దేశంలో ఒకప్పటి కన్యాశుల్కం పరిస్థితులు రాబోతున్నాయా..? మగవాళ్లు బ్రహ్మచారీలుగా మిగిలిపోతారా..? దేశంలో ఆడపిల్లల రేషియో తగ్గుతోందా..? అంటే వీటన్నింటికీ సమాధానం ఎస్ అని చెప్పాల్సిందే. ఆడపిల్లలంటే మన దేశంలో ఇంకా చిన్నచూపు కొనసాగుతూనే ఉంది. అందుకే నానాటికీ ఆడ పిల్లల సంఖ్య అంతకంతకూ పడిపోతూనే ఉంది. రానురాను ఈ పరిస్థితి మరింత ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి.
మనదేశంలో నిత్యం అబార్షన్లు పెరిగిపోతున్నాయి. ఈ అబార్షన్ల కారణంగా 2030 నాటికి భారత్‌లో ఆడపిల్లల జననాల సంఖ్య 6.8 మిలియన్ల మేర తగ్గనున్నట్లు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (KAUST), ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీ డి పారిస్ పరిశోధకులు ఉమ్మడిగా ఈ సర్వే చేపట్టగా.. అత్యంత హీనమైన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఉండబోతోందని పేర్కొంది. 1970 నుంచి దేశ లింగ నిష్పత్తిలో అసమతుల్యత కనిపిస్తోందని గుర్తించింది. లింగ నిర్ధారణ పరీక్షలు, కుటుంబాల్లో ఇప్పటికీ మగ శిశువులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి కారణాలతో ఈ పరిస్థితి తలెత్తుతోందని వెల్లడించింది.
2011 నాటికి భారత్‌లోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 98.4 శాతం జనాభాను పరిగణలోకి తీసుకొని సర్వే చేయగా.. 17 రాష్ట్రాల్లో ‘కొడుకు ప్రాధాన్యత’ అంశం స్పష్టంగా కనిపించినట్లు సర్వేలో తెలిపారు. ముఖ్యంగా 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లింగ నిష్పత్తి గణాంకాలపై ఈ ‘కొడుకు’ ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. 2017 నుంచి 2030 వరకు ఉత్తరప్రదేశ్‌లో మాత్రం 2 మిలియన్ల ఆడ శిశువుల జననాలు ఆగిపోయే ప్రమాదం ఉందని.. దేశంలోనే ఆడ శిశువుల జననాల రేటులో యూపీ అత్యంత హీన స్థానంలో ఉంటుందని చెప్పింది. మొత్తంగా భారత్‌లో 2017 నుంచి 2030 మధ్యలో ఆడపిల్లల జననాల సంఖ్య 6.8 మిలియన్ల మేర తగ్గనున్నట్లు పరిశోధకులు అంచనా వేశారు.
2017 నుంచి 2025 వరకు ఏటా సగటున ఆడపిల్లల జననాల సంఖ్య 4,69,000 మేర తగ్గుతుందని… ఆ తర్వాత ఇది మరింత పెరుగుతుందని సర్వేలో వెల్లడైంది. 2026 నుంచి 2030 వరకు 5,19,000 మేర ఆడ పిల్లల జననాల సంఖ్య తగ్గుతుందని అంచనా వేశారు. భారతదేశంలో లింగ నిర్ధారణ పరీక్షలను 1994లోనే నిషేధించినప్పటికీ.. ఇప్పటికీ ఆడ శిశువుల అబార్షన్లు జరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు మగబిడ్డను కనేందుకే చాలా మంది దంపతులు ఆసక్తి చూపుతుండడం.. మగ పిల్లాడిని కంటే ప్రతిష్ట పెరుగుతుందని భావిస్తుండటం కూడా ఇందుకు కారణమవుతోంది. దేశంలో ఆడ-మగ మధ్య కొనసాగుతున్న ఈ వివక్షకు తెరపడితే తప్ప సమానత్వం సాధ్యపడదు.