Home Blog Page 8335

హ్యపీ బర్త్ డే పవన్ కల్యాణ్: సినీ, రాజకీయ ప్రస్థానం

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినం. పవర్ స్టార్ పుట్టిన రోజుకు నెలరోజుల ముందు నుంచే అభిమానుల్లో సందడి మొదలైంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటూ పవన్ అభిమానులు కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. నేడు ఆయన పుట్టిన రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. పవన్ పేరిట అన్నదానాలు, రక్తదానాలు, కోవిడ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ,, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేస్తున్నారు.

*పవన్ సినీ జీవితం..
సెప్టెంబర్ 2, 1971లో కొణిదెల వెంకట్రావ్ శ్రీమతి అంజనాదేవి దంపతులకు పవన్ కల్యాణ్ జన్మించాడు. ఇంటర్మీయట్ వరకు చదివిన పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ పై అభిమానం పెంచుకొని శిక్షణ తీసుకున్నాడు. కల్యాణ్ బాబు పేరును పవన్ కల్యాణ్ గా మార్చుకొని 1996లో సినీ రంగంలోకి ప్రవేశించాడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్లోకి ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’తో ఎంట్రీ ఇచ్చాడు.

*తొలిప్రేమతో తొలిహిట్టు..
1999లో వచ్చిన ‘తొలిప్రేమ’ పవన్ కు మంచి పేరు తీసుకొచ్చింది. యువతను ఆయనకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. గోకులంలో సీత.. సుస్వాగతం వంటి సినిమాలు పవన్ కు స్టార్డమ్ తీసుకొచ్చాయి. ఆ తర్వాత తమ్ముడు.. బద్రి.. ఖుషి.. గుడుంబా శంకర్.. అన్నవరం.. జల్సా.. గబ్బర్ సింగ్.. గోపాల గోపాల.. సర్దార్ గబ్బర్ సింగ్.. అత్తారింటికి దారెదీ.. కాటమరాయుడు, అజ్ఞాతవాసి వంటి తదితర సినిమాల్లో నటించి అభిమానులను మెప్పించారు. వంటి సినిమాల్లో నటించారు. పవన్ దర్శకుడిగా మారి ‘జానీ’ మూవీని తెరకెక్కించాడు.

*ప్లాపులతో సంబంధం లేకుండా స్టార్డమ్..
పవర్ స్టార్ నటించింది కేవలం 25సినిమాలే అయినా అశేష ప్రేక్షక అభిమానులన్నీ, తరగని క్రేజీ సంపాదించుకున్నాడు. హిట్లతో సంబంధం లేకుండా క్రేజ్ సంపాదించుకుంది టాలీవుడ్లో ఎవరైనా ఉందంటే కేవలం పవర్ స్టార్. పవన్ నటించిన సినిమాల్లో ప్లాప్ సినిమాల కలెక్షన్లే టాప్ హీరోలు సాధించిన కలెక్షన్లతో సమానంగా ఉండేదంటే పవన్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

*పవన్ రాజకీయ జీవితం..
పవన్ కల్యాణ్ సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు. చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీలో పవన్ కల్యాణ్ యువరాజ్యం అధినేతగా రాష్ట్రమంతటా పర్యటించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో పవన్ సినిమాలే పరిమితమయ్యారు. ఇక 2014కు ముందు రాష్ట్ర విభజన సమయంలో పవన్ కల్యాణ్ సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. ఆ సమయంలోనే జనసేన పార్టీని స్థాపించారు. అయితే నాటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చారు.

*టీడీపీకి మద్దతు..
పవన్ కల్యాణ్ మద్దతు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇక ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. తిత్లీ తుఫాను సమయంలోనూ పవన్ ఉత్తరాంధ్రలో పర్యటించి బాధితులకు అండగా ఉన్నారు. అమరావతి రాజధాని విషయంలో రైతులకు అండగా నిలబడ్డారు. ఇలా ప్రజా సమస్యలపై జనసేన తరుఫున పోరాడుతూనే ఉన్నారు. అయితే కిందటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీచేసిన ఓటమి పాలవడం ఫ్యాన్స్ తోపాటు తెలుగు ప్రజలందరికీ షాకిచ్చింది.

*పట్టువదలని విక్రమార్కుడిలా..

ఎన్నికల్లో ఓటమి పాలైన పవన్ పట్టువదలకుండా ప్రజా సమస్యలపై పోరాడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పార్టీ నడిపిందుకు డబ్బులు అవసరం ఉన్నందున మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ‘వకీల్ సాబ్’తో పవన్ కల్యాణ్ మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుండటంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ అంతా ‘నారాజు కాకురా అన్నయ్య.. నసీరు అన్నయ్య.. ముద్దుల కన్నయ్య.. హే మనరోజు మనకుంది మన్నయ్య’ అంటూ జనసేనను ఉద్దేశించి పాటలు పాడుకుంటున్నారు.

కోట్ల నిధులిస్తా.. వైసీపీ లేడి ఎమ్మెల్యేకే ఆఫర్?

సామాన్యులు, డబ్బున్న వారిని ఇన్నాళ్లు మోసగాళ్లు టార్గెట్ చేసేది. ఇప్పుడు ఏకంగా ప్రజాప్రతినిధులనే టార్గెట్ చేస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యేలనే బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మోసపోయిన సందర్భాలున్నాయి.

తాజాగా ఏపీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యేనే ఓ మోసగాడు బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది.మీ నియోజకవర్గానికి కోట్ల నిధులు ఇస్తానని.. తొలుత మీరు ఫలానా ఖాతాకు డబ్బులు పంపాలని ఎమ్మెల్యేకు ఫోన్ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ కొత్త ట్రెండ్ మొదలైంది.

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి నిధుల పేరుతో మోసం చేయడానికి ప్రయత్నించాడు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో మోసం చేసేందుకు పూనుకున్నాడు.

పారిశ్రామిక ప్రాజెక్ట్ డైరెక్టర్ ను మాట్లాడుతున్నానంటూ ఎమ్మెల్యే ఉషశ్రీకి ‘శ్రీనివాస్’ గా తన పేరును పరిచయం చేసుకున్నాడు. మీ నియోజకవర్గానికి రూ.3 కోట్ల నిధులను కేంద్రం కేటాయించిందని.. లబ్ధిదారుల వాటాగా మీరు 10శాతం చెల్లిస్తే యూనిట్ కు రూ.25 లక్షల రుణం ఇస్తామని నమ్మబలికాడు.

అనుమానం వచ్చిన ఎమ్మెల్యే ఉషశ్రీ పరిశ్రమల శాఖ అధికారులను సంప్రదించింది. అటువంటి పథకం ఏదీ లేదని వారు చెప్పడంతో ఎమ్మెల్యే ఎస్పీకి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా ఈ నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మృతి చెందిన ఫ్యాన్స్ కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించిన పవన్..!

Pawan Kalyan fans die due to electric shock | Chitrambhalare

నేడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ప్రపంచ వ్యాప్తంగా అతనికున్న లక్షలాది మంది అభిమానులు రెండు రోజుల ముందు నుండే అతడి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని తీవ్రస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. రోడ్ల మీద ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కొంతమంది సోషల్ మీడియాలోని పోస్టులతో సరిపెట్టుకుంటే…. మరికొందరు తమ అభిమానాన్ని చాటుకునేందుకు 20-30 అడుగుల ఫ్లెక్సీలను, బ్యానర్లను పెద్ద స్తాయిలో ఏర్పాటు చేస్తున్నారు.

Also Read : హ్యపీ బర్త్ డే పవన్ కల్యాణ్: సినీ, రాజకీయ ప్రస్థానం

ఇదే క్రమంలో నిన్న చిత్తూరు జిల్లా.. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం లో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. దాదాపు ఇరవై ఐదు అడుగులు ఉన్న కరెంటు పోల్ పై పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న బ్యానర్ ను అమరుస్తూ ఏడుగురు పవన్ కళ్యాణ్ అభిమానులు కరెంట్ షాక్ కి గురి కాగా వారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

ఇక ఈ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనసైనికుల మరణం మాటలకందని విషాదం అని ఆయన పేర్కొన్నారు. అభిమానుల చావు తన మనసుని కలచివేసిందని అన్నారు. ఇక తల్లిదండ్రులకు దూరమైన బిడ్డలను తీసుకుని రాలేను కానీ వారి కుటుంబాలను ఆర్థికంగా అండగా నిలబడతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

ఇక వెంటనే విద్యుత్ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటికే చాలా సభలలో, మీటింగ్ లలో పవన్ తన అభిమానుల పై ఉన్న ప్రేమను చాటుకోవడం చూశాం. వారికి చిన్న దెబ్బ తగిలినా తనకు కన్నీళ్ళు వస్తాయని అతనే స్వయంగా వెల్లడించాడు. ఇక అలాంటిది అతని పుట్టిన రోజున ముగ్గురు చనిపోవడం అనేది అతనిని ఎప్పటికీ బాధించే విషయమే.

Also Read : పవన్ కళ్యాణ్ బర్త్ డే ఎందుకు చేసుకోరంటే?

షాకింగ్ రిపోర్ట్ : ఆడపిల్లల సంఖ్య తగ్గుతోంది..

దేశంలో ఒకప్పటి కన్యాశుల్కం పరిస్థితులు రాబోతున్నాయా..? మగవాళ్లు బ్రహ్మచారీలుగా మిగిలిపోతారా..? దేశంలో ఆడపిల్లల రేషియో తగ్గుతోందా..? అంటే వీటన్నింటికీ సమాధానం ఎస్‌ అని చెప్పాల్సిందే. ఆడపిల్లలంటే మన దేశంలో ఇంకా చిన్నచూపు కొనసాగుతూనే ఉంది. అందుకే నానాటికీ ఆడ పిల్లల సంఖ్య అంతకంతకూ పడిపోతూనే ఉంది. రానురాను ఈ పరిస్థితి మరింత ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి.

మనదేశంలో నిత్యం అబార్షన్లు పెరిగిపోతున్నాయి. ఈ అబార్షన్ల కారణంగా 2030 నాటికి భారత్‌లో ఆడపిల్లల జననాల సంఖ్య 6.8 మిలియన్ల మేర తగ్గనున్నట్లు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. సౌదీ అరేబియాలోని కింగ్‌ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (KAUST), ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీ డి పారిస్‌ పరిశోధకులు ఉమ్మడిగా ఈ సర్వే చేపట్టగా.. అత్యంత హీనమైన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్‌ ఉండబోతోందని పేర్కొంది. 1970 నుంచి దేశ లింగ నిష్పత్తిలో అసమతుల్యత కనిపిస్తోందని గుర్తించింది. లింగ నిర్ధారణ పరీక్షలు, కుటుంబాల్లో ఇప్పటికీ మగ శిశువులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి కారణాలతో ఈ పరిస్థితి తలెత్తుతోందని వెల్లడించింది.

2011 నాటికి భారత్‌లోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 98.4 శాతం జనాభాను పరిగణలోకి తీసుకొని సర్వే చేయగా.. 17 రాష్ట్రాల్లో ‘కొడుకు ప్రాధాన్యత’ అంశం స్పష్టంగా కనిపించినట్లు సర్వేలో తెలిపారు. ముఖ్యంగా 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లింగ నిష్పత్తి గణాంకాలపై ఈ ‘కొడుకు’ ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. 2017 నుంచి 2030 వరకు ఉత్తరప్రదేశ్‌లో మాత్రం 2 మిలియన్ల ఆడ శిశువుల జననాలు ఆగిపోయే ప్రమాదం ఉందని.. దేశంలోనే ఆడ శిశువుల జననాల రేటులో యూపీ అత్యంత హీన స్థానంలో ఉంటుందని చెప్పింది. మొత్తంగా భారత్‌లో 2017 నుంచి 2030 మధ్యలో ఆడపిల్లల జననాల సంఖ్య 6.8 మిలియన్ల మేర తగ్గనున్నట్లు పరిశోధకులు అంచనా వేశారు.

2017 నుంచి 2025 వరకు ఏటా సగటున ఆడపిల్లల జననాల సంఖ్య 4,69,000 మేర తగ్గుతుందని… ఆ తర్వాత ఇది మరింత పెరుగుతుందని సర్వేలో వెల్లడైంది. 2026 నుంచి 2030 వరకు 5,19,000 మేర ఆడ పిల్లల జననాల సంఖ్య తగ్గుతుందని అంచనా వేశారు. భారతదేశంలో లింగ నిర్ధారణ పరీక్షలను 1994లోనే నిషేధించినప్పటికీ.. ఇప్పటికీ ఆడ శిశువుల అబార్షన్లు జరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు మగబిడ్డను కనేందుకే చాలా మంది దంపతులు ఆసక్తి చూపుతుండడం.. మగ పిల్లాడిని కంటే ప్రతిష్ట పెరుగుతుందని భావిస్తుండటం కూడా ఇందుకు కారణమవుతోంది. దేశంలో ఆడ-మగ మధ్య కొనసాగుతున్న ఈ వివక్షకు తెరపడితే తప్ప సమానత్వం సాధ్యపడదు.

గ్రేటర్‌‌ పీఠం కోసం ‘తారక’ మంత్రం

‘ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు ఉంది ప్రస్తుతం గ్రేటర్‌‌ హైదరాబాద్‌లో రాజకీయ పార్టీల వైఖరి. ఇంకా ఎలక్షన్ల షెడ్యూల్‌ రానే లేదు. అప్పుడే ప్రజలను మచ్చిక చేసుకునేందుకు స్పీడ్‌గా దూసుకెళ్తున్నాయి. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకొని మేయర్‌‌ పీఠం ఖాతాలో వేసుకోవాలని ప్రధాన ప్రతిపక్షాలు ఉవ్విల్లూరుతుంటే.. అధికార పార్టీ మాత్రం ఈసారి వందకు తగ్గకుండా సీట్లలో గెలవాలని పంతంతో ఉంది. టీఆర్‌‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా మహానగరంలో సుడిగాలి పర్యటన చేస్తున్నాడు. వరుస ప్రారంభోత్సవాలతో హోరెత్తిస్తున్నాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీ మైలేజ్‌ పడిపోకుండా శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాడు.

రాష్ట్రంలోని పార్టీల చూపంతా ఇప్పుడు గ్రేటర్‌‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల మీదనే పడింది. ఈ సారి ఎన్నికల్లోనూ గెలుపొంది తీరాలని ఆ బాధ్యతను కేటీఆర్‌‌ మీదేసుకున్నట్లు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం మీదనే దృష్టి సారించిన ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమంతో గ్రేటర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బస్తీ కమిటీలు, గ్రేటర్ కమిటీలు ఏర్పాటు చేసి పదవుల పంపకాన్ని పూర్తి చేశారు. ఎవరికి పదవి రాలేదనే అసంతృప్తి లేకుండా ప్రతి కమిటీలో 18 నుండి 20 మందికి చోటిచ్చారు.

మరోవైపు మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ పూర్తయిన ప్రాజెక్టులను అట్టహాసంగా ప్రారంభిస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నారు. నగరంలో దాదాపు 20 వేల కోట్ల పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారంటే ఎన్నికల మీద ఏ స్థాయిలో ఫోకస్‌ పెట్టారే ఇట్టే తెలిసిపోతోంది. డివిజన్ల వారీగా కార్పొరేటర్లే అభివృద్ధి లక్ష్యంగా పెట్టారు. వీటన్నింటికి తోడు నగరంలో డబుల్ బెడ్‌రూమ్‌ ఇండ్లను, ఎస్ఆర్‌‌డీపీ ప్రాజెక్టులో భాగంగా నగరంలో ప్లైఓవర్లను ప్రారంభిస్తున్నారు. జంక్షన్ల అభివృద్ధి, చెరువుల సుందరీకణ, రోడ్లకు రిపేర్‌‌, రైల్వే బ్రిడ్జిలు, కేబుల్ బ్రిడ్జి, ఐటీ కారిడార్ అభివృద్ధి పనులు ఇలా ప్రతి అంశంపై దృష్టిసారించారు. వీటితోపాటు గతంలో ఇచ్చిన హామీలు.. తీర్చినవి ఏంటి..? తీర్చాల్సినవి ఏంటో లిస్టు ప్రిపేర్‌‌ చేస్తూ వాటి అమలు దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాగా.. గత ఎన్నికల్లో గ్రేటర్‌లో 99 స్థానాలు గెలిపించిన కేటీఆర్ ఈసారి అంతకు మించి అనే ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు.

మరోవైపు గ్రేటర్‌‌పై ఈసారి తమ పార్టీ జెండానే ఎగురుతుందంటూ కాషాయ దళం ప్రకటనలు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలే తమకు ప్లస్‌ పాయింట్లంటూ ప్రజల్లోకి వెళ్తోంది. ఎక్కడా తమ క్యాడర్‌‌ డిస్టర్బ్‌ కాకుండా ధైర్యం నింపే పనిలో పడింది. కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు.. ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలను ప్రచారాస్త్రాలుగా రెడీ చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఇంకా రంగంలోకి దిగినట్లుగా కనిపించడం లేదు.

యుద్ధోన్మాదం: చైనాలో ఆహార సంక్షోభం.. ఆకలిచావులేనా?

చైనా పాలకులు దేశాన్ని యుద్ధోన్మాదంలోకి ఉసిగొలుపుతూ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నారనే విమర్శలు తెచ్చుకుంటున్నారు. 1962కు ముందు కూడా చైనాలో భారీ ఆహార సంక్షోభం తలెత్తింది. అప్పుడు నాటి చైనా పాలకుడు మావో జెడాంగ్.. ప్రజల్లో తన వైఫల్యం కనపడకుండా.. ప్రజల దృష్టిని మరల్చాలని 1962లో భారత్ తో కయ్యానికి కాలుదువ్వి.. యుద్ధంలో భారత్ ను ఓడించి జాతీయ కాంక్షను రగిల్చి ఆ వ్యతిరేకతను రానీయకుండా పోగొట్టుకున్నాడు. కానీ అప్పటికే చైనాలో ఆహార కొరతతో కొన్ని కోట్ల మంది చనిపోయారు. ఇప్పుడు చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ కూడా అదే చేస్తున్నాడని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విస్తరణ వాదంతో చెలరేగిపోతున్న చైనాకు సంక్షోభాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన చైనా ప్రస్తుతం 140 కోట్లకుపైగా జనాభాకు ఆహారాన్ని అందించలేక ఆహార సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఈ మేరకు స్వయంగా అధ్యక్షుడు జిన్ పింగ్ వెల్లడించడం సంచలనమైంది.

చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ మాట్లాడుతూ.. ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. ఆహార వృథా విపరీతంగా ఉందని.. ప్రజల్లో అవగాహన కల్పించి అరికట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ క్రమంలోనే దేశంలోని అన్ని మీడియాల్లో ఆహార వృథాను అరికట్టాలని పెద్ద ఎత్తున ప్రచారకార్యక్రమాలు కొనసాగాయి. 2015లో చైనాలోని మహానగరాల్లో 17 నుంచి 18 టన్నుల ఆహారాన్ని వృథా చేసినట్లు గణాంకాలను మీడియాలో చూపించారు. ఇది దక్షిణ కొరియా ఆహార అవసరాలకు సరిపోతుందని తేల్చారు.

చైనా ఆహార అవసరాలు 30శాతం దిగుమతులే తీరుస్తాయి. వాణిజ్య యుద్ధంతో అమెరికా నుంచి వచ్చే ఆహార దిగుమతులు నిలిచిపోయాయి. భారత్, వియత్నాంలు కరోనా కారణంగా వరి ఎగుమతులు నిషేధించాయి. చైనాలో యాంగ్జీ కారణంగా వరదలు వచ్చి వరి ఉత్పత్తి నష్టపోయారు.

అయితే ఆహార సంక్షోభాన్ని జిన్ పింగ్ దాచేసి లఢక్, దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు సృష్టిస్తూ ప్రజల దృష్టిని మరలుస్తున్నాడని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.

మావోయిస్టు అగ్రనేత ‘గణపతి’ లొంగు‘బాట’.!


మావోయిస్టు పార్టీ అగ్రనేత ముపాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి పోలీసుల ఎదుట లొంగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు పోలీసుల నుంచి కూడా లైన్‌ క్లియర్‌‌ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 74 ఏళ్ల గణపతి తీవ్ర అనారోగ్యం సమస్యలతో బాధపడుతుండడంతో ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం కూడా అందించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గణపతే కాదు.. ఆయనతో పాటు ఇంకా ఎవరు లొంగిపోయిన స్వాగతిస్తామంటూ పోలీసు శాఖ కూడా ప్రకటించింది. పోలీసు వర్గాల సమాచారం మేరకు రానున్న రెండు రోజుల్లో లొంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన వెంట గార్డ్స్‌ కూడా లొంగిపోతున్నట్లు తెలుస్తోంది.

జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ గ్రామానికి చెందిన గణపతి 40 ఏళ్ల పాటు విప్లయోధ్యమంలో కీలక పదవులు అనుభవించారు. సుదీర్ఘ కాలం పాటు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగానూ పనిచేశారు. అనారోగ్య కారణాలతో 2018లో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో నంబాల కేశవరావు బాధ్యతలు తీసుకున్నారు. పీపుల్స్ వార్ పార్టీని ఆ తరువాత కాలంలో మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందించడంలోనూ, దేశ వ్యాప్తంగా విప్లవ సామ్రాజ్యాన్ని విస్తరించడంలోనూ గణపతి కీలక భూమిక పోషించారు. తాజాగా గణపతి లొంగబాటు వార్తలు తెరపైకి రావడంతో అంతటా చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాల పాటు పనిచేసిన ఆయన లొంగిపోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దేశంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టుగా ఉన్న గణపతి తలపై ప్రభుత్వం భారీ రివార్డు కూడా ప్రకటించింది. పీపుల్స్ వార్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మూడేళ్లుగా ఉబ్బసం, మోకాళ్ల నొప్పులు, మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొంత కాలంగా ఆయనని క్యాడర్ కూడా దండకారణ్యంలో మోసుకుంటూ తిప్పుతున్నట్లు సమాచారం. ఇక వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే గణపతి లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు తెలిసింది. గణపతి లొంగుబాటు కోసం తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌ పోలీసులు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆయన లొంగుబాటులో తెలంగాణ పోలీసులే ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కేంద్రం కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

గణపతి లొంగుబాటు లాంఛనమైతే ఆయనతోపాటు కీలక లీడర్లు, మరికొంత మంది కూడా లొంగిపోయే అవకాశాలూ లేకపోలేదు. అదే జరిగితే ఇక భవిష్యత్తులో మావోయిస్టు పార్టీ ఉనికి ప్రశ్నార్థకమనే చెప్పాలి. అందరూ లొంగిపోయే బాటలో పయనిస్తే ఇక కొత్త రిక్రూట్‌మెంట్‌కు కూడా బ్రేక్‌ పడక తప్పదు.

సుశాంత్ ది హత్యా? కాదా? తేల్చిన సీబీఐ

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. సుశాంత్ హత్యకు గురయ్యాడని చాలా మంది సెలెబ్రెటీలు ఆరోపించారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యంస్వామి అయితే హత్యనే అని ప్రధాని మోడీకి లేఖ రాశారు.సీబీఐ విచారణకు ఆదేశించారు.

తాజాగా పలు కోణాల్లో విచారణ జరిపిన సీబీఐ సుశాంత్ కేసులో హత్యకు గురయ్యారనడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఏ విధమైన సాక్ష్యాధారాలు లభించలేదని.. ఇంకా దర్యాప్తు జరుగుతోందని తెలిపింది.

ఇక ఆయనను ఆత్మహత్యకు ఎవరైనా ప్రేరేపించారా అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నామని సీబీఐ తెలిపింది. రియా చక్రవర్తితోపాటు పలువురు అనుమానితులను విచారించామని.. ఫోరెన్సిక్ రిపోర్టులు, అనుమానితుల వాంగ్మూలాలు.. క్రైమ్ రీకన్ స్ట్రక్షన్ చేశామని.. ఇది హత్య అనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని సీబీఐ తెలిపింది.

అయితే దర్యాప్తు ఆపబోమని.. హత్య కోణంలోనే విచారణ జరుపుతున్నామని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు.

బ్రేకింగ్: చంద్రబాబుకు పోలీసుల నోటీసులు

టీడీపీ అధినేత చంద్రబాబు ఏం మాట్లాడినా చెల్లుతుందని ఇన్నాళ్లు అనుకున్నారు. తన బలమైన మీడియాతో తిమ్మినిబమ్మిని చేయవచ్చని నిరూపించారు కూడా.. కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా.. అధికార వైసీపీ అంతకుమించి చంద్రబాబు ఆరోపణలకు ఇరుకునపెడుతూ ముందుకెళుతోంది. తాజాగా చంద్రబాబుకు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేయడం తీవ్ర కలకలం రేపింది.

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం బండకాడ ఎస్సీ కాలనీకి చెందిన ఓం ప్రతాప్ గత నెల 24న రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ముందు సీఎంపై మద్యం విధానంపై అసభ్యపదజాలంతో విమర్శిస్తూ వీడియోలో మాట్లాడాడు. ఆ వీడియో వైరల్ కాగా.. ఓం ప్రతాప్ ఆత్మహత్య చేసుకోవడం జిల్లా కలకలం రేపింది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ పోలీసులు షాకిచ్చారు. తాజాగా ఆయనకు నోటీసులు పంపారు. చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ అనే యువకుడు ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు ఈ నోటీసులను చంద్రబాబుకు పంపినట్టు తెలిసింది.

వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఓం ప్రతాప్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. ఓం ప్రతాప్ ఆత్మహత్యకు మంత్రి పెద్దిరెడ్డి వర్గమే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు డీజీపీకి లేఖ కూడా రాశారు.

ఈ క్రమంలోనే ఓం ప్రతాప్ మృతి కేసులో చంద్రబాబుకు పోలీసులు నోటీసులు పంపారు. సీఆర్పీఎస్ సెక్షన్ 91 ప్రకారం మదనపల్లె డీఎస్పీ ఈ నోటీసులు జారీ చేశారు. ఓం ప్రతాప్ మృతిపై సాక్ష్యాధారాలు ఉంటే ఇవ్వాలని సదురు నోటీసుల్లో పేర్కొన్నారు.వారంలోగా కార్యాలయానికి హాజరై ఆధారాలు ఇవ్వాలని డీఎస్పీ ఈ నోటీసుల్లో కోరారు.

ఇన్నాళ్లు ఏం ఆరోపించినా చెల్లుతుందని అనుకున్నారు.కానీ తాజాగా ఏ ఆరోపణలు చేసినా నిరూపించాలంటూ ఏపీ పోలీసులు చంద్రబాబుకు నోటీసులు పంపడం సంచలనమవుతోంది. ఇటీవలే డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా చంద్రబాబు ఆరోపణలపై నోటీసు పంపడం గమనార్హం.

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఎందుకు చేసుకోరంటే?

రేపు(సెప్టెంబర్ 2న) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే. ఈ రోజును సెలబ్రెట్ చేసేందుకు పవన్ అభిమానులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే పవన్ కల్యాణ్ కు అడ్వాన్స్ బర్త్ డే పేరిట ట్వీటర్లో హ్యాష్ ట్యాగులతో పవన్ అభిమానులు సరికొత్త రికార్డలు నెలకొల్పిన సంగతి తెల్సిందే.

పవన్ పుట్టిన రోజున పురస్కరించుకొని సినీ అభిమానులు, జనసేన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుండగా పవన్ వారికి షాకిచ్చే న్యూస్ చెప్పాడు.  తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకు పుట్టిన రోజు వేడుకలపై పెద్దగా ఇంట్రస్టు లేదని స్పష్టం చేశారు. చిన్నతనంలో కూడా తాను పెద్దగా పుట్టినరోజును జరుపుకోలేదని తెలిపాడు. ఒకటి రెండుసార్లు స్కూల్లో తోటి విద్యార్థులకు చాక్లెట్లు పంచినట్లు గుర్తు అని తెలిపారు. ఇక కొంచెం వయస్సు వచ్చాక పుట్టిన రోజును జరుపుకోలేదని చెప్పాడు.

తన పుట్టిన రోజుకు గుర్తుంచుకొని తన వదిన డబ్బులు ఇచ్చేదని వాటితో పుస్తకాలు కొనుక్కొనే వాడిని అని తెలిపారు. పుట్టిన రోజున అన్నయ్య కలుసుకోవడం చేస్తుండేవాడినంటూ చెప్పుకొచ్చారు. ఇక సినిమాల్లోకి వచ్చాక కొందరు దర్శకులు, నిర్మాతలు పుట్టిన రోజు వేడుకలు చేసేవారని తెలిపారు. అయితే తనకు ఎబ్బెట్టుగా అనిపించడంతో ఆ తర్వాత నుంచి పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.

తన పుట్టిన రోజును పురస్కరించుకొని అభిమానులు సేవా కార్యక్రమాలు చేస్తుండటాన్ని ఆయన స్వాగతించారు. జనసేనికులు, అభిమానులు చేసే సేవ కార్యక్రమాలు చాలా విలువైనవి తెలిపారు. కరోనా సమయంలోనూ వారు రోగులకు ఉపయోగపడేలా ఆక్సిజన్ సిలిండర్లు వితరణ చేయడం, పేదవారికి దుస్తుల పంపిణీ, అన్నదానం చేస్తుండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండటం ద్వారా తనకు ఆడంబరాలు తనకు గిట్టవని పవన్ మరోసారి నిరూపించారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

టీడీపీని నడిపించేది నారా లోకేషే.. ఖాయమైంది


గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత కుమారుడు లోకేష్ బాబు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. మంగళగిరిలో పోటీచేసి ఓడిపోయారు. ఈ ఘోరమైన వైఫల్యం తర్వాత లోకేష్ నాయకత్వంపై టీడీపీ శ్రేణుల్లో అనుమానాలు మొదలయ్యాయి. కానీ టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం తన కొడుకుపై చాలా నమ్మకం ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, 2024 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీకి సంబంధించిన మొత్తం వ్యూహాత్మక ప్రణాళికను లోకేష్‌కు చంద్రబాబు అప్పగించినట్టు సమాచారం. పార్టీ కార్యకలాపాల మొత్తం పర్యవేక్షణను లోకేష్ చూడబోతున్నట్టు తెలిసింది.

2024 ఎన్నికలలో పార్టీ కోసం ప్రచార వ్యూహాన్ని రూపొందించడానికి టిడిపి చీఫ్ కొత్త రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మను నియమించుకున్నట్టు సమాచారం. ఈ రాబిన్ మరెవరో కాదు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని గెలిపించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రధాన సహచరుడు కావడం విశేషం. పీకే నుంచి విడిపోయి సొంతంగా కన్సల్టెన్సీ పెట్టుకున్నాడు. చంద్రబాబు కోసం ఈ సంవత్సరం ప్రారంభం నుంచే పనిచేస్తున్నారు.

రాబిన్ శర్మ కార్యకలాపాలను నేరుగా పర్యవేక్షించే బదులు, ఆ పనిని టిడిపి చీఫ్ లోకేశ్‌కు అప్పగించారు. లోకేష్‌కు నేరుగా రిపోర్ట్ చేయమని శర్మను చంద్రబాబు కోరినట్లు తెలిసింది. ఫైనల్ నిర్ణయం లోకేష్ దేనట..
ప్రచార బృందంలో విశ్వసనీయ విధేయులందరినీ లోకేష్ పక్కన పెట్టారని, నేరుగా రాబిన్ శర్మ జట్టుపై ఆధారపడి ఉందని తెలిసింది.ఇక లోకేష్ ను ప్రజల్లో పాపులర్ చేసే బాధ్యతను కూడా రాబిన్ కే చంద్రబాబు అప్పగించినట్టు సమాచారం.

చంద్రబాబు వెన్నుపోటు రాజకీయానికి నేటితో పాతికేళ్లు?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, ఈరోజుకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 1995 సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీన చంద్రబాబు తొలిసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. నేటితో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టి 25 సంవత్సరాలు పూర్తైంది. స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ కష్టపడి పెట్టిన పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఎన్టీఆర్ ను గద్దె దించి చంద్రబాబు సీఎం అయ్యారు.

Also Read : బ్రేకింగ్: చంద్రబాబుకు పోలీసుల నోటీసులు

చంద్రబాబు వెన్నుపోటు గురించి నేటికీ అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిపై లేనిపోని ఆరోపణలు చేసిన చంద్రబాబు ఎమ్మెల్యేలకు అసత్యాలు చెప్పి ఆ అసత్యాలనే నమ్మించి ప‌ద‌వీచ్యుతుడిని చేశారు. బంధాలు, అనుబంధాలను మరిచి చంద్రబాబు కఠినంగా వ్యవహరించిన తీరుపై అప్పట్లో ప్రజల్లో సైతం తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎన్టీఆర్ లాంటి మహానేతనే గద్దె దించడం చంద్రబాబు ప్రతిభకు తార్కాణమని విశ్లేషకులు నేటికీ చెబుతూ ఉంటారు.

అయితే 1999లో చంద్రబాబు అదృష్టం కలిసివచ్చి మరోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. వాజ్‌పేయ్‌తో పొత్తు, కాంగ్రెస్ గ్రూపు తగాదాలు పార్టీ విజయానికి కారణమయ్యాయి. అయితే ఉమ్మడి ఏపీలో బాబు తొమ్మిదేళ్ల పాలనను తలుచుకుంటే నేటికీ జనం గుండెలదురుతాయి. అణువంతైనా అభివృద్ధి జరగకుండా చంద్రబాబు తొమ్మిదేళ్ల పాటు పాలన సాగించడం గమనార్హం.

2004లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఘోర పరాజయం పాలవగా 2009లో 2004తో పోలిస్తే ఎక్కువ సీట్లలోనే గెలుపొందినా అధికారానికి ఆమడ దూరంలోనే టీడీపీ ఆగిపోయింది. అయితే అదృష్టం కలిసివచ్చి బీజేపీ, జనసేనల సాయంతో 2014లో విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చంద్రబాబు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే చంద్రబాబు 2014 – 2019 పాలన ప్రజలకు గ్రాఫిక్స్ లో మాత్రమే కనిపించడం గమనార్హం. ఫలితంగా 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో 23 స్థానాలకే టీడీపీ పరిమితం కావాల్సి వచ్చింది. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయానికి పాతికేళ్లు పూర్తి కావడంతో ఒక వర్గంలో చంద్రబాబుపై విమర్శలు వ్యక్తమవుతున్నా టీడీపీ శ్రేణులు మాత్రం సంబరాలు జరుపుకుంటుండం గమనార్హం.

Also Read : కోట్ల నిధులిస్తా.. వైసీపీ లేడి ఎమ్మెల్యేకే ఆఫర్?