
సామాన్యులు, డబ్బున్న వారిని ఇన్నాళ్లు మోసగాళ్లు టార్గెట్ చేసేది. ఇప్పుడు ఏకంగా ప్రజాప్రతినిధులనే టార్గెట్ చేస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యేలనే బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మోసపోయిన సందర్భాలున్నాయి.
తాజాగా ఏపీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యేనే ఓ మోసగాడు బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది.మీ నియోజకవర్గానికి కోట్ల నిధులు ఇస్తానని.. తొలుత మీరు ఫలానా ఖాతాకు డబ్బులు పంపాలని ఎమ్మెల్యేకు ఫోన్ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ కొత్త ట్రెండ్ మొదలైంది.
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి నిధుల పేరుతో మోసం చేయడానికి ప్రయత్నించాడు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో మోసం చేసేందుకు పూనుకున్నాడు.
పారిశ్రామిక ప్రాజెక్ట్ డైరెక్టర్ ను మాట్లాడుతున్నానంటూ ఎమ్మెల్యే ఉషశ్రీకి ‘శ్రీనివాస్’ గా తన పేరును పరిచయం చేసుకున్నాడు. మీ నియోజకవర్గానికి రూ.3 కోట్ల నిధులను కేంద్రం కేటాయించిందని.. లబ్ధిదారుల వాటాగా మీరు 10శాతం చెల్లిస్తే యూనిట్ కు రూ.25 లక్షల రుణం ఇస్తామని నమ్మబలికాడు.
అనుమానం వచ్చిన ఎమ్మెల్యే ఉషశ్రీ పరిశ్రమల శాఖ అధికారులను సంప్రదించింది. అటువంటి పథకం ఏదీ లేదని వారు చెప్పడంతో ఎమ్మెల్యే ఎస్పీకి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా ఈ నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.