
‘ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు ఉంది ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో రాజకీయ పార్టీల వైఖరి. ఇంకా ఎలక్షన్ల షెడ్యూల్ రానే లేదు. అప్పుడే ప్రజలను మచ్చిక చేసుకునేందుకు స్పీడ్‌గా దూసుకెళ్తున్నాయి. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకొని మేయర్ పీఠం ఖాతాలో వేసుకోవాలని ప్రధాన ప్రతిపక్షాలు ఉవ్విల్లూరుతుంటే.. అధికార పార్టీ మాత్రం ఈసారి వందకు తగ్గకుండా సీట్లలో గెలవాలని పంతంతో ఉంది. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మహానగరంలో సుడిగాలి పర్యటన చేస్తున్నాడు. వరుస ప్రారంభోత్సవాలతో హోరెత్తిస్తున్నాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీ మైలేజ్ పడిపోకుండా శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాడు.
రాష్ట్రంలోని పార్టీల చూపంతా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల మీదనే పడింది. ఈ సారి ఎన్నికల్లోనూ గెలుపొంది తీరాలని ఆ బాధ్యతను కేటీఆర్ మీదేసుకున్నట్లు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం మీదనే దృష్టి సారించిన ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమంతో గ్రేటర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బస్తీ కమిటీలు, గ్రేటర్ కమిటీలు ఏర్పాటు చేసి పదవుల పంపకాన్ని పూర్తి చేశారు. ఎవరికి పదవి రాలేదనే అసంతృప్తి లేకుండా ప్రతి కమిటీలో 18 నుండి 20 మందికి చోటిచ్చారు.
మరోవైపు మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ పూర్తయిన ప్రాజెక్టులను అట్టహాసంగా ప్రారంభిస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నారు. నగరంలో దాదాపు 20 వేల కోట్ల పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారంటే ఎన్నికల మీద ఏ స్థాయిలో ఫోకస్ పెట్టారే ఇట్టే తెలిసిపోతోంది. డివిజన్ల వారీగా కార్పొరేటర్లే అభివృద్ధి లక్ష్యంగా పెట్టారు. వీటన్నింటికి తోడు నగరంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను, ఎస్ఆర్‌డీపీ ప్రాజెక్టులో భాగంగా నగరంలో ప్లైఓవర్లను ప్రారంభిస్తున్నారు. జంక్షన్ల అభివృద్ధి, చెరువుల సుందరీకణ, రోడ్లకు రిపేర్, రైల్వే బ్రిడ్జిలు, కేబుల్ బ్రిడ్జి, ఐటీ కారిడార్ అభివృద్ధి పనులు ఇలా ప్రతి అంశంపై దృష్టిసారించారు. వీటితోపాటు గతంలో ఇచ్చిన హామీలు.. తీర్చినవి ఏంటి..? తీర్చాల్సినవి ఏంటో లిస్టు ప్రిపేర్ చేస్తూ వాటి అమలు దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాగా.. గత ఎన్నికల్లో గ్రేటర్‌లో 99 స్థానాలు గెలిపించిన కేటీఆర్ ఈసారి అంతకు మించి అనే ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు.
మరోవైపు గ్రేటర్‌పై ఈసారి తమ పార్టీ జెండానే ఎగురుతుందంటూ కాషాయ దళం ప్రకటనలు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలే తమకు ప్లస్ పాయింట్లంటూ ప్రజల్లోకి వెళ్తోంది. ఎక్కడా తమ క్యాడర్ డిస్టర్బ్ కాకుండా ధైర్యం నింపే పనిలో పడింది. కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు.. ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలను ప్రచారాస్త్రాలుగా రెడీ చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇంకా రంగంలోకి దిగినట్లుగా కనిపించడం లేదు.