిచేస్తున్న సునిల్ రాయ్ కుటుంబానికి అధికారులు సమాచారం పంపారు. దీంతో సునీల్ రాయ్ కుటుంబం కన్నీటిపర్యాంతంకాగా ఆ గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. కాగా అమరుడైన జవాన్ నుంచి కుటుంబానికి ఫోన్ కాల్ రావడంతో ఆ కుటుంబం సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
ఈ గందరగోళానికి ప్రధాన కారణం బీహార్ రెజిమెంట్‌కు చెందిన ఇద్దరు జవాన్ల పేర్లు, వారిద్దరి తండ్రి పేర్లు కూడా ఒకటే కావడమే. దీంతో ఒకరికి బదులుగా మరొకరికి ఆర్మీ సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. వీరమరణం పొందిన హవల్దార్ సునీల్ కుమార్ బీహార్ రాష్ట్రానికి చెందినవాడు. ఆయన తండ్రి పేరు సుఖ్‌దేవ్. అలాగే బీహార్ లోని సరణ్ జిల్లా కు చెందిన జవాన్ సునీల్ రాయ్ లేహ్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడి తండ్రి పేరు కూడా సుఖ్‌దేవ్ రాయ్. ఇద్దరి జవాన్ల పేరు సునీల్ కావడంతో చైనాతో ఘర్షణల్లో అమరుడైన సునీల్ కుమార్‌కు బదులుగా సునీల్ రాయ్ కుటుంబానికి ఇండియన్ ఆర్మీ నుంచి సమాచారం వెళ్లింది. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సునీల్ రాయ్ వెంటనే తన భార్య మేనకకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది.
ఇదిలా ఉంటే చైనా సరిహద్దులో వీరమరణం పొందిన అమరుల్లో బీహార్ కు చెందినవారు ముగ్గురు ఉన్నారు. బిహతాకు చెందిన సునీల్ కుమార్, సమస్తిపూర్‌కు చెందిన అమన్ సింగ్, సహస్రకు చెందిన కుందన్ కుమార్ వీరమరణం పొందారు. వీరి భౌతికకాయాలు బుధవారం వారి స్వస్థలాలకు చేరుకున్నాయి. వీరికి సైనిక లాంఛనాలతో ప్రభుత్వం అంత్యక్రియలను నిర్వహించనుంది.